కొత్త ఆశలకు ‘శ్రీకారం’

వ్యవసాయ ప్రధాన భారతదేశంలో అన్ని పార్టీలు రైతుల సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉంటాయి. వాళ్ల అభివృద్ధికి బోలెడన్ని హామీలు ఇస్తుంటాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఆచరణలో పెట్టడంలో చిత్తశుద్ధిని మాత్రం చూపవు. రైతుకు చేసే సాయం కూడా ఓటు బ్యాంక్ రాజకీయంగా మారిపోతున్న తరుణం ఇది. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. గ్లోబల్ మార్కెటింగ్ విధానం వల్ల గ్రామీణ రైతులకు లబ్ధి కలుగుతుందని కేంద్రం చెబుతున్న మాటను పెడచెవిన పెట్టి, రైతులకు దన్నుగా నిలుస్తున్నామనే వంకతో పార్లమెంట్ లో చేసిన చట్టాలకు తూట్లు పొడిచే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ ఫార్మింగ్ – గ్లోబల్ మార్కెటింగ్ పై వచ్చిన సినిమా ‘శ్రీకారం’. శర్వానంద్ హీరోగా, బి. కిశోర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దీనిని నిర్మించారు.

కథ విషయానికి వస్తే కార్తీక్ (శర్వానంద్) కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన అతన్ని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారు. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చినా దానిని కాదని కార్తీక్ తన తండ్రి మాదిరి వ్యవసాయం చేయడానికి పల్లెకు వెళ్లిపోతాడు. అందుకోసం తనను ప్రేమించిన చైత్ర (ప్రియాంక అరుల్ మోహన్)ను కూడా కాదనుకుంటాడు. రైతుల కష్టాలు, కడగండ్లు తెలిసి కూడా వ్యవసాయం చేయాలనుకున్న నాకు .. సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా కథ.

ఇవాళ ప్రకృతిపరంగా వ్యవసాయ రంగానికి ఎదురవుతున్న ఊహించని నష్టాలను పక్కన పెడితే, సాగు బాగా పెరిగింది. అయితే దానిని నిల్వ ఉంచుకుని, సమయానుకూలంగా మార్కెటింగ్ చేసుకోవడమే పెద్ద సమస్య. అందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నాయి. రైతులకు ఎక్కడ లాభం చేకూరుతుందో అక్కడకు వెళ్లి తమ పంటను అమ్ముకునే అవకాశాలు లేవు. వాటినే ఇప్పుడు కొత్త చట్టాలు తీసుకొచ్చాయి. ఈ సినిమాలో ఈ విషయాన్ని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. వ్యవసాయం లాభసాటి వ్యాపారం కాదని భావించి, పల్లెల్లోని రైతులు పట్టణాలకు వలస కూలీలుగా వెళ్లిపోవడం సరికాదని చెప్పాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ, పెద్ద కమతాలతో రకరకాల పంటలను పండించడం ద్వారా, వాటిని గ్లోబల్ మార్కెటింగ్ లో అమ్మి లాభాలు పొందవచ్చనే నమ్మకాన్ని కలిగించాడు. ఇవాళ ప్రభుత్వాలు రైతులకు పంట పండించుకోవడానికి ఆర్థిక సాయం చేస్తున్నాయి. అలానే చెరువులు, నదుల ద్వారా నీటి సరఫరా జరుగుతుండటంతో సాగు గతం కంటే పెరిగింది. కానీ దానిని మార్కెటింగ్ చేసుకునే వ్యవస్థపై ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి. దళారీ వ్యవస్థలో రైతు నష్టపోతున్నాడు. దానికి ప్రత్యమ్నాయాన్ని ఇందులో చూపించారు. సాంకేతికత సాయంతో రైతులు లాభాలు ఎలా పొందవచ్చో చూపించారు. నిజానికి ఈ పని కొన్నేళ్లుగా కొందరు చేస్తున్నదే. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలతో విసిగి వేసారి పోయిన కొంతమంది ఉద్యోగులు, సొంత ఊళ్లకు వెళ్లి వ్యవసాయంపై దృష్టి పెట్టారు. బహుశా వాళ్ల విజయగాథల ఆధారంగానే దర్శకుడు కిశోర్ ఈ కథను రాసుకుని ఉంటాడు.

ఉద్యోగం వదిలి సొంతూరు వచ్చేసిన కొడుకుపై తండ్రి అగ్రహం చూపించడం,
ఊర్లోని రైతులందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకొచ్చి, కథానాయకుడు వ్యవసాయం చేయించడం, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఊరులోని మోతుబరి రైతు వారి బలహీనతలను అడ్డుపెట్టుకుని కుట్రలు పన్నడం వంటి అంశాలు ఆసక్తికరంగానే దర్శకుడు మలిచాడు. ప్రతినాయకులకు పెద్దంత పని పెట్టకుండా, ఇగో అనేది మనుషుల బుర్రలను ఎలా పాడు చేస్తుందో చూపించే ప్రయత్నం చేశాడు. హీరో వర్సెస్ విలన్ అనేది మనకు ఎక్కడా కనిపించదు. దాంతో థియేటర్‌కు వినోదం కోసం వచ్చే ప్రేక్షకులకు మాత్రం కొంత నిరాశ ఎదురవుతుంది. కథలో బలమైన ప్రత్యర్థి లేకపోవడం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు రొటీన్‌గా ఉండటం కొంత మైనస్ అయ్యింది.

శర్వానంద్ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. అతని తల్లిదండ్రులుగా ఆమని, రావు రమేశ్ చక్కగా నటించారు. హీరోయిన్ ప్రియాంక క్యారెక్టరైజేషన్ అంత బలంగా లేదు. హీరో వెనుక ప్రేమ అంటూ పడుతుంది కానీ అతని వైపు నుండి అమె అర్ధం చేసుకున్నట్టు ఎక్కడా కనిపించదు. మురళీశర్మ, నరేశ్, మధుమణి, సత్య, సప్తగిరి వంటి వారు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. సాయికుమార్ పాత్ర కాస్తంత కృతకంగా ఉంది. దానిని మరింత బలంగా మలిచి ఉండాల్సింది. మిక్కీ జే మేయర్ స్వరాలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. పెంచలదాసు పాడిన పాట బయట వినడానికి బాగుంది. కానీ హీరో, హీరోయిన్ల మీద పిక్చరైజేషన్
చేయడం అంతగా నప్పలేదు. యువరాజ్ సినిమా టోగ్రఫీ, మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఓకే.

రొటీన్ కమర్షియల్ సినిమాగా కాకుండా ఓ ప్రయోజనాన్ని ఆశించి, రైతులలో ఆత్మసైర్యాన్ని నింపడానికి దర్శక నిర్మాతలు చేసిన ప్రయత్నాన్ని అభినందించాలి. ఓ ఇంజనీర్, ఓ డాక్టర్ ఎలా అయితే తమ కొడుకులను తమ రంగాల్లోకి వచ్చేలా ప్రోత్సాహిస్తున్నారో రైతులు సైతం తమ పిల్లలను వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలనే కోరికను దర్శక నిర్మాతలు వ్యక్తం చేశారు. అయితే… రైతుల కష్టాలను మరింత లోతుగా ప్రభుత్వాలు అధ్యయనం చేసి వాటిని పరిష్కరిస్తేనే ఆ కల సాకారం అవుతుంది.
చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap