మంచి ముత్యాలు-మంచెం చిత్రాలు

*ఉప్పొంగే ఉత్సాహం నీదైనప్పుడు ఉవ్వెత్తున ఎదురయ్యే అవరోధాలెన్నైనా నీకు దాసోహాలే” కారణం…
ఆ ఉత్సాహం అతని బాధ్యతను విస్మరించేది కాదు. ఆ బాధ్యతను మరింత పెంచేదే గాక తన వృత్తికీ, పనిచేసే సంస్థకూ మరెంతో వన్నె తెచ్చేది. ఎంతో మంది వృత్తి కళాకారులు సైతం సాధించలేని ఆ ఘణతను అతని ఉత్సాహం సాధించింది.
ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు సాధించి పెట్టింది. సమర్ధమైన, సృజనాత్మకమైన అధికారిగా జాతీయ స్థాయిలోనే తన సంస్థకు అత్యుత్తమ అవార్డును సాధించేలా చేసింది. అంతేకాదు సున్నితము, సౌహార్ధంతో నిండిన అతని హృదయకుంచె గీసిన సన్నని సౌకుమార్యమైన రేఖలు ఆహ్లాదకర వర్ణాలతో నిండిన అతని చిత్రాలను చూసిన ఎవరికైనా హృదయం తేలికపడుతుంది. ఆనందపడుతుంది. ఆహ్లాదభరితమౌతుంది. కారణం అతని చిత్రాల్లో ఆధునికత పేరుతో నేడు చూస్తున్న గజిబిజి రేఖలు, అర్ధరహిత ఆడంబర వర్ణాలు లేవు. సునిశితమైన రేఖలు, వాటితో రూపొందించిన అర్ధవంతమైన చిత్రాలు, వాటి మధ్య నింపిన అహ్లాదకర వర్గాలు వెరసి అంతరిస్తున్న మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, వృత్తులు, జానపదాలు, గ్రామీణ జనజీవన సౌందర్యానికి అద్దంపట్టే అందమైన చిత్రాలు… వీటిని సృష్టించింది చిత్రకళనే వృత్తిగా భావించిన ప్రొఫెషనల్ చిత్రకారుడు కాదు. చిత్రకళను ప్రవృత్తిగా మాత్రమే తీసుకుంటూ ఎల్లవేళలా ఆర్థిక లావాదేవీలతో తీరిక లేకుండా గడిపే ఓ బ్యాంక్ ఉద్యోగి. అతనే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆంధ్రాబ్యాంక్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకుడుగా పనిచేసిన మంచెం సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు.

అది 2008వ సంవత్సరం, జనవరి నెల, విశాఖజిల్లా అడపా చిత్రకళా పరిషత్ నర్సీపట్నం వారు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చిత్రకళాపోటీలు, కేవలం ప్రదర్శనా బహుమతి మాత్రమే దక్కిన నేను, మూడవ బహుమతిని సాధించిన నా మిత్రుడు బీర శ్రీనివాస్ ఇరువురం నర్సీపట్నం వెళ్లాం. ప్రదర్శనలో ఉంచిన రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వివిధ చిత్రకారుల చిత్రాలను ఒక్కొక్కటే చూసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటి ఒక్కో శైలి. కానీ వాటన్నింటితోనూ మరింత ప్రత్యేకంగా ఓ రెండు చిత్రాలు అక్కడ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకమైన గొప్ప విషయం ఏమీ ఆ చిత్రాల్లో లేదు, ఒకటి పురాణ సంబంధమైతే రెండోది సాంప్రదాయ బద్ధమైంది. కానీ వాటిల్లో మరేదో ప్రత్యేకత చూసిన ప్రతీ ఒక్కరినీ ఆకర్షించేలా చేస్తున్నాయి. కేవలం కలంతో మాత్రమే సాధ్యమయ్యే సన్నటి రేఖలు, అతను కుంచెతో గీయడం ఒక ఎత్తైతే, ఆ చిత్రాల్లోని రేఖలమధ్య పారదర్శకంగా పూసిన ఆ రంగులు మిగిలిన వాటికంటే చాలా ప్రకాశవంతంగా కనిపించడం మరో ఎత్తు. తరచి తరచి చూస్తుంటే ఆ చిత్రాల్లో కనిపిస్తున్న ఆ ప్రత్యేకతకు కారణం ఆయన రంగులు వాడే విధానంలోనే కనిపిస్తుంది. అదే వాష్ టెక్నిక్.

ఒక వర్ణం పూసిన తదుపరి దాన్ని కడిగి వేరొక వర్ణం పదే పదే పూసి వాష్ చేయడం ద్వారా చివరిగా పూసిన వర్ణాలకు తోడు అక్కడ పూర్వపు వర్ణాల తాలూకు ఛాయలు కూడా సూచాయగా కనిపించడం ద్వారా ఒక ప్రత్యేక శోభ ఆ చిత్రాల్లో కనిపిస్తుంది. అది కూడా బ్రష్తో రంగులు అద్దే మాదిరిగా కాకుండా అత్యంత సహజంగా ఉండే ఆ వర్ణ మాధుర్యం చూసే కంటికి చాలా హాయిగా అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పోటీకి వచ్చిన వందల చిత్రాల్లో ప్రథమ బహుమతిని సొంతం చేసుకున్న ఆ చిత్రాల తాలూకు చిత్రకారుడిని అభినందించి పరిచయం చేసుకున్నాం. అప్పటికే ఆయన ఆంధ్రాబ్యాంక్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కానీ ఆ హెూదా తాలూకు డాబు, దర్పం ఏమీ అతనిలో కనిపించకుండా అతి సామాన్యంగా మాట్లాడిన తీరు మాకు చాలా సంతోషమనిపించింది. అంతే అప్పటి నుండి మాకు పరిచయం రోజు రోజుకూ పెరుగుతూ వచ్చింది.

ఒకప్పుడు చైనా, జపాన్ చిత్రకారులు వాడే వాష్ టెక్నిక్ను బెంగాల్ చిత్రకారులు నందలాల్ బోస్ తదితరులు బాగా వ్యాప్తిలోకి తీసుకురాగా మనరాష్ట్రంలో దామెర్ల, రాజాజీ, భగీరధి, వరదా వెంకటరత్నంతో పాటు ఇటీవలనే మరణించిన కొండపల్లి శేషగిరిరావు ఆయన మరో శిష్యుడు “ఉల్చి”గా ప్రాచూర్యం పొందిన రెడ్డిబోయిన కృష్ణమూర్తిలు విరివిగా ఉపయోగించగా పూర్తిగా ఈ విశిష్ఠ కళా ప్రక్రియలోనే నేడు ఎక్కువగా చిత్రాలు వేస్తున్న విశిష్ఠ చిత్రకారుడు మంచెం సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు. నేడు చిత్రకళాపాఠశాలల్లో విద్య నేరుస్తున్న విధ్యార్ధులకు సైతం తెలియని ఈ విశిష్ఠ కళాప్రక్రియనుపయోగించి విరివిగా చిత్రాలను వేస్తున్నది నేడు రాష్ట్రంలో మంచెం సుబ్రహ్మణ్యేశ్వరరావు గారే అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఎంతో క్వాలిటీతో కూడుకున్న వాట్మన్ డ్రాయింగ్ షీట్స్ పై ఖరీదైన విన్సర్ అండ్ న్యూటన్ కంపెనీ రంగు బిల్లలను మాత్రమే ఉపయోగించి చిత్రాలను వేయడం ఈయన ప్రత్యేకత. వృత్తి రీత్యా తీరిక లేకున్నప్పటికీ, ప్రవృత్తి పరమైన దాహార్తిని తీర్చుకునే క్రమంలో వీలుచిక్కినప్పుడల్లా తాను ఊహించిన బొమ్మల తాలూకు చిత్రాల్ని గీసుకోవడం, రోజుల తరబడి నిదానంగా సంతృప్తి అనిపించే వరకూ వేరొక చిత్రం వైపు పోకుండా ఏకాగ్రతతో చిత్రాల్ని వేయడం వలన ఆయన చిత్రాలు అంతప్రామాణికంగా కనిపిస్తాయి. మంచెంగారి చిత్రాల్లో ప్రధానంగా మనకు మూడు రకాల వస్తువు కనిపిస్తుంది. తరతరాలుగా మన సంస్కృతిలో ఇమిడిపోయిన ఆచారాలకు సంబంధించిన దేవుళ్ళ ఊరేగింపులు, సమర్పణలు, మొక్కుబడులు, గరగాటలు, మామిడితోరణ అలంకరణలు, పేరంటాల్లు లాంటి చిత్రాలు ఒకరకమైతే, గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రతిబింభించే గొర్రెల కాపరులు, విజటబుల్ సెల్లర్స్, జాలరస్త్రీలు, బేంగిల్ సెల్లర్స్, గ్రామీణ కళారూపాలను తయారీ కళాకారులు, పాట్ పెయింటర్స్ లాంటివి ఇంకోరకం. ఇక చారిత్రక, మతపరమైనవి మూడోరకం. వీటిలో చరకుడు, ధన్వంతరి, బౌద్ధజాతక కథలకు సంబంధించిన చిత్రాలు కొన్నైతే పురాణాలకు సంబంధించిన గణపతి, సరస్వతి, శివపార్వతి సమేత గణనాదులు లాంటి చిత్రాలు ఈ కోవలోకి వస్తాయి. చిత్రించే కళారూపం ఏదైనా ఆయన అందుకు ఉపయోగించే విధానం మాత్రం ఒక్కటే. అదే వాష్ టెక్నిక్. ప్రతిచిత్రం సన్నటి రేఖలతో చిత్రించిన తదుపరి ఆయా రేఖల మద్య పారదర్శకంగా పొరలు పొరలుగా రంగులు పూసి చిత్రాన్ని ప్రకాశవంతంగా తీర్చిదిద్దడం ఆయన శైలి.

“దిష్టిబొమ్మలు” అన్న చిత్రంలో దంపతులిరువురు ఇంట్లో కూర్చుని ఆ కళారూపాలను రూపొందిస్తున్న ఆ సన్నివేశంలో వారు కూర్చున్న శైలి చూడచక్కగా వుంటే వారి గృహానికి వేలాడివున్న బూడిద గుమ్మడి ఉట్లు మన పాతకాలం నాటి గ్రామాలను గుర్తుకు తెస్తాయి. అలాగే అవిరేణి అనే చిత్రంలో ఒకప్పటి పెళ్ళిళ్ళ తంతులో ప్రముఖ స్థానాన్ని కలిగియుండే అవిరేణి కుండల తయారీ చిత్రం చూస్తున్నప్పుడు మన గ్రామీణ కళాసౌందర్యం గుర్తుకొస్తుంది. మిత్రులు అన్న వేరొక చిత్రంలో నేటి తరరానికి అసలు ఏమాత్రం తెలియని గుబ్బగొడుగులను చిత్రించి మరలా మన గత కాలాన్ని గుర్తుకుతెస్తారు.

26 మే,1957న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సముద్రతీర ప్రాంతమైన “నేమాం” అనే గ్రామంలో జన్మించిన సుబ్రమ్మణ్యేశ్వరరావుకి బడిలో బలపం పట్టిన నాడే ఏర్పడ్డ చిత్రకళా ఆసక్తిని ఆయన పెద్దమ్మ వరహాలమ్మ మెచ్చుకునేది. హైస్కూల్లో ఉండగా చిత్రకళలో పద్మశ్రీ అవార్డు గ్రహీత తాడేపల్లి వెంకన్న అనే డ్రాయింగ్ టీచర్ చిత్రకళలో మెళకువలు నేర్పిస్తే, అంటార్కిటికా యాత్రలు లాంటి సాహసకార్యాలు చేసిన తన అన్న వెంకటరాయుడు మరియు అతని మిత్రులు విదేశాలు వెళ్ళినప్పుడల్లా అక్కడి రంగులు తెచ్చిఇచ్చి మంచెంను ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్లో వుండగా నీటిరంగుల్లో శివాజీ గెటప్ లో ఉన్న శివాజీ గణేష నన్ను వేసిన చిత్రాన్ని అప్పటి ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ శాస్త్రిగారు ప్రేమ్ చేయించుకుని ఇంట్లో పెట్టుకోవడం, అలాగే తన బైపీసీ రికార్డులను కళాశాలలో స్పెసిమన్స్గా ఉపయోగించడం మరచిపోలేని అనుభూతులుగా ఆయన పేర్కొంటారు. గోదావరి జిల్లాకి చెందిన వ్యక్తి కావడంతో రాజమండ్రిలోని దామెర్ల రామారావు స్మారక చిత్రకళాశాలలోని దామెర్ల రామారావు చిత్రాలు, అడవి బాపిరాజు, అంట్యాకుల పైడిరాజు తదితరులు చిత్రాలలోని శైలి ఆయనను మొదట్లో బాగా ప్రభావితం చేసాయి. 1974లో అగ్రికల్చరల్ బి.యస్సీ చదివేందుకు బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేరడంతో చిత్రకళలో ఆయనకు గొప్ప మలుపు తిరిగిందని చెప్పవచ్చు. కారణం అక్కడే ఆయనలో వాష్ టెక్నిక్ అనే కళాప్రక్రియకు బీజం పడింది. చిత్రకళకు సంబంధించి బహుళ ప్రయోగాలతో ఎన్నో అద్భుతాలు సృష్టించడంతో పాటు వాస్ టెక్నిక్లో అప్పటికే ఎన్నో గొప్ప చిత్రాలను సృజించిన ప్రఖ్యాత చిత్రకారుడు స్వర్గీయ ఉల్చి అక్కడ చిత్రకళాచార్యులుగా ఉండడంతో ఆయనతో ఏర్పడ్డ సాహచర్యంతో వాష్ టెక్కిల్లో చిత్రాలు వేయడం నేర్చుకున్నారు. ఆ శైలి ఆయనకు నచ్చడం, దానిపై మంచి పట్టు సాధించిన మంచెం నిరంతరంగా ఆ తరహాలో వందల చిత్రాలను వేస్తూనే వున్నారు.

ఇప్పటికే 2010లో రవీంద్ర భారతి ఐ.సి.సి.ఆర్. ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్, 2011లో స్టేట్ ఆర్టిలరీ హైదరాబాద్ తో పాటు అనేక చోట్ల వ్యక్తిగత చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించిన ఆయన చిత్రాల్లో అనేకం రాష్ట్రంలోనూ, రాష్టేతర ప్రాంతాలలోనూ అనేక ఉత్తమ బహుమతులందుకోవడం విశేషం.
2007లో ప్రఖ్యాత హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రవేశపెట్టిన తొలి గోల్డ్ మెడల్ సాధించిన ఘణతను దక్కించుకున్న మంచెం 1997 మరియు 2006లో లలితకళాపరిషత్ విశాఖపట్నం వారి పోటీల్లో బెస్ట్ అవార్డ్ను అందుకున్నారు. ఇక 1996వ సం.లో లలితకళా కేంద్రం బాపట్ల, హరివిల్లు ఆర్ట్ అకాడమీ పాలకొల్లు 1999లో కోనసీమ చిత్రకళాపరిషత్ అమలాపురం మరియు వి.ఎస్.ఎన్. ఆర్ట్ గేలరీ విశాఖపట్నం వారి జాతీయ చిత్రకళాపోటీలలోనూ 2002లో అంకాలా ఆర్ట్స్ అకాడమీ భీమవరం, 2003 మరియు 2005, 2008లో అడపా చిత్రకళాపరిషత్ నర్సీపట్నంల నుండి మొదటి బహుమతులను కైవశం చేసుకున్నారు. 2005లో ఉగాది సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి చిత్రకళా పోటీల్లో కూడా ప్రథమ బహుమతిగా ప్రకటించిన 5వేల రూపాయల కేష్ అవార్డ్ను మంచెం వేసిన చిత్రమే సొంతం చేసుకోవడం, ఆ తదుపరి అదే చిత్రం ఆంధ్రప్రదేశ్ పత్రిక ముఖచిత్రంగా రావడం విశేషం. అంతేగాక రాష్ట్రప్రభుత్వం చిత్రకళలో ప్రతీయేట ఇచ్చే 10వేల రూపాయలు కేష్ అవార్డును కూడా 2010లో మంచెం గారు అందుకున్నారు. ఇంకా వీరి చిత్రాలు కాళిదాస్ సాంస్కృతిక అకాడమీ ఉజ్జయిని, (2010) సౌత్సెంట్రల్ జోన్ కల్చరల్ అకాడమీ నాగపూర్, తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ తదితరమైన చోట్ల ప్రదర్శించబడి వున్నాయి.

2017లో ఆంధ్రాబ్యాంక్ జిల్లా ముఖ్య అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత సృజనాత్మకంగా ముందుకు సాగుతున్న మంచెం గారి కళా ప్రస్థానంలో తన భార్య శ్రీమతి సత్యాదేవి పిల్లలు రశ్మి, మరియు తేజల ప్రోత్సాహం మరువలేనిదని, వారే తన చిత్రాలకు మొదటి విమర్శకులని ఆయన చెప్తారు. పిల్లలు ఇరువురు సంగీతంలో, చిత్రకళల్లో రాణించడం విశేషం.

ఇక తన కళాజీవన యానంలో సాధించిన ఎన్నో విజయాలకు సైతం ఎలాంటి ఆడంబర ప్రచారాలకు తావివ్వక, ప్రశాంత జీవనదిలా ముందుకు సాగుతున్న మంచెం సుబ్రహ్మణ్యేశ్వరరావుగారి జీవన నడవడి ఒరవడి ఎందరికో ఆదర్శనీయం.

-వెంటపల్లి సత్యనారాయణ

1 thought on “మంచి ముత్యాలు-మంచెం చిత్రాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap