ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులకు వైయస్సార్ అవార్డుల ప్రదానోత్సవం నవంబరు 1న మంగళవారం విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన 30 మందికి రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందించి సత్కరించింది. 20 మంది లైఫ్ టైమ్ అవార్డులు, 10 మందికి అచీవ్ మెంట్ అవార్డులు అందుకున్నారు. వరుసగా రెండో ఏడాది అవార్డుల ప్రదానోత్సవం.
వ్యవసాయం, కళలు మరియు సంస్కృతి, సాహిత్యం, మహిళా, శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు 20 వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ వార్డులు, 10 వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డులు.
తొలుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పొట్టి శ్రీరాములు, వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూరాష్ట్ర అభివృద్ధికి తమ వంతుగా వివిధ రంగాల్లో గొప్ప పనులు చేసిన వారికి అవార్డులు ఇస్తున్నామన్నారు. సంస్కృతి, కళలు, సాహిత్యం, జర్నలిజం, వ్యవసాయం, మహిళా రక్షణ, వైద్యారోగ్య రంగం, పారిశ్రామికంగా రంగంలో విశేష కృషిచేసిన వ్యక్తులకు, సంస్థలకు ఇస్తున్నామన్నారు. అసామాన్య సేవలు అందించేవారికి ప్రభుత్వ గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అసామాన్య సేవలు అందించేవారికి ప్రభుత్వ గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని సీఎం జగన్ అన్నారు.
వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అవార్డులు అందించారు. కార్యక్రమంలో వైఎస్. విజయమ్మ, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్) జీ.వీ.డి. కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
సంస్కృతి, కళలు విభాగంలో విప్లవాల సినీ నటుడు, దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి, దర్శకుడు విశ్వనాథ్, బి.వి. పట్టాభిరాం, నాటక రంగం నుండి నాయుడు గోపి, కళంకారి కళలో పిచ్చుక శ్రీనివాస్, ఉదయగిరి వుడ్ కట్ లో శ్రీమతి షేక్ గౌసీయా బేగం, సాహిత్య విభాగంలో రాయలసీమ సుప్రసిద్ధ రచయిత శాంతినారాయణ, ఎమెస్కో పబ్లిషర్స్ సిఈవో విజయ్ కుమార్, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మనోహర్ నాయుడు అవార్డులు అందుకున్నారు. జర్నలిజం విభాగంలో భండారు శ్రీనివాసరావు, సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎంఈవీ ప్రసాదరెడ్డి వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను అందుకున్నారు.
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ క్రింద ఎంపికైన వారికి 10 లక్షల నగదు బహుమతి, వైఎస్ఆర్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతంది. అదే విధంగా వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు క్రింద ఎంపికైన వారికి రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
-కళాసాగర్