(సెప్టెంబర్ 8 గరికపాటి రాజారావు వర్థంతి)
కళ కళకోసం కాదనీ, కళ ప్రజలకోసమనీ, కళ మానవ జీవన గమనానికి వెలుగుబాటలు చూపించే ఒక ప్రగతిశీల సాధనమని చెప్పి… నాటకరంగం ద్వారా ప్రజాకళారంగానికి దిక్సూచిగా నిలచిన వైతాళికుడు డాక్టర్ గరికపాటి రాజారావు. తెలుగు నాటకరంగంలో అతి నవీన భావాలతో వినూత్న విలువలను ఆవిష్కరించి తెలుగు నాటక దశను, దిశను మార్చి సామాన్య ప్రజల సాంస్కృతిక సైనికుడిలా నిలచిన కళాస్రష్ట ఆయన.
రాజమండ్రిలో 1915 ఫిబ్రవరి 5వ తేదీన గరికపాటి సోమయ్య దేవర, సోమలింగమ్మ దంపతులకు రాజారావు జన్మించారు. విద్యార్థి దశలోనే విచిత్ర వేషధారణలతో, నటనతో అందరినీ మెప్పించారు. సికిందరాబాద్ లాలాగూడ వర్క్‌షాపులో తండ్రి ఉద్యోగం చేస్తున్నప్పుడు విద్యార్ధిగా ఉన్న రాజారావు హరిశ్చంద్ర నాటకంలో మాతంగ కన్య వేషం ధరించి పాఠశాల అధ్యాపకుల మెప్పు పొందారు. అదే ఆయన తొలి రంగస్థల ప్రవేశం. 15వ ఏటనే నాగేశ్వరమ్మతో వివాహమైంది. లాలాగూడ వర్క్‌షాపులో గుమాస్తాగా కొంతకాలం జీవనం సాగించి పై ఉద్యోగి వేధింపులు భరించలేక దానికి రాజీనామా చేసి 1937లో మద్రాసు చేరారు. మద్రాసులో ఎల్‌ఐబం చదువుతున్న రోజుల్లో పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి (పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు), డాక్టర్ రామదాసు ఈయనకు ప్రాణ స్నేహితులు. వారి స్నేహ ప్రభావంతో మార్క్సిస్టు గ్రంథాలను అధ్యయనం చేశాడు. ప్రజా ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు.
ఎల్‌ఐఎం చదువుతున్నప్పుడే సహ విద్యార్థులతో కలిసి గుళ్లపల్లి నారాయణమూర్తి రచించిన విడాకులు నాటకానికి దర్శకత్వం వహించారు. తర్వాత కాలంలో పలు నాటకాల ద్వారా ఎందరో కొత్త నటులను పరిచయం చేశారు. మద్రాసులో రాజారావు దర్శకత్వంలో ప్రదర్శించిన షాజహాన్ నాటకం నాటకరంగలో సంచలనాన్ని స ష్టించింది. ఆ నాటకంలో రాజారావుకు సుప్రసిద్ధ నటులు, రూపశిల్పి దేవీప్రసాద్ రారు చౌదరి మేకప్ చేయడం విశేషం. మద్రాసులో గరికపాటి వైద్య విద్య అభ్యసిస్తూనే విద్యార్థులను సమీకరించి భమిడిపాటి రాసిన ‘బాగు బాగు’, గాలి బాల సుందరరావు రాసిన ‘అపోహ’ తదితర నాటకాలను ప్రదర్శించారు.
మద్రాసు నుంచి తిరిగివచ్చాక విజయవాడ సమీపంలోని పెనమలూరులో వైద్యశాలను ప్రారంభించారు. సమీప గ్రామాల్లోని ఔత్సాహిక యువతను సమీకరించి ‘ఖిల్జీ రాజ్యపతనం, రంగూన్ రౌడీ’ నాటకాలను విస్త తంగా ప్రదర్శించారు. ఫాసిస్ట్ వ్యతిరేకోద్యమంలో భాగంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో మాల, యువజన సంఘాలను నెలకొల్పారు. 1943లో బొంబాయిలో జరిగిన అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభల వల్ల భారతీయ నాటకరంగంలో, ముఖ్యంగా తెలుగునాటక రంగంలో పెనుమార్పులు సంభవించాయి. అప్పుడే ఇండియన్ పీపుల్ ఆర్ట్ థియేటర్ (ఇప్టా) ఆవిర్భవించింది దీనికి కన్వీనరుగా రాజారావు ఎన్నికయ్యారు. ఇప్టా అనుబంధ శాఖగా రూపొందించిన ప్రజానాట్యమండలి రాష్ట్ర దళం దర్శకులుగా రాజారావు నియమితులయ్యారు. ఆ తర్వాత ప్రజానాట్య మండలిది ఒక సాంస్క ృతిక చరిత్ర.. ఒక ఝంఝూమారుతం… ప్రజానాట్యమండలి సాంఘిక నాటకాలకు పెద్దపీట వేసింది. దీని ద్వారా ప్రతిభావంతమైన నటులు దేవిక, అల్లు రామలింగయ్య, సంగీత దర్శకులు మోహన్ దాస్, టి.చలపతిరావులు, న త్యదర్శకుడు వేణుగోపాల్, రచయితలు సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, బుర్రకథ కళాకారుడు షేక్ నాజర్ వంటివారెందరో వెలుగులోకి వచ్చారు.
ప్రజా నాట్యమండలి ఏర్పడటానికి ముందే, తమ వ్యక్తిగత క షితో ఆనాటికే ప్రజల్లో ఉన్న జంగం కథను, నేడు మనం చూస్తున్న ‘బుర్రకథ’ రూపంలో సుంకర సత్యనారాయణ, కాకుమాని సుబ్బరావు తయారు చేసిన ‘కష్టజీవి’ బుర్రకథను ప్రజానాట్యమండలి జనంలోకి తీసుకెళ్లింది. అనేక కళా బ ందాలు ఏర్పడ్డాయి. వారంతా ఆనాటికి ప్రజల్లో ఉన్న కోలాటం, సోది వేషం, పిట్టల దొర, జముకుల కథ, యక్షగానం లాంటి కళా రూపాలను దాదాపు 40 వరకు రాజారావు ఆధ్వర్యంలో పునరుద్ధరించి, ఆ రూపాల్లో ప్రజా సమస్యలను జోడించారు. తక్కువమందితో ఎక్కువ ప్రచారం చేయడానికి ఉన్న అవకాశాలను గుర్తించి, అందుకు తగ్గట్టు చిన్న కళారూపాలను విప్లవీకరించడంలోనే రాజారావు ప్రతిభ దాగి ఉంది. ‘మా భూమి’ నాటకాన్ని ఆయన దర్శకత్వంలో రాష్ట్రదళంతో పాటు ప్రతి జిల్లాలో దాదాపు 10 దళాలు ఏర్పడి ప్రదర్శనలిచ్చాయి. డాక్టర్ రాజారావు రాష్ట్ర దళం ప్రదర్శించిన మా భూమి నాటకానికి దర్శకత్వం వహించడమే కాకుండా పట్వారీ వెంకట్రావు పాత్రను కూడా అనితర సాధ్యంగా పోషించారు. ప్రజానాట్యమండలి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ‘మా భూమి’ నాటకం అనేక సంచలనాలకు చిరునామాగా నిలిచింది. తెలంగాణ రైతాంగ పోరాట ఇతివ త్తంతో సుంకర- వాసిరెడ్డి రచించిన ఈ నాటకం తెలుగునేలపైనే కాదు భారతీయ నాటకరంగంలోనూ కొత్త సంచలనానికి నాంది పలికింది.. ప్రజల శ్వాసనుంచి వెలువడిన జానపద కళాప్రక్రియ పాశ్చాత్య, చాంధస సంస్క తుల పెనుహౌరులో కొడిగట్టిన దీపంలాగ రెపరెపలాడుతున్న తరుణంలో ఆ ప్రక్రియ పునరుద్ధరణకు నడుం కట్టిన ఘనత ప్రజా నాట్యమండలికి దక్కుతుంది. జానపద కళాప్రక్రియలకు ఆధునిక ఇతివృత్తాలను అనుసంధానం చేసి ప్రదర్శించడంలో రాజారావు కృషి విస్మరించలేనిది. ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలని, ఫాసిస్టు నాజీ రాజ్యాన్ని స్థాపించాలనుకున్న నియంత హిట్లర్ చరిత్రను ‘హిట్లర్ భాగోతం’ పేరుతో వీధి నాటకంగా ప్రజానాట్యమండలి శక్తిమంతంగా ప్రదర్శించింది. ఈ కళారూపం పతాక సన్నివేశంలో ఎర్ర సైనికుని పాత్రలో రాజారావు ప్రళయ భీకరమైన నృత్యం చేస్తూ హిట్లర్‌ను అంతమొందించే సన్నివేశం ప్రేక్షకులను అలరించేది. ఒక సాంస్కృతిక సైనికుడిగా కళాకారులను తయారు చేస్తూనే రాజారావు ‘వీరనారి, వీరకుంకుమ లాంటి నాటకాలు రాశారు. అనేక కళారూపాలు తయారు చేశారు. మాభూమి, పరివర్తన, పోతుగడ్డ, సీతారామరాజు వంటి నాటకాలకు దర్శకత్వం వహించారు. సాయుధ పోరాట విరామం అనంతరం రాజమండ్రిలో రాఘవ కళాసమితిని ఏర్పర్చి అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఆత్రేయ రాసిన ‘పరివర్తన, ఈనాడు, భయం’ నాటకాలను ఆంధ్ర నాటక కళాపరిషత్ పోటీల్లో ప్రదర్శించి బహుమతులను పొందారు. ‘అల్లూరి సీతారామరాజు’ నాటకాన్ని ఆంధ్రదేశంలోనే కాక ఆంధ్రేతర ప్రాంతాల్లో కూడా ప్రదర్శించారు. ఆయన ఈ నాటకానికి దర్శకత్వం వహించడంతో పాటు రూధర్‌ఫర్డ్ పాత్రను కూడా అనితర సాధ్యంగా పోషించారు.
తరువాతి కాలంలో ‘రాజా ప్రొడక్షన్స్’ పేరిట స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ చలనచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా సినీరంగానికి జమున, పెరుమాళ్లు, చదలవాడ కుటుంబరావు, అల్లు రామలింగంయ్య వంటి నటులతో పాటు మోహన్‌దాస్, తాతినేని చలపతిరావు వంటి సంగీత దర్శకులను కూడా పరిచయం చేశారు. ఒక మహిళ చిన్నప్పుడు తండ్రి చాటున, పెళ్లయ్యాక భర్త నీడన, తల్లయ్యాక కొడుకుల పోషణలో అణిగిమణిగి పరాధీనతతో బతుకును తెల్లవార్చుకునే స్థితినుంచి పురుషునితో పాటు సమానంగా సమాజాభివ ద్ధికి పాటుపడగలదనే ఇతివృత్తంతో నిర్మించిన పుట్టిల్లు చిత్రం నాలుగు దశాబ్దాలకు ముందే స్త్రీ వాదానికి అద్దం పట్టింది. ఈ చిత్రంలో ప్రతినాయకుడు రాఘవరావు పాత్రను రాజారావే ధరించడం విశేషం. రాజారావు తెలుగు సాంఘిక నాటకరంగంలో దర్శకుడు అనే పదానికి ఒక గుర్తింపును, గౌరవాన్ని కలిగించారు. నాటక ప్రదర్శనలో పాత్రల కదలికలు, హావ భావ వ్యక్తీకరణకు రంగ స్థలంపై సర్క్యులర్ మూమెంట్, పారలల్ మూమంట్, యాంగ్యులర్ మూమెంట్లను తొలిసారిగా ప్రవేశపెట్టారు. సినిమా వేషాలకోసం మద్రాసు వచ్చిన నటులు ఆకలితో నకనకలాడడం చూసి తన ఇంటి ఆవరణలో ఒక పాక వేయించి మంచాలను ఏర్పాటు చేశారు. రాజారావు భార్య నాగేశ్వరమ్మ తన ఇంటికి వచ్చిన ప్రతి కళాకారునికీ అన్నం పెట్టి ఆదరించేది. రాజమండ్రిలో రాఘవ కళాసమితి పేరుతో గ్రంథాలయాన్ని నెలకొల్పి, విలువైన నాటక గ్రంథాలను సేకరించారు. ‘నటుడు, సమయస్పూర్తి, పాత్రల నిర్ణయం, ప్రదర్శన’ పేర్లతో ఆయన రాసిన వ్యాసాలు ఇప్పటికీ నాటక కళారంగంలో ప్రామాణికంగా నిలుస్తున్నాయి.
రాజారావు ‘జై భవానీ’ నాటకాన్ని హైదరాబాద్‌లో అప్పటి రాష్టప్రతి డాక్టర్ సర్వేపల్లి రాధాకష్ణన్ సమక్షంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజారావును ఆయన అభినందించారు. ఈ నాటకాన్ని ప్రదర్శించే సమయంలోనే రాజారావుకు గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. 1963 సెప్టెంబర్ 8న మద్రాసులో మృతిచెందారు.
మానవ జీవితంలోని అన్ని పార్శ్యాలను ప్రపంచీకరణ పెనుప్రమాదమై అక్రమించేసిన వేళ, మతతత్వం రాజ్యాధికారమై ప్రజాతంత్ర ఉద్యమాలకు, మానవ సంబంధాలకు కొత్త అర్థాలు చెబుతున్న వేళ, ప్రజా జీవితంలో పుట్టిన అనేక కళారూపాలు నేడు అంతర్థానమైపోతున్నాయి. ప్రపంచ శత్రువు సాంస్కృతిక దాడులు ముమ్మరం చేసిన ఈ తరుణంలో గరికపాటి రాజారావు స్ఫూర్తితో ప్రజాకళల పరిరక్షణకు ఉద్యమించడమే తక్షణ కర్తవ్యం.
– బెందాళం క్రిష్ణారావు
(ప్రజాశక్తి సౌజన్యంతో)