ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది…ఇందులో నటులు, రాజకీయ నేతలు, క్రీడాకారులు వున్నారు. ఇప్పుడు కొత్తగా ఓ గణిత శాస్త్రవేత్త కావడం విశేషం. ఆమె ఎవరంటే… ఆమె అంకెలతో ఆడుకుంటుంది. సంఖ్యలతో సమరానికి సై అంటుంది. క్షణాల్లో గణిత చిక్కుల్ని విప్పి అబ్బురపరుస్తుంది. ఆమే ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలాదేవి. ఈ మధ్యనే అను మీనన్ దర్శకత్వం లో విద్యాబాలన్ నటించిన శకుంతలాదేవి బయోపిక్ ఓటీటీలో విడుదలైంది. ఆమె అసాధారణ జీవితంలో ఎన్నో ఆటు పోట్లు, ఆశక్తికర విషయాలు ఎన్నో వున్నాయి.. సంక్లిష్టమైన గణిత సమస్యలకు క్షణాల్లో సమాధానం ఇచ్చే అద్భుత మహిళగా శకుంతలాదేవి చూపబడింది. ఒక సినీమా కు సరిపడ డ్రామా ఈమె కథలో వుంది…
రెండు వందల సంఖ్యలున్న ఓ అంకెని గుణించాలంటే ఎంత సమయం పడుతుంది…? ఎంత స్మార్ట్ ఫోన్లను వినియోగించినా క్షణాల్లో చేయడం అసాధ్యం. కానీ, శకుంతలా దేవి క్షణాల్లో చేసి చూపించింది. ఆ మేధకు ప్రపంచమంతా విస్తుపోయింది.
చదువు కోలేదు…
శకుంతలా దేవి నవంబరు 4, 1929లో బెంగళూరులో జన్మించింది. ఆమెను దేవి అని ముద్దుగా పిలిచేవారు. తండ్రి సర్కస్లో పనిచేసేవాడు, తాడుపై నడవడం, మ్యాజిక్ చేయడం లాంటివి చేసేవాడు. మూడేళ్లప్పుడు లెక్కల్లో ఆమె ప్రతిభ బయటపడింది. సర్కస్లో పనిని మానేసి దేవితో ప్రదర్శనలు చేయించడం మొదలు పెట్టాడు తండ్రి. ఆరేళ్లకే మైసూర్ యూనివర్సిటీలో తన లెక్కల ప్రావీణ్యాన్ని చూపించి ఆశ్చర్యపరిచింది శకుంతల. ఆ తరవాత నుంచి ఆమె ఎక్కడా ఆగింది లేదు. రేడియో షోలు చేసింది. 1944లో తండ్రితో పాటు లండన్ వెళ్లింది. 1950లో లండన్ బీబీసీలో ప్రత్యేక కార్యక్రమం చేసింది. ఓ లెక్కలో అంకెలకు సంబంధించి దేవికి, బీబీసీకి తర్జనభర్జన జరిగింది. ఆఖరికి బీబీసీనే తమ లెక్కలో తప్పు దార్లిందని ఒప్పుకోక తప్పలేదు. ఆనాటి నుంచే ఆమె ప్రపంచ పర్యటన మొదలైంది. ఏ దేశంలో ప్రదర్శించినా దేవి చురుకైన, వేగవంతమైన గణిత ప్రావీణ్యానికి ప్రేక్షకులు విస్తుపోయేవారు. అలా ప్రదర్శనల వల్ల తనకి వచ్చిన మొత్తంలో కావలసినంత మాత్రమే తన కోసం పెట్టుకుని మిగతాదంతా ఇంటికి పంపించేది అతి వేగం …
అనాదిగా వివిధ దేశాలలో అంకెలతో గారడీ చేసే ‘మెంటల్ కాల్యుకులేటర్స్’ అక్కడా ఇక్కడా కన్పిస్తుంటారు. కానీ, శకుంతలది అపారమైన వేగం. కాంతికంటే వేగంగా పయనించేవి ఆమె కాలుక్యులేషన్స్ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. 1977లో 201 అంకెలున్న సంఖ్య 23 వర్గమూలాన్ని 50 సెకెన్లలో పూర్తి చేసింది. 200 అంకెలున్న సంఖ్య 23, వర్గమూలాన్ని 1975లో డచ్ దేశానికి చెందిన గణిత మేధావి విల్లెమ్ క్లీన్ పది నిమిషాలలో పూర్తిచేశాడు. అంటే తమ సమకాలీన మెంటల్ కాలిక్యులేటర్ల కంటే మన శకుంతలా దేవి ఎన్నో రెట్లు ముందుండేది. 18 అంకెలున్న సంఖ్యని 28 సెకెండ్లలో గుణించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఆ అసాధారణ గుణింతాన్ని ‘నమ్మలేని నిజం’ అంటూ మేధావులందరూ కీర్తించారు. ఆమె ముందు ఆనాటి కంప్యూటర్లూ వెనకబడ్డాయి. అందుకే హ్యూమన్ కంప్యూటర్గా పతాక శీర్షికలకెక్కింది. కానీ ఆమెకు అలా పిలవడం నచ్చేది కాదు. కంప్యూటర్లు చేయలేనివెన్నో మనిషి మెదడు చేయగలదని చెప్పేది.
బహుముఖ ప్రతిభ..
లెక్కల్లోనే కాదు శకుంతల ఆలోచనలు కూడా ఆనాటి కాలానికంటే ఎంతో ముందుండేవి. పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నా పెళ్లికి సంబంధించిన వస్తువులను ధరించనని తెగేసి చెప్పిన తెగువ ఆమెది. అలాగే భర్త పేరునూ తన పేరు చివర తగిలించుకోలేదు. ఈ జంటకు అనుపమా బెనర్జీ అనే ఒకే ఒక్క కూతురు ఉంది. తన లాగే కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకుంది.
స్త్రీపురుషులు ఇద్దరూ సమానమేనని ఎప్పుడూ వక్కాణించే తను. కోల్కతాలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు.. తన గుర్తింపు కోసం భర్త పేరును ససేమిరా రాయనంది. నేనూ మనిషినే నన్ను నన్నుగా గుర్తించండి అని గట్టిగా చెప్పింది. ఆమె ప్రగతిశీల భావాలు ఎన్నో అంశాలకు విస్తరించాయి. ఆ క్రమంలోనే 1977లో ‘ది వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ పుస్తకాన్ని రాసింది. స్వలింగ సంపర్కులకు సంబంధించిన తొలి పుస్తకంగా అది పేరు తెచ్చుకుంది. సమాజం స్వలింగ సంపర్కులను అక్కున చేర్చుకోవాలి అని బాహాటంగా రాయడం ఆకాలంలో చాలా మందికి మింగుడు పడలేదు. ఆ పుస్తకాన్ని రాయడానికి నాకు గల ఒకే ఒక అర్హత మనిషిగా జన్మించడం. అని శకుంతల ప్రకటించింది. కానీ ఆనాడు ఆ పుస్తకానికి తగిన గుర్తింపు రాలేదు. అయితే చాలా కాలం తరవాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త స్వలింగ సంపర్కుడు కావడం వల్ల ఆ అంశంపై ఆసక్తి కలిగి పరిశోధించి పుస్తకం రాశానని కుండబద్దలు కొట్టింది. సమాజంలో ఈ అంశంపై అవగాహనా రాహిత్యం వల్ల ఎందరో బలవుతున్నారన్నది ఆమె ఆవేదన. మెదక్ నుంచి పోటీ.. గణితం, వంటలు, ఆస్ట్రాలజీ, పజిల్స్ పై అనేక పుస్తకాలు రాసింది శకుంతలాదేవి. కొన్నేళ్లు జ్యోతిష్యురాలిగా ప్రముఖుల జాతకాలను చెబుతూ బిజీగా గడిపింది. లోకసభకు రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఓసారి దక్షిణ ముంబయి నుంచి, మరోసారి మెదక్ నుంచి. ఇందిరాగాంధీకి ప్రత్యర్థిగా 1980లో మెదక్ నుంచి పోటీ చేసి 6,514 ఓట్లను సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. వ్యక్తిత్వ నిపుణురాలిగా కూడా పేరు తెచ్చుకుందామె. ఇలా తన జీవితకాలంలో ఎన్నో ఘనతలను సాధించి 83వ యేట బెంగళూరులో తుదిశ్వాస విడిచింది శకుంతల. ఆమె జీవితం అనన్యసామాన్యం . ఆ ప్రతిభ అక్షరాల్లో ఒదగనిది, ఆ మేధస్సు అంకెల్లో కొలవలేనిది.
జూలై 31 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విద్యాబాలన్ ప్రీమియర్స్ నటించిన శకుంతల దేవి. జీవిత చరిత్రను అను మీనన్ రచన మరియు దర్శకత్వం వహించారు. తప్పక చూడండి…