వెన్నలాంటి పాటల ‘వెన్నెలకంటి’

మనిషి పోతేమాత్రమేమి… వెన్నెలకంటి జ్ఞాపకాలు పాటలలో పదిలం….

సరిగ్గా రెండేళ్లక్రితం… అంటే 05-01-2021 న సాహిత్య సంగీత సమాఖ్య గౌరవ సభ్యులు, శ్రీ వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ గారు అనాయాస మరణం చెందడం మనకు తెలిసిన విషయమే.‘వెన్నెలకంటి’ అనే ఇంటి పేరుతో తెలుగు చలనచిత్ర సీమలో అద్భుత సినీ రచయితగా వెలుగొందిన కవివరేణ్యులు శ్రీ రాజేశ్వర ప్రసాద్. నెల్లూరు పట్టణంలో నవంబరు 30, 1957 న పుట్టి, అక్కడే పెరిగిన ఈ కవికేసరి తండ్రి కోటేశ్వరరావు పార్వతీ కళ్యాణం (1941), గరుడ గర్వభంగం, శ్రీ సీతారామ జననం, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, మనోరమ (1959) వంటి అనేక తొలితరం సినిమాలకు ప్రొడక్షన్ మేనేజరుగా సేవలందించిన విషయం ఎక్కువమందికి తెలియదు. వెన్నెలకంటి విద్యాభ్యాసం నెల్లూరు పట్టణంలోనే కొనసాగింది. హైస్కూలు చదువునుంచే సాహిత్యం మీద వెన్నెలకంటికి అభిలాష మెండుగా వుండేది. తన 11 వ యేటనుంచే కవితలు, ఛందోబద్ధంగా పద్యాలు రాయడం ఆరంభించారు. ‘భక్త దుఃఖ నాశ…పార్వతీశ’ అనే మకుటంతో ఒక శతకాన్ని రచించారు. తరవాత వరసగా ‘రామచంద్ర శతకం’, ‘లలితా శతకం’ కూడా రచించారు. కానీ వెన్నెలకంటి మనసంతా నాటకాల మీద, సినిమాల మీద ఉండేది. ఎప్పటికైనా సినిమాలలో, పాటలు రాయకపోతానా అనే ఆత్మవిశ్వాసముండేది. ఆ విశ్వాసమే వెన్నెలకంటిని సినీగేయరచయితగా నిలబెట్టింది. పైగా తండ్రి సినిమా పరిశ్రమలో సేవలు అందిస్తూ వుండడంతో ప్రోత్సాహానికి కొదువలేదు. తన పద్దెనిమిదవ యేటనుంచే నాటకాల్లో నటించడం మొదలెట్టారు. ‘ఈచరిత్ర ఏ సిరాతో’, పాటల ‘ఏక్ దిన్ కా సుల్తాన్’, ‘దర్పణం’ వంటి నాటకాలలో ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు అందుకున్నారు. స్వయంగా వెన్నెలకంటి కొన్ని అద్భుత నాటికలకు రూపమిచ్చారు. సాధారణ పేర్లతో కాకుండా ‘ఆత్మవత్ సర్వ భూతానాం‘, ‘యత్ర నార్యస్తు పూజ్యన్తే’ వంటి వినూత్నమైన పేర్లతో ఆ నాటికలు ప్రదర్శిత మయ్యాయి. అనేక నాటక కళాపరిషత్తుల్లో ఈ నాటికలు ప్రదర్శితమై ఉత్తమ రచనతో బాటు అనేక బహుమతులు గెలుచుకున్నాయి. నెల్లూరు వెంకటగిరి రాజా వారి కాలేజీలో పట్టా పుచ్చుకున్న తరవాత భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం దొరికింది. పుష్కరంపాటు బ్యాంక్ ఉద్యోగంలోనే వుంటూ సాహిత్య, కళా సేవ చేశారు.

చలనచిత్ర సీమలో తొలి అడుగు…

తండ్రి మద్రాసు చిత్ర పరిశ్రమలో వుండడంతో వెన్నెలకంటి తరచూ మద్రాసు వెళ్తుండేవారు. అలా 1986 లో నటుడు ప్రభాకరరెడ్డితో పరిచయమైంది. ఆయన నిర్మించిన ‘శ్రీరామచంద్రుడు’ అనే చిత్రంలో పాటరాసే అవకాశాన్ని ప్రభాకరరెడ్డి కలిపించారు. అందులో ‘’చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల’’ అనే పాటను రాశారు. అదే వెన్నెలకంటి రాసిన తొలి పాట. తరవాత ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ‘అన్నా చెల్లెలు’ (1987) అనే సినిమాలో మరొక పాట రాసే అవకాశాన్ని కలిపించారు. అందులో ‘’అందాలు ఆవురావురన్నాయి’’ అనే పాటను రాసి సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. అలా క్రమంగా వెన్నెలకంటి పాటల ప్రయాణం వూపందుకుంది. దాంతో బ్యాంక్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పి సినీ సాహిత్య ప్రయాణం సాగించారు. అప్పట్లో రాజశ్రీ డబ్బింగ్ చిత్రాల రచనలో ముందంజలో వుండేవారు. వెన్నెలకంటి రాజశ్రీ కి దగ్గరై మణిరత్నం దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మించిన ‘నాయకుడు’ డబ్బింగ్ చిత్రంలో రాజశ్రీ తోబాటు రెండు పాటల్ని రాశారు. బాలు, శైలజ ఆలపించిన ‘’ఏదో తెలియని బంధమిదీ ఎదలో ఒదిగే రాగమిదీ’’ అనేది వాటిలో ఒక అద్భుత గీతం. ఇది డబ్బింగ్ పాట అనిపించదు. ముఖ్యంగా రెండవ చరణంలో ‘’ఆశలు రాలే శిశిరంలో ఆమని నీవై వెలిశావు… ఆలూ మగల అద్వైతానికి అర్ధం నీవై నిలిచావు’’ అంటూ ముక్తాయించడం వెన్నెలకంటికే చెల్లింది. రెండవది ‘’నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు’’ అంటూ బాలు ఆలపించిన పాట. తమిళ మాతృకలో దఫాదఫాలుగా వచ్చే ఈ పాట ఒకేమూసలో వుంటుంది. కానీ వెన్నెలకంటి ఈ పాటలో ఒక అద్భుత ప్రయోగం చేశారు. ‘’ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు’ అనే వాక్యాన్ని ప్రతి చరణం చివర వచ్చేటట్లు చరణాలు రాశారు. ‘’ఉదయించు సూరీడు నిదురించెనే నేడు” ; ‘’ఓ చుక్క రాలింది ఓ జ్యోతి ఆరింది; ‘’నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు’’ అనే పదప్రయోగాలతో “ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు” అంటూ చేసిన ప్రయోగం ప్రశంసలు అందుకుంది. ఎందుకో ఈ అద్భుత కవికి డబ్బింగ్ చిత్రాల రచయితగా పేరు నిలిచిపోయింది. ఆయన ఎన్నో స్ట్రెయిట్ చిత్రాలకు బాగా ప్రాచుర్యం పొందిన పాటలు రాశారు.

స్ట్రెయిట్ చిత్రాల్లో రాణించిన కొన్ని పాటల విశేషాలు…

వెన్నెలకంటి స్ట్రెయిట్ చిత్రాలకు అద్భుతమైన పాటలు రాశారు. సందర్భానికి అనుకూలంగా, సాహిత్యానికి అనుగుణంగా రాసిన పాటలు అద్భుతాలనే చెప్పాలి. 1988 లో నిర్మాత స్రవంతి రవికిషోర్ వంశీ నేతృత్వంలో నిర్మించిన ‘మహర్షి’ చిత్రంలో వెన్నెలకంటి మరొక అద్భుత ప్రయోగం చేశారు. పదాలలో ఇమడ్చలేని ప్రేమభావాలను ఆ పాటలో గుప్పించారు. ‘’మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది… గానమిదీ నీ ధ్యానమిదీ, ధ్యానములో నాప్రాణమిదీ … ప్రాణమైన మూగ గుండె రాగమిదీ’’ అంటూ ముక్తపదగ్రస్తంలో పల్లవి మొదలవుతుంది.. (మొదటి పంక్తిలోని చివరి పదాన్ని రెండవ పంక్తి లో మొదటి పదంగా వాడడం ముక్తపదగ్రస్త లక్షణం) చరణంలో ‘’ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా… ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎప్పుడమ్మా’’ అంటూ రాశారు. ‘ముద్దారబోయటం’, ‘నవ్వుల్లో వెన్నెలదీపాలు పెట్టడం ఎంతమంచి ప్రయోగం! ఇళయరాజా ఇచ్చిన ట్యూను కి రాసిన ఈ పాట ఎంత అద్భుత హిట్టో తెలిసిందే కదా! పైగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వెన్నెలకంటి రాసిన మొదటి పాట ఇది కావడం విశేషం. 1989లో వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘చెట్టుకింద ప్లీడరు’ చిత్రంలో ఒక డొక్కు కారును గురించి పొగడ్తలతో ఒక పాటను నింపి హాస్యానికి పెద్ద పీట వేశారు వెన్నెలకంటి. ఆ పాట ‘’చల్తీ కా నామ్ గాడీ, చలాకీ వన్నె లేడీ, రంగేళి జోడీ… బంగారు బాడీ… వేగంలో చేసెను దాడీ, వేడెక్కి ఆగెను ఓడి… అహో… ఇక ముప్పల తిప్పలు తప్పవా తప్పవా’’ అంటూ పల్లవి సాగుతుంది. ‘’అశోకుడు యుద్ధంలోన వాడింది ఈ కారు.. శివాజీ గుర్రం వీడీ ఎక్కింది ఈ కారు” అంటూ చరణంలో పలికే ప్రగల్భాలు సినిమాలో బాగా పండాయి. ఈ పాటనే స్ఫూర్తిగా తీసుకొని ఆరేళ్ల విరామం తరువాత ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో వంశీ “వెన్నెల్లో హాయ్‌.. హాయ్‌’’ పాటను చక్రి చేత ట్యూన్‌ చేయించుకున్నారు. ఇదే సినిమాలో వెన్నెలకంటి రాసిన “అల్లిబిల్లి కలలా రావే.. అల్లుకున్న కథలా రావే.. మల్లెపూల చినుకై రావే.. పల్లవించి పలుకై రావే” అనే ప్రేమ గీతంలో ‘‘జావళీలు పాడే జాణ.. జాబిలమ్మ తానై’’ అనే ప్రయోగం అంటే వంశీకి చాలా ఇష్టం. మరో వంశీ సినిమా ‘ఏప్రిల్ 1 విడుదల’ (1991)లో వంశీ మొదట సిరివెన్నెల చేత ‘‘నిజమంటే నిప్పేకాదా.. ముట్టుకుంటే చుట్టుకోదా” అనే పాటను రాయించారు. ఈ పాటను మనో పాడగా రికార్డు కూడా విడుదలైంది. వంశీకి వైవిధ్యం కావాలి. ప్రాస కుదరాలి. ‘మంచీ-చెడు’ సినిమాలో ఆత్రేయ రాసిన ‘‘రేపంటి రూపం కంటి.. పూవింటి తూపుల వంటి.. నీ కంటి చూపుల వెంట నా పరుగంటి’’ పాటలా సాగిపోవాలి అంటూ వెన్నెలకంటిని పిలిపించి రెండు చరణాలకు రెండు సీన్లు ఇచ్చారు. పాట డైలాగుల్లా కాకుండా పాట రూపంలో ఆ రెండు సీన్లు రావాలి అని షరతుపెట్టి, పాట రాయమన్నారు. అన్నీ నిజాలే చెప్తే వచ్చే అనర్ధాలను పాట రూపంలో వెన్నెలకంటి మలిచారు. ‘‘మాటంటే మాటేనంట.. కంటబడ్డ నిజమంతా అంటా… రుజువంటూ దొరికిందంటే…గంటకొట్టి చాటేస్తూ ఉంటా’’ అనే పల్లవిని రాజేంద్రప్రసాద్‌కు, ‘‘నిజమంటే తంటాలంటా.. నిక్కుతుంటే తిక్క దిగుతాదంటా.. మొదలంటూ చెడతావంట.. వెంటబడి తెగ తంతారంట’’ అనే పల్లవిని శోభనకు పల్లవులుగా రాశారు. ఈ డ్యూయట్ ను బాలు, చిత్ర లతో పాడించి వంశీ చిత్రీకరణ జరిపారు. చూస్తున్నదే వింటున్నట్లు, వింటున్నదే చూస్తున్నట్లు రాయడంతో వెన్నెలకంటి రాసిన ఆ పాట బాగా పాపులర్‌ అయ్యింది. ఆదిత్య 369‘ చిత్రంలో వెన్నెలకంటి రాసిన “రాసలీల వేళ రాయబారమేల … మాటే మౌనమై మాయజేయనేల” పాట సూపర్ హిట్టయిన విషయం తెలియంది కాదు. అలాగే ‘సమరసింహారెడ్డి’ చిత్రంలో వెన్నెలకంటి రాసిన “రావయ్యా ముద్దుల మామా నీకు రాసిస్తా రాయలసీమ’’ కూడా పెద్ద హిట్టు. రాయలసీమ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో “నీకు రాసిస్తా రాయలసీమ’’ అని రాయడం ఎంత సబబుగా వుందో కదా! వెన్నెలకంటి శైలి ఆచార్య ఆత్రేయ శైలిని పోలి వుంటుంది. అలాగే వేటూరి అభివ్యక్తి కూడా ఆయన పాటల్లో కనిపిస్తుంది.

విజయా సంస్థలో…

సంగీతానికి ఇంటిపేరు సాహిత్యం అని వెన్నెలకంటి అభిప్రాయం. ఆ నానుడి విజయా వారు నిర్మించిన అన్ని సినిమాలకూ వర్తిస్తుంది. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్‌ ‘‘షిర్డీ సాయి’’ ఆల్బం కోసం వెన్నెలకంటి చేత నాలుగు పాటలు రాయించారు. ఆ పాటల సాహిత్యం విన్న సింగీతం శ్రీనివాసరావు వెన్నెలకంటిని మెచ్చుకొని ‘బృందావనం’ సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. 17 యేళ్ల విరామం తరువాత విజయా వారు నిర్మించిన ఈ సినిమాకి పింగళి నాగేంద్రరావు లాగే సింగిల్ కార్డ్ రైటర్ గా పాటలు మొత్తం వెన్నెలకంటి గారే రాయడం విశేషం.. ‘’మహానుభావులు పింగళి, ఘంటసాల, పెండ్యాల కూర్చొని పాటలు రాసి మట్లు కట్టిన చారిత్రాత్మక గదిలో కూర్చొని పాటలు రాసినప్పుడు ఒళ్లు పులకించిం’’దని వెన్నెలకంటి చెప్పుకున్నారు. ఈ పాటలకు స్వరాలు అల్లడానికి నలభై రోజులు పట్టింది. ముఖ్యంగా ‘‘మధురమే సుధా గానం.. మనకిదే మరో ప్రాణం.. మదిలో మోహన రాగం.. మెదిలే తొలి సంగీతం’’ పాట విజయా వారి ‘ట్రేడ్‌ మార్క్‌’ పాటగా గుర్తింపు తెచ్చుకుంది. ‘‘ఓహో ఓహో బుల్లి పావురమా.. అయ్యో పాపం అంటే అది నేరమా.. అతివలకింత పంతమా.. అలకలు వారి సొంతమా’’ అంటూ బాలు, ‘‘పదే పదే వెటకారమా.. అతివలు అంత సులభమా.. శ్రుతి ఇంక మించనీకుమా’’ అని జానకి ఆలపిస్తారు. ఈ వరసలు విన్న రావి కొండలరావు, సింగీతం శ్రీనివాసరావు, ‘’బాబ్జీ! ‘అబ్బా!! మళ్లీ పింగళి గారు కనిపిస్తున్నారయ్యా’’ అంటూ మిస్సమ్మ సినిమాలో పింగళివారి ‘‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’’ పాటను గుర్తు చేసుకున్నారు. ‘’అంతకు మించిన అవార్డు నాకేం కావాలి’’ అంటూ ఉప్పొంగిపోయారు వెన్నెలకంటి. అందులోవే ‘‘ఆ రోజు నారాణి’’, ‘‘అబ్బో ఏమివింత’’, ‘‘మా మామయ్యా’’ పాటలు కూడా. సింగీతం దర్శకత్వం నిర్వహించిన ‘ఆదిత్య 369’లో వెన్నెలకంటి రాసిన ‘‘రాసలీల వేళ రాయబారమేలా.. మాటే మౌనమై మాయజేయ నేలా’’ పాటను సాధన చేసి రికార్డింగుకు సిద్ధమౌతూ బాలు, సింగీతంతో “ఈ పాట చాలా బాగా వచ్చిందండీ” అంటే… సింగీతం ‘‘నేను ఈ కుర్రాణ్ణి చెడగొడదామనుకున్నాను. అతను చెడిపోకపోగా చాలా అద్భుతంగా పాట రాశాడు. నాకు పింగళి గారితో రాయించుకున్న ఫీలింగు కలుగుతోంది’’అన్నారు.

కళాతపస్వి తో…

దర్శకుడు విశ్వనాథ్ చిత్రం ‘స్వాతికిరణం’ లో సి. నారాయణరెడ్డి, సిరివెన్నెల కలిసి 11 పాటలు రాశారు. విశ్వనాథ్‌ వెన్నెలకంటిని పిలిచి ‘‘ఈ సినిమాలో ప్రధానమైన పాటలన్నీ అయిపోయాయి. బాలనటుడు చెట్లవెంటా, గట్లమీదా తిరుగుతూ పాడుకునే ఒక పాట నువ్వు రాయాలి’’ అన్నప్పుడు ‘‘మహద్భాగ్యం’’ అనుకున్నారు వెన్నెలకంటి. విశ్వనాథ్‌తో పనిచెయ్యడమే ఒక వరంగా భావించి ‘‘కొండా కోనల్లో లోయల్లో…గోదారి గంగమ్మా సాయల్లో.. కోరి కోరి కూసింది కోయిలమ్మ..’’ అని పల్లవి మొదలెట్టి ‘‘నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా.. రివ్వున గువ్వే సాగంగా.. నవ్వే మువ్వై మోగంగా.. ఉంగా ఉంగా రాగంగా.. ఉల్లాసాలే ఊరంగా.. ఊపిరి ఊయలలూగంగా… రేపటి ఆశలు తీరంగా.. తెనుగుతనం నోరూరంగా… తేటగీతి గారాబంగా.. ఝుమ్మని తుమ్మెద తియ్యంగా కమ్మని రాగం తీయంగా’’ అంటూ చరణాలు రాశారు ‘‘అలతి పదాలతో ఎంత కమ్మగా పాట రాశావయ్యా’’ అని విశ్వనాథ్‌ మెచ్చుకుంటుంటే వెన్నెలకంటి గొప్ప అనుభూతికి లోనయ్యారు.

స్ట్రెయిట్ చిత్రాలకు డబ్బింగ్ చిత్రాలకు గల వ్యాత్యాసాన్ని వెన్నెలకంటి ఎలా విశ్లేషించారంటే…

స్ట్రైయిట్‌ సినిమాల్లో సన్నివేశానికి, ట్యూనుకి సంబంధించిన పరిమితులు మాత్రమే ఉంటాయి. డబ్బింగు సినిమాల్లో కట్టుబాట్లు ఎక్కువ. పెదవుల కదలికలకు సంబంధించిన ఆంక్షలు. ముఖ్యంగా క్లోజప్‌ షాట్లు ఉన్నప్పుడు పాట రాయడానికి శ్రమించాలి. ప, ఫ, బ, భ, మ వచ్చిన చోటల్లా పెదాల కదలికతో కవి రాసే పదాలు కలవాలి. అదే మాటల విషయానికొస్తే, ఒక ఫ్లోలో డైలాగులు చెపుతూ ఉంటారు కనుక రెండు మూడు చోట్ల అటూ ఇటూ లిప్‌ పోయినా పెద్దగా తెలియదు. కానీ పాట విషయానికొస్తే, పాట ఎప్పుడూ సస్టైన్డ్‌గా ఉంటుంది. ఉదాహరణకు ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో ‘‘సన్నజాజి పడకా’’ తమిళ వర్షన్‌ పాటలో ‘‘ఇంజి ఈడు ప్పళఘ.. మంజ తవ ప్పళఘ.. కళ్ళ నీరి ప్పళఘ.. మరక్క మనం గూడు దిల్లయే’’ అని ఉంది. ఇక్కడ ‘‘సిరిప్పు + అళఘ’’ సంధి కలిపితే ‘ప్పళఘ’ అవుతుంది. ఆ పదం సింక్‌ అయ్యేలా ‘‘సన్నజాజి పడకా.. మంచెకాడ పడకా.. చల్లగాలి పడకా.. మాట వినకుందీ ఎందుకే’’ అంటూ మూడు పడకలా అర్థం వచ్చేలా వెన్నెలకంటి పాట రాశారు. డబ్బింగ్‌ పాటను లిప్, యాక్షన్, ట్యూన్, సిచువేషన్‌ రిస్ట్రిక్షన్లను పాటిస్తూ రాయాల్సి ఉంటుందంటారు ఆయన. అన్నిటికీ మించి ఆ పాటలో తెలుగుతనం (నేటివిటీ) కనిపించేలా రాయాలి అనేదే వెన్నెలకంటికి వున్న తపన.

వెన్నెలకంటి డబ్బింగ్ పాటలు…

‘గజినీ’ సినిమాలో ‘‘హృదయం ఎక్కడున్నదీ.. నీ చుట్టూనే తిరుగుతున్నదీ’’ పాట రెండు సంవత్సరాలు మారు మోగిపోయింది. ఇందులో ‘చుట్టూ విళీ చూడరే’’ (నిప్పులాంటి చూపు నన్ను కాల్చేస్తోంది అని అర్థం) అనే తమిళ లైన్‌కు ‘‘అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ’’ అంటూ .. ‘చూపులన్నీ వెతికా, చూపుల్లోనే బతికా కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా’’ అని ముక్తాయించారు. నిజానికి తమిళ మాతృకలోని పల్లవి చివరి లైనులో ‘’ఉన్నాలే కన్ విళిత్తు సొప్పనమ్ కండేన్’’‘ అని ఉకారంతో ఆ పదానికి వెన్నెలకంటి ‘’తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా’’ అని రాస్తే లిప్ మూవ్మెంట్ కు అతికినట్లు సరిపోయింది. ఇది డబ్బింగ్ పాటే అయినా చరణాలతో సహా కుర్రాళ్ల నాలుకలమీద చాలాకాలం ఆడుతూనే వుండేది. కారణం అది హృదయానికి సంబంధించిన పాట కావడం. రజనీ కాంత్ డూపర్ హిట్ ‘చంద్రముఖి’ సినిమాలో ముందు విజువల్‌ చూడకుండా వెన్నెలకంటి పాట రాశారు. సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ ఆయనకు మంచి మిత్రుడు. ఆ పాట అతనికి నచ్చింది. ‘‘విజువల్‌ ఉందా’’ అని వెన్నెలకంటి అడిగితే ఇచ్చి చూడమన్నారు. తమిళ వర్షన్‌లో ‘‘కాలం’’ అనే మాట ఒకసారే వస్తుంది. కానీ వెన్నెలకంటి ‘‘కాలం’’ మీద పూర్తి ప్రయోగం చేస్తూ. ‘‘కొంత కాలం కొంత కాలం కాలమాగిపోవాలి – నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి.. ఎంత కాలమెంత కాలం హద్దు మీరకుండాలి – అంత కాలమంత కాలం ఈడు నెట్టునాపాలి’’ అని పల్లవి రాసి చరణాలను కూడా ‘‘కాలం’’తో కలిపారు. ఆ గమనం చాలా బాగుంటుంది. ‘’మదనుడికి పిలుపు మల్లె కాలం, మదిలోనే నిలుపు ఎల్లకాలం, చెలరేగు వలపు చలి కాలం, కలనైన తెలుపు కలకాలం, తొలి గిలి కాలం, కౌగిలి కాలం… మన కాలం ఇది’’ అంటూ కాలంతో ఆడుకున్నారు వెన్నెలకంటి. వెన్నెలకంటి ఎన్టీఆర్‌ అభిమానిని. ‘భాషా’ సినిమాలో అన్నమీద ఉన్న అభిమానాన్ని ఆయన వాడుకున్నారు. ‘‘నేను ఆటోవాణ్ణి, ఆటోవాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి – న్యాయమైన రేటు వాణ్ణి.. ఎదురులేని ఆటగాణ్ణి’’ అంటూ ‘‘మంచోళ్లకు మంచివాణ్ణి.. తప్పుడోళ్ల వేటగాణ్ణి.. అచ్చమైన తెలుగువాణ్ణి’’ అంటూ తెలుగుదనం ఆ డబ్బింగ్ పాటలో నింపారు. అది ఎంత హిట్టయిందో మీకు తెలుసు. ‘మహానది’డబ్బింగ్ చిత్రంలో వెన్నెలకంటి రాసిన ‘‘శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే చూడరే.. శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడరే – నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా…కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా’’ అనే పాటను విశ్వనాథ్‌ టీవీలో చూసి, వెన్నెలకంటికి ఫోన్‌ చేసి ‘‘ఈ పాట డబ్బింగ్‌ పాటలా లేదు. కీప్‌ ఇట్‌ అప్‌’’ అంటూ అభినందించారు. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యూయట్’ చిత్రానికి వెన్నెలకంటి మాటలు, పాటలు సమకూర్చారు. అందులో ‘’అంజలి అంజలి పుష్పాంజలి…పూవంటి పదములకు పుష్పాంజలి, ముద్దైన పెదవులకు మోహాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి’’ అంటూ రాసిన పాట సాహిత్య పరంగా, సంగీత పరంగా గొప్ప కీర్తిని ఆర్జించింది. మూలంలో లేని అందమైన అభివ్యక్తులు వెన్నెలకంటి కలంలో పలుకుతాయి. అలాగే కమలహాసన్ చిత్రం ‘దశావతారం’ (2008)లో ‘’రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు… హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే, అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే’’ అని రాసి మెప్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే యెన్నో మధురానుభూతులు వెన్నెలకంటి మదిలో వున్నాయి. వెన్నెలకంటి పాటలు రాసిన డబ్బింగ్ సినిమాలు గుణ, క్షత్రియపుత్రుడు, మహానది, డ్యూయట్, బాషా, తెనాలి, పోతురాజు, పందెం కోడి, దశావతారం … ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో!

మరిన్ని విశేషాలు…

వెన్నెలకంటి బాలు గారిని తల్లి, తండ్రి, గురువు, దైవంగా భావిస్తారు. భార్గవ్ ఆర్ట్స్ నిర్మాత ఎస్. గోపాలరెడ్డి (అదృష్టం కొద్దీ తిరుపతి వ్యవసాయ కళాశాలలో ఆయన నాకు రెండు సంవత్సరాల సీనియర్, ‘ఒరే’ అని పిలుచుకునేంతటి చనువు)కి వెన్నెలకంటిని పరిచయం చేసింది బాలు గారే! ‘’మన నెల్లూరు కుర్రాడే. బాగా రాస్తున్నాడు. ఏదైనా అవకాశం ఇచ్చి చూడు’’ అని పరిచయం చేశారు. ఆ పరిచయంతో వెన్నెలకంటి గోపాలరెడ్డిని కలిశారు. అపుడు గోపాలరెడ్డి ‘ముద్దుల మామయ్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పట్లో భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ కు సి. నారాయణరెడ్డి గారే పాటలు రాస్తుండేవారు. ఈ సినిమాకు కావలసిన పాటలన్నీ అప్పటికే గోపాలరెడ్డి రాయించేసి వున్నారు. అయితే ఒక్క పాట మాత్రమే మిగిలి వుండడంతో ఆ సన్నివేశాన్ని కోడి రామకృష్ణ వివరించగా వెన్నెలకంటి పాట రాశారు. అది ఒక అన్నయ్య తన చెల్లెలి శ్రీమంతంలో పాడే పాట. ఆ పాటే బాలు, శైలజ ఆలపించిన సూపర్ హిట్టయిన ‘’మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు’’ అనేది. అందులో ‘’కమ్మగా పాడనా కంటిపాప జోల’’ అనే చరణం గోపాలరెడ్డి కి ఎంతగా నచ్చిందో చెప్పలేం. వెన్నెలకంటి రాసిన ఈ పాటకు మహదేవన్ అద్భుతంగా ట్యూను కట్టారు. తరవాత గోపాలరెడ్డి బ్యానర్ కు వెన్నెలకంటే సింగిల్ కార్డ్ రైటర్ అయ్యారు.

వెన్నెలకంటి కేవలం పాటలకు మాత్రమే పరిమితం కాలేదు. హిందీ, తమిళ, కన్నడ, మలయాళ మాతృకల డబ్బింగ్ వర్షంలకు మాటలు, పాటలు కూడా రాశారు. ‘జూరాసిక్ పార్క్’ తో ఆరంభించి అనేక ఆంగ్ల సినిమాలకు మాటలు సమకూర్చారు. ‘భామనే సత్యభామనే’ లో మూగవాడైన వంటవాడికి, యజమానికి మధ్య అవగాహన సాధించే సన్నివేశానికి మాటలు సమకూర్చడం, ‘పందెం కోడి’ చిత్రంలో మూడక్షరాల పదాలతో దేశాభిమానాన్ని చాటడం, వెన్నెలకంటి రాసిన మాటల సరళికి మెచ్చు తునకలు. ‘సాహసం’, ‘ఇదండీ మావారి వరస’ చిత్రాలకు కథ సమకూర్చారు. రెండువేల ఐదు వందలకు పైగా పాటలు రాసిన వెన్నెలకంటి కి ఇద్దరు కుమారులు. శశాంక్ కూడా సినిమాలకు మాటలు, పాటలు రాస్తున్నారు. అలాగే చిన్న కొడుకు రాకేందు మౌళి కూడా డబ్బింగ్ సినిమాలకు మాటలు పాటలు సమకూర్చుతున్నాడు. 2000 సంవత్సరంలో ‘రాఘవయ్యగారి అబ్బాయి’ చిత్రంలో వెన్నెలకంటి రాసిన ‘’రుద్రభూమి యుద్ధభూమి’’ అనే పాటకు నంది బహుమతి లభించింది. వేటూరి మెమోరియల్ అవార్డు, మహాకవి శ్రీశ్రీ అవార్డు, ఆచార్య ఆత్రేయ అవార్డు, సముద్రాల రాఘవాచార్య అవార్డు, పింగళి నాగేంద్రరావు అవార్డు వెన్నెలకంటికి లభించాయి. విశాఖపట్నం మహాకామేశ్వర పీఠ సంస్థాన్ వారు ప్రతిభా పురస్కారంతో సత్కరించారు. తుంగా రాజగోపాలరెడ్డి లిటరరీ అవార్డు కూడా వెన్నెలకంటి స్వీకరించారు. ‘వెన్నెలజల్లు’ పేరుతో యు ట్యూబు చానల్లో వెన్నెలకంటి సినీ విశేషాలను ధారావాహికంగా ప్రసారం చేశారు.

క్షత్రియపుత్రుడు’ (1992) డబ్బింగ్ చిత్రంలో వెన్నెలకంటి ‘’సన్నజాజి పడకా… మంచెకాడపడకా… చల్లగాలి పడకా… మాట వినకుంది ఎందుకే’… అడిగితే సిగ్గేసింది… సిగ్గులో మొగ్గేసింది… మొగ్గలా బుగ్గే కందిపోయెనే’’ అనే పాటను ఎంత అద్భుతంగా రాశారో విన్నవారికి తెలిసే వుంటుంది. ఇళయరాజా ఇచ్చిన ట్యూనుకు రాసిన పాట ఇది. ఇందులో అద్భుత సాహిత్యాన్ని గుప్పించారు వెన్నెలకంటి. అది డబ్బింగ్ పాటైనా ఎంత శ్రద్ధగా రాస్తారో చెప్పేందుకే ఈ ఉదాహరణ. ‘’కొండమల్లివ్వులన్నీ గుండెల్లోని నవ్వులన్నీ దండే కట్టి కాచుకున్నా నీకొరకే’’ అని వెన్నెలకంటి ఎందుకు రాశారంటే ఇందులోని హీరోయిన్ ఒక పల్లెపడుచు. కవిత్వ ధోరణిలో పాట పాడలేదుకదా! అందుకేనన్నమాట అలతి పదాల పొందిక. ‘’పండువెన్నెలంటి ఈడు ఎండలోన చిన్నబోతే పండించగా చేరుకున్నా నీదరికే’’ అంటుంది హీరోయిన్. ఎందుకంటే ఆమె ఈ పాట పాడేది పంటచేలల్లోని మంచె కాడ! అంతేనా ‘’అండ దండ నీవేనని పండగంతా నాదేనని ఉండి ఉండి వూగింది నా మనసే’’ అంటూ ‘’దిండే పరిచే వేళయ్యింది రావే’’ అని గుంభనంగా మనసులోని మాటను వెలిబుచ్చుతుంది. వెన్నెలకంటి గారి శృంగార రచనా చమకృతి, శైలి ఎలావుంటుందో…. అంటే ఇలాగే వుంటుంది. ఎక్కడా అసభ్య పదజాలం తన కవిత్వంలో దొరలనివ్వని స్వచ్చకవి వెన్నెలకంటి.

మరొక్క విశేషం…. ఇళయరాజా సాధారణంగా ఇతర సంగీత దర్శకుల ట్యూన్లను అనుకరించరు, కానీ విచిత్రమేమిటంటే ఈ పాటలో ‘ఇష్క్ పర్ జోర్ నహీ’ (1970) చిత్రంలో సచిన్ దేవ్ బర్మన్ స్వరపరచిన ‘’ఏ దిల్ దివానా హై… దిల్ తో దివానా హై… దిల్ దీవానా’’ అనే పాటను ప్రేరణగా తీసుకున్నారు. ఆ పాటలో ‘’బే చైన్ రెహతాహై… చుప్కే సే కెహతా హై… ముఝ్ కో ధఢక్ నే దో… షోలా భడక్ నే దో’’ అనే చరణాన్ని ప్రేరణగా తీసుకొని ‘’కొండమల్లివ్వులన్నీ గుండెల్లోని నవ్వులన్నీ దండే కట్టి కాచుకున్నా నీకొరకే’’ అంటూ వెన్నెలకంటి చరణాన్ని అద్భుతంగా మలిచారు ఇళయరాజా. విశేషమేమిటంటే… ఈ పాట పల్లవికి, హిందీ పాట పల్లవికి ఎలాంటి పోలిక లేకపోవడం.

వెన్నెలకంటిగారంటే ఇళయరాజాకు ఎంత ఇష్టమో చెప్పలేం. ఆయన సంగీతంలో కొన్ని స్ట్రెయిట్ చిత్రాలకు, ఎక్కువభాగం అనువాద చిత్రాలకు పాటలు రాసే అవకాశం వెన్నెలకంటి గారికి దక్కింది. అయ్యప్ప స్వామి భక్తి గీతాలను వెన్నెలకంటి గారి దగ్గర వుండి రాయించుకోవడమే కాకుండా, శ్రీ రమణ మహర్షి జయంతి సందర్భంగా వెన్నెలకంటి గారిచేత భక్తి గీతాలు రాయించి, రికార్డుచేసి, అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి ఆ పాటల CD ని ఆవిష్కరించి, ఆశీర్వాదాన్ని వెన్నెలకంటి గారికి ఇళయరాజా ఇప్పించారు.

ముక్తాయింపు…

నేను ‘ఆమనీ పాడవే’ పేరిట సంకలనం చేసిన ఇళయరాజా పుస్తకానికి ముందుమాట రాసిన వెన్నెలకంటి గారికి సర్వదా కృతజ్ఞుణ్ణి. నా దృష్టిలో ‘గుణ’ డబ్బింగ్ చిత్రంలో వెన్నెలకంటి రాసిన ‘’పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలుబొమ్మలాటలోన ఎప్పుడింక ఆటవిడుపు… ఓ తమ్ముడా చెప్పుకుంటే జాలిగొలుపు… ఈ పుట్టుటేమో గిట్టుటేమో చిత్రమేమో చెప్పలేని సంశయాల మేలుకొలుపు… ఓ తమ్ముడా సంకటాల బ్రహ్మతలపు’’ అనే పాటకు జాతీయ బహుమతి రావాలి!! కానీ, డబ్బింగ్ పాటలకు ఆ బహుమతి లభించే అవకాశం లేదుకనకే ఆ పాత సాహిత్యం పరిశీలనకు నోచుకోలేదు.

చిన్న వయసులోనే వెన్నెలకంటి కాలం చేయడం, తెలుగు సినీ సాహిత్యానికి తీరని లోటు!

-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap