–సమరయోధుల రూప చిత్రాల ప్రదర్శన
ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ఆధ్వర్యంలో శుక్రవారం (4-11-2022) విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 73 చిత్రకారుల కుంచె నుండి జాలువారిన 133 మంది స్వతంత్ర సమరయోధుల రూప చిత్రాల ప్రదర్శన, చిత్రకళా గ్రంథావిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. గిల్డ్ కన్వీనర్ పి. రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఏ. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు ముఖ్యఅతిథిగా హాజరుకాగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా టెలికాం సలహా కమిటీ సభ్యులు నిమ్మరాజు చలపతిరావు, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు గోళ్ళ నారాయణరావు, చిత్రకారుడు జర్నలిస్ట్ జింకా రామారావు, విద్యావేత్త చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, గిల్డ్ ఉపాధ్యక్షులు సుభాష్ బాబు, కళాసాగర్, ఎన్.ఎస్. శర్మ, ఏ. అప్పారావు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బి.ఏ. రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న తెలుగు వారు అత్యధికంగా వున్నారు అని అన్నారు. ఈ సందర్భంగా చిత్రకారులందరికీ సత్కారం జరిగింది.
గవర్నర్ చే ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ స్వాతంత్ర్య సమరయోధుల రూప చిత్రాల సమాహారం “స్వాతంత్ర్య స్ఫూర్తి – తెలుగు దీప్తి” పుస్తకాన్ని రాజ్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ గిల్డ్ నాయకత్వాన్ని మనసారా అభినందించారు. గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్.పి.శిశోడియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.