దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సుమారు 2500 సినీమాలకు పబ్లిసిటీ ఆర్టిస్టు పనిచేసిన ఈశ్వర్ గారి ‘సినిమా పోస్టర్” కబుర్లు…
సినిమా పబ్లిసిటీ ఆర్టిస్టు ఈశ్వర్ ‘సినిమా పోస్టర్” పేరుతో తన జీవితచరిత్రను గ్రంథస్తం చేస్తూ పోస్టర్ల గురించి సాంకేతిక అంశాలను, ఆ రంగంలో నిష్ణాతులైన సీనియర్ల, జూనియర్ల జీవిత రేఖాచిత్రాలనూ పరిచయం చేశారు. తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి స్వయంగా తన యింటికి వచ్చిన సందర్భం గురించి ఆయన ‘సినిమా పోస్టర్” పుస్తకంలో రాసుకున్నారు.
పశ్చిమగోదావరిలో పాలకొల్లుకి చెందిన ఈశ్వర్ కుటుంబం తరతరాలుగా శిల్పకారులు. ఆయనకు చిత్రకళ స్వతస్సిద్ధంగా వచ్చింది. చిన్నప్పటినుంచి ఆయన వేసిన బొమ్మలకు ఖ్యాతి వచ్చింది. పెద్ద కుటుంబం కావడంతో తండ్రి పెద్దగా చదివించలేకపోయారు. ఈయన నాటకాలలో నటిస్తూ వాటిపై ఆసక్తి పెంచుకున్నారు. ఫీజు కట్టలేక పాలిటెక్నిక్ చదువు మధ్యలో మానేయాల్సి వచ్చింది. కొన్నేళ్ల తర్వాత చదువు మళ్లీ ప్రారంభిద్దామనుకున్నారు. ఆయన రాసిన నాటకాలను మిత్రులందరూ కలిసి ప్రదర్శించి, విరాళాలు సేకరించి రూ.1100లు ఆయన చేతిలో పెట్టారు. తీరా కాలేజికి వెళితే ‘ఈ లోపున రెగ్యులేషన్స్ మారిపోయాయి. ఫైనలియర్ లో చేరలేవు, కావాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి మళ్లీ చదువుకురా.’ అన్నారు. ఇక చదువు సాగదని అర్థమై మద్రాసు వెళ్లి పోస్టర్లు రాసి బతుకుదామని నిశ్చయించుకున్నారు. కానీ ఎవరిద్వారా వెళ్లాలి? సినీనటుడు చలంది కూడా అదే వూరు. వాళ్ల అన్న గారు సూర్యనారాయణ అప్పుడు పాలకొల్లుకి వస్తే కామన్ ఫ్రెండ్ ఈశ్వర ను పరిచయం చేశాడు. “నేను ఎవరిదగ్గరకైనా తీసుకెళతాను. వాళ్లు పని యిస్తారు కానీ జీతం యివ్వరు. కొన్ని నెలలైనా నీ డబ్బుతో మేన్టేన్ అయ్యేట్లు వుంటేనే రా” అని చెప్పారాయన. అప్పటికి ఈశ్వర్ చేతిలో రూ.960 వున్నాయి. సరిపోతుందా అని సందేహిస్తూ వుంటే అన్న రంగాచారి “నాకు నెలకు ఎనభై రూపాయలు స్టయిపెండ్ వస్తుంది, దాన్లో సగం నీకు పంపిస్తా” అని ఆఫర్ చేశారు. అప్పుడు ధైర్యం చేసి నాటకాల్లో సంపాదించిన వెండి కప్పులు, వేసిన కలర్ డ్రాయింగులు, డిజైన్స్ ఫైలు పట్టుకుని 1960 జులైలో మద్రాసు చేరారు.
సినిమా పుట్టినపుడు మొదట్లో పబ్లిసిటీ విభాగం వుండేది కాదు. సినిమాకు పనిచేసిన ఆర్ట్ డైరక్టరే పబ్లిసిటీకి కావలసిన పోస్టర్లు, పేపరు 30 x 40 అంగుళాలు సైజులో డిజైన్ చేసేవారు. క్రమేపీ సినిమాకు పబ్లిసిటీ అవసరం వుందని గ్రహించి వేరే వాళ్లను పెట్టుకుని చేయించుకునేవారు. తెలుగు సీమలో పోస్టర్ల డిజైనింగ్ ను రూపుదిద్దిన వ్యక్తి టి.వి.యస్. శర్మ. పూర్తి పేరు తంగిరాల వెంకట సుబ్రహ్మణ్య శర్మ. నెల్లూరు వాస్తవ్యులు. చిన్నప్పుడు బాణసంచా పేలి ఎడమచేయి మోచేతిదాకా తీసేయాల్సి వచ్చింది. ఒక్క చేత్తోనే ఈరంకి వెంకట శర్మ మాస్టారి దగ్గర చిత్రకళ నేర్చుకున్నారు. బందరు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరి డిగ్రీ పూర్తి చేసి, 1935లో మద్రాసుకు వచ్చి కళాదర్శకత్వ శాఖలో చేరడానికి ప్రయత్నం చేశారు. మూడేళ్లలో ప్రయత్నాలు ఫలించాయి. తను కళాదర్శకత్వం వహిస్తూనే పబ్లిసిటీ డిజైనింగ్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, మంచి సిబ్బందిని పెట్టుకుని, పబ్లిసిటీ అవసరాన్ని చాటి చెప్పి పెద్ద సంస్థలందరినీ క్లయింట్లుగా చేసుకున్న ఘనత ఆయనదే. ఆయన డిజైన్ చేసిన, చేయించిన పోస్టర్లపై ‘స్టూడియో శర్మ టివియస్’ అని సంతకం వుండేది.
తెలుగు పౌరాణిక చిత్రాల పోస్టర్లు అత్యున్నత స్థాయిలో నిలిచాయంటే దానికి ఆయనే కారణం. ఎన్టీయార్ నటించిన అనేక పౌరాణిక పాత్రలకు కళాదర్శకత్వం, పోస్టర్లు డిజైనింగ్ ఆయనదే. ఎన్టీయార్‌కి శర్మగారంటే ఎంత గౌరవమంటే ఆయన ఆఫీసుకి వెళితే కూర్చోమని సైగ చేసేంతవరకూ చేతులు కట్టుకుని నిలబడే వుండేవారట. తన ఆఫీసును ఒక కార్పోరేట్ స్టయిల్లో నడుపుతూ. ఉద్యోగులకు చాలా గౌరవం యివ్వడంతో బాటు చాలా ఆప్యాయంగా చూసుకుంటూ వుండేవారు. ”నర్తనశాల” సినిమాకు ఆయన రూపకల్పన చేసిన భారీ సెట్టింగులు, బృహన్నలతో సహా అందరికీ చేసిన రూపకల్పనలు జకార్తాలో జరిగిన చిత్రోత్సవంలో ప్రత్యేక ప్రశంసలందుకున్నాయి. ఆనాటి సభలో ఇండోనేసియా ప్రధాని సుకర్నో ప్రత్యేకంగా కళాదర్శకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ వుంటే వేదిక మీద వున్న ఎస్‌వి రంగారావు కల్పించుకుని ‘ఆ ఆర్ట్ డైరక్టరుకు ఒక చెయ్యి లేదు’ అని చెప్పగానే సుకర్నో ఆశ్చర్యపడి, తేరుకుని ‘ఆయనకు రెండో చెయ్యి కూడా వుండి వుంటే ఆయన కళాసృష్టిని చూడడానికి మన రెండు కళ్లు చాలవేమో” అన్నాడట. ఆయన 1968లో తన 59వ యేట కన్నుమూసారు.
ఆయన దగ్గర పనిచేయాలని ఈశ్వర్‌కు కోరిక. సూర్యనారాయణగారితో చెపితే ”ఆయనకూ నాకూ పడదయ్యా, వేరే ఎవరిపేరైనా చెప్పు, తీసుకెళతా” అన్నారాయన. ”నాగ్ పేరుతో బొమ్మలు వేసే కాకుమాను నాగేశ్వరరావుగారి దగ్గరకు తీసుకెళ్లండి” అని కోరారు. ఈయన బందరు వాసి. అక్కడే స్కూలు ఆఫ్ ఆర్ట్స్‌లో డిగ్రీ తీసుకుని ఆంధ్రా సినీటోన్ స్టూడియోలో, కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోలో కొంతకాలం కళాదర్శకుడిగా పనిచేశారు. వాహిని స్టూడియో ప్రారంభించినపుడు దానిలో చేరి, విడిగా వచ్చేసి ”గుణసుందరి కథ”, ”లైలా మజ్నూ”, ”నాడోడి మన్నన్” వంటి భారీ సినిమాలకు ఆర్ట్ డైరక్టరుగా పనిచేశారు. తర్వాత పబ్లిసిటీవైపు దృష్టి మరలించి ఎమ్జీయార్ సినిమాలు, విజయా వారి సినిమాలతో సహా సుమారు 400 సినిమాలకు పబ్లిసిటీ చేశారు. ఈశ్వర్, సూర్యనారాయణ వెళ్లేసరికి ”జగదేకవీరుని కథ” వర్కు జరుగుతోంది. సూర్యనారాయణగారు చెప్పినా ఆయన వంచిన తల ఎత్తకుండానే ”నా దగ్గర ఖాళీ లేదు బాబూ, మరెక్కడయినా ప్రయత్నించండి ” అనేశారు. ” సరే… కేతాగారి దగ్గరకి వెళదాం” అన్నారు సూర్యనారాయణ.
‘స్టూడియో కేతా’ అధినేత కేతా సాంబమూర్తి పాలకొల్లుకు దగ్గరున్న పల్లెటూళ్లో నిరుపేద కుటుంబంలో పుట్టారు. తాపీ మేస్త్రీ దగ్గర కూలీగా చేరి కొన్నాళ్లకు మేస్త్రీ అయ్యారు. జన్మతః చిత్రకారుడు కావడంతో సిమెంటు విగ్రహాలు, తులసికోటలు లాటివి చేసి అమ్మి గడిస్తూండేవారు. ఆ సమయంలో చిత్రకారులైన రామలింగేశ్వరరావు, గోపాలకృష్ణమాచార్యులు వద్ద చిత్రకళ నేర్చుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే విద్యావేత్తగా, వదాన్యుడిగా పేరు పొందిన మూర్తిరాజుగారు తన జన్మదినాన అందరికీ కానులు యిచ్చే సమయంలో అర్థిగా నిలబడి ‘నాకు వచ్చిన చిత్రకళను అభివృద్ధి చేసుకోవడానికి బొంబాయి జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరాలని వుంది’ అని అడిగారు. మూర్తిరాజుగారు వెంటనే తన డబ్బుతో కేతాను చదివించారు. కేతా జీవితాంతం ఆయన్ను దైవంగా ఆరాధించారు. బొంబాయి నుంచి మద్రాసు వచ్చి అక్కడి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదువుకుని కళాదర్శకులు ఎస్‌విఎస్ రామారావు, టివియస్ శర్మ, కాకుమాను నాగేశ్వరరావు గార్ల వద్ద ఆర్ట్ డైరక్షన్, పబ్లిసిటీ రెండూ నేర్చుకున్నారు. పుస్తకాలకు కవరు డిజైనింగ్ చేస్తూ నిలదొక్కుకున్నారు. 1947లో ”గొల్లభామ” సినిమా పోస్టర్‌పై స్టూడియో కేతా అనే మొదటి సంతకం చేసి సుమారు 600 సినిమాలకు పనిచేశారు. పుస్తక ముఖ చిత్రాలు, ఆయిల్ పెయింటింగులు, పోస్టర్లు యిలా రకరకాల రంగాల్లో ఆయనంత ఔట్‌పుట్ వున్న పబ్లిసిటీ ఆర్టిస్టు మరొకరు లేరు. ఆయనకున్నంత శిష్యగణం కూడా వేరెవరికీ లేరు. ఎవరు వచ్చి అర్థించినా నీడ నిచ్చిన మహా మనిషి. ఎన్టీయార్‌కు కేతా అంటే ప్రత్యేక అభిమానం. టివియస్ శర్మగారి మరణానంతరం ఎన్.ఏ.టి. సంస్థ పబ్లిసిటీ కేతాకే అప్పగించారు. ”బ్రహ్మర్షి విశ్వామిత్ర” సినిమా తీసేటప్పుడు కేతాను పిలిచి కళాదర్శకత్వం చేయమన్నారు. ”భట్టి విక్రమార్క” (1960) తర్వాత ఏ సినిమాకు ఆర్ట్ డైరక్షన్ చేయకపోయినా రామారావు మాట కాదనలేక కేతా హైదరాబాదుకి మకాం మార్చి ముఖ్యమంత్రి హోదాలో రామారావు గారు అప్పగించిన అనేక ప్రముఖుల ఆయిల్ పోర్ట్రెయిట్లు వేస్తూ అక్కడే స్థిరపడి, 2000 సం.లో 77 వ యేట కాలం చేసారు.
కేతాగారు ఈశ్వర్‌ను చూసి ”పాలకొల్లు అంటున్నారు, ఎవరబ్బాయివి?” అని అడిగారు. ”ముత్యంగారబ్బాయిని” అనగానే ”ఆయన బంగారు వడ్డణాలపై ఎన్‌గ్రేవింగ్ అద్భుతంగా చేసేవారు. వారబ్బాయివా! నువ్వు వేసిన డ్రాయింగ్స్ చూపించు’ అని అడిగి ఫైలు తీసుకుని చూసి ”మంచి హేండ్.. నా దగ్గర ప్రస్తుతం ఆరేడుగురు పనిచేస్తున్నారు. ఇక్కణ్నించే వెళ్లిన ”సరాగం” వాళ్ల దగ్గర ఎవరూ లేరట. అక్కడకు వెళ్లి, వాళ్లు కాదంటే నా దగ్గరకొచ్చేయ్” అని చెప్పారాయన. ”సరాగం” సత్యనారాయణమూర్తి, రామారావు, గంగాధరం అనే ముగ్గురు చిత్రకారులు తమ పేరులో మొదటి పేర్లు కలిపి స్థాపించిన సంస్థ. కేతాగారి వూరి వాళ్లే. ఆయన చిన్నతనంలోనే వీళ్లను తీసుకుని వచ్చి తన దగ్గర పెట్టుకుని చిత్రకళ నేర్పారు. రెండున్నరేళ్లు వున్న తర్వాత కేతా దగ్గరే వుంటూ సినిమా ఛాన్సు కోసం ప్రయత్నిస్తున్న కెవి చలం (హాస్యనటుడు) ప్రోత్సాహంతో విడిగా వచ్చి ”డిటెక్టివ్” మాస పత్రికకు యిలస్ట్రేషన్స్ వేసేవారు. తర్వాత పోస్టర్ డిజైనింగ్ అవకాశం వచ్చింది. ”కలిమి లేములు”, ”చివరకు మిగిలేది” సినిమాలకు వాళ్లు వేసిన పోస్టర్లు పరిశ్రమలో వీరికి ఒక గుర్తింపును తెచ్చాయి. ఈశ్వర్ అక్కడకు వెళ్లేసరికి వాళ్లు ”ఈడుజోడు” సినిమాకు లోగోలు రాస్తున్నారు. ఈశ్వర్ ఫైలు చూసి వారిలోని గంగాధరం ”మీ పేరు నాకు తెలుసండి. పాలకొల్లు హైస్కూలులో డ్రాయింగు బాగా వేసేవారని చెప్పుకునేవాళ్లం.” అన్నాడు. వెంటనే సూర్యనారాయణ ”మీరు చేర్చుకుంటే చాలు. 8 మాసాల వరకు అతనికి జీతం అక్కరలేదు.” అన్నారు. వాళ్లు పని యివ్వడానికి ఒప్పుకున్నారు.
ఆవిధంగా జరిగింది పబ్లిసిటీ రంగంలో ఈశ్వర్ ప్రవేశం. ఇప్పుడు కరుణానిధి ఉదంతం చెప్పుకుందాం. ”సాక్షి” (1967) సినిమాతో ఈశ్వర్‌కు బ్రేక్ వచ్చింది. స్వతంత్రంగా తన పేరుతో పోస్టర్లు డిజైన్ చేయసాగారు. వెంటవెంటనే ఆఫర్లు వచ్చిపడ్డాయి. తెలుగు, తమిళ, కన్నడ సినీరంగాల్లోనే కాక మద్రాసులోని కమ్మర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కు, బుక్ పబ్లిషర్స్‌కు ఆయన పేరు పాకింది. ”విజయచిత్ర” దాని తమిళ వెర్షన్ ”బొమ్మయ్”లలో తారల ఆయిల్ పెయింటింగ్స్‌ను, కథలకు బొమ్మలు ఈశ్వర్ చేతే వేయించేవారు. ఇవి కరుణానిధి దృష్టికి వచ్చాయి. 1969లో అణ్నాదురై మరణించి, కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. పదవిలోకి రాగానే అణ్నాదురై నిలువెత్తు పోర్ట్రయిట్ ఒకటి అసెంబ్లీ జరిగే రాజాజీ హాల్లో పెట్టించాలని అనుకుని, దానికి ఈశ్వరే సమర్థుడనుకుని కబురు పెట్టారు. ఈయన వెళ్లాక అణ్నావి కొన్ని ఫోటోలు చేతికిచ్చి, ఆయన హావభావాలు, ముఖకవళికల గురించి విశదీకరించి, అవగాహన కల్పించి, నెలలోపు 9 అడుగుల సైజ్ పెయింటింగు కావాలన్నారు.
పెయింటింగు తయారవుతుండగా మధ్యలో ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూడాలని తనూ, నలుగురు కాబినెట్ మినిస్టర్లు ఈశ్వర్ యింటికి వచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది వీధిని బ్లాక్ చేసింది. వీధి నిండా కార్లే, పోలీసులే. పెయింటింగును చూసిన కరుణానిధి ”బాగా వచ్చింది, ఇంకాస్త చిరునవ్వు కావాలి” అని చెప్పాడు. తమిళ పత్రికలు దీన్ని హైలైట్ చేస్తూ వార్తలు రాశాయి. ”ఈశ్వరై తేడి వంద ముదల్‌వర్” (ఈశ్వర్‌ను వెతుక్కుంటూ వచ్చిన ముఖ్యమంత్రి) అని హెడ్‌లైన్సు పెట్టి మరీ వ్యాసాలు రాశారు. ఆయన కోరిన మార్పు చేసి, పెయింటింగు పూర్తి చేసి దానికి సరిపడా ఫ్రేమ్ కట్టించి పూర్తయిందని కబురు పెడితే మళ్లీ అందరూ వచ్చారు. వచ్చినవాళ్లందరూ మెచ్చుకున్నారు. 1970 లో దాన్ని ఆ వారాంతంలోనే రాజాజీ హాల్లో ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేసి, ఆవిడ చేతుల మీదుగానే ఈశ్వర్‌ను సన్మానింపచేశారు కరుణానిధి.
52 మంది శిష్యులున్న ఈశ్వర్ గారు ప్రస్తుతం చెన్నై లో నివసిస్తున్నారు. దక్షిణాదిన ఎందరో సిని పోస్టర్లు డిజైన్ ఆర్టిస్టులున్నప్పటికీ, పోస్టర్లు డిజైన్ గురించి, తన అనుభవాలను క్రోడీకరించి పుస్తకం రాసిన మొదటి ఆర్టిస్ట్ ఈశ్వర్ గారే.
-కళాసాగర్
నైస్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ ..నైస్ఆర్టికల్
Nice article
Legendary artist…