తెలుగు ప్రచురణరంగం కొత్త సవాళ్ళు

 

(జనవరి 3 నుండి 12 వరకు విజయవాడ పుస్తక ప్రదర్శన సందర్భంగా)

“పుస్తకాలకు మార్కెట్ తగ్గింది, చదివే అలవాటు తగ్గింది. టీవీ,ఇంటర్నెట్ పుస్తకపఠనం మీద గణనీయమైన ప్రభావం చూపించింది. ఈ పరిస్థితుల్లో పుస్తకం భవిష్యత్తు ఏమిటి ?

అందరి ప్రచురణకర్తల్లాగానే నేనూ ఈ ప్రశ్నను పదేపదే ఎదుర్కొంటూ వుంటాను. పత్రికలవాళ్ళు, పుస్తకాభిమానులు, రచయితలు ఇలా చాలామంది ఇదే ప్రశ్నను వేస్తూవుంటారు. అయితే ఈ సందేహంలో వాస్తవం ఎంతుంది ?
ప్రచురణకర్తగా నా భవిష్యత్తు ఏమిటి ? ఈ ప్రశ్నను నేనూ వేసుకుంటాను. కొన్ని సంవత్సరాలుగా ఈ విషయమై నేను చాలా శోధన చేసినవాణ్ణి, వివిధ కోణాలలో పరిశీలించినవాణ్ణి, ఈ సందేహాన్ని పక్కన పెట్టి పుస్తక ప్రచురణే వ్యాపకంగా, జీవితంగా జీవిస్తున్నవాణ్ణి. వర్తమాన పరిస్థితులు నన్నెప్పుడూ భీతికి లోనుచేయలేదు. భవిష్యత్ ఆకాంక్షలు బలంగానే వున్నాయి. ఇలా వుండటానికి బలమైన కారణాలున్నాయి. ప్రచురణరంగం తన వ్యాపార వ్యూహాలను నిరంతరం పరిస్థితులకనుగుణంగా మలుచుకోవాలి అని భావించేవాడిని నేను.
స్వాతంత్ర్యానంతరం ప్రచురణరంగం పరిస్థితిని ఆలోచిస్తే ఈ 50 సంవత్సరాల్లో ఎన్నో మార్పులకు లోనయినప్పటికీ పుస్తక ప్రచురణ క్రమేపీ వృద్ధి చెందుతూనే వుంది. ఎప్పుడూ ఈ రంగంలో Stagnation అనే పరిస్థితి ఏర్పడలేదు. అక్షరాస్యతా శాతం పెరగటం, అలాగే నూతన పుస్తకప్రియులు నిరంతరం తయారవుతుండటం, రచయితలు, ప్రచురణకర్తలు వారి అవసరాలకనుగుణమైన పుస్తకాలను ప్రచురిస్తుండటం నిరంతరం జరుగుతున్న విషయం. 1990వ సంవత్సరం వరకు జనరల్ పుస్తకాల మార్కెట్లో నవలల అమ్మకాలు గణనీయమైన పాత్రను పోషించాయి. వామపక్ష భావపరమైన సాహిత్యం , ఆధ్యాత్మిక సాహిత్యం పుస్తకాల మార్కెట్లో తరువాతి స్థానం ఆక్రమించాయి. 1990 సంవత్సరం తరువాత ఈ పదమూడేళ్ళ కాలంలో టీవీ మాధ్యమం ప్రవేశం జరగటం, 2005 సంవత్సరం తరువాత ఇంటర్నెట్ లో సోషల్ మీడియా మాధ్యమం ప్రవేశంతో కాల్పనిక సాహిత్యానికి డిమాండ్ తగ్గటం ప్రముఖంగా గమనించాలి. కాల్పనిక సాహిత్యం అమ్మకాలు తగ్గిపోవడంతో ప్రచురణరంగంలో అత్యధికులు కాల్పనిక సాహిత్యం ప్రచురణకర్తలు, పత్రికలవారు పుస్తకాల మార్కెట్ గణనీయంగా తగ్గిందనే అభిప్రాయానికి స్థిరీకరించుకోవడం జరిగింది. అయితే కొత్తతరం ప్రచురణకర్తలు వివిధ విషయాలపైన ప్రచురించే పుస్తకాలు విస్తృతంగా అమ్మగలగడం మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యం, సాధారణ విషయ విజ్ఞానం, భక్తి, వ్యక్తిత్వ వికాసం, సామాజిక శాస్త్రాలు మొదలైన అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఈనాడు విస్తృతంగా అమ్ముడవడాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. 1990 నుంచి 2005 వరకు ప్రచురణరంగం కనీసం 30 శాతం వృద్ధిని సాధించిందని చెప్పవచ్చు. తర్వాత క్రమేపి ప్రచురణరంగం తిరోగమనంలో నడుస్తుంది. ప్రచురణకర్తలు కూడా పుస్తక విక్రయానికి సంబంధించిన వ్యూహాల్లో మార్పులు తీసుకురావలసిన అవసరం వుంది. పుస్తకాల షాపుల్లో మాత్రమే పుస్తకాలు అమ్మాలి అనే విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం అసన్నమైంది. వివిధ వినిమయ వస్తువుల్ని మార్కెట్ చేయటంలో ఆయా తయారీదార్లు అనుసరిస్తున్న వ్యూహాల్ని మనంకూడా గమనించాలి. ప్రచురణకర్తలు తమ ప్రచురణలని జనసమర్థం వున్న ప్రదేశాల్లో చిన్న చిన్న ట్రాలీలమీద కాని, సైకిళ్ళమీద కాని పెట్టి ప్రదర్శించటం, సూపర్‌బజార్లు, మల్టీప్లెక్స్ మార్కెట్లలో పుస్తకాలు అందుబాటులో ఉండేటట్లు చూడటం, ఇంటింటికీ వారి ప్రచురణలను పంపి పుస్తకాల అమ్మకాలు జరపటంవంటి వ్యూహాలను మనం అందరం ఆచరించాలి.
పుస్తకాల ప్రచురణలో నాణ్యత విషయంలో, అలాగే పుస్తకాలలోని విషయానికి సంబంధించిన అంశాల సాధికారికత విషయంలో ప్రచురణకర్తలు మిక్కిలి జాగ్రత్త వహించాలి. అందమైన, విషయపరిపుష్టమైన పుస్తకాల్ని తయారుచేయటం ద్వారా ప్రచురణరంగం భవిష్యత్తును ఉజ్వలభరితం చేసుకోవచ్చు.

-ఎమెస్కో విజయకుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap