(రాజమండ్రి దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో శీలా వీర్రాజు చిత్రాల విభాగం ప్రారంభం)
సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడానికి సాహిత్యం చిత్రలేఖనం దోహదం చేస్తాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజమండ్రి దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ (2nd Block)లో ప్రముఖ సాహిత్యవేత్త, చిత్రకారులు శీలా వీర్రాజు కుంచె నుంచి జాలువారిన చిత్రాల ప్రదర్శన గ్యాలరీ ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం (13-03-22) ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపకులు పడాల వీరభద్రరావు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ సాహిత్యం చిత్రలేఖనం ద్వారా సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుకోవచ్చునని అన్నారు. రాజమహేంద్రవరం నగరం సాంస్కృతిక, సాహిత్య రంగాలకు కేంద్రమన్నారు. సమాజంలో నైతిక విలువలను కాపాడుకోవడానికి ఎందరో మహానుభావులు కృషి చేశారని అన్నారు. అందులో అనేక మంది చిత్రకారులు ప్రధాన భూమిక పోషించారని గుర్తు చేశారు. రాజమహేంద్రవరం కేంద్రంగా దామెర్ల రామారావు, వరదా వెంకట రత్నం, మాదేటి రాజాజీ, శీలా వీర్రాజు వంటి ఎందరో మహానుభావులు ఉన్నారన్నారు. చిత్రలేఖనం కళను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రముఖ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన చిత్రాలను అందుబాటులో ఉండాలంటే అందుకు సంబంధించిన గ్యాలరీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ఇచ్చే చిత్రలేఖనం గ్యాలరీలను అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ తరపున ప్రభుత్వానికి సూచిస్తుందని తెలిపారు.
మరో ముఖ్య అతిథి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సాహిత్యవేత్త చిత్రకారుడు వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ దేశంలో తొలితరం చిత్రకారులు తెలుగుజాతి గర్వించదగిన రీతిలో చిత్రాలను తమ తమ కుంచె నుంచి జాలు వార్చారని అన్నారు. ఇప్పటి వరకు సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరం నగరం చిత్రలేఖన రాజమహేంద్రి గా మారబోతున్నదని తెలిపారు. తెలుగు నేలను మేల్కొల్పుతూ శీలా వీర్రాజు కుంచె నుంచి జాలువారిన చిత్రాలు ఉన్నాయని చెప్పారు. సామాన్యుల బతుకులను శీలా వీర్రాజు తన చిత్రాల ద్వారా బాహ్య ప్రపంచానికి అందించారని కొనియాడారు. దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ రంగుల కొలువుగా మారిందని యువతకు స్ఫూర్తినిచ్చే అనేక చిత్రాలు గ్యాలరీలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. యువతలో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈ చిత్రాలు ఎంతగానో దోహదం చేస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా శీలా వీర్రాజు, సుభద్రా దేవి దంపతులను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖులను, చిత్రకారులను ఈ సందర్భంగా మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి మాదేటి రవిప్రకాష్ ఉపాధ్యక్షులు పి.యస్.రవికాంత్ ఇతర కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందించారు. శీలా వీర్రాజు గారి చిత్రాలను దామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమికను పోషించిన మాదేటి రవిప్రకాష్ పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు ప్రముఖ చిత్రకారులు ఎస్. విజయ్ కుమార్, మాకినీడి, టేకి మృత్యుంజయ రావు, తారా నగేష్ , భాస్కర్ రమణ , నాంబత్తుల రాంబాబు, ఎన్.వి.పి.ఎస్. లక్ష్మి, ఎన్.ఎస్. శర్మ, పి.ఎస్. ఆచారి, ప్రముఖ రచయిత డి.ఆర్. ఇంద్ర తదితరులు మాట్లాడారు.
దామెర్ల ఆర్టు గేలరీ మినియేచర్:
70 సంవత్సరాల క్రితం నిర్మించిన దామెర్ల ఆర్టు గేలరీ మినియేచర్ ఆర్కిటెక్చర్ మోడల్ (రిప్లిక)ను కథా రచయిత డి.ఆర్. ఇంద్ర తయారు చేసారు.
పాత భవనం అలాగే నూతనంగా నిర్మించిన భవనం నమూనాలను చాలా శ్రమకోర్చి తయారు చేసారు. చిత్రకళతో ఉన్న అనుబంధంతో, అవగాహనతో దీనిని తయారు చేసారు.
ఈ సందర్బాన్ని పురస్కరించుకొని గిరిజన సంక్షేమశాఖ డైరెక్టరు వాడ్రేవు చినవీరభద్రుడు, మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మలు ఆవిష్కరించి గేలరీకి అందచేసారు.
-కళాసాగర్