తెలంగాణ మీడియా అకాడమీ నూతన చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి నియామకం
——————————————————————————————–
పాత్రికేయుల సమస్యల పట్ల సరైన అవగాహన, నిజాయితీగా పోరాడే తత్వం కలిగిన సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం. హనుమంతరావు నియామక జివో విడుదల చేశారు. ఈ పదవిలో ఆయన రెండేళ్లు కొనసాగుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ అకాడమి తొలి చైర్మన్ గా పని చేశారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రెస్ అకాడమిని తెలంగాణ మీడియా అకాడమీ గా మార్చి అల్లం నారాయణ ను చైర్మన్ గా నియమించిన విషయం విదితమే. ప్రభుత్వం మారిన తరువాత నూతన మీడియా అకాడమీ చైర్మన్ గా కె. శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేశారు.
నల్గొండ జిల్లాకు చెందిన కె. శ్రీనివాస్ రెడ్డి సిపిఐ పార్టీ సభ్యులు. చాలకాలం విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ గా సేవలు అందించారు. ప్రస్తుతం ప్రజాపక్షం ఎడిటర్ గా ఉన్నారు. వారి వయసు 74 సంవత్సరాలు. మొదటి నుంచి కూడా పాత్రికేయ సమస్యలపై ఉద్యమిస్తూ తనదైన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుని తో పాటు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వివాదారహితులు, సౌమ్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు. గత 17 ఏళ్ళుగా కొనసాగుతున్న జర్నలిస్టుల హౌసింగ్ సైట్ల సమస్య మీ సారధ్యంలో ఒక కొలిక్కి వస్తుందని ఆకాంక్షిస్తున్నాను.
–డా. మహ్మద్ రఫీ