
–చోడవరంలో ముగిసిన 5వ జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన
– వివిధ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా పాల్గొన్న చిత్రకారులు
చోడవరం చిత్రకళా నిలయం వారి 5వ జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శన మరియు బహుమతి ప్రదానోత్సవం ఆదివారం(6-11-2022) ఉదయం చోడవరం (విశాఖ జిల్లా), ప్రేమ సమాజం ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సభలో అనకాపల్లి ఎం.పీ. డా. బి.వి. సత్యవతి, ఏ.పి. విప్ కరణం ధర్మశ్రీ పాల్గొని ప్రదర్శనను తిలకించి, విజేతలకు బహుమతులు అందజేశారు. చోడవరం చిత్రకళా నిలయం వ్యవస్థాపకులు బొడేట్టి సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఏ.పి వంటి వివిధ రాష్ట్రాల నుంచి వంద మందికి పైగా చిత్రకారులు పాల్గొన్నారు. నవంబర్ 4, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన ఈ చిత్రకళా ప్రదర్శన ఆదివారంతో ముగిసింది.
వీటిలో యూనివర్సిల్ మెగా అవార్డుకు ప్రథమ స్థానంలో కేరళకు చెందిన సంతోష్ మిత్రా, రెండో స్థానంలో కె.ఏ. రాజు (రాజమహేంద్రవరం), మూడో స్థానంలో చిత్రాలయ రాంబాబు (ఏలూరు), నాలుగో స్థానంలో కె. శ్రినివాస్, పశ్చిమబంగాకు చెందిన డి. రాజేష్ నిలిచారు. వీరికి నగదు బహుమతితో పాటు సర్టిఫికెట్లను ఎం.పీ. సత్యవతి, విశాఖ ఫారెస్ట్ రేంజ్ అఫీసర్ రామ్ నరేష్, చోడవరం ఫారెస్ట్ రేంజ్ అఫీసర్ పి. రవి కుమార్ అందించి వారిని సత్కరించారు. మెగా అవార్డ్ అందుకున్న వారిలో వజ్రగిరి జస్టీస్, యర్రాజీ వున్నారు. బెస్ట్ క్రియేటివిటి అవార్డులలో ఆకొండి అంజి-అమలాపురం, కాంతారావు-ఏలూరు, కామేష్-నర్సిపట్నం, శ్రీనివాస్-పాలకొల్లు, భాస్కర్-పాలకొల్లు వున్నారు. ఎంపీ మాట్లాడుతూ చోడవరంలో గ్యాలరీ నిర్మాణానికి కలెక్టర్‌తో మాట్లాడి స్థలం మంజూరుకు సహరిస్తానని, చోడవరం చిత్రకళా నిలయం సంస్థకు అండగా వుంటానని తెలిపారు. బాలల చిత్రకళా పోటీలో విజేతలకు నవంబర్ 5 వ తేదీన బహుమతులు అందజేశారు.

ఇంకా ఈ సభలో చెన్నై కి చెందిన డి. ధర్మలింగం ను చిత్రకళా సార్యభౌమ, ప్రముఖ శిల్పి డాక్టర్ ఎన్.ఎస్. శర్మ ను చిత్రకళా సామ్రాట్, అమలాపురంలో సీనియర్ ఆర్టిస్టు డాక్టర్ యు. ఆశీర్వాదం ను చిత్రకళా తపస్వి, పాలకొల్లుకు చెందిన సీనియర్ ఆర్టిస్ట్ జి. సత్యనారాయణ ను చిత్రకళాచార్య బిరుదులతో ఘనంగా సత్కరించారు. ఇంకా తిరుపతిరావు, 64కళాలు.కాం ఎడిటర్ కళాసాగర్, ప్రసాద్ రాజు, ఆర్కే. ప్రసాద్, శిల్పి దివిలి హేమచందర్, చంద్రశేఖర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
-కళాసాగర్


Hearty ❤️ congratulations to everyone 💐💐