కవిత్వం సజీవ సృజన సాయుధం

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా… ప్రత్యేకం
ప్రపంచం ఒక పద్మవ్యూహం… కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నిజమే కవిత్వమనేది లలిత కళల్లో ఒకటే అయినా … దాని ప్రభావం మాత్రం అణువిస్ఫోటానికి సమానంగా ఉంటుంది. అసలా శక్తంతా అక్షరానిదే. అక్షరంలో దాగిన ఆ శక్తి కవిత్వ రూపంలో విస్ఫోటం చెంది సామాజిక రుగ్మతలపై నిప్పుకణికల్లా పడి నిలువునా దహించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఓవైపు సమాజాన్ని అలా చైతన్యపరుస్తూ మరోవైపు మమతల తీగెలకు అనురాగాలను పూయిస్తూ సంతోష ఫలాలను కూడా అందించే బాధ్యత కవిత్వమే చేపట్టింది. అలా సమాజాన్ని చైతన్యపరుస్తూ.. సంతోష ఫలాలను అందించే కవులు, రచయితలు ప్రపంచ సాహిత్యంలో ఎందరెందరో ఉన్నారు. వారందరికీ ప్రపంచ కవితా దినోత్సవం (మార్చి 21) సందర్భంగా… రా.శే.కలం సలామ్ చేస్తోంది…. మనిషిని మేల్కొలిపే, సంస్కృతిని కాపాడే, భాషను పరిరక్షించే కవిత్వంపై ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందిస్తున్న ప్రత్యేక కథనం.
భరతావనిలో….
భారత జాతీయోద్యమంలో జాతిని మేల్కొలిపింది కవిత్వమే. చిలకమర్తి వారి ‘భరత ఖండంబు చక్కని పాడియావు’ వంటి పద్యాలు, గరిమెళ్ళ వారి ‘మాకొద్దీ తెల్ల దొరతనమంటూ’ సాగిన గేయం జాతిని ఉద్యమం వైపు పరుగులు తీయించాయి. తర్వాత వచ్చిన ఎన్నెన్నో ఉద్యమాల్లో ఓ ఆయుధమై దారి చూపే దివిటీ అయి తరతరాలుగా కవిత్వం కాంతులీనుతోంది.

సృజనశీలతే కవిత్వం
నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటారు. కవిత్వం ఒక సృజనశీలతో సాగే సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. సాధన ద్వారా కవిత్వాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కవిత్వం అంటే అక్షర హింస కాదు. అక్షరాల కుంటి నడక అంతకంటే కాదు. కవిత్వం అంటే అక్షర తాండవం. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు కవిత్వానికి తీరని హాని చేస్తాయి. కవిత్వంలో చెప్పేదేదైనా బలంగా ఉండాలి. కవిత్వం రాసేవారిని కవులు, కవయిత్రులు అంటారు. ఇక ఈ క్షణంలో ఈ కవిత రాయకపోతే చచ్చిపోతాం అన్నంత ఆవేశం వస్తేగానీ ఒక మంచి కవిత జన్మించదు. కవిత పాఠకుడిని కదిలించడానికి ముందు కవిని కదిలించాలన్న విషయం మర్చిపోకూడదు. ఒకరు రాయమంటే రాసేది కవిత్వం కాజాలదు. ఆకలియే కవిత్వం ఆలోచనయే కవిత్వం కదిలించే ఘటనలు, కవ్వించే ప్రతినలు కవితకు ప్రతిపాదికలు. కవిత్వంలో రకాలు…అభ్యుదయ, విప్లవ కవిత్వం, భావ కవిత్వం కాల్పనికత కవిత్వం .కవిత్వం పై ప్రముఖుల వ్యాక్యలు….ఇలా…
శ్రీశ్రీ:కవిత్వ మొక తీరని దాహం
ఆధునిక కవిత్వం అర్థం కాలేదంటే, ఆధునిక జీవితం అర్థం కాలేదన్నమాటే…

గుర్రం జాషువా: వడగాడ్పుల నా జీవితం. వెన్నెల నా కవిత్వం…

దాశరథి క ష్ణమాచార్య: అబద్ధాలాడడమంత సులభం అవదు సుమా! కవిత అల్లడం…

భిన్న కవి దృక్పథాలు
ప్రపంచ కవిత్వానికి ఆద్యులు మూలవాసులే… జానపదాలే ఆధారాలు… భారతదేశంలో
1 జంట కవులు, 2 భారత కవులు, 3 రామాయణ కవులు, 4 శివ కవులు, 5 ప్రబంధ కవులు, 6 పద కవులు, 7 శతక కవులు, 8 జాతీయోద్యమ కవులు, 9 భావ కవులు, 10 అభ్యుదయ కవులు, 11 దిగంబర కవులు, 12 తిరుగబడు కవులు, 13 విప్లవ కవులు, 14 నయాగరా కవులు, 15 చేతనావర్త కవులు,16 అనుభూతి కవులు, 17 స్త్రీవాద కవయిత్రులు,18 దళితవాద కవులు, 19 ముస్లిం మైనార్టీవాద కవులు.20 అస్తిత్వవాద కవులు… ఇప్పటి వరకూ ఉన్న వీరితో… మున్ముందు ఇంకా పెరగవచ్చు…..
సాహితీ సృజన అంర్భాగమే కవిత్వం
కవిత్వం అంటే సాహిత్యంలో ఒక భాగమేనని, అది కవి ఆలోచనా, ఆందోళనా, ఆవేశమూ, ఆచరణా అన్నీ కూడా నిర్దిష్ట స్థల కాలాలకూ, భౌతిక పరిస్థితులకు లోబడే వుంటాయని మళ్లీమళ్లీ చెప్పుకోనక్కర్లేదేమో.. సమాజ సంబంధాలకు అతీతంగా ఎక్కడైనా వుంటే- అది ఎక్కువ కాలం ప్రజల మనస్సుల్లో మనజాలదేమో?!
కవిత్వానికీ ప్రజలకీ పరస్పర సంబంధం లేనప్పుడు ఆ కవిత్వం ఎన్నో సుళ్లు తిరిగినప్పటికీ, ఎంత శబ్ద ప్రపంచాన్ని నిర్మించినప్పటికీ, భావుకత్వంతో భ్రమలు కల్పించినా, ప్రజల సామాజిక భావనలతో మమేకం కాకపోతే వారి కవిత్వం అకవిత్వంగానే నిలిచిపోతుంది.
కవిత్వం ఒక అగ్ని జలపాతం లాంటిది. కుళ్లిపోతున్న వ్యవస్థను చూస్తూ, దాన్ని సరిచేయడానికి, శస్తచ్రికిత్స చేయడానికి పూనుకోవడం లాంటిది కవిత్వ రచన. ఆధునిక జన జీవనంలోని సంక్లిష్టత, సందిగ్ధత- నిరాశ- నిస్పృహ, నిస్సహాయత- ఆశ, అయోమయత, అలజడి అన్నింటిని వెలిగ్రక్కే గొప్ప వాహికే కవిత్వం.
స్పష్టమైన కవిత్వ అవగాహన, సహజమైన సృజనాత్మక ప్రతిభ, ఇతివృత్తానుకూలమైన ప్రగాఢ అనుభవ వైశాల్యం ఈ మూడు అరుదైన లక్షణాలు. సుకవిలో అపూర్వంగా సంగమించి వుంటాయి. అందువల్లనే ఆ కవి కవిత్వం అసాధారణమైన, ఆర్ధ్రమైన జీవితానుభవాలను తవ్విపోస్తూ, ప్రకాశవంతమే కాకుండా, ఫలవంతమై సమకాలీనవౌతుంది.
కవిత్వాన్ని తనకన్నా ఎక్కువగా ప్రేమించే కవి వస్తుస్వీకారంలో నిర్వహణలో కళాహద్దులు అతిక్రమించడు. కొన్ని సామాజిక సిద్ధాంతాలు ఆవశ్యకమనిపించినా, దాన్నికూడా కవిత్వీకరించడానికి ప్రయత్నిస్తాడే కానీ, కవిత్వాన్ని వొదిలివేసి సిద్ధాంతానికి హత్తుకుపోడు. మానవ జీవన వేదనకు తన కవిత్వాన్ని ప్రతినిధిగాచేసి, తన పరిసరాల్లోని జీవితాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు.
ఆలోచనా ధోరణిలో కొత్తదనం ఉన్నప్పుడు కొత్త కవితా ప్రక్రియల కోసం, కొత్త వ్యక్తీకరణలకోసం, కొందరు కవులు, సాహితీవేత్తలూ తహతహలాడుతుంటారు. అన్నం ముఖ్యంగానీ- ఏ పాత్రలో వండారన్నది కానట్టు- వండిన పాత్రనుబట్టి అన్నానికి పేరుమారనట్టు, భావాల్ని, భావుకతను ఏ ప్రక్రియ ద్వారా బహిర్గతం చేసినా పర్వాలేదు. అందులో ఆహారం కాగల జీవ శక్తినిచ్చే కవిత్వం వుండాలన్నది గ్రహించవలసిన విషయం.
కవిత్వంలోని అనుభూతుల్ని ఆస్వాదిస్తూ- అస్తిత్వాన్ని కోల్పోకుండా భావ చిత్రాలలో స్పందిస్తూ, నిష్కలత్వాన్ని, నిష్కపటాన్ని, నిస్వార్థాన్ని ప్రతీకలతో ఆస్వాదిస్తేనే ఆ కవి అర్థమౌతాడు. ఎన్ని అవమానాలను, దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటున్నా మానవీయ విలువల్ని కాపాడుకుంటూ కొంతమంది కవులు సమాజంలో కనిపిస్తూనే వుంటారు. ‘‘జీవితం ఒక నిరంతర పోరాటం అయినప్పుడు కవిత్వాస్త్రంలో పోరాడుతూనే ఉండు’’ అనే మంత్రం వాళ్లది.
వస్తు శిల్పాల సమ్మిళితం కవిత్వం
ప్రక్రియల మీదనే కాకుండా- శైలి మీద, శిల్పం మీద భావం మీద- భావ చిత్రాల మీద, నవ్యత మీద నాణ్యత మీద, సంఖ్య మీద కాకుండా స్థాయి మీద దృష్టిపెడితే మంచి కవులుగా మనగలుగుతూ, కొనసాగుతారన్నది అక్షర సత్యం.
కేవలం శిల్పాన్ని దృష్టిలో పెట్టుకొని, శ్రమపడి రాసిన కవితలు పాఠకులను ఇబ్బందిపెడతాయి. వస్తుశిల్పాల అన్యోన్యతవల్లనే మంచి కవిత్వం సాధ్యవమౌతుంది. కవి ఎవరైనాసరే- తను కవిత్వం చదివితే శ్రోతగా పరవశించి పోవాలనీ, పాఠకుడిగా ప్రశ్న వెయ్యకుండా ప్రశంసించాలనీ అనుకొంటారు. కవి మాత్రమేకాదు రచయితా అంతే. తన రచనను ఎటువంటి ఆక్షేపణా లేకుండా ఆమోదించాలనే అనుకొంటారు.
ఉత్తమ కవులందరూ ఉన్నతమైన ఉదాత్త భావుకులే. మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి కవిత్వమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అత్యంత మనోజ్ఞంగా కవిత్వీకరించిన గ్రంథాలనేకం ఉంటాయి కూడా. కవి కొత్త పేర్ల మీద, తక్కువ స్థాయి ప్రచారాల మీద, పైరవీల మీద, నైతికత వదిలేసుకోవడం మీద దృష్టిపెడితే- అంతకుముందు కవిగా సంపాదించుకొన్న కొద్దిపాటి గౌరవం, విలువ కూడా అడుగంటి పోతుందేమో. కవిత్వం ఒక కళ. కళాత్మకత లోపించిన కవిత రిపోర్టులా వుంటుంది. వస్తు గాంభీర్యంవల్ల ఆ కవిత అప్పటికి మంచి కవిత అనిపించవచ్చునేమో తర్వాత దానికి వార్తాకథనానికి ఉన్న విలువ వుంటుంది.
కవిత్వ దృక్పధానికి- జీవన తాత్త్వికత్వం అన్వయించుకోవాలి. మరింత విశ్లేషణాత్మకంగా మెరుగ్గా రాస్తుండాలి. విస్తృతంగా చదవడంతో వివిధ ప్రాంత కవుల భావజాలంతో ఇంటరాక్షన్ వలన ఆవేశంతో ఒక్క విషయం మీదనే దృష్టి కేంద్రీకరించడంపోయి, ఆలోచన, ఆకళింపు వస్తాయి. మానవ జీవన క్లిష్టతను అర్థంచేసుకునే ప్రయత్నం అనుకోకుండానే జరిగిపోతుంది.
కవి చూపు విస్తరించాలి. సమ సమాజ భావనతో ఎక్కడెక్కడ స్పృశించాల్సిన అంశాలున్నాయో, ఎక్కడెక్కడ చీకటి పేరుకుపోయి వుందో కళ్లు చెదిరే భావచిత్రాల దిశా నిర్దేశం చేయగలమో, ఆ దిశగా కవిత్వం విస్తరించినపుడే మనమనుకునే సమగ్రత, సంస్కారం పెరుగుతుంది. సమాజంలోని సంస్కారం కవిత్వంలో ప్రతిఫలిస్తుంది.
కొంతమంది కవులు- తమ రచనల ద్వారా తమ వర్ణీయులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని కాంక్షిస్తూ- భావ సెగలతో కాకలు చూపిస్తూ, మనసుకు దూరంగా జరుగుతూ, తమ వర్ణంపై రాసినంత కవిత్వం, మిగిలిన శ్రమ కులాలు, వృత్తిపనులు ఒత్తిళ్లమయ జీవితాలు గురించి ఎందుకు రాయరో అర్థంకాదు. మిగతా కులాల్లో, వర్గాల్లో జాతుల్లో పేదరికం, అజ్ఞానం, నిరుద్యోగం వంటి వీడని సమస్యలు వీరి కవితా కళ్ళను ఎందుకు తడిచేయవో ఎప్పటికీ అవగతం కాదు.
ప్రపంచీకరణ విషఫలం- కవిత్వ ప్రతిబింబం
ఇది ప్రపంచీకరణ కాలం. అంటే ప్రపంచమంతటినీ ఒక్కతాటిపై కలగలిపి ఏకంచేస్తున్న తరుణం.ఏ దేశాల మధ్యనైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యాపారాన్ని కొనసాగించవచ్చునని దీని భావం. ప్రస్తుతం’ స్వేచ్ఛా వాణిజ్యం ‘ పేరిట దీనిని వ్యవహరిస్తున్నారు. వస్తువులు, పెట్టుబడులు, ఉత్పత్తి, సాంకేతిక విఙ్ఞానం ఒక దేశం నుండి మరొకదేశానికి తరలిపోవడం అనే అర్థంలో ప్రపంచీకరణని వాడుతున్నారు. ఇది నేడు బహుముఖాలుగా విస్తరించి పలుపార్శ్వాలతో మనల్నిచుట్టుముడుతోంది.అగ్రరాజ్యమైన అమెరికా సామ్రాజ్యవాదానికి కేంద్ర బిందువుగా నిలిచి ప్రపంచమంతటిని గుత్తాధిపత్యంతో తన ఆధీనంలో ఉంచుకుంది. దీనికి వంతపాడే మరికొన్ని సంపన్న దేశాలు ఒక కొమ్ముకాస్తూ ఇందుకు అనుగుణంగా తలవొంచి పనిచేస్తూ ఈ తంతులో ప్రధానపాత్రను పోషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు ,అంతర్జాతీయ ద్రవ్యనిధి మున్నగునవి అంతర్జాతీయంగా ప్రమాదకర శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. వీటి కనుసన్నల్లో మెలిగే బహుళ జాతి సంస్థలు లాభాపేక్షను ధ్యేయంగా పెట్టుకొని ముందడుగు వేస్తున్నాయి. తృతీయ ప్రపంచ దేశాలను తమ ఆర్థిక స్థలాలుగా ఎంచుకొని ధనార్జన అనే ఏకైక లక్ష్యంతో ఇవి కొనసాగుతున్నాయి. ఈ ప్రస్థానంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే బాహ్య రూపాలతో విశ్వాధిపత్యాన్ని సొంతం చేసుకొని తద్వారా ఏకఛత్రాధిపత్యాన్ని పొందడానికి కుట్ర పన్నుతున్నాయి.పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాద ఆర్థిక అవసరాలకోసం ప్రపంచీకరణ వచ్చింది. ఇది ప్రపంచ నూతన ఆర్థిక క్రమంగా వ్యవహరిస్తూ మానవాళి పేదరికం మీద జీవిస్తోంది. అప్పుల కోసం ఎదురుచూసే పేదదేశాల అలసత్వాన్ని ఆసరాగా చేసుకొని స్వేచ్చా వాణిజ్యాన్ని, నూతన ఆర్థిక విధానాలను వాటిపై రుద్దే పనిని చేపడుతోంది. ఈ వ్యవహరం బలహీన దేశాల ఆర్థిక స్థితిగతుల పట్ల గొడ్డలి పెట్టుగా తయారైంది. తత్ఫలితంగా పెట్టుబడిదారి దేశాలు పురోగతిని సాధిస్తుంటే , పేదదేశాలు ఆర్థికంగా చితికిపోతూ అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి. ఈ బలమైన కుట్రలో చివరికి బలిపశువులుగా మిగిలిపోతున్నాయి. ఈ చర్యల మూలంగా ఉన్నవారికీ లేనివారికీ మధ్యంతరం పెరిగిపోతూ వస్తోంది. కాలక్రమంలో తలెత్తుతున్న ఇలాంటి సంక్షోభాలు సుస్థిరతకు అడ్డంకిగా తయారవుతున్నాయి. ఒకదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే దాని ప్రభావం ఇతరదేశాలపై కూడా పడుతుంది. ప్రపంచీకరణ వల్ల పర్యావరణ విధ్వంసం, సామాజిక వివక్షను పెంపొందించడం, జాతివాదాన్ని ప్రోత్సహించడం, స్త్రీల హక్కుల లోపలి పునాదులను ధ్వంసం చేయడం వంటి పర్యవసానాలు సంభవిస్తున్నాయి.ఈ దశలో ఆధునిక తెలుగు సాహిత్యంలో దేశీయ దోపిడిని నిరసిస్తూ అనేకమైన జాతీయవాద ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ఇవి క్రమేపి ఆర్థిక పరిస్థితుల నేపధ్యం నుంచి సంస్కృతి మూలాలను ప్రశ్నిస్తూ, స్త్రీ – పురుష సంబంధాలతో పాటు ఇతర రంగాలలోకి ప్రవేశించాయి. ఈ తరుణంలో సామ్రాజ్యవాద నేపధ్యం, రైతు వ్యవసాయం, సాంస్కృతిక పతనం, పర్యావరణ విధ్వంసం, వస్తు సంస్కృతి , స్త్రీ వాద స్పృహ , దళిత – మైనారిటీ వాదాలు, బాల్యస్మృతులు మొదలైన అంశాలను ప్రపంచీకరణ అమితంగా ప్రభావితం చేస్తోంది. వీటి ఛాయలను ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేద్దాం.ప్రపంచీకరణ కారణంగా రైతు బతుకు అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. సమస్యను ఎటువైపు నుంచి చూసినా పరిష్కారానికి దారులు తెరుచుకోవడం లేదు. ఇలాంటి సందర్భాలు ముప్పేటగా అల్లుకొని రైతులపాలిట శత్రువుగా పరిణమించాయి. ఈ దయనీయ పరిస్థితులను కళ్లకి కట్టించడం ద్వారా కవులు ముందడుగు వేశారని చెప్పడానికి కొన్ని సజీవ తార్కాణాలున్నాయి.
“నేనిప్పుడు నెపం
నేలమీదో గాలిమీదో తోసేస్తే కుదరదు
నేల మోసం చెయ్యదు
నేరం తప్పకుండా మనిషిదే
నేనిప్పుడు
వాడి చేతిలొ పంట నొల్లుకుని
కంట్లో కారం జల్లిన వాళ్ళనే ప్రశ్నిస్తాను” అంటూ పాపినేని శివశంకర్ “నాగలి విరిగినప్పుడు” అనే కవితలో మనల్ని ప్రశ్నిస్తారు. పురుగుమందు తాగి చనిపోవలసిన అవసరం రైతుకి ఏర్పడినపుడు దాని వెనకవున్న మూలకారణాలను అన్వేషించాలి . సకాలంలో ఎరువులు , సబ్సీడీలు, విద్యుత్తు, నీటివసతి సౌకర్యాలను కల్పించనపుడు అన్నదాతకి మిగిలేది చివరికి విషాదమే .ఈ గడ్డు పరిస్థితికి కారణమైన పాలకవర్గంతోపాటు అంతర్గతంగా పొంచివున్న అదృశ్యశక్తుల్ని గుర్తించే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం లభించే దిశగా ముందడుగు వెయ్యగలుగుతాం.

“చేను కంకుల్లో మానవ కంకాళాలను ఏరుకుతిన్న
భూస్వామి కలగలసిన మధ్య దళారి
దేశం ముఖమ్మీద
ఉక్కుపాదాలతో తొక్కుతున్నప్పుడైనా
ముఖం చిట్లిందని దాక్కుంటావా?
మట్టిని పెకలిస్తూ మేల్కొంటావా ?”
అని నిశితాసి కవి “ఇప్పుడైనా మేలుకో ” కవితలో దళారి – భూస్వామి కలిపి ఆడుతున్న పంట నాటకానికి తెరదించమంటూ రైతుని హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు. మధ్యవర్తులుగా వ్యవహరించడంతోపాటూ అపారమైన లాభాలను మూటగట్టుకొని, బడుగు రైతుల్ని దోచుకునే తీరును నిలదీస్తాడు…

భవిష్యత్తుకు బరోసా విప్లవ కవిత్వమే…
ఆధునిక తెలుగు కవిత్వ చరిత్రలో చప్పున దృష్టి మరల్చే కవితా ధోరణులు వచ్చి ఉండవచ్చు. ఆకర్షణీయమైన వ్యక్తీకరణలూ మనం విని ఉండవచ్చు. తాము రంగం మీదికి వచ్చాకనే చరిత్ర మొదలైందని దబాయించిన కవితా ధోరణులూ ఉండవచ్చు. కానీ సజీవ పరిణామానికి నిదర్శనం మాత్రం ఒక్క విప్లవ కవిత్వమే. సుమారు యాభై ఏళ్లుగా తన తొలి లక్ష్యం పట్ల ఏమరపాటు లేకుండా నిత్య పరిణామానికి లోనవుతున్నది. వందలాది మంది కవులు ఈ ఉద్యమంలో పుట్టి తమదైన సొంత వ్యక్తీకరణను సంతరించుకున్నారు. విప్లవ కవిత్వం మొదలయ్యాక వచ్చిన కవితా ధోరణులు ఎన్నో కొత్తదనాలు అందించాయి.

-జనత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap