(బాల సుబ్రహ్మణ్యం గారి 75 వ జన్మదిన సందర్భంగా….)
అలుపెరగని తన అమృత మధుర గానానికి ఇక సెలవంటూ తెలుగు వారి అరాధ్య గాయకుడు, బహుముఖ ప్రజ్ఞానిధి శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం 25 సెప్టెంబరు 2020న కన్నుమూశారు. పాటకు పర్యాయపదమై అభిమానుల హృదయాలలో ‘బాలు’గా ఆప్యాయతానురాగాల్ని అందుకున్న ఆ గాన గంధర్వుడు 4 జూన్ 1946లో హరికథా కళాకారుడైన సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండే భాష, గాన అనురక్తి, కలిగిన బాలు చదువులలోనూ ప్రతిభాశాలిగా నిలిచారు. పియుసి విద్యార్థిగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఉన్నప్పుడు మద్రాసు ఆకాశవాణిలో ప్రసారమైన ఒక నాటికలో స్త్రీ పాత్రలో ఆయన నటించారు. తానే రాసి, స్వరపరచిన లలిత గీతానికి విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి బాలు బహుమతి అందుకున్నారు. మద్రాసు సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీలలో 1964లో ఎస్.వి. కోదండపాణి ప్రశంసలతో పాటు ప్రధమ బహుమతిని బాలు గెలుచుకున్నారు. ప్రఖ్యాత నటుడు పద్మనాభం 1966లో నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో ‘ఏమి ఈ వింత మోహం ‘ అనే పాటలను తొలిసారిగా పాడారు బాలు. 1969 నుండి గాయకుడిగా వెనుదిగిరి చూడనన్ని పాటలు పాడి ఎవరూ ఊహించలేనంత ప్రజారదణను బాలు పొందారు. తెలుగు సినిమాకు సంబంధించి మహాగాయకుడు మంటసాల తరువాత అంతటి స్థానాన్ని బాలు అందుకుని పరిశ్రమలో స్థిరపడిపోయారు. నటులకు అనుగుణమైన ఉచ్ఛారణా భావాలను తన గళంలో పలికిస్తూ చూపిన సత్ప్రతిభ ఆ బాల గోపాలానికీ బాలును అభిమాన గాయకుడిని చేసింది.
అసమాన ప్రతిభా వ్యుత్పత్తులతో నాలుగు దశాబ్దాలపాటు తెలుగుతో పాటు 11 భాషల్లో ఎదురులేకుండా బాలు పాటలు పాడారు. సుమారు 45 వేల పాటలు పాడి ఉంటారని అంచనా. 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. శంకరాభరణం, సాగర సంగమం (తెలుగు), ఏక్ దుజే కేలియే (హిందీ) వంటి విజయవంతమైన చిత్రాలలో బాలు పాడిన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. ఏ ఒక్క భాషకూ పరిమితి చేయకూడని అసాధారణ భారతీయ గాయకుడు బాలు.
గాయకునిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకునిగా, నటునిగా, నిర్మాతగా అనేక విభాగాలలో బాలుకు ప్రవేశం ఉంది. 29 సార్లు ఉత్తమ గాయకునిగా నంది పురస్కారాలతో అనేక ప్రఖ్యాత సంస్థల పురస్కారాలను అందుకున్నారు. రోజుకు పది పాటలు పాడగలిగిన గాయకుడిగా బిజీగా ఉంటూనే పలు చిత్రాలల నటుడిగా నటించి పాత్రలకు జీవం పోశారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘మల్లెపందిరి’ చిత్రంలో మొదటిసారి నటించారు. ఆ తర్వాత పక్కింటి అమ్మాయి. పవిత్ర బంధం, పర్వతాలు – పానకాలు, ఆరోప్రాణం, మనసుపడ్డాను కానీ, దీర్ఘ సుమంగలి, ప్రేమికుడు వంటి పలు చిత్రాలలో నటించారు. 1990లో తమిళంలో వచ్చిన కేలడికన్మణి’లో 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన ‘మిధునం’ చిత్రాలలో కథా నాయకుడిగా నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా బాలు ఎంతో పేరు తెచ్చుకున్నారు. మన్మధలీల సినిమాలో కమలహాసనకు డబ్బింగ్ చెప్పే అవకాశాల్ని బాలుకు దర్శకులు కె బాలచందర్ కల్పించారు. దశావతారం (2010) సినిమాలో కమలహాసన్ ధరించిన 7 పాత్రలకు విలక్షణంగా డబ్బింగ్ చెప్పి బాలు రికార్డు సృష్టించారు. రజనీకాంత్, భాగ్యరాజ్, సల్మాన్ ఖాన్, మోహన్, గిరీష్ కర్నాడా, విష్ణువర్ధన్, జెమినిగణేశన్, రఘువరన్, కార్తీక్, అర్జున్ వంటి నటులకు బాలు డబ్బింగ్ చెప్పారు. నటుల హావభావాల కనుగుణంగా గాత్రాన్ని అందించడంలో బాలు భేష్ అనిపించుకున్నారు. అన్నమయ్య సినిమాలో సుమన్ నటించిన
వెంకటేశ్వరస్వామి పాత్రకు, ‘గాంధీ’ చిత్రంలో(దర్శకుడు అటెరో) గాంధీ పాత్ర ధారి ‘కింగ్ బెన్ ప్లేకు’ బాలు డబ్బింగ్ చెప్పారు.
బాలు స్వరం సప్త స్వరాలను పలికింది. ఎన్నో పద్యాలు, శ్లోకాలు పాడిన బాలు భాష తీరు, ఉచ్ఛారణపై ప్రత్యేక దృష్టిని నిలిపి ఆకట్టుకున్నారు. తన తండ్రి సాంబమూర్తి ద్వారా తెలుగుపై చిన్ననాడే తనకు అభిమానం ఏర్పడిందని తరచూ బాలు చెప్పేవారు. తనకు మొట్టమొదటి అవకాశమిచ్చిన కోదండపాణిని గురుతుల్యులు, పితృతుల్యులు, భగవత్ స్వరూపులుగా బాలు భావించేవారు. అనేక దేశాలు తిరిగి కార్యక్రమాలలో పాడినప్పుడు తెలుగును ఆదరించి, కాపాడమని బాలు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ తన భాషామమకారాన్ని చాటుకున్నారు. తన కెరీర్ లో తొలి బ్రేక్ మర్యాద రామన్నను ప్రతి సందర్భంలో ఆయన తలచుకునేవారు. 1993లో హైదరాబాదు పబ్లిక్ గార్డెన్‌లో ఘంటలసాల కాంస్య విగ్రహాన్ని, నెల్లూరులోని శ్రీకస్తూర్బా కళా క్షేత్రంలో తండ్రి సాంబమూర్తిల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. తనకు తొలి అవకాశం కల్పించిన కోదండపాణి పేరును తాను నెలకొల్పిన ఆడియో ల్యాబ్ కు పెట్టి తన కృతజ్ఞతను బాలు చాటుకున్నారు. బాలు సతీమణి సావిత్రి, పల్లవి, ఎపి చరణ్ సంతానం. కొన్ని సినిమాల్లో చరణ్ పాటలు పాడడంతో పాటు సినీ నిర్మాతగా మారారు.
1996లో ఈటీవీలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో బుల్లితెరకు వచ్చారు బాలు. కొత్తతరం గాయనీగాయకులను ఈ కార్యక్రమం ద్వారా ఆయన వెలికితీసి పరిచయం చేశారు. సంగీత జ్ఞానాన్ని తిరుగులేని సాధనతో పుష్కలంగా పెంచుకున్న బాలు నవతరం గాయనీగాయకులకు ఎన్నెన్నో సూచలనందించిన కార్యక్రమం ఇది.
అమెరికాలో ఓ తెలుగు పాటని రికార్డింగ్ చేయించిన ఘనత బాలుకే దక్కింది. జంధ్యాల ‘ఆనందభైరవి’ ఘనవిజయం తరువాత ప్రవాసాంధ్రులు బాలు సంగీతదర్శకత్వంలో జంధ్యాల దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయించారు. ఆ సినిమా కోసం బాలు అమెరికాలోని ఒమేగా స్టూడియోలో శైలజతో కలిసి ‘పిబరే రామరసం’ పాటను పాడి రికార్డు చేశారు. అక్కినేని, ఎన్టీఆర్ మొదలుకొని మూడుతరాల కథానాయకులకు పాడిన ఘనత పొందిన బాలు బాగా పాడడమే కాదు గొప్పగా మాట్లాడగిలిన వక్త. తన గాన ప్రస్థానంలో బాలు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ (2001), పద్మభూషణ్ (2011), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ (1999), భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం (2016), నంది పురస్కారం 2012 ప్రత్యేక బహుమతి (మిథునం) అందుకున్నారు.
ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ నేపథ్య గాయకుడు ‘మైనే ప్యార్ కియా’ (1990), ఉత్తమ నేపథ్య గాయకుడు ‘శ్రీరామదాసు’ (2007), ఉత్తమ నేపథ్య గాయకుడు ‘మోజి’ (2008), ఉత్తమ నేపథ్య గాయకుడు ఆప్తరక్షక (2011), ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ప్లేబ్యాక్ సింగర్ (1987), లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు (1984) బాలు అందుకున్నారు. జాతీయ అవార్డులలో ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ‘మిన్నరకన్నావు’ (1996), బెస్ట్మ ల్ ప్లేబ్యాక్ సింగర్ ‘సంగీత సాగర గానయోగి పంచాక్షర’, గవాయ్ (1995), బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ‘రుద్రవీణ’ (1988), బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ ‘సాగర సంగమం’ (1983), బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఏక్ దూజే కేలియే (1981), బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ శంకరాభరణం (1979) అందుకున్నారు. శిఖరాగ్రపు కీర్తిని అందుకున్న అరుదైన బహుభాషా గాయకులు బాలు మానవతావాదిగా, సేవానిరతితో జీవనం సాగించారు. గానవీచికై బాలు సంగీత ప్రపంచంలో వెలుగొందారు.
-తిరునగరి శ్రీనివాస్