కరోనా థర్డ్ వేవ్ పొంచి వున్న సమయం లో కళాకారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రముఖ సమాజ సేవకులు, సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి శ్రీ బండారు సుబ్బారావు సూచించారు. హైదరాబాద్ లో మంగళవారం సీల్ వెల్ కార్పొరేషన్ కార్యాలయం లో “ఝమ్మంది నాదం ” సంగీత విభావరి కార్యక్రమ బ్రోచర్ ను శ్రీ బండారు సుబ్బారావు ఆవిష్కరించారు.
గత ఏడాదిన్నరగా కరోనా లాక్ డౌన్ తో సాంస్కృతిక కార్యక్రమాలు జరగక కళాకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని శ్రీ బండారు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని కళాకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ కరోనా లో ఎందరో కళాకారులను పోగొట్టుకున్నామని, అందులో గాన గంధర్వుడు డాక్టర్ ఎస్.పి.బాలు గారు కూడా వెళ్లిపోవడం అభిమానులు అందరిని కలచి వేస్తున్నదని అన్నారు. బాలుగారిని గుర్తు చేసుకుంటూ ఝమ్మంది నాదం శీర్షికతో సంగీత విభావరి ఏర్పాటు చేయడం సముచితంగా ఉందన్నారు.
ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కుసుమ భోగరాజు మాట్లాడుతూ తెలుగు పాట ఉన్నంత కాలం ఘంటసాలగారు, బాలు గారు అందరి హృదయాల్లో ఉంటారని వివరించారు. శృతిలయ సంస్థ 20వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నవరస గాయని ఆమని ఆధ్వర్యం లో జరిగే ఈ విభావరిలో పాటల ప్రియులందరు పాల్గొనాలని, ఉచిత ప్రవేశం అని ఆయన ఆహ్వానం పలికారు.
శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి శ్రీమతి ఆమనిగారు మాట్లాడుతూ ప్రముఖ సమాజ సేవకురాలు శ్రీమతి గుడ్ల ధనలక్ష్మి గారు శృతిలయ అధ్యక్షురాలుగా ఆ రోజు అదే వేదిక పై బాధ్యతలు స్వీకరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన సభ తొలి స్పీకర్ శ్రీ ఎస్.మధుసూధనాచారి, తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ పూర్వ ప్రతినిధి శ్రీ ఎస్.వేణుగోపాలాచారి, తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొలేటి దామోదర్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొంటారని ఆమె వివరించారు.
-సాగర్