లోకంలో ఎన్నటికీ విలువ తరగని గొప్ప వస్తువు ఏదైనా వుందంటే అది పుస్తకంగా చెప్పుకోవచ్చు. కారణం – “తలదించి నన్ను చూడు తల ఎత్తుకుని నిలబడేలా నిన్ను చేస్తాను” అంటుంది పుస్తకం. అందుచేతనే అబ్దుల్ కలాం లాంటి వారు పుస్తకం వందమంది మిత్రులతో సమానం అని పేర్కొన్నారు. పుస్తకం అంత గొప్పది, అది సర్వ విషయాల పట్ల విజ్ఞానాన్ని వినోదాన్నిమాత్రమే గాక అమూల్యమైన విషయాలను మనిషికి అందించే ఒక అపురూపమైన వస్తువు. అలాంటి పుస్తకం కేవలం విషయ పరిజ్ఞానాన్ని అందించడమే గాక ఒక అందమైన భూషణంగాను మధురమైన జ్ఞాపకాలనూ కూడా మనకు అందించేదిగా కూడా వుంటే అది మరెంత బాగుంటుంది. నిజంగా మనసును పరవశించేలా చేస్తుంది కదా. అలా కావాలి అంటే అది ఒక ప్రత్యేక శ్రద్దతో రూపొందినప్పుడే ఆ పుస్తకాన్ని చూసినప్పుడు పాఠకుడికి ఆ భావన కలుగుతుంది. చాలా కాలం తర్వాత చిత్రకళకు సంభందించి అటువంటి మంచి అనుభూతిని కలిగించిన పుస్తకం “వపాకు వందనం”.
గంధర్వ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారి శత జయంతి సందర్భంగా చిత్రకళా పరిషత్ విశాఖపట్నం వారు ప్రచురించిన “వపాకు వందనం” శతవసంతాల ప్రత్యేక సంచిక నిజంగా అలాంటి మంచి అందమైన అనుభూతిని చిత్రకారులకు, చిత్రకళాభిమానులకు కలిగిస్తుంది. జలవర్ణాలతో వేలాది చిత్రాలను తన కుంచె విన్యాసంతో చిత్రించి లోకాన్ని నేటికీ అబ్బురపరుస్తున్న ఈ గంధర్వ చిత్రకారుడు ఏ ఒక్క ప్రదర్శన చేయలేదంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది . అయితేనేం ఎన్నో ప్రదర్శనలు చేసిన చిత్రకారులను మించి ఒక్క తెలుగు వారి మదిలోనే గాక యావత్ దక్షిణాది ప్రజల గుండెల్లో కూడా చెరగని ముద్ర వేసుకున్న గొప్ప చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ప్రచారాలకి అల్లంత దూరంలో వుండే ఈ వ్యక్తి తన జీవితకాలములో కూడా అంతగా ఎవరికీ చేరువ కాకుండా తనదైన లోకంలో మునిగితేలి ఒక అద్భుతమైన ఊహా సౌందర్యంతో తనదైన ఒక గొప్ప కళాసామ్రాజ్యాన్ని సృష్టించి, దానిని మనకు అందించి వెళ్ళిన గొప్ప చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ఆయన ఈ భువిపై జన్మించి సెప్టెంబర్10, 2021 నాటికి వందేళ్ళు గడిస్తే, ఆయన ఈ భువి నుండి గతించి కూడా అప్పుడే 29 ఏళ్ళు గడిచాయి. అయినప్పటికీ చిత్రకళాభిలాషుల మదిలో అంత గొప్పగా ముద్రవేసిన చిత్రకారుడు మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప చిత్రకారునికి నివాళిగా ఒక ప్రత్యేక మైన శ్రద్దతో రూపొందించబడ్డ గ్రంథం ఈ ‘వపాకు వందనం’.
ఈ గ్రంథంలో ప్రత్యేకత ఏమంటే ఇందులో వున్నటువంటి వ్యాసాలన్నీ ‘వపా’ గారితో కొద్దో గొప్పో పరిచయమున్న వ్యక్తుల అనుభవాలతో కూడిన వ్యాసాలనే పొందుపరచడం. దానిలో ముఖ్యంగా ఈ గ్రంథం రూపుదిద్దుకోడానికి ప్రధాన కారకులైన సుంకర చలపతిరావుగారు రాసిన వ్యాసాలు ప్రధానమైనవి. అయితే, ఇంకా ‘వపా’గారితో వివిధ సందర్భాలలో ప్రత్యక్ష పరిచయ భాగ్యం కలిగిన కొందరు వ్యక్తులు, కళాకారులు కూడా వున్నారు. ఈ గ్రంధానికి అద్భుతమైన ముఖపత్రాలంకరణ చేసిన చిత్రకారుడు కడలి సురేష్, పి.ఎస్. బాబు, ఇటీవలనే అమర లోకానికేగిన ప్రఖ్యాత సిని పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్, జగమెరిగిన కార్టూనిస్ట్ జయదేవ్ బాబు, శిల్పి దివిలి అప్పారావు, చిత్రకారులు కోరసాల సీతారామస్వామి, కొండూరి నాగేశ్వరరావు, ఇప్పిలి జోగి సన్యాసిరావు, సింగంపల్లి సత్యనారాయణ, ఈనాడు చీఫ్ ఆర్టిస్ట్ రవికిశోర్, సత్యం పేద సింగు, మంగేన గంగాధరరావు, నఖ చిత్రకారుడు పల్ల పర్సినాయుడు, కవి మాధవి సనారా లాంటి…. వారంతా వడ్డాది పాపయ్య గారితో తమకు వున్న అనుభవాలను వ్యాసాల రూపంలో పొందుపరచడం ముఖ్య విషయం . అంతేగాక వపా సృష్టించిన సర్వాంగ సుందరమైన వారి చిత్ర సుందరిల లాంటి వారి అక్షరాలను కూడా స్వయంగా వారు వివిధ వ్యక్తులకు రాసిన వుత్తరాల ముద్రణ ద్వారా ఈ గ్రంథంలో మనం వీక్షించవచ్చు. ఇంకా ‘వపా’ గారు 1992 డిసెంబర్ 30న స్వర్గస్తులైనప్పుడు వివిధ రచయితలు ‘వపా’గారి గురించి నాడు స్వాతి లాంటి వివిధ పత్రికలలో రాసిన కవితలు వ్యాసాలూ, పేపర్ కట్టింగ్స్ మొదలైనవి దీనిలో పొందుపరిచారు.
అన్నింటి కంటే ముఖ్యమైనది పుస్తకం యొక్క అలంకరణ. ఒక గ్రంథంలో ఎంత సరుకు వున్నా అది చూసేందుకు ఆకర్షనీయంగా లేకుంటే అసలు ఆ పుస్తకం జోలికి పోలేము. క్రౌన్ సైజ్ లో ముద్రించిన ఈ గ్రంథ ముఖచిత్రం కూడా ప్రత్యేకంగా వుండేలా చూసారు. శత వసంతాలను సూచించే విదంగా ‘వపా’ తన సప్తవర్ణాల రథాన్ని అధిరోహించి కుంచె కళ్ళెంతో ముందుకు నడిపిస్తున్నరీతిగా కడలి సురేష్ గారు ఎంతో భావయుక్తంగా ఈ గ్రంథాన్నివేసిన వడ్డాది పాపయ్యగారి ముఖచిత్రంతో పాటు ఇందులో ‘వపా’గారి 27 పూర్తి నిడివి వర్ణచిత్రాలు, 46 హాఫ్ అండ్ క్వార్టర్ సైజ్ వర్ణచిత్రాలే గాక చిన్న పెద్ద కలిసి మరో 75 వర్ణరహిత చిత్రాలు, అన్ని కలిసి మొత్తం 150 చిత్రాలు వరకూ ఈ గ్రంథం నందు పొందు పరచిన తీరు నిజంగా చిత్రకళాభిలాషులకు కన్నుల పండుగ చేస్తుంది. వర్ణ చిత్రాలన్ని కేవలం పుస్తకంలో ఒక్క చోటనే పొందు పరచకుండా, కొన్ని వర్ణచిత్రాల తర్వాత బ్లాకు అండ్ వైట్ చిత్రాలు, వ్యాసాలూ మరలా అబ్భుఅరపరిచే వర్ణచిత్రాల మేళవింపుతో వున్నఈ పుస్తకం చూడగానే మనసును మనసుకి హాయిగొలిపే రీతిలో తీర్చిదిద్దారు. పుస్తకం తీయగానే ఎంతో ఆకర్షణీయంగా వుండి వెంటనే కొని దాచుకోవాలనిపించే తీరుగా మనకు కనిపిస్తుంది. వివిధ పత్రికలలో ప్రచురితమైన ఎన్నో చిత్రాలతో బాటు అసలు ఇంతవరకూ ఎన్నడూ పబ్లిష్ కాకుండా కొందరి కలక్షన్ లో మాత్రమే వున్నవాటిని కూడా ప్రత్యేకంగా సేకరించిన చిత్రాలు కూడా ఇందులో పొందుపరచడం మరో విశేషం.
తెలుగు ప్రజలకు గర్వకారణమైన ఈ చిత్రకారుడి శత జయంతి గ్రంథాన్ని ఏఒక్క ప్రభుత్వ సహకారం లేకుండా కేవలం ‘వపా’ యొక్క అభిమానులు మరియు ప్రకటనలద్వారా వచ్చిన ఆర్ధిక సహకారంతోనే చిత్రకళా పరిషత్ పేరు మీదుగా వపా శత జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన మరో విశేషం. చివరగా చిత్రకారులే గాక చిత్రకళాభిలాషులు మరియు పుస్తకాభిలాషులు అందరూ కొని దాచుకోవాల్సిన ఈ అపురూప గ్రంథం మన ముందుకు రావడములో ప్రధాన భూమిక పోషించిన వారు వపాకి వీరాభిమాని మరియు చిత్రకళా రచయితలైన సుంకర చలపతిరావు గారైతే, దానిని అంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత మరో చిత్రకారుడు మరియు 64 కళలు.కం ఎడిటర్ కళాసాగర్ గారికి దక్కుతుంది. అందుకు వారిరువురూ ఎంతో అభినందనీయులు.
112 పేజీలతో సర్వాంగ సుందరంగా ఆర్ట్ పేపర్ తో ముద్రించబడిన ఈ చిత్రకళా గ్రంథం యొక్క వెల. 200/- రూపాయలు. నవోదయ బుక్ హౌస్ హైదరాబాద్ లోను, సుంకర చలపతిరావు (9154688223), కళాసాగర్ (9885289995) గారిని సంప్రదించి కూడా ఈ గ్రంథాన్ని సొంతం చేసుకోవచ్చు.
-వెంటపల్లి సత్యనారాయణ
(9491378313)
Very good article 👍
Thank u so much andi
Credit goes to Sri kalasagar
And Sri sunkara chalapathirao
Congratulations both of you
Thank you sir….
*వపా గారు *ఒక అద్భుతచిత్రకళా తపస్వి. *వపాకు వందనం *ఒక అద్భుతగ్రంధం. ఈ అపురూప గ్రంథ రూప కర్తలు శ్రీ సుంకర చలపతి రావు, శ్రీ కళాసాగర్ గార్లకు అక్షరాభినందనలు. –ఒక VAPA అభిమాని Bomman. 🙏🙏💐💐
వప గారి పుస్తకం ఒక అక్షర రమ్యం మరియు వారి చిత్రాల సుమమాల వారికే ఆభరణం.
ఆ మహా చిత్ర తపస్వికి మనః పూర్వక సుమాంజలి. ఈ పుస్తకం వెలుగులోకి రావడానికి కారకులైన చలపతిరావు, కళాసాగర్ల కృషి అభిందనీయం. CSN Raju