నాటకానికి ప్రాణసమానమైన మాట “రసం”. రచనా పరంగా, ప్రదర్శనాపరంగా, నటనాపరంగా.. రసమే జీవశక్తి. ఏ నటుడు రస పోషణలో అద్వితీయుడో.. అతడే రంగస్థలంపైన సమర్ధవంతంగా నిలుస్తాడు.
రసం అనే పదం గురించి వందల.. వేల సంవత్సరాలు విస్తృతమైన చర్చ జరిగింది.
నాటకపండితులు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. ఎన్నో వాదనలు..మరెన్నో ఖండనలు..
ఇంకెన్నో ప్రతిపాదనలు..
అబ్బో… అదంతా ఓ గొప్ప గ్రంథం.
అసలు రసం అనే మాట.. తొలి వేదమైన ఋగ్వేదంలో కన్పిస్తుంది. వేదంలో రసాన్ని వనస్పతుల “సారం” అన్నారు.
సారం అనడంలోనే రసం యొక్క అర్ధం.. ప్రాధాన్యత మనకు స్పష్టమవుతుంది. అధర్వణ వేదం రసాన్ని “తృప్తి”అంటూ.. మరింత అందంగా చెప్పింది. ఆ తరువాత తైత్తరీయ ఉపనిషత్తు రసం గురించి మరింత స్పష్టంగా “ఆహ్లాదం”అంటూ వర్ణించి చెప్పింది.
“రసోవైనః౹ రసం హ్యేవాయం..”
అంటూ రసానికి చాలా స్పష్టత నిచ్చింది తైత్తరీయఉపనిషత్తు.
రామాయణంలో రసాన్ని “అమృతం” అనే అర్థంలో ప్రయోగిస్తే.. మహాభారతంలో గంధం అనే పదానికి పర్యాయ పదంగా ప్రయోగించారు.
ఇలా.. సాగుతూ వచ్చిన రస శబ్దం వాత్యాయనుడి కామశాస్త్రంలో “రతి, కామశక్తి”అనే పదాలతో.. తొలి సారిగా శాస్త్రీయ భావనలో నిర్వచించబడింది. జయమంగళ టీకాకారుడు కూడా.. రసాన్ని శృంగారాది భావంగా పేర్కొన్నాడు.
నాట్యశాస్త్రం రచించి.. నాటకానికి నాట్య వేదమనే.. గొప్ప గౌరవం…
ఇచ్చిన భరత మహాముని రసం అంటే.. నటుడు ప్రదర్శించే అంశం అంటూ.. నటీనటులు నాటకంలో రసభావాలను ఎంతో అందంగా చూపించాలి అంటూ.. వర్ణించాడు.
రసం గురించి చెబుతూ..రుద్రభట్టు.. తన శృంగార తిలకం గ్రంథంలో భర్త లేని స్త్రీ వలే.. రసం లేని కావ్యం రాణించదు అంటూ చమత్కరించాడు.
మరో మహాపండితుడైన రాజశేఖరుడు తన కావ్య మీమాంస గ్రంథంలో రసాన్ని “ఆత్మ” అంటూ గౌరవించాడు. నిజానికి నాటకానికి ఆత్మ రసమే.
అటుపిమ్మట వచ్చిన ధనుంజయ పండితుడు తన “దశ రూపకంలో
“రసమే “కావ్యాత్మ” అంటూ.. నిశ్చయం చేసాడు.
ఔచిత్య సంప్రదాయ ప్రవర్తకుడైన ఆచార్య క్షేమేంద్రుడు మరో అడుగు ముందుకు వేసి.. రసం కావ్యాత్మకు ప్రథమ తత్వం అంటూ.. విస్పష్టంగా పేర్కొన్నాడు.
ఇలా.. రసం.. ఎన్నో విధాలుగా.. ఎందరో మహాపండితుల చేత
నిర్వచించబడి.. అంతిమంగా..
నాటకానికి “ఆత్మ” అని నిరూపించబడింది. రసం లేని నాటకం లేదు. రసపోషణ లేని నటన లేదు. ఒక వేళ
నాటకం వర్ధిల్లాలి.
తెలుగు నాటకం ఎంతో వర్ధిల్లాలి.
వాడ్రేవుసుందర్రావు