సాయికుమార్ గారికి… పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక ప్రత్యేకత నిండిన పుట్టినరోజు ఇది (జూలై 28 ).ఈ రోజుతో అరవైలోకి అడుగు పెడుతున్నారు.షష్టి పూర్తికి శుభారంభం ఇది.సుయోధన ఏకపాత్రతో ఆరంభమైన సాయికుమార్, నటజీవితం..సినీ రంగంలో ఎంతో ఎత్తున నిలిచింది. ఎన్నో విభిన్న పాత్రలు..ఆయనను వరించాయి. నటించిన ప్రతి పాత్రను తనదిగా మలచుకోవడం ..ఆయన గొప్ప నేర్పు. అందుకోసం పడే శ్రమ..చేసే కష్టం మాటల్లో చెప్పలేనివి.మరీ ముఖ్యంగా ఆయన స్వరం.. అది నిజంగా అద్భుతం.
కంచు కంఠం లాంటి.. ఆయన స్వరంలో వినబడే ప్రతి సంభాషణ శ్రోతలకు గొప్ప అనుభూతి నిస్తుంది. అందులోనూ..తెలుగు అక్షరం సాయికుమార్ నోట.. మధురాతి మధురంగా వినవస్తుంది. తెలుగు అంటే ఆయనకు చెప్పలేనంత ఇష్టం.సహృదయంఆయన సహజ లక్షణం. వినయం ఆయన విశిష్ట సంపద.
కనిపించే మూడు సింహాలు సత్యానికీ, న్యాయానికీ, ధర్మానికి ప్రతిరూపాలైతే… కనిపించని నాలుగో సింహమేమేరా ఈ పోలీస్. ఈ సంభాషణ ఎక్కడ ఎవరు పలికినా గుర్తుకొచ్చేది సాయికుమారే. ఆయన కథానాయకుడిగా నటించిన ‘పోలీస్ స్టోరీ’లో చెప్పిన ఆ సంభాషణతో సాయికుమార్ తెలుగు ప్రేక్షకులకు నాలుగోసింహమే అయ్యాడు. కథానాయకుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు, కన్నడ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు సాయికుమార్.
ప్రముఖ నటుడు, డబ్బింగ్ కళాకారుడైన పి.జె.శర్మ, పూడి పెద్ది కృష్ణజ్యోతి దంపతులకి 1960లో జన్మించిన సాయికుమార్ ఎమ్.ఎ. వరకు చదువుకొన్నారు. కాలేజీలో ఎన్.సి.సి విద్యార్థి అయిన సాయికుమార్, చదువు పూర్తయ్యాక నటనపై దృష్టిపెట్టారు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మొదట డబ్బింగ్ ఆర్టిస్టుగానే ప్రయాణం మొదలుపెట్టారు సాయికుమార్. సుమన్, రాజశేఖర్ కి గళం అందించారు. ‘పోలీస్ స్టోరీ’ చిత్రంతో కన్నడలో కథానాయకుడిగా ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువాదమై విశేష ఆదరణని చూరగొంది. ఆ తర్వాత ఆయనకి కన్నడ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ‘అగ్ని ఐపీఎస్’, ‘కుంకుమ భాగ్య’, ‘పోలీస్ స్టోరీ 2’, ‘లాకప్ డెత్’, ‘సర్కిల్ ఇన్స్పెక్టర్’, ‘సెంట్రల్ జైల్’, ‘పోలీస్ బేటే’, ‘మనే మనే రామాయణ’ చిత్రాలతో కన్నడలో స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగులో బాపు దర్శకత్వం వహించిన ‘స్నేహం’తో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. ఆతర్వాత ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి. పలుచిత్రాల్లో ప్రతినాయకుడిగా, సహనటుడిగా మెరిసి ప్రేక్షకులకు చేరువయ్యారు. టెలివిజన్లో పలు కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి ఇంటింటికీ చేరువయ్యారు. ‘సామాన్యుడు’తో ఉత్తమ విలన్ గా నంది పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. ‘ప్రస్థానం’తో ఉత్తమ సహనటుడిగా నంది అందుకొన్నారు. సాయికుమార్ తమ్ముళ్లు పి.రవిశంకర్, అయ్యప్ప. పి. శర్మలు కూడా నటులుగా డబ్బింగ్ కళాకారులుగా కొనసాగుతున్నారు. సురేఖని వివాహం చేసుకొన్న సాయికుమార్ కి ఇద్దరు సంతానం. తనయుడు ఆది కథానాయకుడిగా కొనసాగుతుండగా, తనయ జ్యోతిర్మయి వైద్య వృత్తిలో ఉన్నారు.