రేడియో నాటకం

రేడియో నాటక రచన ఒక ప్రత్యేక రచనా ప్రక్రియగా చెప్పుకోవచ్చు. నాటక సాహిత్యాన్ని పరిపుష్టం చేసేందుకే, నాటక రచన చేస్తున్నానని ఇవాళ ఎవరూ చెప్పుకోరు. దాని పరమావధి రంగస్థలంపై ప్రదర్శింపబడడం. “నాటకాంతం హి సాహిత్యం” అన్న ఆర్యోక్తిని బట్టి సాహిత్య సృజనలో నాటక ప్రక్రియకు మరింత పెద్దపీట వేయబడింది. చేయితిరిగిన రచయిత అధిరోహించవలసిన తుది శిఖరంగా నాటక రచన చేయడంగా చెప్పుకోవచ్చు. అందునా శ్రవ్య మాధ్యమానికి వ్రాయడం మరింత క్లిష్టమైంది. దాని బలాలు, బలహీనతలూ, పరిధులు చేసుకోనిదే మంచి రేడియో నాటక రచన సాధ్యం కాదు. ఇందుకు రచయిత ప్రయోక్తల మధ్య చర్చ- అవగాహన అత్యంత అవసరం.

అర్థగంట వ్యవధిగల నాటికలో 5, 6 పాత్రలకు మించకుండా, 4, 5 రంగాలకన్నా ఎక్కువ లేకుండా ప్లాన్ చేయడం, పాత్రల ప్రవేశం, నిష్క్రమణ అవసరమైనచోట సహపాత్రల ద్వారా చెప్పించడం, శ్రవ్య నాటకంలో గందరగోళం నివారించడానికి అవసరం. సన్నివేశాలలో దృశ్యాలను ఆవిష్కరింప చేయగల శబ్ద, పదాల ఎంపిక, వాక్య నిర్మాణం చేయడం లాంటివి ప్రాథమిక విషయాలు. సంభాషణలు పెద్ద పెద్ద వాక్యాలతో, సమాస భూయిష్ఠంగా లేదా ఉచ్ఛారణకు అతిక్లిష్టమైన, అనువుకాని రీతిలో వుండకూడదు. చెవినపడగానే సుబోధకం కాని పదాలు, మైక్రో ఫోను ముందు పలికేటపుడు నోటినుండి ఫోర్సుగా గాలిబయటకు వచ్చే అక్షరాలు, ఉదాహరణకు ‘భు’ ‘భ ‘ఫ’ లాంటివి. సాధారణంగా పలికే అలవాటులేని ‘ళ’ ‘క్ష’ రో లాంటి అక్షరాలను వర్ణించగలిగితే మంచిది. సరళంగా, చిన్నగా ఉండే వాక్యాలు, అర్థవంతమైన పాజ్ లు శ్రవ్యనాటికలో మంచి ఉత్కంఠను రేకెత్తిస్తాయి.

మాజౌరి బౌల్టన్ (Majorie Bowlton) అనే సుప్రసిద్ధ ఆంగ్ల విమర్శకురాలు “Drama is the Literature that works, talks before our eyes” అన్న వాక్యం రేడియో నాటకానికి అతి చక్కగా సరిపోతుంది. ఇలా కళ్ల ముందు దృశ్యాన్ని సాక్షాత్కరింప జేయటానికి ప్రప్రథమంగా నాటక టక రచయిత తదుపరి ప్రయోక్త, నటుడు సమిష్టి కృషి జరపాల్సి వుంటుంది.

కాలెరిడ్జి అనే ఆంగ్లకవి అన్నట్లు “The eyes make pictures when they are shut” అంధులు ఏవిధంగా శబ్దానికి రూపాన్నిచ్చి, తమ అంతరంగాల్లో దర్శిస్తారో, అదే విధంగా రేడియో నాటక రచయిత, నటీనటులచేత తాను పలికించే సంభాషణల శబ్దం ద్వారా శ్రోతల మనోఫలకంపై ఊహా చిత్రాన్ని నిలపాలి. ఈ ఊహకు పరిధి లేదు. శ్రోత చదువు సంస్కారాన్ని బట్టి దాని ఘనత ఆధారపడి వుంటుంది. ఇందుకు నటుడి ప్రతిభామిక పాటవాలు ఎంతైనా అవసరం.

నటుడు తన నైపుణ్యాన్నంతా ఉపయోగించి, డైలాగ్ ని Pitch, Punctuation, Emotion తో Timing తో పలికితే అది గురి చూసిన బాణంలా శ్రోత హృదయాన్ని తాకి రసహ్లవితం చేస్తుంది.
ఆహ్లాదపరుస్తుంది.
వినోదింపజేస్తుంది.
చిరస్మరణీయం చేస్తుంది.

-ఎ.మల్లేశ్వర రావు
(ఆల్ ఇండియా రేడియో తిరుపతి కేంద్రం)
సెల్:94400 07374

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap