రానా, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్” అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న ‘విరాటపర్వం’ను ఏప్రిల్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మేకర్స్ ముందుగా ప్రకటించినట్లుగానే గురువారం సాయంత్రం ఈ మూవీ టీజర్‌ను మెగాసార్ట్ చిరంజీవి విడుదల చేశారు.
“ఆధిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు..
తారతమ్య గోడలనే పెకిలించగ ఎన్నినాళ్లు..
దున్నేటోడి వెన్నువిరిచి భూస్వాములు ధనికులైరి.” అంటూ
రానా బ్యాగ్రౌండ్‌లో ఆవేశంగా కవిత్వం చెప్తుండగా, ఆ కవిత్వాన్నే రాస్తూ రానా కనిపిస్తుండగా, టీజర్ మొదలైంది. ఆ లైన్లు వినిపిస్తుండగానే చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతూ ఇద్దరు వ్యక్తులు, వారిని చూసి గుండెలు బాదుకుంటూ జనం కనిపిస్తున్నారు.
ఆ తర్వాత, “ప్రియమైన అరణ్య.. నీకు నేను అభిమానిని ఐపోయాను. నీ కవిత్వం చదువుతుంటే నాలో తెలీని భావోద్వేగం రగులుతోంది. మీరాబాయ్ కృష్ణుడి కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను వదిలేసి వెళ్లిపోయిందో.. అలా నేనూ నీకోసం వస్తున్నాను.” అని చెప్తూ సాయిపల్లవి లేఖ రాస్తున్న విజువల్స్ కనిపించాయి.
“చరిత్రలో దాగిన కథలకు తెరలేపిన ప్రేమ ఆమెది” అనే అక్షరాలు ప్రత్యక్షమయ్యాక బస్సులో ప్రయాణిస్తూ కనిపించింది సాయిపల్లవి. అంటే ఆమె తన ఇంటిని వదిలేసి రానాను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిందని అర్థమవుతోంది. ఈసారి “ఆమె ప్రేమ.. అలౌకికం.. ఆత్మికం.. అపురూపం” అనే అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ వెంటనే రానా, ప్రియమణి బృందం పోలీసులను ఎదుర్కొని వాళ్లను తమ గన్స్‌తో కాల్చడాన్ని మనం చూడొచ్చు. “ఆపైన అనల మార్గాన ఉరిమిన రహస్యోద్యమం ఆమె జీవితం” అనే అక్షరాలు వచ్చాయి.
సాయిపల్లవి పోలీసులకు చిక్కింది. ఒక పోలీసు ఆమె చేతుల్ని పైకి విరిచిపట్టుకోగా, మరో పోలీసు ఆమెను ఒంటిని శోధించాడు. సాయిపల్లవి భయవిహ్వలగా మారింది.
పోలీసులు, నక్సలైట్ల మధ్య పోరు సాగుతుంటే వాళ్ల మధ్య సాయిపల్లవి పరుగులు పెట్టింది.
చివరి సీన్‌లో పరుగెత్తుతూ.. మనకు కనిపించని వ్యక్తి మీద రాయివిసురుతూ, “దొంగ .. కొడకా” అని సాయిపల్లవి అరవడం, ఆమెను ఆపడానికి ఈశ్వరీ రావ్ ప్రయత్నించడం చూడొచ్చు.
ఒకటిన్నర నిమిషాల ‘విరాటపర్వం’ టీజర్‌ను చూస్తుంటే ఒకవిధమైన భావోద్వేగం ఒంటిని ఊపేస్తుందనేది నిజం. టీజర్‌లో జాతీయ ఉత్తమనటి నందితా దాస్ కూడా కనిపించారు.
ఇప్పటివరకూ ‘విరాటపర్వం’పై ఉన్న అంచనాలు ఒక ఎత్తయితే, టీజర్ తర్వాత వెల్లువెత్తుతున్న అంచనాలు మరో ఎత్తని చెప్పవచ్చు. టీజర్‌తో ఒక్కసారిగా సినిమాపై అనూహ్యంగా అంచనాలు పెరిగిపోయాయి.
వేణు ఊడుగుల ఈ సినిమాతో మరో స్థాయిని అందుకుంటాడని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు.
ఇక పర్ఫార్మెన్స్ పరంగా రానా, సాయిపల్లవి విరాటపర్వంతో మరింత పేరు తెచ్చుకోవడం ఖాయం. డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సంయుక్త సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ ఈ సినిమాకు ఎస్సెట్ కానున్నాయి.
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
https://www.youtube.com/watch?v=IUWwtXjtsLY
తారాగణం:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి