అమృత మధురం ‘సలలిత రాగ సుధారస సారం’!

తెలుగునాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోశన పట్టి నాదవినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వడు పద్మవిభూషణ్‌ డాక్టర్‌ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ‘ఎక్కడ మానవ జన్మంబిది.. ఎత్తిన ఫలమేమున్నది’; వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకంటా’ అంటూ తత్వరహస్యాలను రాగమయంగా తెలియజెప్పిన ఈ గానసరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ఆ మహనీయుని గురించి…

మంగళంపల్లి జన్మస్థానం…

బాలమురళీకృష్ణ పుట్టింది 1930 జూలై 6న, జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తం. తండ్రి పట్టాభిరామయ్యది అంతర్వేదిపాలెం. ఆయన శంకరగుప్తంలో సంగీత పాఠాలు బోధిస్తూ ఉండేవారు. తల్లి సూర్యకాంతమ్మ వీణ విద్వాంసురాలు. అతనికి తల్లితండ్రులు పెట్టిన పేరు మురళీకృష్ణ. కానీ మురళీకృష్ణ పుట్టిన పదమూడు రోజులకే తల్లి మరణించటం ఆయన దురదృష్టమనే చెప్పవచ్చు. తల్లిపాలు కరవైన వయసులో గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో మురళీకృష్ణ పెరిగారు. స్కూలులో చేర్పించినా అక్కడ చదివింది మూడు నెలలే. మురళీకృష్ణకి చిన్నతనంలోనే సంగీతంమీద ఆసక్తి ఉన్నట్టు గ్రహించిన తండ్రి విజయవాడ తీసుకొని వచ్చి, అక్కడే మకాం పెట్టి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద సంగీత శిక్షణ కోసం చేర్పించారు. ఆయన వద్దే మురళీకృష్ణ కర్నాటక సంగీతాన్ని అభ్యసించారు. విజయవాడ మునిసిపల్‌ హైస్కూల్‌ హెడ్మాస్టరు మురళీకృష్ణ సంగీత జ్ఞానానికి ముగ్దుడై తిన్నగా ఆరవ తరగతిలో ప్రవేశం కల్పించారు. కానీ సంగీతం మీద ఉన్న ముక్కువతో చదువును మురళీకృష్ణ అశ్రద్ధ చేయడంతో పరీక్ష తప్పారు (ఆరోజుల్లో ప్రతి తరగతికీ డిటెన్షన్ పద్ధతి ఉండేది). ఆ పాఠశాల హెడ్మాష్టరు మురళీకృష్ణకు సంగీతం మీద మంచి శిక్షణ ఇప్పించమని అతని తండ్రికి సూచించటంతో మురళీకృష్ణ చదువుకు దూరం కావాల్సి వచ్చింది. విజయవాడలో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాలలో మురళీకృష్ణ పాల్గొని, తన ఎనిమిదేళ్ల వయసులోనే పూర్తిస్థాయి కచేరి నిర్వహించి అందరినీ అబ్బురపరచారు. ఆ సందర్భంగా మురళీకృష్ణ సంగీత సామర్థ్యం గుర్తించిన ప్రముఖ హరికథా విద్వాంసుడు ముసునూరి సూర్యనారాయణ భాగవతార్‌ అతని పేరుకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణగా సంబోధించడంతో అదే పేరు సార్థకమై నిలిచిపోయింది. పదకొండవ ఏటనే ఆకాశవాణిలో తొలిసారి గళం విప్పారు. కుర్తాళం పీఠాధిపతి విమలానంద భారతి ప్రేరణ, ఆశీర్వాదబలంతో తన పదిహేనవ ఏటకే 72 మేళకర్త రాగాలను మధించి, పండిత అప్పయ్య శాస్త్రి శిక్షణలో కృతి, కీర్తన వంటి రాగ రచనా రహస్యాలను గ్రహించి, 1952లో ‘జనక రాగ కృతిమంజరి’ అనే కీర్తనా సంపుటిని ప్రచురించారు. సంగీత రికార్డింగ్‌ కంపెనీవారు ఈ పుస్తకంలోని కీర్తనలను ‘రాగాంగ రవళి’ పేరుతో తొమ్మిది సంచికలుగా విడుదల చేశారు. తరవాతి కాలంలో విజయవాడలోనే ఉంటూ అక్కడ ఏర్పాటైన సంగీత కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా కూడా బాలమురళీకృష్ణ వ్యవహరించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సంగీత శాఖ అధిపతిగా కొంతకాలం పనిచేశారు. తరవాత బాలమురళీకృష్ణ మకాం మద్రాసుకు మారింది.

సంగీత రాజధానిలో అడుగిడి…

మద్రాసుకు మకాం మార్చిన బాలమురళి రాయపేట మ్యూజిక్‌ ఆకాడమీకి దగ్గరలోనే ఇల్లు కట్టుకొని, సంగీతాచార్యునిగా ఎంతోమందికి శిక్షణ ఇస్తూ వచ్చారు. ప్రతి ఏటా మద్రాసులో జరిగే సంగీతోత్సవాలలో బాలమురళి తప్పకుండా పాల్గొనేవారు. అక్కడే కర్నాటక సంగీత కచేరీలు వందల సంఖ్యలో నిర్వహిస్తూ వచ్చిన బాలమురళీకృష్ణకు వయోలిన్‌ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు అంటే ఎంతో అభిమానం. ఆ అభిమానం నేపథ్యంలోనే వయోలిన్‌ మీద పట్టు సాధించారు. దీనితోబాటు కంజీర, వయోల, వీణ మృదంగం వంటి సంగీత వాయిద్యాల మీద కూడా ప్రావీణ్యం సాధించారు. కొంతకాలం తిరుపతి తిరుమల దేవస్థానానికి, శృంగేరి పీఠానికి, బెజవాడ కనకదుర్గ దేవస్థానానికి ఆస్థాన విద్వాంసునిగా కూడా బాలమురళీకృష్ణ వ్యవహరించారు. మద్రాసు నగరం కర్నాటక సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది కావటంతో బాలమురళీకృష్ణ ఎన్నో కచేరీలు చేసి అష్టపదులు, లలితగీతాలు, హిందుస్థానీ భజనలు, తిల్లానాలు వినిపించి తమిళ సంగీత అభిమానులకు ప్రీతిపాత్రులయ్యారు. సంగీత సామ్రాజ్యంలో బాలమురళీకృష్ణ సాధించని కొలువులు లేనేలేవు. స్వయంగా కొన్ని కొత్త రాగాలకు రూపకల్పన చేసి సంగీత బ్రహ్మగా ఖ్యాతి గడించారు. వాటిలో మహతి, లవంగి, తరణి, ప్రతిమధ్యమావతి, రోహిణి, కాళిదాస, మనోరమ, సర్వశ్రీ, సిద్ధి, గణపతి వంటివి కొన్ని మాత్రమే. అమ్మప్రేమకు దూరమైన బాలమురళి ‘సూర్యకాంతి’ పేరుతో ఒక కొత్తరాగాన్ని సృష్టించి తల్లికి నీరాజనం పలికారు. వాడుకలో లేని ‘సునాదవినోదిని’ వంటి కొన్ని రాగాలకు పునరుజ్జీవనం కలిపించారు. బాలమురళి మద్రాసులో కట్టుకున్న గృహానికి నారద మహర్షి తంబూర పేరు వచ్చేలా ‘మహతి’ అనే పేరును పెట్టుకున్నారు. తమిళులు ఆయనను త్యాగరాజ అంశగా భావిస్తే, తెలుగు ప్రజలు అన్నమయ్యగా, రామదాసుగా ఆరాధించారు. క్రమంగా అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, ఇటలీ, సింగపూరు, శ్రీలంక, మలేషియా వంటి విదేశాలలో కచేరీలు చేయడం మొదలెట్టి దాదాపు పాతిక వేల కచేరీల రికార్డులను సృష్టించారు. ఎన్నో సత్కారాలను, సన్మానాలను అందుకున్నారు. జుగల్‌ బందీ తరహా కచేరీలకు రూపకల్పన చేసి పండిట్‌ భీమ్‌సేన్‌ జోషి, పండిట్‌ హరిప్రసాద్‌ చౌరాసియా, అమోన్కర్‌ వంటి పండితులతో జుగల్‌ బందీలను నిర్వహించారు. సంగీత కళానిధి, గాన కళాభూషణ, జ్ఞాన శిఖామణి, జ్ఞాన సరస్వతి, గాన కౌస్తుభ, నాద మహర్షి, గాంధర్వ గానసామ్రాట్‌ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలనెన్నిటినో అందుకున్నారు. కర్నాటక సంగీతానికి ఆత్మబంధువై నిలిచారు.

BalaMurali as Narada

సినీ గాన మురళీరవం…

కేవలం గానగంధర్వుడిగానే కాదు రంగస్థలం మీద కూడా రాణించిన నటుడుగా బాలముళి కీర్తిగడించారు. క్రమంగా వెండితెర మీద కూడా దర్శనమిచ్చారు. ఒక సంగీత విద్వాంసుడి నేపథ్యంలో నిర్మించిన ‘సంధ్య గిదేన సిందూరం’ అనే మళయాల చిత్రంలో హీరోగా దర్శమిచ్చిన బాలమురళి ‘చచందనిర్‌’ అనే బెంగాలి సినిమాలో, ‘మేఘసందేశం’ తెలుగు సినిమాలోనూ కొంచెం సేపు దర్శనమిచ్చారు. ‘భక్తప్రహ్లాద’ సినిమాలో నారదుడిగా ప్రధాన పాత్ర పోషించారు. ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్‌ ఈ సినిమా నిర్మించ తలపెట్టినప్పుడు నారద పాత్రకు గాత్రదానం ఇవ్వలసిందని కోరగా బాలమురళి ఆ పాత్రను తనే వేస్తానని అడిగి మరీ నటించారు. అందులో ‘ఆది అనాదియు నీవే దేవా..నింగియు నేలయు నీవే కావా’, ‘వరమొసగే వనమాలీ నా వాంఛితమ్ము నెరవేరునుగా’, ‘సిరిసిరి లాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ల లాలి’ పాటలను సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో బాలమురళి ఆలపించారు. నేపథ్య సంగీత విషయానికొస్తే కొన్ని తెలుగు, తమిళ, కన్నడ, మళయాల సినిమాలలో పాటలు పాడారు. బాలమురళి మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు 1957లో అలనాటి నటీమణి ఎస్‌.వరలక్ష్మి, కడారు నాగభూషణం దర్శకత్వంలో ‘సతీసావిత్రి’ సినిమా నిర్మించింది. ఆమె కొంతకాలం బాలమురళి వద్ద సంగీతాభ్యాసం చేసింది. ఆ చొరవతో సత్యవంతుడుగా నటించిన అక్కినేని నాగేశ్వరరావుకు నేపథ్యగానం చేయవలసిందిగా బాలమురళిని కోరింది. ఆ సినిమాలో వరలక్ష్మితో కలిసి బాలమురళి మూడు యుగళ గీతాలను, ఐదు పద్యాలను పాడారు. ‘ఒహో విలాసాల కోవెల..వినోదాల నావలా’, ‘రావేలనో చందమామా దాగదవేలా’, ‘ఎందుకో ఈ ఆనందం ఏనాదితో అనుబంధం’, అనే మూడు పాటలకు స్వరకల్పనచేసి పాడడం విశేషం. 1962లో విడుదలైన ‘స్వర్ణగౌరి’ సినిమాలో నారదపాత్ర పోషించిన వల్లం నరసింహారావుకు ‘జయజయ నారాయణ ప్రభో పావన’ అనే పాటను ‘పాలించు ప్రభువుల పసిపాపలను జేసి’, అనే పద్యాన్ని వెంకట్రాజు సంగీత దర్శకత్వంలో ఆలపించారు. 1963లో రాజ్యం పిక్చర్స్‌వారి ‘నర్తనశాల’ సినిమా కోసం సంగీతదర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి ఎన్టీఆర్‌ పోషించిన బృహన్నల పాత్రకు బాలమురళి చేత ‘సలలిత రాగ సుధారస సారం’ పాటను పాడించారు. ఈ పాట నేటికీ రసజ్ఞులను అలరిస్తూనే ఉంది. ‘కర్ణ’ డబ్బింగ్‌ చిత్రంలో సుశీలతో కలిసి ‘నీవూ నేనూ వలచితిమి నందనమే ఎదురుగ చూచితిమీ’ అనే యుగళ గీతాన్ని కూడా ఆలపించారు. బాలమురళి సినిమాల కోసం ఆలపించిన పాటల్లో ‘ఏటిలోని కెరటాలు యేరు విడచివోవు’ (ఉయ్యాల జంపాల), ‘పలుకే బంగారమాయెనా అందాలరామా’ (అందాలరాముడు), ‘మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా’, (శ్రీరామాంజనేయ యుద్ధం), ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా’ (మేఘసందేశం), ‘తెరతీయరా తిరుపతి దేవరా’ (శ్రీవేంకటేశ్వర వైభవం) బాగా పాపులర్‌ అయినవిగా చెప్పవచ్చు. ఎన్టీఆర్‌ నిర్మించిన ‘శ్రీమద్విరాట పర్వము’ సినిమాలో బాలమురళి చేత బృహన్నల పాత్రకు ‘ఆడవే హంస గమనా’, ‘జీవితమే కృష్ణ సంగీతమూ’ పాటల్ని పట్టుబట్టి పాడించారు. స్వాతి తిరుణాల్‌ అనే మళయాళ సినిమాలో పాడిన భజన గీతానికి ఉత్తమ గాయకుడిగా బాలమురళి అవార్డు అందుకున్నారు. కె.విశ్వనాథ్‌ రూపొందించిన ‘శంకరాభరణం’ సినిమాలో బాలమురళి పాడాల్సింది. కానీ విదేశీ పర్యటనలో ఉండడంతో ఆ అవకాశం బాలుగారికి దక్కింది. జి.వి.అయ్యర్‌ నిర్మించిన కన్నడ చిత్రం ‘హంసగీతె’కు తొలిసారి సంగీత దర్శకత్వం నిర్వహించిన బాలమురళీకృష్ణకు ఉత్తమ గాయకుడిగా, ఆ తరువాత వచ్చిన మరో కన్నడ చిత్రం ‘మధ్వాచార్వ’కు ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ పురస్కారాలు లభించటం ఆయన విశిష్ట ప్రజ్ఞకు నిదర్శనాలు. తెలుగులో ‘తోడు’ అనే చిత్రానికి మాత్రమే బాలమురళి సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఇక లలిత గీతాల విషయానికొస్తే రామదాసు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, ‘ఏమీ సేతురా లింగా’, ‘వస్తా ఒట్టిది పోతా ఒట్టిది ఆశ ఎందుకంటా’ వంటి తత్వ గీతాలు బాలమురళి స్వరపొదిలో ఎన్నున్నాయో చెప్పలేం.

With former president Pranab Mukharjee

మరిన్ని విశేషాలు..
బాలమురళికృష్ణ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1971లో పద్మశ్రీ, తరవాత పద్మభూషన్, 1991లో పద్మవిభూషణ్‌ పురస్కారాలు అందించి గౌరవించింది. కేంద్రప్రభుత్వ అకాడమీ అవార్డు కూడా బాలమురళికి దక్కింది. అలాగే కేంద్రప్రభుత్వ సంగీత అకాడమీ బాలమురళికృష్ణకు గోల్డెన్‌ జుబిలీ పురస్కారాన్ని అందజేసింది.
ఫ్రెంచ్ ప్రభుత్వం 2005లో బాలమురళికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేసింది. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, కోల్‌కతా రవీంద్ర విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ జవహర్లాల్‌ నెహ్రూ టెక్నాలాజికల్‌ విశ్వవిద్యాలయం బాలమురళీకృష్ణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేశాయి.
కచేరి చేయడానికి బాలమురళీకృష్ణ ప్రత్యేకంగా సాధన చేసేవారు కాదు. వేదిక పైకే వెళ్లాక అశువుగా పాడేవారు. మద్రాసు దూరదర్శన్‌లో ఒకసారి మురళీకృష్ణ సరస్వతి బృందంలో కలిసి కొన్ని బెంగాలీ లలిత గీతాలను ఆలపించారు. ఆ కార్యక్రమం కోల్‌కతా దూరదర్శన్‌లో పునఃప్రసారమైనప్పుడు వీక్షించి పులకించిన బెంగాలీ శ్రోతల కోరిక మేరకు, బాలమురళీ చేత రవీంద్రుని గీతాలను పాడించి కోల్‌కతా దూరదర్శన్‌ ప్రసారం చేసింది. ఈ విషయంలో బెంగాలీ గాయని సుచిత్రామిత్రా ఆయనకు సహకరించింది.

బాలమురళి ఆంధ్రప్రదేశ్‌ లలితకళల అకాడమీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సమయంలో నూతన ముఖ్యమంత్రిగా పదివి చేపట్టిన ఎన్‌.టి.రామారావు అకాడమీలన్నింటినీ రద్దుచేశారు. కళాకారులకు జరిగిన అవమానంగా భావించిన బాలమురళి ఎన్టీఆర్‌ తన పంధాను మార్చుకోనంత వరకు ఆంధ్రదేశంలో కచేరి చేయనని ప్రతినబూనారు. ఏడేళ్ల తరువాత పదవిలోకి వచ్చిన ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి అభ్యర్థనతో హైదరాబాద్‌లో బాలమురళి మరలా కచేరిలో పాడారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ పదవిలోకి వచ్చాక బాలమురళిని పిలిచి గౌరవించడంతో యధాతధంగా ఆంధ్రదేశంలో కచేరీలలో పాల్గొనటం ప్రారంభించారు.

ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap