చిత్రకళా దీప్తి “స్ఫూర్తి” శ్రీనివాస్”

ఎవరూ పుడుతూనే కళాకారులుగా పుట్టరు! వారు పెరిగిన కుటుంబం, చుట్టూవున్న సమాజం తదితరాలతో ప్రభావితమై కళల యందు ఆశక్తి చూపుతారు! సాధన ద్వారా కళాకారునిగా రూపొందుతారు. “సాధనమున పనులు సమకూర ధరలోన” అన్నట్లు కృషితో ఆయారంగాలలో అత్యుత్తమ కళాకారులుగా పేరుప్రఖ్యాతలు సంపాదిస్తారు. అలాంటి కోవకు చెందిన చిత్రకారుడు, చిత్రకళోపాధ్యాయుడు స్ఫూర్తి శ్రీనివాస్. అంతే కాదు ఫోటోగ్రాఫర్ గా, రైటర్ గా, గ్రాఫిక్ డిజైనర్ గా, ఈవెంట్ మేనేజర్ గా, ప్రకృతి ప్రేమికుడిగా బహుముఖమైన ప్రతిభకలిగిన కళాకారుడు. తాను ఎంచుకున్న రంగంలో విజయం కోసం శ్రమించే విక్రమార్కుడు స్ఫూర్తి శ్రీనివాస్… గురించి…

పేరులో శ్రీనివాస్ కి ముందు ఇన్నున్నాయి అంటే ఇదేదో ఆలోచన చేయాల్సిందే. ఒక్కో మాటకు ఒక్కో కథనం తన జీవితంతో ముడిపడి ఉంది. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఏ పేరున పిలిచినా పలుకుతానంటూ సాగే శ్రీనివాస్ జీవితం ఓ వైవిధ్యం. వీడు తేడా రా బాబూ.. కిక్కు కోసం రిస్కు చేస్తాడు, మంచోడే కానీ మొండోడు, సక్కనోడు గానీ తిక్కలోడు, వీడు మాములోడు కాదంటూ మిత్రుల్లో వచ్చే మాటల సరదాతో తనంటే ప్రాణమిచ్చే వ్యక్తులను సంపాదించుకున్న వ్యక్తి కథనమే ఈ స్ఫూర్తికథనం…..

రెండు అంశాలకు అతను జీవితం లింక్ అయ్యి ఉంటుంది. ఒకటి ఆర్ట్ రెండు పిచ్చుక. పొత్తిళ్ల పుణ్యం ఓ తల్లి అయితే యశోదమ్మ చాటు కన్నయ్యలా పెరిగింది మాత్రం భారతమ్మ ఒడిన. బొమ్మలంటే గమ్ముగుండనక పిల్లాడు గోల చేస్తుంటే బొమ్మలేసి రోడ్డుమీద అర్ధరూపాయిలెక్క అడుక్కుంటావా అన్న తండ్రి మాటను దర్జాగా దాచి గంటల తరబడి బొమ్మలేయించి మురిసిన భారతమ్మ, వీడు గొప్పగా బొమ్మలేస్తాడు చూస్తుండు అని వేలి పట్టుకుని తీసుకొచ్చిన అన్న నర్రా శంకర్ ఈ ఇద్దరే ఆర్ట్ జీవితానికి ఓనమాలు.

చిత్రకళా సాధనలో : నూనూగు మీసాల వయసులోనే ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం సాధించి సబ్జెక్ట్ టీచర్ల కన్నా మేమేమి తక్కువకాదని నిరూపించి ఆర్ట్ టీచర్ల స్థాయిని పెంచి…కళ ఓ వారసత్వ సంపద ఎవరుబడితే వారు ఆర్టిస్ట్ కాలేరు, పల్లెటూరు నుండి వచ్చి ఈ పిచ్చిబట్టలతో నువ్వేం ఆర్టిస్ట్ అవుతావని అవమానించి.. ఆర్ట్ అంటే ఇకవారే అన్నట్లుగా చెప్పుకుంటున్న వారి చేత వాహ్వా అనిపించుకునే స్థాయిలో నిలబడి ఆశ్చర్యపరచిన ప్రతిభావంతుడు. ఆర్ట్ వారసత్వ సంపదా..? ఇంకెవరూ ఆర్ట్ వేయకూడదా..? నేర్వకూడదా..? మధ్యతరగతి జీవితాన్ని వేలెత్తి చూపుతూ.. వేసుకున్న బట్టలను హేళన చేస్తూ.. ఆర్ట్ కి వంక పెడతారా అనే ఆలోచనలు రగిలాయి అవమానాలు రాజుకున్నాయి. తనలాగే ఆర్ట్ లో భంగపడ్డ కొందరి మిత్రులతో కలసి 1994 సంవత్సరంలో “సిరి” ఆర్ట్ అకాడెమీ పేరుతో ఆర్టిస్ట్స్ ఆర్ మేడ్ – నాట్ బోర్న్ అనే ట్యాగ్ లైన్ తో తోటి ఆర్టిస్టులంతా తమ నైపుణ్యాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఒక్కటై నడిచి ప్రయోజకులై మెరిశారు.

Srinivas Life journey

స్నేహ పరిమళం : ఇదిలా ఉంటే ఓ ప్రణయం చిగురించింది. శ్రీనివాసుడు కాస్తా స్నేహా వసుడయ్యాడు. అగ్నికి ఆజ్యం తోడయినట్టు భర్త అడుగుజాడల్లో మరింత ముందుకి నడిచి… ఆయన విజయాలకి తోడై నడిచారు భార్య స్నేహ శ్రీనివాస్. ఎంచుకున్న రంగం కోసం ఇంటినీ, ప్రేమించిన అమ్మాయి కోసం అన్నింటినీ అలవోకగా వదిలి జంటగా ఒంటరి ప్రయాణం మొదలెట్టారు. ఆర్ట్ అందరికీ చేరాలని “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ స్థాపన 2005 ఏప్రిల్ 15 జరిగింది. కళ వారసత్వ సంపద కాదూ, నేర్చుకోవాలన్న తపన., సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే ఆసక్తి ఉన్నవారెవరైనా కళాకారులుగా రాణించవచ్చునని నిరూపించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో “కళకి పునరుజ్జీవనం (Renaissance in the field of Art)” అనే క్యాప్షన్ తో స్థాపించబడిన స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఇద్దరు విద్యార్థులతో మొదలయ్యి వేల మంది విద్యార్థులకు ఆర్ట్ ని ఒక టూల్ గా వాడుతూ చిన్నారులకు శిక్షణనిస్తూ వారిలో Imagination, Observation, Creative స్కిల్స్ మెరుగు పరుస్తూ… జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బహుమతులు, యువ చిత్రకారులకు ఉపాధి, వివిధ స్థాయిలో చిత్రలేఖన పోటీలు, విద్యార్థులచే చిత్రకళా ప్రదర్శనలు, ఆర్ట్ వర్కుషాప్లు / సెమినార్లు, సామాజిక అంశాలపై ఈవెంట్లు, సీనియర్/యువ/చిన్నారి చిత్రకారులకు అవార్డులు సత్కారాలు ఇలా వందల్లో ఆర్ట్ ఈవెంట్స్, వేలల్లో విద్యార్థులను ఆర్ట్ టీచర్లుగా, గ్రాఫిక్ డిజైనర్లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా,ఆర్కిటెక్టులుగా, ఆర్టిస్టులుగా తయారు చేసి విజయవాడ చిత్రకళా చరిత్రలో ఒక రంగుల విప్లవాన్ని సృష్టించారు.

పిచ్చుకల ప్రేమికుడు : పల్లె వాతావరణంలో పెరిగిన శ్రీనివాస్ కి పిచ్చుకలంటే మహా ఇష్టం. ఉదయాన్నే అవి చేసే కిచకిచలు వినడం ఎక్కడలేని సంతోషాన్ని కలిగించేవి. వాటికి కంకులు కట్టడం, నీరు పెట్టడం, వాటి ఎదురుగా అద్దం పెడితే అవి అందులో చూస్తూ పొడుచుకుంటూ ఆడుతుంటే చూసి సంబరపడటం, ఈదురు గాలులకు, వర్షానికి ఆ గూడులు పడిపోతే ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను జాగ్రత్త చేసి మళ్ళీ యధాస్థానానికి చేర్చడం, వాటిని ప్రేమగా చూసుకోవడం ఇలా అవి మెలిగే తీరు అంతా శ్రీనివాస్ జీవితంలోకి వచ్చేసాయి. ప్రకృతిని మించిన మోటివేటర్ లేడు, మనసుకు అయిన ఏ గాయాన్నైనా మాన్పించే శక్తి ప్రకృతిది. అందుకే ఏ మాత్రం సందు దొరికిన చెట్లవెంట, గుట్టలవెంట, దట్టమైన అడవుల వెంట తన నీడని వెతుక్కుంటూ వెళ్తారు. స్నేహితులతో కలిసి ట్రావెల్ చేయడమంటే బాగా ఇష్టం. తను విదేశాల్లో కూడా విహరించి వచ్చారు. పులి, సింహం, ఏనుగు లాంటి జంతువులతో స్నేహం చేసి సెల్ఫీ దిగుతాడు. సరదాతో కూడిన సంతోషం కోసం తపిస్తాడు, స్నేహితులతో గడిపేందుకు గంతులేస్తాడు. వెళ్ళిన ప్రతిచోటా, కనిపించినప్పుడల్లా పిచ్చుకలని తన కెమెరాలో బంధించడం అలవాటు. ఇప్పటిదాకా కొన్ని లక్షల పిచ్చుక ఫోటోలు తన దగ్గర దాచబడి ఉన్నాయి. 2016 లో క్రమేపీ కనుమరుగవుతున్న పిచ్చుకలను కాపాడాలని, రేడియేషన్తో రాలుతున్న ఈ చిన్న జీవాలను సంరక్షించాలని సేవ్ స్పారో ఈవెంట్ చేశారు. మరలా 2022 న ఉభయ తెలుగురాష్ట్రాల్లో సేవ్ స్పారో ఈవెంట్ గొప్పగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు.

Save sparrow event-2022 at Vijayawada
Save Sparrow

ఈరోజున జి. శ్రీనివాస్ (“స్పూర్తి” శ్రీనివాస్), ఆర్టిస్ట్, ఆర్ట్ మాస్టర్, ఆర్ట్ స్కూల్ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్, ఇంటర్నేషనల్ ట్రావెలర్, ఫోటోగ్రాఫర్, డిజిటల్ క్రియేటర్,రైటర్, గ్రాఫిక్ డిజైనర్… వగైరా… వగైరా… ఒకప్పుడు, కళారంగానికి పనికిరావని, ఈర్ష్యతో అణచివేసిన వాళ్ళతోనే అందరిముందు చప్పట్లు కొట్టించుకుంటూ.. పేరుగాంచిన సంస్థలనుంచి సత్కారాలను పొందుతూ… మెగా ఈవెంట్లను అలవోకగా చేసుకుంటూ పోయే మనోడి ముచ్చట్ల చరిత్ర చైనా వాల్ అంతవుద్ది. తిరగడమే కాదు ప్రదేశానికి తగ్గట్టుగా ఫోటోలు దిగుతూ చక్కగా క్యాప్షన్లు రాయడం కూడా తెలిసిన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న హార్టిస్ట్..

“నేనో సాధారణ ఆర్టిస్టుని గొప్పగొప్ప పనులు చెయ్యలేకపోవచ్చు గానీ నేను చేసే చిన్న పనినైనా గొప్పగా చేస్తాను” అంటూ పిచ్చుకల రక్షణ కోసం..చిత్రకళ పునరుజ్జీవనం కోసం మరిన్ని కార్యక్రమాలు చేస్తూ, ప్రతీ సంవత్సరం తన కుటుంబంతో తిరిగే ఫ్యామిలీ ట్రిప్ తో తన బిడ్డలకు అనేక ప్రదేశాల్లో జీవనశైలి గురించి తెలిసేలా చేస్తూ… సంఘజీవిగా ప్రకృతి నుండి స్ఫూర్తిని, పిచ్చుక నుండి స్వేచ్ఛని పొంది ముందుకు సాగుతున్న మన శ్రీనివాస్ ఇద్దరి బిడ్డల పేర్లు కూడా స్ఫూర్తి, స్వేచ్ఛ. స్ఫూర్తి శ్రీనివాస్ అలియాస్ పిచ్చుక శ్రీనివాస్ జీవనశైలి మొత్తం పక్షుల జీవన విధానంతో మమేకమై ఉంటుంది.

ఆర్ట్ టీచర్ గా : ఇరవై ఏడేళ్ళ నుంచి విద్యల వాడగా ప్రశిద్ది గాంచిన విజయవాడ నగరంలో సంవిదా విద్యా పీఠ్, నలందా విద్యా నికేతన్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ సంస్థ ల్లో ఆర్ట్ మాష్టర్ గా, క్రియేటివ్ హెడ్ గా సేవలందించారు.

పదిహేడేళ్ళు పూర్తి చేసుకున్న స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ కి డైరెక్టర్ గా, వందకి పైగా ఆర్ట్ ఈవెంట్లను విజయవంతం గా నిర్వహించిన ఈవెంట్ మేనేజర్ గా “స్ఫూర్తి” శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

artist Srinivas

చిత్రకళా బోధనలో: చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి… కళని కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో గత పదిహేడు సంవత్సరాలుగా “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ ఆధ్వర్యంలో చిత్రకళలో ఎన్నో వేల మంది చిన్నారులకు శిక్షణ నిస్తూ సమాజానికి కొంతమంది ఉత్తమ చిత్రకారులను అందిస్తూ… చిత్రకళ ద్వారా పలు సామాజిక అంశాలపై చైతన్యాన్ని తీసుకువచ్చి వారిలో కళా నైపుణ్యాన్ని పెంపొందించాలనే దీక్షతో… సేవ్ స్పారో, ఆర్ట్ బీట్, టాలెంట్ హంట్, మెగా ఆర్ట్ కాంటెస్ట్, మెగా ఆర్ట్ కాంటెస్ట్, సలాం ఇండియా, సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ నేచర్ ఫర్ ఫ్యూచర్, స్వేచ్ఛ భారత్, గ్రీటింగ్ కార్డ్ కాంటెస్ట్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, సేవ్ వాటర్…. వంటి టైటిల్స్ తో చిత్రలేఖనం పోటీలు, చిత్రకళా ప్రదర్శనలు నిర్వహిస్తూ… సీనియర్ చిత్రకారులకి “చిత్ర కళారత్న”.. యువ చిత్రకారులకి “యువ చిత్రకళా రత్న”… చిన్నారి చిత్రకారులకి…”బెస్ట్ బడ్డింగ్ ఆర్టిస్ట్” అవార్డులు ఇస్తూ…ప్రతి యేటా మార్చి నుంచి జూన్ వరకు ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులను నిర్వహిస్తూ… ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్, పెన్సిల్ షేడింగ్, పెన్ డ్రాయింగ్, కార్టూన్స్, పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్, కాలిగ్రఫీ, పేపర్ క్విల్లింగ్, క్లే మౌల్డింగ్, మండాల ఆర్ట్, మైక్రో ఆర్ట్, లీఫ్ ఆర్ట్, ఫోటోగ్రఫీ, ఫోటోషాప్డి, జిటల్ పెయింటింగ్ లతో పాటు… మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు యేటా నిర్వహించే టెక్నికల్ గ్రేడ్ ఎగ్జామ్స్ కి కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తూ… ఎంతో మందికి ఉపాధి అవకాశాలను చూపిస్తూ తనవంతు బాధ్యతగా కళకు స్ఫూర్తి శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయం.

చిత్రకళా సేవలో: దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే సూక్తి నుంచి ప్రేరణ పొంది నేటి తరం చిన్నారులకు, యువతకు 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతావని ఔన్నత్యాన్ని తెలియపరచి వారిలో దేశభక్తిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో కేజీ నుంచి పీజీ చదివుతున్న విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా “సలామ్ ఇండియా” ఆర్ట్ కాంటెస్ట్ తో పాటు స్ఫూర్తి విద్యార్థులు మరియు క్రియేటివ్ టీం లతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ని 2023 ఫిబ్రవరి 5న గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించబోతున్న మన స్ఫూర్తి శ్రీనివాస్ కి ఆల్ ది బెస్ట్.

సోషల్ మీడియాలో: కళ శాశ్వతం – కళాకారుడు అజరామరం అనే నానుడిని నిజం చేస్తూ చిత్రకళతో పాటు ఇతర కళలు… కళాకారులు.. కళా ప్రదర్శనలు… కళా వేడుకలు ఇలా కళల ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాప్రియులందరికీ చేరవేయాలనే క్రియేటివ్ కాన్సెప్ట్ తో 2023 గణతంత్ర దినోత్సవం నుంచి “ఆర్ట్ బీట్” యూట్యూబ్ ఛానెల్ ని నిర్వహించబోతున్న స్ఫూర్తి శ్రీనివాస్ కి అభినందనలు.

విదేశీ పర్యటనలు చేస్తూ… అక్కడ కళా సంస్కృతి… కళాకారులు శైలి…. ప్రదర్శనా ఏర్పాట్లను పరిశీలిస్తూ…తనంతట తాను అప్డేట్ అవుతూ… తన శిష్యులను అప్డేట్ చేస్తూ… పలు సంస్థలు వివిధ స్థాయిల్లో నిర్వహిస్తున్న చిత్రకళా పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ… తన కెమెరా కన్నుతో బంధించిన ఛాయా చిత్రాలకు సందర్భానుసారంగా చక్కటి కొటేషన్స్ వ్రాస్తూ… విజయవాడ ఆర్ట్ సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా తన విధులను నిర్వహిస్తూ… నలుగురితో కలివిడిగా కలిసిపోతూ… అందరి వాడిగా ముందు కు సాగుతున్న స్ఫూర్తి శ్రీనివాస్ జీవితం నేటి యువతకి స్ఫూర్తి దాయకం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
-కళాసాగర్

Felicitation by Creative hearts Art Academy
Anitha Literary Award

7 thoughts on “చిత్రకళా దీప్తి “స్ఫూర్తి” శ్రీనివాస్”

  1. స్ఫూర్తి శ్రీనివాస్ గురించి చక్కటి ఆర్టికల్ అందించారు… మిత్రులు స్ఫూర్తి శ్రీనివాస్ గారికి… 64 కళలు.కం ఎడిటర్ శ్రీ కళాసాగర్ గారికి అభినందనలు…

  2. Good article. Thanks for good information. Searched Youtube but unable to trace ARTBEAT channel.

  3. నా జీవన గమనాన్ని చక్కటి ఆర్టికల్ రూపంలో 64కళలు.కాం నుంచి ప్రచురించి నేను మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న కళాసాగరర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
    థ్యాంక్యూ సార్ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap