బయోపిక్ సినిమాల నిర్మాణంలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన రచయిత డాక్టర్ ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో, ఈనాడు పత్రికా రంగంలో మకుటం లేని రారాజుగా వెలుగొందుతున్న స్వాతి వారపత్రిక సంపాదకులు-పబ్లిషర్ అయినటువంటి వేమూరి బలరామ్ గారి బయోపిక్ సినిమా నిర్మాణం 30 మార్చి, 2023 శ్రీరామనవమి శుభ ముహుర్తాన విజయవాడలోని హోటల్ ఐలాపురంలో ప్రారంభం కానుంది. ‘స్వాతి’ బలరామ్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయనవసరం లేదు. పత్రికలన్నీ కనుమరుగైన ఈ తరుణంలో రచయితలకు పట్టం కట్టి, పాఠకులకు కనీసం ‘స్వాతి’ అయినా ఉందని భరోసా కల్పించిన ఎడిటర్ బలరామ్ గారు.
‘స్వాతి’ ఈ విధంగా పత్రికా ప్రపంచంలో అగ్రగామిగా, శిఖరాగ్రాన నిలబడిందంటే, బలరామ్ గారి అకుంఠిత దీక్షా; నిద్రలేని రాత్రుళ్ళూ; సైకిల్ తొక్కి ప్రతీ కిళ్ళీ బంకులో పోస్టర్లు అంటించిన క్షణాలూ; విషాదాలూ; వైరుధ్యాలూ; గర్వించే అనుభూతులే కారణం. వాటన్నింటినీ వెండితెరపైకి దృశ్యకావ్యంగా మలిచి శాశ్వత రూపాన్ని ఇవ్వాలన్న ఆశ, ఆశయంతో ముందుకు సాగాలని అనుకుని, బలరామ్ గారి అనుమతితో “అతడే ఒక సైన్యం” సినిమాను ప్రారంభిస్తున్నానని ప్రభాకర్ జైనీ అన్నారు. ఒక పత్రికా ఎడిటర్ జీవిత చరిత్ర బయోపిక్ గా రావడం తెలుగులో ఇదే ప్రథమం అనుకుంటా. జైనీ క్రెయేషన్ బేనర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతగా విజయలక్ష్మి జైనీ వ్యవహరిస్తారు. గతంలో ప్రజాకవి కాలోజీ జీవిత చరిత్రను ‘ప్రజాకవి కాలోజీ’ బయోపిక్ గా తీసిన ఈ దర్శకుడు ‘సినీవాలీ’ అనే వెబ్ పత్రికను నడుపుతున్నారు.
ఒకప్పుడు పబ్లిక్ వేదికల మీదకు రావడానికిగాని, ఏ సంస్థ నుండైనా ఆవార్డ్ స్వీకరించడానికి గాని, ఇంటర్ వ్యూలు ఇవ్వడానికి గాని సుముఖంగా వుండేవారు కాదు బలరాం. కరోనా తరువాత పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అప్పటి నుండి స్వాతి వారపత్రికలోనూ కొంత మార్పు కనిపిస్తుంది. అదే వరవడి బలరాం గారిలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంవత్సరం బలరాం గారు విశాఖపట్నం లోనూ, దుబాయిలోనూ అవార్డులు స్వీకరించడం మనం గమనించవచ్చు. ఇటీవల యూట్యూబ్ లో మాశర్మ గారు చేసిన బలరాం గారి ఇంటర్ వ్యూ కూడా బాగా వైరల్ అయ్యింది. అందులో భాగంగానే ఈ సినిమా కూడా అనే భావన కలుగుతుంది.