‘గిరిజన గీత శిల్పి’ బొండా జగన్మోహనరావు

కొండకోనల్లో నివశించే గిరిజనులు శ్రేయస్సే ఆయన ధ్యేయం.. లక్ష్యం..! ఆధునిక సమాజంలో నివశిస్తున్న వారందరికీ పూర్వికులు గిరిజనులేనన్న ధృక్పధంతో గిరిజనుల జీవనశైలిపై నిరంతర పరిశీలన చేసిన గిరిజన గీతశిల్పి డా. బొండా జగన్మోహనరావు. భారతదేశవ్యాప్తంగా ఎన్నో గిరిజన ప్రాంతాలను సందర్శించి, కొండకోనల్లోని గిరిజనుల జీవన విధానాన్ని నిశితంగా పరిశీలించి… వారి సంస్కృతీ సాంప్రదాయాలను తన చిత్రాల్లో ప్రతిబింబిస్తూ… గిరిజనుల అభ్యున్నతి కోసం అహరహం పాటుపడుతున్న కళాకారుడు బొండా జగన్మోహనరావు. గిరిజనుల జీవన శైలిపై సమగ్ర అవగాహనతో చిత్రాలను గీస్తూ గిరిజన గీతశిల్పిగా పేరొందిన విజయవాడకు చెందిన డా. బొండా జగన్మోహనరావు గిరిజనుల ఆచార వ్యవహారాలను, వారి జీవనశైలిని తాను ఎన్నో సంవత్సరాలుగా నుంచి దగ్గర నుండి గమనిస్తూ వారికి తన చేతనైన సాయం చేస్తున్నారు. ప్రజాహితాన్ని కోరి భారతీయ సంస్కృతి, సాహిత్యం, అధ్యయనం, సమాజసేవలో తన వంతు ప్రయత్నాన్ని ఆయన కొనసాగిస్తున్నారు.

జాతి మూలాల్లోకి…
మన పూర్వీకులైన గిరిజనులను అర్ధం చేసుకుని వారి జీవితాలను అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో డా. జగన్మోహనరావు గిరిజనులపై ఇప్పటివరకూ 150కి పైగా చిత్రాలను గీయడం జరిగింది. వీటితో పాటుగా విభిన్న సామాజిక అంశాలను సృజిస్తూ ఆయన వెయ్యికి పైగా చిత్రాలను సృజించారు. ఆయా చిత్రాలు సహజసిద్దంగా వుండేలా యాక్రలిక్ రంగులతో చిత్రిస్తారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా వివిధ అంశాల్లో ఆయన చూపిన ప్రతిభకు గుర్తింపుగా బొండాను ఇప్పటివరకూ 40 కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.


జీవన ప్రస్థానం:
చంద్రయ్య- అప్పల నరసమ్మ పుణ్యదంపతులకు విజయవాడలో మార్చి 25, 1954 లో జన్మించిన బొండా జగన్మోహనరావు తన తండ్రి ఆశయాలను ఆకళింపు చేసుకున్నారు. బి.కాం. డిగ్రీ పూర్తి చేసి విజయ బ్యాంక్ లో ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుకున్న రోజుల్లో తన గురువు గారైన దారా సత్యనారాయణ శర్మ గారి పాఠాలకు ప్రభావితమైన బోండా గారు శర్మ గారిని ప్రత్యక్ష దైవంగా భావిస్తారు.

కళా ప్రస్థానం :
వీరి మొదటి కార్టూన్ ఆంధ్రపత్రికలో 80వ దశకంలో ప్రచురితం అయ్యింది. వివిధ పత్రికలలో సుమారు 300 కార్టూన్లు ప్రచురించ బడ్డాయి. చిన్నతనం నుంచే పెయింటింగ్స్ పై పున్న ఆసక్తితో చిత్రకారుడిగా పలు చిత్రాలు గీసిన జగన్మోహనరావుకు వడ్డాది పాపయ్య, బాపుగార్లు స్ఫూర్తిగా నిలిచారు. వారి చిత్రాలను గమనిస్తూ వాటిలోని అర్ధాన్ని గ్రహిస్తూ బొండా తాను చిత్రాలు గీయడం ప్రారంభించారు. బ్యాంక్ ఉద్యోగిగా ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే సమయంలో గిరిజనుల జీవితాలను దగ్గర నుండి చూసి, స్పూర్తిని పొంది… ఒక చిత్రకారుడిగా తనకున్న ప్రతిభను ప్రాయోజిత చిత్రాలుగా మరల్చి జన జాగృతం చేశారు. గిరిజనుల జీవితాలపై చిత్రకారులు, ఔత్సాహిక చిత్రకారులు చిత్రాలు గీయాలని, తద్వారా వారి జీవితాలను నాగరీకులకు అర్ధం అయ్యేలా చేసి గిరిజనుల సంక్షేమానికి పాటుపడే యజ్ఞంలో చిత్రకారులు భాగస్వాములు కావాలని బొండా నిర్థేశం చేశారు.

సామాజిక సేవాభిలాషి :
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో జన్మించిన బొండా జగన్మోహనరావు తన చిన్నతనం నుంచీ అభ్యుదయ భావాలతో పెరిగారు. ఆయన తల్లితండ్రులు బొండా చంద్రయ్య- అప్పుల నరసమ్మ దంపతులు.. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో స్వాతంత్ర సమరయోధులును బ్రిటీష్ ప్రభుత్వం జైలుపాలు చేసినపుడు బొండా చంద్రయ్య ఆ యోధుల కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఉచితంగా అందచేసేవారు. ఈ విషయాన్ని గమనించిన నాటి బ్రిటీష్ ప్రభుత్వం చంద్రయ్యను జైల్లో పెట్టింది. తర్వాత కొద్ది కాలానికే స్వాతంత్ర్యం సిద్ధించడంతో భారత ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది. స్వాతంత్య్ర సమరం ముగిసిన తర్వాత సమర యోధుల పెన్షన్ తీసుకోవడానికి కూడా బొండా చంద్రయ్య నిరాకరించారు. భారతమాత సేవలో నిస్వార్ధంగా పనిచేసిన తమకు పెన్షన్ తీసుకోవడం సమంజసం కాదని ఆయన భావించారు. ఆనాడు సమాజంలో ఆకలి పేదల పాలిట శాపంలా వుండేది. సరైన వసతి, తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలులేని పరిస్థితుల్లో పేదలు నిత్యం సతమయ్యే పరిస్థితుల్లో మార్పురావాలని చంద్రయ్య కోరుకునేవారు. తన ఇంట తన పిల్లలతో పాటే ఇతరుల పిల్లలనూ సమానంగా చూసేవారు. ఆకలితో వున్నవారికి పట్టెడన్నం పెట్టాలన్న సత్సంకల్పంతో చంద్రయ్య-అప్పలనరసమ్మ దంపతులు నిత్యం తమ ఇంట పేదవారికి ఆహారాన్ని పెట్టేవారు.


చిన్నతనం నుంచే సామాజిక అంశాలపై అవగాహనతో పెరిగారు. కాలక్రమేణా గిరిజన ప్రాంతాల్లో బ్యాంక్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో వారు పడే ఆర్ధిక, సామాజిక ఇబ్బందులు బొండా జగన్మోహనరావును తీవ్రంగా ఆలోచింప చేసాయి. అడవుల్లో జీవనం సాగిస్తూ, నాగరికతకు ఆమడదూరంగా నివశిస్తున్న గిరిజనులు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవడం వంటి ఇబ్బందులనూ ఆయన గమనించారు. సరైన ఆహారం లేక పోషకాహార లోపంతో గిరిజనులపిల్లలు పడే జబ్బులను ఆయన చూసారు. గిరిజనులకు సహకరించాలనే ఆకాంక్షతో పలు సేవాకార్యక్రమాలను చేసేవారు. జీవన శైలిని నాగరీకులకు పరిచయం చేయడానికి చిత్రాలను గీయడం బొండా తన ప్రారంభించిన జగన్మోహనరావు చిత్రాల ద్వారా వారి జీవన విధానాన్ని ఆధునిక ప్రపంచానికి తెలియచెప్పేందుకు కృషిచేసారు. చిత్రాలు సహజసిద్ధంగా చూపరులను అలరించి గిరిజనుల ఆలోచింపచేసేలా గీయడం ద్వారా గిరిజనుల ప్రపంచాన్ని వివిధ చిత్రాల ద్వారా చేరువ చేసారు. గిరిజనులకు కూడా ఆధునిక వైద్యసేవలు అందాలని, వారు కూడా చక్కగా చదివి విద్యా ఉద్యోగాల్లో రాణించాలన్న ఆశయంతో జగన్మోహనరావు కృషిచేస్తున్నారు.

బ్యాంక్ ఉద్యోగిగా ట్రైబల్ ఏరియాల్లో పనిచేసే సందర్భాల్లో అమాయకులైన గిరిజనులను కొందరు పరిపరి విధాలుగా మోసం చేయడాన్ని గమనించిన బొండా జగన్మోహనరావు వారికి ఆయా విషయాల్లో ఎలా వ్యవహరించాలో తెలియచెప్పేవారు. ఒకసారి ఒక శేరు లవంగాలు. ఒక గిరిజన మహిళ నుంచి కొన్న తర్వాత ఆమె అడిగిన పది రూపాయలకు బదులుగా వంద రూపాయలు ఇవ్వబోతే ఆమె నిరాకరించిన సంఘటన ఆయన తన మిత్రులతో చెబుతుంటారు. అదే శేరు లవంగాలను పట్టణాల్లో వందల రూపాయలకు వ్యాపారులు అమ్ముతారనే విషయం మనందరికీ తెలిసిందే. బ్యాంక్ లకు వచ్చే గిరిజనుల్లో ఎక్కువ మంది వేలిముద్రలు వేసేవారని, అటువంటి వారికి చదువుకోవడం నేర్చుకోవాలని, కనీసం వారి పిల్లలదైనా చదివించాలని బొండా జగన్మోహనరావు నచ్చజెప్పేవారు. చదువు వుంటే మోసాల నుంచి తమను తాము గిరిజనులు కాపాడు గలరన్నది ఆయన అభిప్రాయం.

ఉద్యోగ ప్రస్థానం :
విజయ బ్యాంక్ ఉద్యోగజీవితాన్ని 1982లో ప్రారంభించిన జగన్మోహనరావు తదుపరి దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉద్యోగిగా సేవలందించారు. INTUC లో చురుకైన నాయకునిగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషిచేసారు. ఉత్తర, దక్షిణ భారతదే శాల్లోని గిరిజన ప్రాంతాల్లో తరచూ పర్యటనలు చేస్తూ వారి ఆచార వ్యవహారాలను ఆకళింపు చేసుకున్నారు. చిన్నతనం నుంచీ నాణేల, స్టాంపులు, కలెక్షన్ ను హాబీగా చేసుకున్న ఆయన 50వేలకు పైగా వివిధ స్టాంపులను సేకరించారు. అలాగే రాజుల కాలంనాటి నాణేలను అనేకం ఆయన సేకరించారు. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నాణేలను కూడా బొండా జగన్మోహనరావు సేకరించి భద్రపరిచారు. చదరంగం క్రీడాకారుడిగా నేషనల్-బి లో టీం ఛాంపియన్షిప్ కి సెలక్టయ్యారు. జగన్మోహనరావు 200లకు పైగా చదరంగ పోటీల్లో పాల్గొని పలు బహుమతులు గెలుపొందారు. అలాగే వైద్యం మీద అపేక్షతో హెూమియో వైద్యంను నేర్చుకున్నారు. జీవితంలో పోటీతత్వంతో, పాజిటివ్ దృక్పధంతో ఉన్నతిని సాధించాలని ఆయన చెబుతున్నారు.

ఇంటినే ఆర్ట్ గ్యాలరీగా:
విజయ బ్యాంక్ లో వివిధ హోదాల్లో పనిచేసిన జగన్మోహనరావు మేనేజర్ గా 2015 పదవీవిరమణ చేసిన పిదప పూర్తిగా చిత్రకళా సాధనకే పరిమితమయ్యారు. తను చిత్రించిన వందలాది చిత్రాలను పదిమందికి చూపాలన్న అభిలాషతో తన ఇంటినే ఒక గ్యాలరీగా మార్చుకున్నారు. విజయవాడ, హవుసింగ్ బోర్డ్ కాలనీ లో వున్న ఇంటిలో ఒక ఫ్లోర్ మొత్తం జగన్మోహనరావు తన చిత్రాలతో నింపారు. అద్దెల కోసం ఆశించకుండా ఇలా చేయగలగడం జగన్మోహనరావు గారి కళాపిపాసకు నిదర్శనం.

అవార్డులు-రివార్డులు:
జగన్మోహనరావు గారు గీసిన చిత్రాలకు జాతీయ స్థాయిలో అనేక సంస్థలు ఎన్నో అవార్డులు వరించాయి. అందులో ముఖ్యమైనవి… ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, స్వదేష్ బుక్ ఆఫ్ రికార్డ్, ఆసియన్ ఎడ్యుకేషన్ అవార్డు, కళా గౌరవ్ సమ్మాన్-2022, నెల్సన్ మండేలా గ్లోబల్ బ్రిలియన్సీ అవార్డ్-2022, స్వదేష్ నవరత్న అచీవర్స్ అవార్డ్-2023, మహాత్మగాంధీ గ్లోబల్ ఫీస్ అవార్డ్-2023, మణికర్ణిక మాస్టర్స్ కళా అవార్డ్-2023, సర్ధార్ పటేల్ ఎక్స్ లెన్స్ అవార్డ్-2023, మ్యాన్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అవార్డ్, లాంటి ఎన్నో అవార్డులు, ప్రముఖుల ప్రసంశలు అందుకున్నారు. ఢిల్లీలోని ది క్రేజీ టేల్స్ పబ్లిషర్స్ వారు బొండాకు ఇన్ఫ్లుయెషల్ ఇండియన్స్ అవార్డును అందచేసారు.
గిరిజనుల జీవన శైలిపై అత్యధిక చిత్రాలను గీసిన చిత్రకారుడిగా హానరరీ డాక్టరేట్ అవార్డ్ తో గౌరవించ బడ్డారు. MTV వారు ప్రచురించిన టాప్ టెన్ గ్లోబల్ స్టార్ అచీవర్స్-2023 మేగజైన్ లో డా. బొండా గారి చిత్రాల గురించి ప్రచురించారు.

అభ్యుదయ భావాలు:
మనిషిగా జన్మించాక తోటి మనిషి శ్రేయస్సును కూడా ప్రతి ఒక్కరూ ఆకాంక్షించాలని,
సొంతలాభం కొంతమానుకు పొరుగువాడికి తోడుపడవోయ్…!
దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్…!!
అన్న… గురజాడ అప్పారావు గారి స్పూర్తితో జీవనం సాగించడం వలన విశ్వమానవ సౌభ్రాతత్వం సాధ్యపడుతుందని జగన్మోహనరావు విశ్వసిస్తారు. తన చిత్రాల్లో ఆయన ఈ తరహా అనేక సృజనలు చిత్రించారు. విద్యార్ధి దశనుంచే జీవితంలో ఏదో సాధించాలనే తపన, ఆశయంతో సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తు వచ్చిన జగన్మోహనరావు తన చేతనైనంతలో దేశాభివృద్ధిలో, సామాజిక చైతన్యంలో పాటుపడాలని నిర్ణయించుకున్నారు. చదరంగం క్రీడాకారుడిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తాను విజయాబ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నకాలంలో పలువురు పేదపిల్లల చదువులకు ఆర్ధికంగా సహకరించారు. అది ఇప్పటికీ కొనసాగుతుంది. సాధించాలనే పట్టుదల, తపన వుంటే ఎంతటి లక్ష్యానైనా సాధించవచ్చన్న సూత్రాన్ని నమ్మిన ఆయన తన జీవితంలో అదే ఆచరించారు. డా. జగన్మోహనరావు సతీమణి లక్ష్మీకుమారి గారు కూడా ఉన్నత విద్యావంతురాలు. ఆమె జైకిసాన్ పాఠశాలల్లో ఉపాధ్యాయినిగా పనిచేసారు. జగన్మోహనరావు సహధర్మచారిణిగా భర్త ఆశయ సాధనలో ఆమె చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. పదిమందికీ మంచి జరగాలనే సత్సంకల్పంతో ఉద్యోగ విరమణ అనంతరం కూడా వారు సమాజసేవలో భాగం అవుతున్నారు. నిత్య కళాసాధనతో జీవిస్తున్న వీరి కుమారుడు, కుమార్తె కూడా తల్లితండ్రుల ఆశయాలను పుణికిపుచ్చుకుని తండ్రి బాటలోనే నడవడం అభినందనీయం. వీరి కుమార్తె ఆరాధ్యకు కూడా చిత్రకళలో ప్రవేశం వుంది.


ఒక కళాకారుడికి ఇంతకంటే ఏమికావాలి. అందుకే జగన్మోహనరావుగారి జీవితం ఎందరికో అదర్శం కావాలని కోరుకుంటాను. జగన్మోహనరావుగారి లాంటి మహోన్నత వ్యక్తిత్వం గల మిత్రులు నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తాను. వారి కళా, సామాజిక సేవ నిరంతరం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.

-కళాసాగర్ యల్లపు

13 thoughts on “‘గిరిజన గీత శిల్పి’ బొండా జగన్మోహనరావు

  1. కళారంగంలో ఇంతకృషి చేసిన చిత్రకారులు మన విజయవాడలో వున్నారా? చాలా సంతోషం కళాసాగర్ గారు గొప్ప చిత్రకారున్ని పరిచయం చేశారు. జగన్ గారిని కలిసి వారి గ్యాలరీ చూడాలనిపిస్తుంది.
    విద్య ప్రయాగ

  2. గొప్ప కళాహృదయం సర్ మీది. గిరిజనులు మన పూర్వీకులని…వాళ్ళ గురించి లోకానికి తెలియజేస్తున్న జగన్ మోహనరావు గారికి అభినందనలు.
    నరసింగరావు, అరకు

  3. అంతరించి పోతున్న గిరిజన సంతతిని చిత్రాల రూపంలో బద్రపరుస్తున్న మీ కృషికి వందనం సర్.
    నాగేశ్వరరావు, హైదరాబాద్

  4. Beautiful works. Great service to society. Congratulations sir. Thank you Kalasagar garu.

    Bhaskara Rao K., Palakol

  5. చాలా ఆశక్తి కలిగించాయి. కొంచెం ఆచ్చర్యం కూడా కలిగింది… ఈ కళాకారున్ని గురించి చదివాక. కళాకారుడు అంటే ఇలా వుండాలి కదా అనిపించింది. కళాకారుడు సున్నితహృదయుడు… సమాజానికి ఇలాంటి కళాహృదయుల అవసరం వుండి. జగన్మోహనరావు గారికి సంక్రాంతి శుభాకాంక్షలు.
    నమస్సులతో…
    పి.పి. నాయుడు, పార్వతిపురం

  6. అజ్ఞాతంగా ఇలాంటి గొప్ప కృషీవలను వెలికితీసి 64కళలు పత్రిక ద్వారా మాకు అందిస్తున్న కళాసాగర్ గారికి, మహత్తరమైన కృషిచేస్తున్న బొండా జగన్ గారికి నా అభినందనలు.
    కూచిబొట్ల ఆనంద్, అమెరికా

  7. మీరు చిత్రించిన బొమ్మలకంటే… మీ ఆశయం గొప్పది సర్. మీకు కళాభివందనాలు.
    ఎస్. సత్యనారాయణ, తిరుపతి

  8. గిరిజన జీవితాలపై చిత్రకారులు చిత్రాలు గీయాలని, తద్వారా వారి జీవితాలను నాగరీకులకు అర్ధం అయ్యేలా చేసి గిరిజనుల సంక్షేమానికి పాటుపడే యజ్ఞంలో చిత్రకారులు భాగస్వాములు కావాలన్న బొండా గారి ఆశయం నెరవేరాలి. వారి ఆర్టు గ్యాలరీని సందర్శిచాలన్న ఉత్సుకత ఈ ఆర్టకల్ చదివాక పదింతలైంది. వారిపై అపారమైన ప్రశంసా పూర్వక అభిమానం ఏర్పడ్డది. వ్యాస రచయిత పూర్తి వివరాలను అందివ్వడంలో సఫలులయ్యారు.

  9. Jaganmohan rao garu andariki adarshanga nilustharandi ayana batalo kondaru nadichina desham bagu paduthundandi.
    Rajani Reddy Tummala

  10. రంగుల లోకం కొత్తపుంతలు తొక్కుతున్న సమయాన నేను ఉన్నాను అంటూ సంప్రదాయ కళ మనముందుకు తళుక్కుమంది. అమాయకపు జానపదుల చిత్రారూపాలు అందులోని భావుకత, రంగులు, మానవకృతులు అబ్బురు పరుస్తున్నాయి.
    జగన్మోహన్ రావు గారు తన విశ్రాంతి సమయాన్ని ఎంతో గొప్ప భావప్రకటన లో నిమగ్నమై రసభరిత కళాకృతులను తీర్చిదిద్దుతూ, నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
    కానీ కళ నాలుగు గోడలికి పరిమితం కాకుండా చిత్రకారులందరూ బాహ్య ప్రపంచానికి ఎప్పటికప్పుడు కళారుచిని చూపించాలని నా కోరిక, అందలి పరమార్ధాన్ని సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap