శిల్పిపేరుతోనే ‘రామప్ప’ గుడి

రామప్ప శిల్పి పేరు కాదు అని ముందే నిర్ణయించుకొని దానికి కావలసిన ఆధారాలు వెదికే పనిలోనికి పడినట్లు ద్యావనపల్లి సత్యనారాయణ గారి వ్యాసం స్పష్టంగా తెలియవస్తూ ఉంది. ఆయన వ్యాసంలో ఆరంభంలోనే “దేనికైనా శాస్త్రీయ ఆధారాల వెలుగులో నిర్ధారణకు రావలసి ఉంది” అని వక్కాణించిన సత్యనారాయణ గారు ఏ శాస్త్రీయ ఆధారంతో రామప్ప శిల్పి కాదు అని తేల్చారో ఇందులో ఎక్కడా కనిపించదు. ఏ శాస్త్రీయ ఆధారంతో ఇది శిల్పి పేరు కాదు అని చెపుతున్నారో అది ఇందులో లేదు. మొదటి శేషాద్రి రమణ కవులు చెప్పిన సమాచారం ఏమంటే దూపాటి వేంకట రమణాచార్యులు శాసనాన్ని చదివి చాలా అమూల్యమైనది అని చెప్పారు. కాని దానిలో ఎక్కడా శిల్పి పేరు రామప్ప అని లేదు, అని రాశారు. శిల్పి పేరు శాసనంలో ఎక్కడా లేకపోతే దూపాటి వారు అది శిల్పిపేరు కాదని ఎలా నిర్ధారిస్తారు. మనదేశంలో నూటికి 99 దేవాలయాలలో శిల్పులు వారి పేర్లు ఎక్కడా రాసుకోలేదు. అంత మాత్రాన ఆశిల్పులు లేనట్లా. రామప్ప శిల్పి కాదు అని చెప్పడానికి ఇది శాస్త్రీయ ఆధారమా. కానేకాదు.
ఇక ద్యావనపల్లి వారి తర్వాతి వాదన ఏమంటే సమకాలీన గ్రంథాలైన ఆంధ్రప్రతాపరుద్ర యశోభూషణం, సిద్ధేశ్వర చరిత్ర, ప్రతాపరుద్రచరిత్రలలో రామప్పగుడి శిల్పి పేరు లేదు. కాబట్టి అది శిల్పి పేరు కాదు అని. మన లక్షణగ్రంథకారులు ఏలక్షణ గ్రంథంలోనైనా కావ్యకారులు ఏకావ్యంలోనైనా ఆలయాగురించి రాస్తే రాశారేమో కట్టించిన ఆరాజుల పేర్లు రాశారు కానీ కట్టిన ఆశిల్పుల పేర్లు రాశారా అంతటి సహృదయతను చాటుకున్న పాపాన పోయారా. వీరురాయలేదు కాబట్టి రామప్ప శిల్పి పేరు కాదని నిర్ధారణకు రావడం ఎలాంటి శాస్త్రం అవుతుంది. ఇది శాస్త్రీయ ఆధారం ఎందుకు అవుతుంది. ద్వావనపల్లివారి తర్వాతి వాదన ఎమంటే గుడి రామలింగేశ్వరునిది. విష్ణుకుండిన కాలంలో అక్కడ రామలింగేశ్వరాలయం ఉండి ఉంటుంది. రామలింగేశ్వరాలయాన్నే రామప్ప ఆలయం అని ఉంటారు అని ఊహించారు. అంతే కాదు ఆ కాలంలో తెలుగు కన్నడ భాషలు కలిసి ఉన్నాయి తెలుగన్నడంలో రాముడిని రామ+అప్ప అని అంటారు. కాబట్టి ఇది రామాలయం అయి ఉంటుంది అని ఒక ఊహ చేశారు. ఇంకా ఏమంటారంటే మనం రాముడిని రామ+అయ్య అని కలిపి అన్నట్లుగా కన్నడం వారు అయ్యని అప్ప అంటారు కాబట్టి రామప్ప అవుతుంది కనుక రామలింగేశ్వరుని గుడిని రామప్పగుడి అని అన్నారు. ఇది సత్యనారాయణ గారి వాదన. అలా అనుకున్నా రామలింగేశ్వరాలయాన్ని రామలింగప్ప గుడి అని వ్యవహరించి ఉండాలి. కానీ లింగేశ్వరుడు అసలు దేవుడు ఆయనపేరునే తీసివేసి రామప్పగుడి అని ఎలా అంటారు. ఒక వేళ కన్నడం అలా అనే సంప్రదాయం ఉంటే కర్ణాటకలో ఏ రామాలయాన్ని య్యినా రామప్పుగుడి అని అంటున్నారా. రామాయలయం అనేకదా అంటున్నారు. కాబట్టి సత్యనారాయణగారిది ఏమాత్రం పొసగని పిచ్చి వాదన. ఇదేనా ద్వావనపల్లి సత్యనారాయణ గారు చెప్పే శాస్త్రీయ ఆధారం. కాబట్టి వీరి “రామప్ప శిల్పి పేరు కాదు” అని చెప్పే ఏ ఆధారమూ నిలిచేది కాదు.

ఇక రామప్ప గుడికి ఆపేరు తరతరాలనుండి అంటే వందల సంవత్సరాలనుండి అనgస్యూతంగా వస్తున్న జానపద వాక్కు. జానపద సమాచారంకాలక్రమంలో గాథగా మారుతుంది. శిల్పి ఉండడం యదార్థం శిల్పి నిర్మాణం చేసి ఉండడం యదార్థం శిల్పి పేరు ప్రఖ్యాతులు కాంచినవాడైతే ఆ శిల్పి పేరు పైన కట్టిన గుడిని రామప్పగుడి అని పిలవడం ఆనాటి సాధారణ వాడుక కావడం సాధ్యమే. అంతే కాదు ఆ గుడి కొద్ది కాలంలో కట్టినది కాదు దాదాపు నలభై సంవత్సరాలు పట్టిందని చారిత్రక ఆధారాలున్నాయని చరిత్రకారులు చెప్పారు. అంతకాలం ఒక ప్రధాన శిల్పి ఎందరో శిల్పుల సహాయంతో కట్టిన గుడి అది. ఇక రామప్ప ప్రేమకథ మరికాస్తకల్పనలతో కూడిన కథ కావచ్చు. అతనికి ఏదైనా ప్రేమాయణం ఉండి ఉండవచ్చు. రాణి అ రాణి కూతురు అనేది కల్పన కాచ్చు. కానీ జానపదుల నోటిలో తరం నుండి తరానికి ఒక సమాచారం వస్తే దాన్ని శాస్త్రీయ ఆధారం కాదని కొట్టి పారవేయడం సరైన పద్ధతికాదు. ఆధునిక చరిత్ర రచనవిధానంలో (historical research methodology)లో మౌఖిక ఆధారాలను కూడా శాస్త్రీయ ఆధారాలుగానే పరిగణిస్తారు. Oral Tradition and Historical Methodology అనే ప్రసిద్ధ గ్రంథమే ఉంది. కాకుంటే వాటిలో యదార్థం కావడానికి ఏ ఏ అంశాలు పనికి వస్తాయి. దేన్ని కల్పనగా భావించవచ్చు అని చూస్తారు. ఇక్కడ అసలు శిల్పి అనే వాడు లేకుంటే జానపదుల కథలోనికి కాని జానపదుల సమాచారంలోనికి కానీ రాదు. ఇక ప్రేమాయణం అధికంగా కల్పించినది కావచ్చు.

ఇదొక్కటే కాదు సర్వాయి పాపని కథలో కూడా నిజాం నవాబును ఎదిరించి యుద్ధం చేయడం ఒకరోజు రాజుగా గద్దెనెక్కడం ఈ కథ అంతా జానపదగాథగానే మనకు నేటి తరానికి అందివచ్చింది. ఇందులో కల్పన ఉన్నా సర్వాయి పాపడు చారిత్రక వాస్తవంగా నేడు మనం గ్రహిస్తున్నాం. ఇంకా పరిశోధన సాగాలి అంటున్నాము. అతని కోట దానికి పాక్షిక సాక్ష్యం. ఇక మరొక ఉదాహరణ. మనకు ఇప్పటికీ ఉన్న ఐతిహ్యం కాని చరిత్ర ఉంది. ఇబ్రహీం కుతుబ్ షా హైదరాబాదు సికింద్రాబాదుల నడుమ చెరువు తవ్వించాడు. దానికి ప్రధాన ఇంజినీరు హుస్సేన్ ఆయన అక్కడి కార్మికులను చాలా బాగా చూచుకున్నాడు. అందరూ హుస్సేన్ సాగర్ అని పిలిచారు. దానికి అదే పేరు స్థిరపడింది. కట్టించిన నా పేరు కాకుండా అక్కడి ఇంజనీరు పేరుతో దాన్ని పిలుస్తున్నారు అనే బాధతో ఇబ్రహీం మరొక చెరువును కట్టించాడు అక్కడ ఊరు కూడా ఏర్రాటు చేశాడు. అదే నేటి ఇబ్రహీం పట్నం ఆ పేరుతో ఉన్న చేరువు. ఇది కూడా ఐతిహ్యంగా నిలిచిన ఇటీవలి చరిత్ర.

సమ్మకసారల కథ, ఒక ఐతిహ్యంగా నమ్మలేని మహిమలతో ఒక పురాకథగా మనముందు నిలిచింది. కాకతీయ రాజులతో వారు చేసిన యుద్ధం అంతా నేటికి మనకి పురాకథగానే వచ్చింది. ఇందులో నమ్మదగ్గ శాస్త్రీయ ఆధారం ఏదీ మనకు దొరకదు అంటే చరిత్రకారులు కోరుకునే శాసనాలు కానీ, నాణేలు కాని రాతప్రతులు కానీ, తాళపత్రాలు కానీ దొరకవు. కాబట్టి సమ్మక్క సారలమ్మ ఘటన జరగలేదు వారు చారిత్రక వ్యక్తులు కారు అని ద్యావనపల్లి సత్యనారాయణగారు చెప్పగలరా. ఇందులోని కల్పనని పురాకథా సృజనని తీసివేసి చారిత్రక అంశాలను మాత్రమే గ్రహించి చరిత్ర నిర్మాణంలో వాటిని ఆధారంగా తీసుకోవడమే నేటి పద్ధతి. వ్యాసంలో రామవాగు లక్ష్మణవాగు అనేవి ఉన్నాయని వాటిమీద రామప్ప చెఱువు, లక్నవరం చెఱువు కట్టారని జానపదగాథలు తెలుతున్నాయి అని చెప్పిన సత్యనారాయణగారు వాటిని ఆధారంగా పరిగణిస్తూ రామప్పశిల్పికథ కూడా జానపదకథే అయినా దాన్ని నమ్మిన వారు దీన్ని నమ్మకపోవడానికి కారణం ఏమిటి. దీనికి సమాధానం ఏమిటి అంటే “అది శిల్పి పేరు కాదు” అని ముందే నిర్ణయించుకొని దానికి ఏవో ఉపపత్తులు చూపడానికి ప్రయత్నించారు. నమ్మడానికి వీలు కాని ఆధారాలను పట్టుకొని శాస్త్రీయ ఆధారాలుగా చెప్పడానికి పూనుకున్నారు. కాబట్టి “రామప్ప శిల్పి పేరు కాదు” అనే సత్యనారాయణగారి వాదన చెల్లదు. జానపద స్రోతస్సులో తరంనుండి తరానికి వస్తున్న సమాచారం రామప్ప శిల్పి అతను కట్టిన గుడి అనే. దీన్ని శాస్త్రీయ ఆధారం కాదు అని చెప్పడం ఆధునిక చరిత్ర నిర్మాణ పద్ధతికి కూడా వ్యతిరేకం. కాబట్టి రామప్పశిల్పి పేరు అనీ అతని పేరు పైన వచ్చినది రామప్పగుడి అనే పరంపరా సమాచారాన్ని కాదనడానికి వీలు లేని వాస్తవం.

-ప్రొ. పులికొండ సుబ్బాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap