ప్రముఖ తెలుగు సినీ రచయిత, తెలుగు సినిమా చరిత్రకారుడు, సినీ విజ్ఞాన విశారద, సినిమా విశ్లేషకుడు, నటుడు, సినిమా జర్నలిస్ట్, ఎస్.వి. రామారావుగారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
జీవిత విశేషాలు : ఎస్.వి.రామారావు ఫిబ్రవరి 2 1940 న కామేశ్వరమ్మ, చంద్రమౌళి దంపతులకు జన్మించారు. తండ్రి ఉద్యోగి, రంగస్థల నటుడు.తండ్రి ద్వారా నాటకరంగం పట్ల ఆసక్తిని అందుపుచ్చుకున్న ఆయన ఉన్నత పాఠశాలలో ఉండగానే “తారుమారు” అనే నాటకాన్ని రచించి, స్కూల్ మేట్స్ తో కలసి ప్రదర్శించారు.అప్పటి నుండి నాటకం ఆయన జీవితంలో ఒక భాగంగా మారింది.చిన్నతనంలో తన తల్లి కామేశ్వరమ్మతోపాటు సినిమాలు చూసేవారు. ఊహ వచ్చినప్పటి నుండి ఆ సినిమా కథ, కథనం పాత్రల చిత్రీకరణ పై చర్చించేవారు. ఆ విధంగా ఆయనకు నాటకం, సినిమా రెండు కళ్ళులా మారాయి. 1960 సంవత్సరంలో ఏలూరు సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల నుండి పట్టా పొందారు. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, మురళీమోహన్, క్రాంతి కుమార్ వంటి సినిమా నటులు ఆయన సహాధ్యాయులు. చదువు పూర్తవ్వగానే ఖమ్మం జిల్లా మధిరలో టీచరుగా రెండేళ్ళపాటు పనిచేసిన ఆయన రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖలో సబ్ రిజిస్ట్రారుగా, ఆంధ్రా ఏరియా చిట్ రిజిస్ట్రారుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. డిగ్రీ చదువుతున్నప్పుడు నాటకాలు వేయడంతో పాటు సినిమా పరిశ్రమపై కూడా దృష్టి పెట్టారు.
తెలుగు సినిమా చరిత్రకారుడు :
ప్రముఖ పత్రికలకు సినిమా సమీక్షలు రాయడం, సినిమాలపై విశ్లేషణ చేస్తూ ప్రసంగించడంతో ఈయనకు సినీ విశ్లేషకునిగా మంచి పేరు వచ్చింది.ఐదు దశాబ్దాల అనుభవంతో సినీ రంగంలోని వివిధ అంశాలపై 12 పుస్తకాలు రచించారు. కలవారి కుటుంబం, త్రిలోక సుందరితో సహా ఆరు సినిమాలకు స్క్రిప్టు రాయడంతో పాటు 15 సినిమాలలో నటించారు. పలు టెలివిజన్ ఛానళ్లలో సినిమాపై అనేక అరుదైన కార్యక్రమాలు నిర్వహించారు.అలాగే గుమ్మడి, జమున, డి.వి.యస్.రాజు, కళాధర్ వంటి వారి జీవిత చరిత్రలకు రచనా సహకారం అందించారు.రేడియో శ్రోతలకు కూడా రామారావు చిరపరిచితులు.వీరికి నటన, నాటకం, సినిమా జర్నలిజం అభిమాన విషయాలు.వీరు 150 పైగా నాటకాలలో నటించారు, కొన్ని నాటకాలలు రచించారు. వందేళ్ళ భారతీయ సినిమాను పురస్కరించుకొని ఆయన తీసిన డాక్యుమెంటరీ అమెరికాతో పాటు ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో ప్రదర్శింపబడి అందరి మన్ననలను అందుకున్నారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు అనేక పురస్కారాలను అందుకున్నారు.
పురస్కారాలు : తెలుగు సినిమాపై 13 పుస్తకాలు రచించి తెలుగుసినిమా చరిత్రకారునిగా వినుతికెక్కాడు. వాటిలో “తెలుగు తెర, నాటి 101 చిత్రాలు” అనే పుస్తకానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి 2006, 2011 లలో నంది పురస్కారాలు అందుకున్నారు. కొలసాని చక్రపాణి పురస్కారంతో పాటు మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీ వారి నుండి గౌరవ ఉగాది పురస్కారాలు అందుకున్నారు. వంశీ ఇంటర్నేషనల్, ఆంధ్ర ప్రదేశ్ సినీ గోయల్స్ సంస్థల నుంచి ఉత్తమ సినీ జర్నలిస్టు పురస్కారాన్ని అందుకున్నారు. 2011 లో కెన్నెర-అక్కినేని స్వర్ణకంకణం అందుకున్నారు.2013 లో అమెరికా తానా సభలలో పాల్గొన్నారు. ఉగాది పురస్కారం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాదు, 11 ఏప్రిల్ 2013) అందుకున్నారు.
అవార్డులు : వీరిని డాక్టర్ సి.నారాయణరెడ్డి “సినీ విజ్ఞాన విశారద” బిరుదుతో సత్కరించారు.
వీరు రచించిన తెలుగు తెర 1999 సంవత్సరానికి తెలుగు సినిమా చరిత్రపై ఉత్తమ గ్రంథంగా నంది అవార్డు పొందినది. వీరు రచించిన నాటి 101 చిత్రాలు 2006 సంవత్సరానికి ఉత్తమ సినీ రచనగా నంది అవార్డు పొందింది.