-నవంబర్ 5న విజయవాడలో కార్టూనిస్ట్ సరసి కి ‘తాపీ ధర్మారావు పురస్కార’ ప్రదానం
-అదే వేదిక పై ‘అమ్మనుడిని అటకెక్కిస్తారా ! ‘ కార్టూన్ పుస్తకావిష్కరణ
కార్టూనిస్టుల సంగతి ఎలా వున్నా, కార్టూన్ ఇష్టుల విషయంలో నేడు సరసి జనాభాయే ఎక్కువ. కార్టూనిస్టుల కులగురువు అనదగిన ‘బాపు’ గారే పధ్నాలుగేళ్ళ క్రితమే ఆంధ్రప్రభ వీక్లీలో ‘సరసి’ కార్టూన్లు చూసి ఉండబట్టలేక 16.12.98 న ఓ ఉత్తరం రాసారు. “మీ పత్రికలో సరసి అన్నతను (లేక ఆమె) వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి. తెలుగు కార్టూనిస్టులలో ఆ మాత్రం తెలివైనవానిని ఇంతవరకూ చూడలేదు” అని. ఆ తెలివితేటలు ఇప్పటికీ తేటతేటగా అందరినీ అలరిస్తూనే వున్నాయి. ‘మనమీదేనర్రోయ్’ అంటూ పాఠకులను అలరించారు.
మనలో సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాళ్లు బోలెడుమంది వున్నారు. వాళ్లకి బొమ్మలు వేయడం రాదుగానీ లేకపోతే కార్టూనిస్టుగా వాళ్ల ముందు మనమేమీ ఆనము అనే సరసి అసలు పేరు సరస్వతుల రామనరసింహం. బ్రహ్మరాతలు చూసిన సరస్వతికి, కార్టూన్లు వేయాలని బుద్ధి పుట్టి బహుశా సరసిగా మగజన్మ ఎత్తి వుంటుంది. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం బోడపాడు స్వగ్రామమైన సరస్వతుల రామనరసింహం 1956 జూలై 5న శ్రీమతి వెంకటరమణమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు రెండో అబ్బాయిగా పుట్టాడు. తల్లి కాసమ్మ కారణంగానే ఆ ఇంట సాహిత్య సంగీత కళలు కాసాయి. తండ్రి హస్యచతురత, సృజనాత్మక అభిరుచిని చిగురింపజేసే ప్రోత్సాహం వెన్నుదన్నయ్యాయి. చిన్నప్పుడు బొమ్మలు వేయడానికి కారణం అన్నయ్యే. ఆ తరువాత స్కూలు డ్రాయింగ్ మాస్టారు శ్రీ తమ్మా సత్యనారాయణగారు తతిమ్మా వాళ్లల్లో కంటే సరసిలోని చిత్రకళా రసికతను గుర్తించి స్వంత తమ్ముడి కంటే ఎక్కువగా ఆదరించి మాటలకందని ఆప్యాయతనీ, అనురాగాన్ని పంచి అందమైన బొమ్మలు వేసే విద్యతో పాటు విలువైన జీవితధర్మాలను బోధించారు. అందుకే సరసి కార్టూన్లలో ఎక్కడా వెర్రితనం, వెకిలితనం గోచరించవు. సమాజాన్నీ, చుట్టూ మను షులనీ, సంఘటనల్నీ నిశితంగా గమనించి ముఖ్యంగా మధ్యతరగతి జీవితాలపై ఆయా తీరుతెన్నుల పై సున్నితంగా అత్యంత వైవిధ్య భరితంగా కార్టూన్లను సంతరించిన ప్రజ్ఞ సరసిదే. కార్టూన్లే కాదు సరసి ప్రకృతి దృశ్యాలు, మహనీయుల తైలవర్ణ చిత్రాలు చిత్రించడంలో కూడా సిద్దహస్తుడు. డ్రాయింగు మాష్టారు ర్యాలి, సింహాచలం వంటి క్షేత్రాలకు తీసుకు వెళ్ళి అక్కడి శిల్పకళా విన్యాసాలను అలాగే విశాఖ, భీమిలీ సుందర దృశ్యాలను కౌమార దశలోనే స్కెచ్లు గీయించి, డ్రాయింగు పరీక్షలకు కట్టించి సరసిని అనేక పోటీలలో గెలిపించారు.
ఎం.ఏ ఫిలాసఫీ, ఎల్.ఎల్.బి. విద్యనభ్యసించిన సరసికి మానవ మనస్తత్వాలనూ, అందులోని వివిధ పార్శ్వాలనూ అందిపుచ్చుకోవడం, అన్యాయంగా కాక ఎంతో న్యాయంగా వారిలోని నైజాలను వారికే హాస్యంగా ఎత్తిచూపి వ్యంగ్యచిత్రాలతో అలరించడం అలవోక అయిన విద్య. ఇప్పటిదాకా సుమారు అయిదువేల కార్టూన్లు, నాలుగువందలకి పైగా కథలు, పెయింటింగ్లు అనేకం సంతరించిన సరసి గొప్ప సంగీత హృదయుడు కూడా. వేణువు మీద రాగాలను పలికించగల దిట్ట. వృత్తిరీత్యా రాష్ట్రప్రభుత్వ శాసనసభా కార్యాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న సరసి వేసిన పొట్టిశ్రీరాములు, అంబేద్కర్, కాసుబ్రహ్మానందరెడ్డిల నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు శాసనసభా కమిటీ హాలులో శాశ్వతంగా అలంకృతమై చూపరులను కట్టిపడేస్తుంటాయి. శాసనసభాపతి, ముఖ్యమంత్రి చేతుల మీదగా సన్మానాలు అందుకున్న ఆస్థాన’ చిత్రకారుడు తనే! సరసి కార్టూన్లు ఇప్పటిదాకా మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. ఒకదానిని మించి ఒకటి తెలుగులోగిళ్ళలో నవ్వుల పువ్వులు పంచాయి. సరసి కార్బన్లు -3 తన వ్యంగ్య చిత్ర వైభవాన్నే కాక వైశంపాయనుడు కథలతో తన హాస్య రచనా విన్నాణాన్ని కూడా ఆవిష్కరించేదిగా భావిస్తోంది.
1993లో జపాను ఆంగ్ల దినపత్రిక ‘యుమియోలీ షింబున్’ నిర్వహించిన అంతర్జాతీయ కార్టూన్ల పోటీలో, 1993, 1994 ల్లో కొరియాలో తేజాన్ అంతర్జాతీయ కారన్ల పోటీలో ఆనరబుల్ వెర్షన్ అవార్డులు, కొన్ని కారూన్లకు జపాన్, కొరియా, ఇరాన్, టోలెంటినోలలో జరిగిన అంతర్జాతీయ కార్టూన్ ప్రదర్శనల్లో చోటు రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన పోటీల్లో కార్టూన్లకు, కథలకు పలు బహుమతులు, తను పొందిన మంచి గుర్తింపులు, ఇటీవలే ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక నిర్వహించిన బొమ్మల కథల పోటీలో ప్రథమబహుమతిని సరసి పంచుకున్నాడు.
తన కార్టూన్లలో సరసి మధ్యతరగతిని నిలువుటద్దంలో చూపుతాడు. ఊహలోగానీ, గీతలోగానీ ఎవరినీ అనుకరించడు, అనుసరించడు. తనదైన శైలి కార్టూన్ క్యాప్షన్ లోనూ, గీతలోనూ కూడా చూపుతాడు. ఇన్ని ‘అయిడియా’లు ఇలా ఇతనికి ఎలా తడతాయా అని కుళ్లుకునేలా సాటి కార్టూనిస్టులను కూడా అలరిస్తాడు. గొప్ప స్నేహశీలి. అంధ్ర బాలానంద సంఘంలో హైదరాబాద్లో పిల్లలకు వీలయినప్పుడల్లా చిత్రకళలో శిక్షణ గరుపుతున్న మంచి గురువు. అద్భుతమైన, తెలివైన కార్టూన్లు వేసే సరసి కార్టూన్గీతల్లో అందం కన్నా ఆనందం పండించడానికే ప్రాముఖ్యత ఇస్తాడు. కార్టూన్స్ లోని రాత, గీత రెండూ కూడా ఒకదాన్ని విడిచి ఒకటి మనలేని చందాన బాపు రమణ జంటలాగా నిలపడం సరసి ప్రతిభ. అతని పాటవం అన్యులకు అందడం కష్టం. సరసి కార్టూన్లు పదిమందితో పంచుకు మరీ ఆనందించేవి. ఏ రంగంలో వారయినా సరసి కార్టూన్ల ప్రపంచంలో మమేకం కాగలరు కనుక అంతా సరసి ‘జనాభాయే అనడం కుదుర్తోంది. ‘గానకళలో ఒక్క శాస్త్రీయ సంగీతం అన్న విషయం మీదే ఆయన వేసిన కార్టూన్లు చూస్తే ఆ ప్రతిభకు “ఔరా!’ అని అబ్బురపడక తప్పదు. ఆయన సోదరుడు హనుమంతరావు గారు గొప్ప మృదంగ, ఘటవిద్వాంసులుకావడం కూడా ఆ విషయం మీద కార్టూన్లు సంధించడానికీ అందునా సంగీతజ్ఞులే అందుకోగల మర్మాలతో హాస్య, వ్యంగ్యాలు ఉత్పత్తి చేయడానికీ ఉపకరించి వుండవచ్చు. అసెంబ్లీలో ఉద్యోగం కనుక రాజకీయ అంశాలపై సంగతి సరేసరి. మరో విశేషం ఏమిటంటే ‘నడుస్తున్న చరిత్ర’ మాసపత్రికలో గత దశాబ్దం పైగా కేవలం ‘తెలుగుభాషమీద అనేక కార్టూన్లు వేస్తున్నారు. తెలుగు భాష, శాస్త్రీయ సంగీతం, అపార్టుమెంట్స్, రైల్వేకంపార్టుమెంట్స్ అంశాలమీద సరసి వేసినన్ని కార్టూన్లు మరెవరూ వేయలేదంటే అది అతిశయోక్తి కాదేమో! రైళ్లు, విమానాలు, హెూటళ్లు, అపార్ట్ మెంట్లు, గుళ్లు, పెళ్ళిళ్లు, క్రీడలు, సినిమాలు వంటి విషయాలే కాదు శవాలు, శ్మశానాలు, దయ్యాలు ఒక ప్రక్క మునులు, దేవతలు, అప్సరసలు మరో ప్రక్క అసలు ఆయన కార్టూన్లకు ఆలవాలం కాని విషయం లేదంటే విడ్డూరపడనక్కర్లేదు. ఐదు సంపుటాలతో హాస్యాన్ని కార్టూన్ల సంకలనాలుగా తెలుగు నాట తేజరిల్లుతున్న సరసి కి అభినందనలు. తన హాస్యంతో ఆరోగ్యదాయకమైన తెలుగులోగిళ్లను వ్యవస్థీకృతం చేస్తూ, సరసి జనావళి హృదయవాసి కావాలని కోరుకుందాం.
– సుధామ
Very Good
Excellent!
Thank you Kalasagar garu and Sudhama garu.
Nice article what all in our hearts showed in text thank you
సరసిగారి గురించి సుధామగారు చాలా అద్భుతంగా రాశారు. ఇరువురికీ అభినందనలు
సరసి ఆచ్చ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. ఆయన కార్టూన్లు ఇష్టపడని తెలుగువాడు ఉండడు.
సరసి గారి గురించి సుధామ గారి విశ్లేషణ చాలా బావుంది… అవార్డు అందుకోబోతున్న మీకు అభినందనలు…