విజయవాడ రాజభవన్ లో గత నవంబర్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు ఆర్ట్ అసోసియేషన్స్ గిల్డ్ ప్రచురించిన గ్రంథము “స్వాతంత్య్ర స్ఫూర్తి – తెలుగు దీప్తి” ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 73 మంది చిత్రకారులు రూపొందించిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 133 స్వాతంత్ర్య సమరయోధుల రూపచిత్రాల సంకలనమే ఈ గ్రంథము. మహాత్మా గాంధీ పిలుపుకి ఆకర్షితులై, పేద, ధనిక, కుల-మత, ప్రాంతీయ ప్రాతిపదికలు, లేకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన శాంతియుతంగా పోరాడిన వేలాదిమంది నాటి పెద్దల నుండి 133 మందిని ఎన్నుకొని వివిధ ప్రక్రియలలో రూపొందించిన ఈ చిత్రాలు మన చిత్రకారుల దేశభక్తికి కళా నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఏ విధమైన ఆర్థిక ఫలితాలను ఆశించక చిత్రాలను రూపొందించి, చిత్రకారులు అందించిన సహకారానికి అభినందనలు చెప్పుకోవాలి.
ఆంగ్లేయుల దౌర్జన్యానికి బలి అయిన అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, ద్వార బంధాల చంద్రయ్య, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కన్నెగంటి హనుమంతు, మహా పండితులైన దాశరధి కృష్ణమాచార్య, తిరుమల రామచంద్ర కాళోజి నారాయణరావు, కళాకారులు ఘంటసాల వెంకటేశ్వరరావు, అడవి బాపిరాజు, మాధవ పెద్ది గోఖలే, విద్యాభూషణ్, విద్యా దాతలు మూర్తి రాజు, పిళ్ల రామారావు, కమ్యూనిస్టు యోధులు పుచ్చలపల్లి సుందరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రరెడ్డి, మహిళామూర్తులు సరోజినీ నాయుడు, చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, దుర్గాబాయి దేశముఖ్ రాజకీయ ప్రముఖులు నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, పీవీ నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, వెంకయ్య, అమరజీవి పొట్టి శ్రీరాములు, అమృతాంజన్ అధినేత కాశీనాధుని నాగేశ్వరరావు, గ్రంథాలయ ఉద్యమ కారులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు మున్నగు వారే గాక ఏ విధమైన ప్రచారము పొందక ఏ విధమైన పదవులు ఆశించక ప్రజాసేవలో నిమగ్నమైన అనేక పెద్దల రూప చిత్రాలు ఈ గ్రంథములో చోటు చేసుకోవడం గొప్ప విశేషం.
ఈ సంకలనములో ఉన్న రూప చిత్రాలన్నీ మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన చేయి తిరిగిన, యువ, మహిళా చిత్రకారులు తమదైన శైలిలో కడు శ్రద్ధతో చక్కని ప్రావీణ్యతలతో మలచబడినవి. చిత్రలేఖనంలో ఒక ప్రధాన అంశమైన రూప చిత్రకళకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఇందులో పొందుపరచబడిన స్వాతంత్య్ర సమరయోధుల సంక్షిప్త సమాచారము నేటి యువతకు, విద్యార్థి లోకానికి, నాటి పెద్దల త్యాగనిరతికి, దేశభక్తికి, పట్టుదలకు, నిజాయితీకి, ధైర్యానికి, మచ్చుతునుకలుగా నిలబడి అంకితభావాన్ని ప్రబోధించే విధంగా ఉన్నవి. ఒక విధంగా కళాత్మకంగానూ, మరో విధంగా సందేశాత్మకంగాను ఉన్నవి. ఈ ప్రచురణ ఆర్ట్ పేపర్ పై ఆకర్షణీయంగా రూపొందించబడింది.
ఈ పుస్తకం కావలసిన వారు 80084 63073 కి గాని 9951116775 కి గాని మీరు సంప్రదించగలరు.