విశ్వానికి విద్యనేర్పినటువంటి ఓ ఘనమైన విశ్వవిద్యాలయం మన భారతదేశం. ఇటువంటి మన భారతదేశంలో అనేక కష్టనష్టాలకోర్చి వారి వారి రంగాలలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినార్జించినటువంటి మన భారతీయులెందరో వున్నారు. నేటితరం నిరంతరం స్మార్ట్ ఫోనుల మోజులో పడి అటువంటి మహామహుల రూపురేఖలను సైతం మర్చిపోతున్న తరుణంలో యావత్ భారతదేశంలోని మహనీయుల జీవిత విశేషాలను నేటి, రేపటి విద్యార్థిలోకానికి తెలుగులో పరిచయం చేయాలన్న సంకల్పంతో 64కళలు.కాం సమర్పిస్తున్న “ధృవతారలు” రెగ్యులర్ ఫీచర్లో ఆయా మహానుభావుల జన్మదిన సందర్భాలలో వారిని జ్ఞాపకం చేసుకుందాం.
ధృవతారలు – 42
భారతీయ విద్యావనంలో విరబూసిన విద్యలమల్లి రాధాకృష్ణన్ సర్వేపల్లి, అధ్యయనానికి అధ్యాపనానికి విద్యనేర్పిన విద్యావేత్త భారతీయ తత్వానికి భారతీయత్వానికి అంతర్జాతీయ రాయబారిగా భాసిల్లిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేల నాలుగు చెరగులా మనకు పాఠాలు బోధించిన తన పాట వాన్ని చూపించి తనకూ మనకూ అత్యంత ఖ్యాతి నార్జించినట్టి విశ్వ గురుకుల భూషణుడు. అద్వితీయ వాచస్పతిగా, ఆధునిక బృహస్పతిగా, విద్యాధిపతిగా, ఉపకులపతిగా, రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదిగిన నిరంతర కృషీవలుడు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆలోచనలో తాత్వి కత, ఆచరణలో సాత్వికత, సలక్షణమైన వ్యక్తిత్వం, విలక్షణమైన అభివ్యక్తిత్వం, సర్వసాధారణ వేషధారణ, అసాధారణధారణ, మంత్రముగ్ధభాషణ శ్రీ సర్వేపల్లి భూషణాలు. యూనెస్కోకి భారత రాయబారిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలకి ఉపకులపతిగా స్వతంత్ర భారతావనికి రాష్ట్రపతిగా ఇలా అత్యున్నత శిఖరాలకు ఎదిగినా ఒదిగి వుండే మహోన్నతుడు శ్రీ సర్వేపల్లి మన ఎల్లలు దాటి ప్రపంచమంతటా విస్తృతంగా శిష్యులను ఆకర్షించ గలిగే గురుత్వాకర్షణ శక్తిగల సద్గురువు నేటికీ గురుపూజలందుకుంటున్న గురుకుల జాబిల్లి శ్రీ సర్వేపల్లి నేటికీ మన ధృవతార.
(రాధాకృష్ణన్ సర్వేపల్లి జన్మదినం సెప్టెంబర్ 05, 1888)