రాజా రవివర్మ (జీవిత నవల)

భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పు బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, గుప్తుల స్వర్ణయుగం, అశోకుని పరిపాలన, గాంధీజీ స్వాతంత్ర్య సమరపోరాటం ఎలా మర్చిపోమో, భారతీయ చిత్రకళా వైతాళికుడు రాజారవివర్మ కూడా అలాగే జ్ఞప్తికివస్తాడు. మన పురాణాలు, ఇతిహాసాలు చదివి, అందులోని ముఖ్య సంఘటనలను తన కుంచెతో అకృతులు కల్పించిన అమర చిత్రకారుడు రాజారవివర్మ.
తెలుగులో వచ్చిన అన్ని పత్రికలు ఇప్పటికీ ఆయన వేసిన చిత్రాలు, ప్రత్యేక వ్యాసాలు అవకాశం కుదిరినప్పుడల్లా ప్రచురిస్తునే ఉన్నాయి. రవివర్మ భారతీయ చిత్రకారుల్నే కాదు, తెలుగు చిత్రకారులెందర్నో కూడా ప్రభావితం చేశారు. అంతేకాక కురుపాం, పిఠాపురం, నిజాం నవాబులు అయన చేత గీయించుకొని భద్రపర్చుకున్నారు. ఆ విధంగా కూడా వారితో మనకు సన్నిహిత సంబంధం వుంది. మన చిత్రకళా సంస్థల్లో కొన్ని అయన జయంతి/వర్థంతుల్ని నిర్వహిస్తున్నాయి. మరికొన్ని ఆయన పేరుతో కూడా అవార్డుల్ని ఇస్తున్నాయి.
వివిధ భారతీయ భాషల్లో అయన పై అనేక గ్రంధాలు వచ్చాయి. తెలుగువచ్చిన గ్రంధాల్ని గురించి చర్చించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

2012లో నేను రాజారవివర్మ పేరుతో 48 పేజీల చిరుపుస్తకం తెచ్చాను. ఇందులో 14 రంగుచిత్రాలు, 20 నలుపు-తెలుపు చిత్రాలు ఇచ్చాను. పుస్తకం ముద్రణకు ముందు కొందరు చిత్రకళా మిత్రలు, మరికొందరు కళాభిమానుల అభిప్రాయం తీసుకోవడం జరిగింది. చిత్రకారుణ్ణి గురించి ఎంతరాసినా, అతనుగీసిన చిత్రాలు ఎక్కువ వుండటం అవసరం అని వారంతా చెప్పడం జరిగింది. అందువల్ల రవివర్మకు సంబంధించి ముఖ్య సమాచారం మాత్రం ఇచ్చా. చిత్రాలు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించాను. ఆ పుస్తకాలు ఒక సంవత్సరంలోపే విక్రయాలు జరిగాయి. రవివర్మ జీవిత చరిత్ర వెలుగులో గ్రంథ రూపంలో తెచ్చిన వ్యక్తిగా గుర్తింపుపొందాను.

గత సంవత్సరం ఏలూరుకి చెందినవి బిందా రాజారవివర్మ పేరుతోనే 92 పేజీల గ్రంధం ప్రచురించారు. 18 రంగుల చిత్రాలు, కొన్ని నలుపు-తెలుపు చిత్రాలతో ముద్రించారు. రంగుల చిత్రాలు ముద్రణ ఎంతో బాగుందో నలుపు-తెలుపు చిత్రాలు అంత బాగోలేదు. రవివర్మకు సంబంధించిన ముఖ్య విశేషాల్ని అక్రమబద్ధం చేశారు బిందా..
తాజాగా గత డిసెంబరులో పి. మోహన్ రాజా రవివర్మ పై ఒక నవల 410 పేజీలతో తెచ్చారు. ఇందులో నాల్గు పేజీల్లో 13 రంగుల చిత్రాలు, మరో నాల్గు పేజీల్లో 12 రవివర్మ బంధువుల చిత్రాలు, ఇంకో నాల్గు పేజీల్లో 15 నలుపు-తెలుపు రవివర్మకు సంబంధించినవి ఇచ్చారు.

ఇదీ స్థూలంగా రవివర్మ జీవితం. కళ గురించి ఇందులో వాస్తవం అని పాఠకులకు అనుమానం కల్గవచ్చు. ఇందులో ఘటనల్లో, పాత్రల్లో ముప్పావువంతు పైగా వాస్తవమైనవే. చారిత్రక సంఘటనలు, రవివర్మ చిత్రాలు ఆధారం చేసుకొని సన్నివేశాలు కల్పించాను” అని రచయిత తన చిన్న మాటలో చెప్పుకొన్నారు.
రవివర్మ మరణించి దాదాపు పదకొండు దశాబ్దాలు దాటాయి. అలాంటప్పుడు నాటి సంఘటనలు లిఖించినవారుకాని, చెప్పేవారుకాని లేకపోవడంతో రవివర్మ తమ్ముడు రాజరాజవర్మ డైరీ ఆధారంగా రచయిత మోహన్ ‘నవల’ను రచించారు. ఈ విషయంలో రచయిత చాలావరకు విజయం సాధించారు. సంఘటనలు, చిత్రరచన ఒక క్రమపద్ధతిలో చెప్పడంవల్ల నవల చదివినట్టుగాకాకుండా జరుగుతున్న కథగా గోచరిస్తుంది. రవివర్మ చిత్రాలకు మోడళ్లు, చిత్రీకరణ, ఇబ్బందులు, రూపచిత్ర రచన సవివరంగా వివరించారు. నవలలో అనవసర వర్ణనలు అక్కడక్కడా కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి.

రవివర్మ అసలు పేరు రవివర్మ కోయిల్ తుంపరాన్ అని, బ్రిటీష్ ప్రభుత్వం అతనికి రాజా’ అనే బిరుదును ‘కైజర్-ఇ-హింద్’ అవార్డు ఇచ్చినప్పుడు, ప్రశంసాపత్రంలో రవివర్మకు బదులు ‘రాజా రవివర్మ’ అని వ్రాయడం, ఆయనకు ఇష్టమైన అయ్యప్పన్ అనే ఏనుగు గురించి కూడా సంక్షిప్తంగా చెప్పివుంటే ఇంకా బాగుండేది.
రవివర్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్న కళాకారులు, కళాభిమానులు తప్పక కొని చదవవలసిన గ్రంథం మోహన్ తెలుగులో మనకందించారు. ఇది మనకు గర్వకారణమైన విషయం. ఈ గ్రంథంలో రవివర్మ చిత్రాల్ని రచయిత అక్షరాల్లో చూపించారు. రవివర్మ చిత్రాల్ని రంగుల్లో చూడాలనుకొన్నవారికి కొంత నిరాశ కల్గుతుంది.

మోహన్ ది సాహసోపేత నిర్ణయం. రవివర్మ ‘వెన్నెల్లో రాధ’లో కొంత భాగాన్ని ముఖచిత్రంగా వేశారు. గ్రంధం కూడా ముఖచిత్రంలా వుంటుంది.
ఈ గ్రంథానికి సాహిత్య అభిమానులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీరామ్ చెరువులు ఆర్థిక సహకారం అందించడం అభినందనీయం.
కాకి ప్రచురణలు – ముద్రించిన ఈ గ్రంథం వెల రూ. 300/-లు, ప్రతులకు : 9949052916.

సుంకర చలపతిరావు
9154688223

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link
Powered by Social Snap