(సరిగ్గా నెలరోజుల క్రితమే తన 95 వ జన్మదినోత్సవం జరుపుకున్న శ్రీకర్నాటి లక్ష్మీనరసయ్య ది. 5-11-2019 మంగళవారం ఉదయం 8 గంటలకు విజయవాడలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.)
బహుముఖ రంగాల్లో కర్నాటి అడుగు జాడలు
“ప్రకృతి నాబడి”, జానపదులు నా గురువులు, సమాజం నా రంగస్థలం, మానవత్వం నా మతం. కళలు నా నిధులు” ఈ మాటలు అన్నది వేరెవరో కాదు, సాక్షాత్తూ జానపద కళానిధి, జానపద జలధి, తొమ్మిది పదులు నిండిన మేటి నటుడు జానపద పయోనిధి, శ్రీకర్నాటి లక్ష్మీనరసయ్య.
అభ్యుదయానికి, ఆధునికతకు అద్దంపట్టే సనాతనుడు, నిత్యయవ్వనుడు ఈ రంగస్థల నటుడు. తెలుగుపద్యం పట్ల ఎంతో గౌరవాన్ని ప్రకటిస్తూంటారు. పద్యం తెలుగువారి నేపధ్యంగా సాగదీసి, లాగదీసి పద్యానికున్న పరిమితి అధిగ“మించరాదని సూచిస్తుంటారు. 8 ఏళ్ల చిరుప్రాయంలోనే వేషంకట్టి తొలిగా రంగస్థలంపై నటించి, ఆపై వివిధ జానపద కళారూపాల్లో తన అసమాన గాన, రచన, నటనా వైదుష్యంతో జానపద, నాటక రంగానికే ఓ మూల స్థంబంలా ఎదిగి చిరకీర్తినార్జించారు. “జానపదమే తన పథంగా తన కళాకౌశలంతో సమాజాన్ని చైతన్య పరిచే విధంగా తన జీవితాన్ని మలచుకొని సమకాలీన సామాజిక, సాంఘిక, సాంస్కృతిక రాజకీయ పరిస్థితుల కనుగుణంగా ఓ భాద్యతగల నటునిగా, పౌరునిగా తన హావ భావా’లతో జన సామాన్యాన్ని ప్రభావితం చేసినట్టి ఘనాపాఠి ఈ కర్నాటి” అన్నది జనవాక్యం.
జాన’పదం’లో ఓ అక్షరంగా ఆరంభమైన కర్నాటి నేడు జానపద కళాకారులకు ఓ పెద్ద బాలశిక్షగా పరిణతి చెందిన “ జానపద కళాప్రపూర్ణుడు”. ధనార్జన, తన, మన కుటుంబపోషణ అనే స్వప్రయోజనాలకు స్వస్తి పలికి, దేశకాల పరిస్థితులు కనుగుణంగా సామాజిక శ్రేయస్సును కాంక్షించిన ఆదర్శ జానపద కళాకారుడీయన, నిజాం నిరంకుశత్వాన్ని నిర్భయంగా నిరసించినందుకు అరదండాలు ధరించాడు. జైలు జీవితం కూడా భరించాడు. నేటి మన ప్రజాస్వామ్యంలో అత్యంత గౌరవ ఆదరాలతో దండాలు పెట్టించుకుంటూ పూలదండలు ధరిస్తున్న ఈ జానపద నటరాజ హంసకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంస అవార్డుతో సత్కరించి, ఈ జానపద కళాపారావారానికి నీరాజనం పట్టింది తన జానపద కళతో జన సామాన్యాంలోని సామాజిక రుగ్మతలను నయం చేసే జానపద కళా వైద్యుడీ కర్నాటి. ప్రతీ మనిషికి “కూడు, గూడ, గుడ్డ, భద్రత స్త్రీలకు సమాన ప్రతిపత్తి కావాలి. సమాజంలో సగం మంది ఉన్న స్త్రీలు అన్ని రంగాలలో సమానంగా ఉండాలి. జాతీయ కళారూపాలన్ని మనిషిని మనిషిగా గౌరవించాలి” అని అంటుంటారు.
5-10-1925న ఖమ్మం జిల్లా, మధిర తాలూకా, దెందులూరు గ్రామంలో పుట్టి పురుడుపోసుకున్న కర్నాటి నాటకరంగంలోనే కాక ఆలిండియా రేడియేలోనూ గ్రేడ్ 1 ఆర్టిస్టుగా గుర్తింపు పొంది, సినీ రంగంలోనూ పదార్పణం చేసారు. పద్మశ్రీ నాజర్ తో కలిసి పుట్టిల్లు, అగ్గిరాముడు సినిమాలలో బుర్రకథలు చెప్పారు. ‘ఇదికాదు ముగింపు’, ‘ఈ చదువులు మాకొద్దు’, ‘లవ్ మ్యారేజి’, ‘పూలపల్లకి’, ఈ చరిత్ర ఏ సిరాతో ‘భలేబావ’ వంటి సినిమాలలో తన నటనా పటిమను చూపించి ఆ సినీ మాయా ప్రపంచంలో ఇమడలేక మరల తన మాతృక అయిన జానపద కళవైపు మరలినారు. తొమ్మిది పదుల వయస్సు దాటినా గాని పద్యం పాడటంలో తన ధాటిని ప్రదర్శిస్తున్న నిత్య యవ్వనుడు, ఈ నరసయ్య నవరసాల పెద్దయ్య’ అని జానపదుల గుండెల్లో గూడు కట్టుకున్న వీరి మది జానపద కళల ప్రయోగశాల. వీరి గది జానపద కళల పాఠశాల.
సినిమాలలో సంపాదించింది కాస్తా నాటకరంగానికే ఖర్చు చేసారు. ఆనాడు వీరి బుర్రకథలు టిక్కెట్ కొని చూసారు. వీరి నాటకాలు వరుసగా వారం రోజులు ఒకే ఊరిలో ప్రదర్శింపబడటం అప్పటికి, ఇప్పటికి అబ్బురమే. వీరు ఆపాదమస్తకం సామాన్య జనప్రయోజనశాల. ఇంత వయసు పెరిగినా వాయిస్ తగ్గకపోవటం కర్నాటి స్పెషాలిటి. సామాజిక కళ్యాణం కాంక్షించటం కర్నాటి ఆలోచనలతో క్వాలిటీ.
కర్నాటి భావాలు, వీరు ధరించిన
పాత్రలు అభ్యుదయానికి ఆనవాలు. మెట్ట, మాగాణుల సువాసనలు తెలిసిన రైతుబిడ్డ కర్నాటి. తాను నటించిన ముందడుగు నాటకం తర్వాత ఇక వెనకడుగు వేయకుండా జానపద కళాప్రపంచంలో వడివడిగా అడుగులు వేస్తూ అగ్రస్థానాన్ని ఆక్రమించారు. ‘ప్రెసిడెంట్ పట్టయ్య పాత్రలో అధికార దాహం అధికంగా కలిగిన పాత్ర ద్వారా తన నటనకు మరింత పటుత్వం కలిగించారు.
ఆత్రేయ రచించిన ‘ఈనాడు’ నాటకంలో రాము పాత్ర కర్నాటి నటనకు గీటురాయి వంటిది. ప్రగతి నాటకంలో పిచ్చివాడి పాత్ర పోషించిన తన నటనా గతిని పెంచిన ఘనుడు . ఈ నాటకాన్ని ప్రముఖ హిందీ నటుడు ముఖ్య అతిథి హెదాలో తిలకించి పులకించి ప్రశంసించటం నరసయ్య గారి జీవితంలో ఓ మధురస్మృతిగా నెమరు వేసుకుంటుంటారు. బి.ఏ. ఫోక్ ఆర్ట్స్ సిలబస్ కమిటీలో సభ్యునిగా కృషిచేసారు. మా భూమి నాటకంలో వీరు పోషించిన భూమిక వీరికి ఎనలేని కీర్తి నార్జించి పెట్టింది. కన్యాశుల్కం నాటకంలో అగ్ని సూత్రావధానులు పాత్ర కర్నాటి కీర్తి కిరీటంలో కలికితురాయిగా వెలిగింది.
“గాలిమేడలు” నాటకం కర్నాటిలోని బహుముఖ ప్రజ్ఞకు తార్కాణంగా నిలుస్తుంది. ఈ నాటకంలో వీరు ఆంజనేయులు, సీతారాయయ్య సూటల్ యజమాని పాత్రలు ఒకే నాటకంలో ఒకే వేదికపై నటించి ప్రేక్షకులను మెప్పించి ఓ చరిత్ర సృష్టించారు.
అంతరించిపోతున్న జానపద కళలకు గత వైభవాన్ని సంతరింపజేయాలన్న వీరి భావాలకు స్వాగతం పలుకుదాం. ఉపాధ్యాయుడిగా ప్రారంభమైన జానపద కళావాహిని నరసయ్యగారి జీవిత అధ్యాయం తన ప్రతిభ తరగతిగదిలోని నాలుగు గోడల మధ్యనుండి బయటపడి విశ్వవ్యాప్తమైనది. నాటకరంగ కళామతల్లి పాదాలు కడిగే ఈ జానపద జలపాతాన్ని ఆపే శక్తి కాలానికి లేదని రుజువైనది. 25 సంవత్సరాల నాడు స్థాపించిన జానపద కళాకేద్రం వీరి నాయకత్వంలో జానపద కళాకారుల మోడువారిన జీవితాలకు కొత్త చిగుళ్ళను తొడుగుతున్నది. తెలుగు జానపద కళారంగాన్ని ఉద్ధరించటానికే ఉ ద్భవించిన కారణజన్ముడు శ్రీ కర్నాటి నర్సయ్యగారు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
కర్నాటి అడుగు జాడలు
► 1945 ప్రజానాట్యమండలి సభ్యత్వం
► 1965 ఆంధ్రనాటకకళా సమితి స్థాపన
► 1979 సోవియట్ యూనియన్ పర్యటన
► 1983 షష్టిపూర్తి ఉత్సవం(అక్టోబరు 11) ‘ప్రజానటుడు’ బిరుదు ప్రదానం
► 1987 జానపద కళాకేంద్రం స్థాపన
► 1991 నటజీవన స్వర్ణోత్సవం
► 1991 తానా(అమెరికా)వారి తెలుగు సభలకు ఆహ్వానం, సత్కారం.
► 1996 కర్నాటి సప్తతి సన్మాన మసూత్సవం
► 1999 కళాయశస్వి, కళావిరాట్ బిరుదుల ప్రదానం
► 2007 ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్నాటి నాటక జాపకాలు 20 భాగాలుగా రికార్డు చేసి ప్రసారం చేసారు.
► 2013 – పట్టాబి కళాపీఠం వారిచే ప్రతిభా పురస్కారం.
ఇంకను లెక్కకు మించిన పురస్కారాలు, సత్కారాలు అందుకొన్నారు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
-బి.ఎం.పి. సింగ్
Great service for drama and burrakatha. rest in peace.