జగమెరిగిన జర్నలిస్ట్ తుర్లపాటి
అజేయమైన శక్తికి ప్రతీకగా నిలిచే ఆంజనేయునికి పరమభక్తుడు, అక్షర దేవత సరస్వతి దేవి వరపుత్రుడు, పదహారణాల ఆంధ్రుడు, బాధ్యతగల భారతీయుడు, అనువాదంలో అద్వితీయుడు, ఉపన్యాస విన్యాసాల మాంత్రికుడు, తెలుగు పత్రికా రంగాన “పద్మశ్రీ” అందుకొన్న ఒకేఒక్కడు, రాజకీయ పార్టీలకతీతుడు, తెలుగుజాతి నౌకలో నావికుడు, తెలుగు జర్నలిజం ప్రాభవానికి బాధ్యుడు, తెలుగుభాషా పరిరక్షకుడు, వర్తమాన రాజకీయ నాయకులకు, శిక్షకుడు, పత్రికారంగ కట్టుబాట్లలో సుశిక్షితుడు పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు. ఎన్నో ప్రత్యేకతలున్న ఏకైక వ్యక్తిగా విజయవాడ నగరానికి వన్నె తెచ్చిన తుర్లపాటి గారు ఆదివారం (10-01-21) అర్థ రాత్రి కన్నుమూశారు..
దేహమంతా దేశభక్తి
మనసంతా తెలుగక్షరాలపైనే ఆసక్తి
గంటల తరబడి నిలబడి ఉపన్యసించే అద్భుత శక్తి
వీటి కలయికే తుర్లపాటి కుటుంబరావు
అనే అరుదైన వ్యక్తి …
1933వ సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగునాట పుట్టి, పురుడుపోసుకున్న ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కలం, గళం, ఈ యుగళం పేరే తుర్లపాటి కుటుంబరావు. కాలానికి అనుగుణంగా కదులుతున్న కలం, గతాన్ని, వర్తమానాన్ని కలగలిపి వినిపించే గళం తుర్లపాటి కుటుంబరావుగా రూపం దాల్చాయి. వీరికి అనర్గళంగా వచించే గళం వకీలు అయిన తండ్రి సుందర రామానుజరావు గారి నుంచి అమోఘంగా రచించే కలం తల్లి శేషమాంబ నుండి సంక్రమించిన వారసత్వ సంపదగా వీరు భావిస్తారు.
నేటి ఈ “ఉపన్యాస కేసరి” విద్యార్థి దశనుండే వక్తృత్వంలో దిట్ట! 14 ఏళ్ల అతి పిన్న వయస్సులోనే ఈ ఉపన్యాస కిశోరం గన్నవరంలో తొలిగా తన గళం విప్పింది. ఆ గళం నేడు అష్టాదశ సహస్ర సభాకేసరిగా ప్రతిష్టాత్మక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో రికార్డయ్యే వరకు ఎదిగి, నిరంతరం గంగా ప్రవాహంలా అలానే సాగుతూ ఎందరినో అచ్చెరువుకు గురిచేస్తున్నది. గతంలో 10 వేల సభలలో ప్రసంగించి, ‘దశ సహస్ర సభాకేసరి’గా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించారు వీరు.
నార్ల వారి దార్లోనే…. వీరికి పట్టుమని పదిహేనేళ్లయినా నిండక ముందే ఆంధ్రజ్యోతి ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారి సంపాదకీయాలు చదివి, అదే స్థాయిలో తాను కూడా ఎడిటర్ అవ్వాలన్న ‘ఆశయాన్ని ఏర్పరచుకున్నారు. కేవలం 19 ఏళ్ల ప్రాయంలోనే ‘ప్రతిభా ఎడిటర్‌గా ఎదిగి తన రచనాపటిమ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారి దృష్టిని ఆకర్షించి వారి ప్రజాపత్రికకు సహాయ సంపాదకునిగా చేరారు. అంతేగాకుండా అనతికాలంలోనే ఈ “భావి సభాకేసరి” ఆంధ్రకేసరి గారికి కార్యదర్శి పదవి చేపట్టారు.
రచించడంలో, వచించడంలోనూ సమాన ప్రతిభా పాటవాలను ప్రదర్శించే సవ్యసాచిగా, ద్విముఖ ప్రజ్ఞాశాలిగా యావత్ తెలుగుజాతికి సుపరిచితులు వీరు. “ఆంధ్రకేసరి” వంటి నిస్వార్ధ ప్రజాసేవకునికి సచివునిగా వుండటం వలన, ఆ గురువుగారి గురుత్వాకర్షణకు గురై వారి నిర్భీతి, నిజాయితీ వంటి గుణాలు యువ కుటుంబరావులోనూ చోటు చేసుకుని వీరితోపాటు పెరిగి పెద్దవవుతున్నాయి.
పాత్రికేయ ప్రపంచంలో పదార్పణం చేసిన కుటుంబరావు గారు రాసిన ప్రథమ వ్యాసం “స్వరాజ్యంలో స్వరాష్ట్రం”. దశాబ్దాల జ్ఞాపకాల పుస్తకం వీరి మస్తకం. స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తరువాత ఆంధ్రనేలపై జరిగిన పలు సంఘటనలను నేటికీ మన కళ్లకు కట్టినట్లు చెప్పే వీరి మస్తకం ఓ జ్ఞాపకాల పుస్తకం. దాదాపు 70 సం.ల క్రితం సంభవించిన పలు ఉద్యమాలు, వాటి కారణాలు, విజయాలు, అవజయాలు రకరకాల రాజకీయాలు, వాటి తేదీలు, ఆనాటి వ్యక్తుల పేర్లు, ఊర్లు అన్నీ వివరంగా చెప్పగలిగిన అసాధారణ ధారణ, మంత్రముగ్ధ భాషణ వీరికి భూషణాలు.
కుటుంబరావు గారి కుటుంబం :
వీరి కలం, గళం 70 సంవత్సరాల జ్ఞాపకాల సంకలనం. వీరు గళం విప్పితే గంగా ప్రవాహం. వీరు కలం కదిపితే పలు ఆసక్తికర విషయాల ప్రమేయం. కనుకనే వీరి శైలి నేటికీ అజేయం, అద్వితీయం. తెలుగు పదాల నిధిగా, తెలుగు పత్రికా జగతికి పెన్నిధిగా కుటుంబరావు గారు పత్రికా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచారు. రచనావ్యాసంగం తప్ప వేరే వ్యాపకం ఎరుగని కుటుంబరావు గారు ప్రేమకు తలొగ్గి కృష్ణకుమారిని పరిణయ మాడారు. కృష్ణమ్మ ఒడిలో కాపురం పెట్టి, తన కుటుంబానికి స్వాగతం పలికారు. వీరి ప్రేమకు, అన్యోన్య దాంపత్యానికి, “ఆంధ్రజ్యోతి” పత్రికలో తన ఉద్యోగానికి ఆనవాలుగా కలిగిన వీరి తొలి సంతానం ఆడశిశువుకు “ప్రేమజ్యోతి” అని నామకరణం చేశారు. మలి సంతాన మగశిశువుకు వీరి వివాహానికి “ఒకనాటి భారత ప్రధాని కాగలిగిన పుత్రుడు త్వరలో మీకు కలుగుగాక” అనే సందేశం పంపిన స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ గారి గౌరవ సూచకంగా “జవహర్‌లాల్ నెహ్రూ” అనే పేరు పెట్టి, నెహ్రూ పట్ల తనకున్న గౌరవ భావాన్ని సజీవంగా అక్షరాలా కనబరచారు.
వీరి జీవితం త్రిగుణాత్మకం : గాంధీ, నెహ్రూ, “ఆంధ్రకేసరి” ఈ త్రిమూర్తుల మంచి గుణగణాలను ఆకళింప చేసుకున్న వ్యక్తి కుటుంబరావు గారు. 80వ పడిలోనూ వడివడిగా నడిచే ‘వాక్’ చాతుర్యం, ఏ సభలోనైనా శ్రోతలను కట్టిపడివేయగల వాక్చాతుర్యం (వాక్కు చాతుర్యం) కనబరిచే వీరి ఆరోగ్యరహస్యం ఏమిటని ప్రశ్నిస్తే… “మితాహారం, నిరంతర వ్యవహారం, నియమం తప్పని వ్యాయామం” అని నవ్వుతూ సమాధానమిస్తారు కుటుంబరావు గారు. (నిజమే నేడు హ్యాపీ చిరాయువు). ఇవి వీరి తేజస్సుకు కారణమైతే మూడు “పి”లు 1) ప్రెస్ 2) ప్లాట్‌ఫారం 3) పిక్చర్ వీరి యశస్సుకు కారణాలు.
అభిప్రాయం’ : “ఇలాంటి వ్యక్తి అరుదుగా కాని ఉ ండడు”… అని అనిపించుకోవాలన్న అభిప్రాయాన్ని 14 ఏళ్ల చిరుప్రాయంలోనే తన మనఃఫలకంపై ముద్రించుకున్నారీ పాత్రికేయులు. వీరు రాసిన జీవిత చరిత్రల్లో ఇద్దరు ముగ్గిరికి వీరు రాస్తూ… “వారికి పుట్టుమచ్చంత అవినీతి కూడా లేదని” రాశారు.
ఎందరి జీవితాలనో తరచి చూసిన కుటుంబరావు గారికి మంచి చెడుల పర్యవసానాలు తెలుసుకనుక నేటికీ, ఏనాటికీ వీరి జీవితంలో ఇసుమంతైనా దోషం కనిపించదని నా అభిప్రాయం.
ఎటువంటి జటిల సమస్యకైనా తృటిలోనే పరిష్కారం కనుగొనటం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మర్రి చెన్నారెడ్డి గారు కితాబిచ్చారు. అనువాదంలో అద్వితీయుడుగా పలువురు ప్రముఖుల మన్ననలందుకొన్నారు వీరు. లక్ష్యం :
యోగ్యతవున్నా, యోగం లేకపోతే ఏదీ దరిచేరదని భావించే వీరు మూడుసార్లు తనకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యత్వం అందినట్లే అంది, చేజారినాగానీ అది వీరు ఆశించలేదు కనుక నిరాశ చెందలేదంటారు.
జాతి, కుల, మత, వర్ణ, వర్గ, స్త్రీ పురుష విభేదాలకు అతీతమైన, మానవుడు, తోటి మానవుని పట్ల మానవీయతను కనబరిచే సమాజ స్థాపనే వీరి లక్ష్యం. ఇందుకు వీరి జీవితం ఓ భౌతిక సాక్ష్యం.
తెలుగు జర్నలిజంలో వజ్రం :
అర్ధ శతాబ్దానికి పైబడి ‘వార్తల్లోని వ్యక్తి’ శీర్షికను “ఆంధ్రజ్యోతి”లోను, ఆ తరువాత నేడు ‘వార్త’ దినపత్రికలోను నడిపిస్తూ, వీరు వార్తల్లోని వ్యక్తిగా వెలుగొందుతున్నారు. ఈ అక్షరపూజారి ఓ నడిచే గ్రంథాలయం కనుక ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఛైర్మన్ గా వీరు ఆ పదవికే వన్నె తెచ్చారు. ఎంతటి వారినైనా నిలదీయడంలో, వారి నిగ్గు తేల్చడంలో వీరికి వీరే సాటి. గాంధీకి నోబెల్ బహుమతి ఇవ్వనందుకు స్వీడనికి ఉత్తరం రాసి వారి వివక్షను చీల్చి చెండాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని అవమానించిన స్విస్ ఆర్ధికమంత్రిని తన అక్షరాలతో శిక్షించి, క్షమాపణ చెప్పించగలిగిన మనాపాఠి కుటుంబరావు గారు. ప్రధానమంత్రులకు, ముఖ్యమంత్రులకు, గొప్ప గొప్ప వ్యక్తులకు తన లేఖల ద్వారా సమకాలీన సమస్యలను తెలియచేసి, సుపరిపాలన కొనసాగించేలా సహకరిస్తూ వస్తున్నది వీరి కలం.
“పద్మశ్రీ” అందుకొన్న ఒకే ఒక్కడు :
పత్రికా రంగాన జర్నలిజంలో సిన్సియారిటీ, సీనియారిటీ గల కుటుంబరావు గారు ఇజాలకు దూరంగా, నిజాలకు చేరువగా వుండే వీరి జర్నలిజానికి మరియు వీరి బహుముఖ ప్రజ్ఞకు ముగ్ధుడైన నాటి భారత రాష్ట్రపతి శ్రీ కె. ఆర్. నారాయణన్ స్వయంగా చొరవ తీసుకొని తుర్లపాటి కుటుంబరావుకి వారి చేతుల మీదుగా “పద్మశ్రీ ” అవార్డును అందించి, అభినందించి, ఆనందించారు.
సినీ కుటుంబంతో కుటుంబరావు గారు :
రాజకీయ రంగంతోనే కాకుండా తుర్లపాటి కుటుంబరావుకి సినీరంగంతో విడదీయరాని సంబంధం వున్నది. వీరు ‘జ్యోతిచిత్ర’లో తెలుగు సినీ విశేషాలను, ఆరోజుల్లో తీసిన సినిమాల గుణగణాలను విశ్లేషించి తెలుగు సినీ పరిశ్రమ వర్ధిల్లడానికి వీరివంతు కృషి విశేషంగా సలిపి పలువురి మన్ననలందుకున్నారు. తొలితరం మేటి నటీనటులైన భానుమతి, అంజలీదేవి, కన్నాంబ, సావిత్రి, జమున వాణిశ్రీ, ఎ.ఎన్.ఆర్., ఎన్.టి.ఆర్. ఎస్.వి.ఆర్, కృష్ణ వంటి వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి కుటుంబరావు గారు. ఎ.ఎన్.ఆర్. కు “నటసామ్రాట్” బిరుదు ఇవ్వడంలో వీరి ప్రమేయం ప్రముఖంగా ప్రస్తావించదగినది.
వీరు రెండు దశాబ్దాలపాటు ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ ఫ్యాన్స్ అసోసియేషన్‌కు సెక్రటరీగా వుండి గణనీయమైన సేవలు అందించారు. చిన్ననాటనే రంగస్థల అనుభవం వున్న వీరికి కళలపట్ల ఆసక్తి వుండటం సహజమేమరి.
ఎవరీ తుర్లపాటి ?
నెహ్రూగారి హయాంలో కృష్ణాజిల్లాలో కాంగ్రెస్ పరాజయానికి కారణాలను విశ్లేషిస్తూ నెహ్రూ గారికి రాసిన సుదీర్ఘమైన లేఖను చదివిన నెహ్రూగారు “ఎవరీ తుర్లపాటి?” అని ఆశ్చర్యంగా ప్రశ్నించడం ఈ అక్షరయోధుడి ప్రతిభకు తార్కాణం.
మధుర జ్ఞాపకాలు :
మహాత్మా గాంధీ గారి ‘ఆటోగ్రాఫ్’ తీసుకోవటం, జవహర్‌లాల్ నెహ్రూ గారితో విజయవాడ రైల్వే స్టేషన్లో సంభాషించటం, అంబేద్కరను ఇంటర్వ్యూ చేయటం, ఇందిరాగాంధీతో ఇంటర్వ్యూ వంటివి వీరి జీవితంలో మరపురాని ఘట్టాలుగా పేర్కొంటారు వీరు. వీరి పరోక్షంలో వీరి జర్నలిజం డైమండ్ జూబ్లీని నాటి గవర్నర్ ఎన్.డి. తివారీ జరిపించి, వీరిని ప్రశంసించటం వీరి జర్నలిజం చాతుర్యానికి ఓ మచ్చుతునకగా పేర్కొనాలి. ఇటువంటి విశిష్ఠవ్యక్తి కేవలం విజయవాడ నగరానికే కాక, మన దేశానికే గర్వకారణం… వారి మరణానికి 64కళలు.కామ్ పత్రిక నివాళులర్పిస్తుంది.
-బి.ఎం.పి. సింగ్