ఝాన్సీ లక్ష్మీబాయి ఈ పేరు వింటేనే యావత్ ప్రజల మనసులు ఆనందంతో సముద్రంలా ఉప్పొంగుతాయి. ఆమె గురించిన భావాలు సముద్ర కెరటాల్లా ఎగిసి పడుతుంటాయి. ఆమె పేరు వినబడితే చాలు వీర వనిత అని కోయిలలు కుహూ రాగంలో చెప్తాయి. చిలకలు కూడా భారతమాత ముద్దుబిడ్డ అని తమ చిలకపలుకులతో చెప్తాయి. ప్రకృతిమాత సైతం పిల్లగాలుల్ని ప్రసరింపజేస్తుంది. అందుకే ఆమె చైతన్య మూర్తీభవించిన వీరనారి. పరిపూర్ణ నారీ తత్వం, అమర దేశభక్తి, బుద్ధికుశలత, సౌర్య సాహసాలు, కార్య కుశలత వీటన్నింటి కలయికే మణిరత్నం ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి. ఈమె అలుపెరుగని పోరాట యోధురాలు. ఈ పోరాటంలో తనను తాను రక్షించుకోవడమే కాదు తనపై ఆధారపడిన వారికి కూడా రక్షణ కల్పించి వారిలో ఉన్న మనోధైర్యాన్ని వెలికితీసి వారిలో కూడా తనలోని అద్భుతమైన శక్తుల్ని ప్రసరింపజేసి ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించిన గుణవతి, రూపవతి అన్నింటినీ మించి భారతమాత ముద్దుబిడ్డ. ఈ భారతమాత ముద్దుబిడ్డ ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి మహారాష్ట్రలో వారణాసి పట్టణంలోని సతారాలో 1828 నవంబర్, 19న మోరోపంత్ తంబి, భగీరథి బాయి పుణ్యదంపతుల ఇంట వరాల పుత్రికగా జన్మించింది.
ఈమె అసలు పేరు “మణికర్ణిక”. తండ్రి ముద్దుగా ‘మను’ అని పిలుచుకునేవారు. మను నాలుగేళ్ళ ప్రాయంలోనే తల్లి చనిపోయింది. ఇంతటి క్లిష్ట సమయంలో బాజీరావు పిష్వా అనే దూరపు బంధువు బిరూర్ కు మోరోపంత్ ను పిలిపించుకొని ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు నానాసాహెబ్ అనే దత్తపుత్రుడు ఉన్నాడు. నానా సాహెబ్ పినతండ్రి కుమారుడు కూడా ఇక్కడే ఉండేవారు. ఇద్దరూ కూడా మణికర్ణికను తన సొంత చెల్లెలులాగా ఆదరించేవారు. అందరూ కలిసి బిరూర్ లో విద్యాభ్యాసం చేశారు. ముగ్గురు కలిసి కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం లాంటివి నేర్చుకున్నారు. ఖడ్గం ధరించి కళ్లెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తున ఎగిరే కురులతో గుర్రపు స్వారీ అద్భుతంగా చేసేది మణికర్ణిక.
మణికర్ణిక 13 సంవత్సరాల వయసులో అంటే 1842లో ఝాన్సీ రాజ్యానికి రాజైన గంగాధరరావు నవల్కర్ తో వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయినప్పటికీ వారి ఆచారం ప్రకారం మణికర్ణిక పేరు లక్ష్మిబాయిగా మారింది. 1951 లక్ష్మీబాయికి ఒక కుమారుడు పుట్టి చనిపోయాడు. రాజు అనారోగ్యం పాలయ్యారు. దీంతో మంత్రి వర్గం సలహాతో రాజు తన దూరపు బంధువైన వాసుదేవరావు నవల్కర్ కుమారుడైన దామోదర్ రావును దత్తత తీసుకున్నారు. కాని దత్తత తీసుకున్న మరుసటి రోజే మహారాజు గంగాధరరావు మరణించాడు. దీంతో కొడుకు రాజయ్యే అర్హత ఉన్నా బ్రిటిష్ ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయంపై లక్ష్మీబాయి లండన్ కోర్టులో దావా వేసింది. అక్కడ కోర్టు కూడా కేసును కొట్టివేసింది. లక్ష్మీ బాయి కోర్టుకు వెళ్లిందనే కక్షతో రాజభరణాల ఖజానాలో రాజు రుణపడి ఉన్న డబ్బును కూడా ఆమె పెన్షన్ నుండి తీసుకొని వెంటనే ఝాన్సీ పట్టణం వెళ్ళమని హుకుం జారీ చేశారు. కానీ లక్ష్మీబాయి తాను ఝాన్సీ పట్టణాన్ని వదిలేది లేదని ప్రతిజ్ఞ చేసి గడగడలాడించింది. ఝాన్సీ పట్టణాన్ని ఆంగ్లేయులకు ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్న రాణి తన సైన్యాన్ని మరింత బలపరిచే దిశగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్లందరికీ తానే సొంతంగా చక్కని శిక్షణ ఇచ్చి మంచి సైన్యాన్ని తయారు చేసింది. మహిళకి కూడా ప్రత్యేక యుద్ధ శిక్షణ నిచ్చి మహిళా దళాలను తయారుచేసింది. గులాం దాసు లాంటి ఆరితేరిన యుద్ధవీరులంతా బలగంలో ఉన్నారు. తాంతియా తోపే లాంటి ప్రముఖులు కూడా ఆమెకు మద్దతునిచ్చారు. లక్ష్మీబాయి సమర శంఖం పూరించడానికి సిద్ధపడింది. నా రాజ్యంలోకి రావడానికి ఎవరూ సాహసిస్తారో చూస్తాను అంటూ ఆమె సింహంలా గర్జించింది. కోట గోడల్ని పటిష్టం చేసి బురుజులపై ఫిరంగులను నిలిపింది. శిక్షణ ఇచ్చిన వ్యక్తులను బురుజులపై ఉంచింది.
ఝాన్సీ లక్ష్మీబాయి సమరాంగణ రాణియై ఈస్టిండియా కంపెనీని తుదముట్టించడానికి సమరశంఖం పూరించడంతో బ్రిటిష్ వాళ్ళు సమరాన్ని అణచివేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంటే సర్ హ్యూగ్ రోజ్ తన సైన్యంతో వచ్చి రాయగడ్, సాగర్, బాణాపూర్ చందేరి ప్రాంతాలను స్వాధీనం చేసు కుంటూ ఝాన్సీకి 15 మైళ్ల దూరంలో ఆగారు. సర్ హ్యూగ్ రోజ్ ఝాన్సీపై ఆక్రమణ జరిపాడు. ఝాన్సీ సేనాని గులాబ్ దాస్ ఆంగ్లేయులను తరిమికొట్టారు. రాజును ఝాన్సీరాణి బంగారు కడియంతో సన్మానించింది. సర్ హ్యూగ్ రోజ్ మళ్ళీ వచ్చి 1858 జనవరి 6 నుండి మార్చి 31 వరకు కోటలోకి ప్రవేశించి లేకపోయారు. ఈ సమయంలో ఝాన్సీ ఎంతో ఉత్సాహంగా చురుకుగా చాకచక్యంగా ఉండి నగర రక్షణను తానే స్వయంగా పరిశీలించింది. ఆమె తన బలగాలను అప్రమత్తం చేసి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తు అపరకాళిగా వారితో తలపడుతూనే ఉంది. అప్పటికి బ్రిటిష్ వారి దగ్గర 1500మంది సిపాయిలు మాత్రమే వున్నారూ. ఇలా పోరాడుతూనే ఆమె కాల్ఫియాలో ఉన్న ఉన్న తాంతియాతోపేకు కబురు పెట్టింది. ఆయన వెంటనే తన వద్దనున్న 24 ఫిరంగులు 20 వేల మంది సైన్యంతో వచ్చి బ్రిటిష్ సైన్యం వెనకకు వెళ్లి ముట్టడి చేయాలని పథకం వేశాడు ఝాన్సీలక్ష్మీ బాయితో కలిసి. కానీ హ్యూగ్ రాజ్ ఈ విషయం పసిగట్టి తాంతియాను, లక్ష్మీబాయిని అడ్డుకున్నాడు. మిగిలిన సైన్యంతో ముట్టడి తీవ్రతరం చేశాడు. ప్రధాన ద్వారం వద్ద భీకర పోరాటం జరిగింది.
కానీ ఊహించని విధంగా పరిస్థితి తారుమారైంది. ఓ దేశద్రోహి ద్వారాన్ని బ్రిటిష్ వారి పరం చేశాడు. దాంతో ఆంగ్లేయులు రెట్టించిన ఉత్సాహంతో కోట నుంచి రాణి ఝాన్సీ మందిరం వైపు వచ్చేశారు. లక్ష్మీబాయి తన భర్తని, పిల్లవాడిని దూరం చేసుకొని కూడా దేశం కోసం, ప్రజల కోసం తన దుఃఖాన్ని దిగమింగుకొని ఈ స్వాతంత్ర సంగ్రామంలో చాలా సాహసంతో పరిస్థితులకు ఎదురొడ్డి అపరకాళిగా విజృంభించింది. రెప్పపాటులో ఖడ్గాన్ని తీసుకొని ఆంగ్లేయుల పై దాడి మొదలు పెట్టింది. దీంతో ఆంగ్లేయులు కోటను అగ్నికి ఆహుతి చేసేశారు. రాణి సైన్యాన్ని అప్రమత్తం చేసి గ్వాలియర్ కు రమ్మని చెప్పింది. తన కుమారుడు దామోదరరావు వీపుకు కట్టుకొని ఒక చేత్తో కత్తి, మరొక చేతిలో గుర్రపు కళ్ళెం పట్టుకొంది. ఆమె తన గుర్రాన్ని గ్వాలియర్ వైపు పరుగు పెట్టించింది. గ్వాలియర్ రాజా సింధియా ఆమెకు సహాయం చేయడానికి నిరాకరించాడు. కానీ నగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ వీరనారి సిందియాను ఓడించి గ్వాలియర్ ను స్వాధీనం చేసుకుంది.
మళ్ళీ బ్రిటిష్ సైన్యం బ్రిటిష్ వచ్చి గ్వాలియార్ ను ముట్టడించారు. ఆమె మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించింది. శత్రువుల మధ్య అపర కాళియై విజృంభించింది. ఈ వీరాంగన ధాటికి తట్టుకోలేక హ్యూగ్ రోజ్ వెనుకడుగు వేశాడు. కాని ఆమె అక్కడ ఉన్న నదిని దాటాలనుకొంది. ఆకస్మాత్తుగా ఆమె గుర్రం ఒరిగిపోయింది. ఇంతలో వెనుకనుంచి ఓ ఆంగ్ల సైనికుడు ఆమె డొక్కలో పొడిచాడు. రాణి వెనుతిరిగి ఒక్క వేటుతో వాడి తలను నరికి వేసింది. అప్పటికే ఆమె రక్తంతో తడిసిపోయింది. ఇలా ఈ వీరవనిత 17 జూన్, 1858 న యుద్ధంలో వీరమరణం పొందింది. ఇలా అతి చిన్న వయసులోనే తన బుద్ధి కుశలతతో, తన సాహసంతో ఆంగ్లేయుల పాలిట సింహస్వప్నమై జాతికి వన్నె తెచ్చిన పవిత్రమూర్తి భారతరత్నం ఝాన్సీకి రాణి లక్ష్మీబాయికి ఘన నివాళి.
–పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు రచయిత్రి
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి వ్యాసం రాసిన పింగళి భాగ్యలక్ష్మి గారు అలాగే ప్రచురించిన కళాసాగర్ గారికి హృదయపూర్వక అభినందనలు మన భారతదేశంలో మొట్ట మొదట స్వాతంత్ర పోరాటం చేసిన వీరవనిత, ఆదర్శ వనిత. ఆమె గురించి ప్రచురించి మన వాళ్లకు తెలిసేలా చేశారు అందుకు ఎంతో సంతోషం, అభినందనీయం. ఇటువంటి వ్యక్తి గురించి ఇంకా ప్రచారం కావాల్సిన అవసరం ఉంది అన్ని పత్రికలు ఆమె జీవితాన్ని, సాహసాన్ని ఇంకా వివరంగా ప్రచురిస్తూ ఉండుంటే నేటి తరం యువత అందరూ కూడా స్ఫూర్తి పొందుతారు సంఘాన్ని బాగు చేసుకునే విధంగా ముందుకు వెళ్లగలుగుతారు అని నా భావన.