మానవతామూర్తి చిరంజీవి – సమరం

చిరంజీవి గారు మనసున్న మనిషి. మనసెరిగిన మనిషి, మానవత్వం మూర్తీభవించిన మనిషి. చక్కని హృదయ స్పందన కలిగిన మనిషి. మంచితనానికి రూపుకడితే చిరంజీవి అవుతారు. చిరంజీవిగారిని తలకుంటే అభిమానులకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇవాల్టికీ ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గకపోవడానికి కారణం చిరంజీవిగారి హృదయసంస్కారం. అందుకే ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.. వార్తా కథనాల్లో, ప్రత్యేక కథనాల్లో గానీ పత్రికా రచయితలు చిరంజీవి గారి గురించే ప్రస్తావించే తీరు ప్రత్యేకంగా ఉండేది. చిరంజీవి గారి ఇంటర్వ్యూలు కూడా హార్ట్ టచింగ్ గా ఉండేవి. అలా చిరంజీవి గారి పట్ల ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తి కాస్తా ఆదరాభిమానాలతో కూడిన పరస్పర గౌరవ స్నేహంగా మారడానికి కారణం 1990లో అనుకుంటా, “శిరంజని’ సినీవారపత్రికలో ‘సమరంజని’ అనే కాలమ్ ప్రారంభించమని డాక్టర్ దాసరి నారాయణరావుగారు కోరడం.. ఆ కాలమ్ మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రారంభించాలని చెప్పి చిరంజీవిగారిని కలిసే ఏర్పాటు చేశారు. చిరంజీవిగారు హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోలో ‘గ్యాంగ్ లీడర్’ సాంగ్ పిక్చరైజేషన్లో ఉండగా ఉదయం 11 గంటలకు నేను మా అమ్మాయితో కలిసి వెళ్లాను. చిరంజీవిగారు రిసీవ్ చేసుకున్న తీరుకు ఆశ్చర్యపోయాను. ఎక్కడా తను మెగాస్టారు అన్న ధోరణి ఆయనలో లేదు. కలిసిన వెంటనే “మీ నాన్నగారి పేరు గోరాగారు. గోరా గారి గురించి నేను స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ సినిమాలో డైలాగ్ చెప్పాను సమరంగారు” అంటూ ఎంతో గౌరవించారు. మరుసటి రోజు మా అమ్మాయి బర్త్ డే అని చెప్పడంతో స్టిల్ ఫొటోగ్రాఫర్‌ను పిలిచి వెంటనే తనతో ఫొటోలు దిగి “వీళ్లు ఈ రోజు వెళ్లిపోతున్నారు. విజయవాడలో ఉంటారు. రేపు ఉదయానికి బర్త్ డే గిఫ్ట్ గా ఫొటోలు విజయవాడలో అందాలి.” అని పురమాయించారు. ఎదుటివారిపట్ల కన్సర్న్ చాలా గొప్పగా చిరంజీవి గారు కలిగి ఉంటారనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

ఆ తర్వాత కొన్నిసార్లు కలిశాక బ్లడ్ బ్యాంక్, ఐబ్యాంకు నెలకొల్పాన్న ఆలోచనను నాతో పంచుకున్నారు. అద్భుతంగా సక్సెస్ అవుతారని చెప్పాను. తర్వాత అవి కార్యరూపం దాల్చాయి. 1998లో ఐ అండ్ బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు అయితే 2000 సంవత్సరం నుంచి నన్ను స్టేట్ కో ఆర్డినేటర్‌గా తీసుకున్నారు. ఎన్నో బ్లడ్ క్యాంపులు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించాము. ఫ్యాన్స్ అందరినీ సేవా కార్యక్రమాల వైపు మళ్లించిన ఘనత మెగాస్టార్ చిరంజీవి గారిదే. 500 మందితో మొదలైన రక్తదాతల సంఖ్య క్యాంప్ క్యాంపు పెరుగుతూ 4000 వరకు టచ్ అయింది. నేను చాలెంజింగ్ గా తీసుకుని నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో 130 కాలేజీల స్టూడెంట్స్ తో రెండు రోజులు క్యాంప్ నిర్వహిస్తే 6 వేల యూనిట్ల రక్తాన్ని దాతలు అందించడం ఒక గ్రేట్ ఎచివ్మెంట్. అప్పటికి అదే స్టేట్ రికార్డ్. (ఆ తర్వాత ఈ రికార్డు బ్రేక్ చేసింది కూడా చిరంజీవిగారి ఫ్యాన్సే) అందుకే నేను చిరంజీవి గారి ఫ్యాన్ను చాలా గౌరవిస్తాను. చిరంజీవిగారిని, ఫ్యాన్ను వేరు చేసి చూడలేను. అదిలాబాద్ నుంచి అనంతపురం, విజయవాడ నుండి వికారాబాద్ చిరంజీవి బ్లడ్ క్యాంప్ ల కోసం నేను తిరగని ప్లేస్ లేదు. అన్ని చోట్లా ఒకటే రెస్పాన్స్.. దటీజ్ ది పవర్ ఆఫ్ చిరంజీవి గారు. ఇక్కడ నా పర్సనల్ లైలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నా శ్రీమతి రష్మి ఓ ప్రోగ్రామ్ కి బెంగళూరు వెళ్లి యాక్సిడెంట్ అయ్యి మణిపాల్ హాస్పిటల్ లో సర్జరీ చేయాల్సి వచ్చింది. తనది ఓ నెగిటివ్ బ్లడ్. రేర్ బ్లడ్ గ్రూప్. మేమేమో విజయవాడ నుండి బై రోడ్ బయలుదేరాము. అల్లు అరవింద్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాను. మేము టెన్షన్ గానే బెంగళూరు చేరాము. హాస్పిటలకు వెళ్లేటప్పటికి 40 మంది ఓ నెగిటివ్ బ్లడ్ డోనర్స్ రెడీగా ఉన్నారు. అందరూ చిరంజీవిగారి ఫ్యాన్సే, రెండు మూడు యూనిట్లు సరిపోతాయి. కానీ రేర్ గ్రూపు కదా.. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి స్వామినాయుడు గారు కర్ణాటకలోని ఫ్యాన్కు విషయం చెప్పగానే ఒకరికొకరు కమ్యునికేట్ చేసకుని అంతమంది హాస్పిటల్‌కు చేరుకున్నారు. మానవత్వానికి ఇందకంటే నిర్వచనం ఇంకేముంటుంది?! నా శ్రీమతి కుదటపడి విజయవాడ వచ్చాక చిరంజీవిగారిని కలిసి థ్యాంక్స్ చెబుదామని హైదరాబాదు వచ్చి చిరంజీవి గారిని గీతా ఆర్ట్స్ ఆఫీసులో కలవగానే చిరంజీవి గారు తన యోగక్షేమాలు జాగ్రత్తగా అడిగి తెలుసుకోవడంతో ‘హ్యూమన్ టచ్’ యొక్క మాటకు విలువ పెరిగినట్టయింది.

ఎయిడ్స్ పై నేనొక పుస్తకం రాసి చిరంజీవిగారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నానని చెబితే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రవింద్రభారతికి వచ్చి చాలా సేపు ఆ సభలో సమయాన్ని కేటాయించి తన ప్రసంగంలో ఎయిడ్స్ బాధిత కుటుంబాలపై వివక్ష తగదని చిరంజీవిగారు ఇచ్చిన సందేశం ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి అభినందనలు అందుకునేలా చేసింది. చెప్పడమే కాదు.. 2006లో తన పుట్టినరోజు ఆగస్టు 22వ తేదీన మా ‘వాసవ్య మామ్’లో ఉంటున్న హెచ్ఐవీ బాధిత చిన్నారులందరినీ హైదరాబాద్ పిలిపించుకుని వారి మధ్య తన బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం, వారితో కలిసి కేక్ కట్ చేయడం, కేక్ తినిపించుకోవడం ఇవన్నీ కూడా సమాజానికి చిరంజీవి గారు ఇచ్చిన వెలకట్టలేని సందేశాలు మాత్రమే కాదు, ఆ హెవీ బాధిత చిన్నారుల్లో అంతులేని ఆత్మ విశ్వాసాన్ని కూడా నెలకొల్పారు. చిరంజీవి సినిమాలలో నా ఫేవరెట్ మూవీ ‘ఠాగూర్’. చిరంజీవిగారితో కలిసి రాజమండ్రికి మదర్ థెరిస్సా విగ్రహావిష్కరణ కోసం చార్టెడ్ ఫ్లెలో వెళ్లడం ఓ మధురమైన జ్ఞాపకం. నా మాతృమూర్తి సరస్వతి గోరా గారు మరణించినప్పుడు చిరంజీవి గారు ఫోన్ చేసి పరామర్శించడం, చిరంజీవి గారి సమున్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. అందుకే మొదట్లోనే చెప్పాను, చిరంజీవి గారు మనసున్న మనిషి, మనసెరిగిన మనిషి. ఆ మనసెరిగిన మహా మానవతామూర్తికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 64కళలు పత్రికా ముఖంగా అందస్తున్నా…

డా. సమరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap