అలనాటి అందాల నటి గీతాంజలి అక్టోబర్ 31 తెల్లవారుజామున ఆకస్మికంగా గుండె పోటుకు గురై మృతి చెందారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. సుమారు ఐదు దశాబ్దాల సినీ జీవితంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, సినీ ప్రియుల హృదయాలకు ఆమె సన్నిహిత మయ్యారు. ఆమె మరణంతో తెలుగు చిత్రసీమ ఒక విలక్షణ తారను కోల్పోయినట్లయింది. ఆమెకు శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నారు.
గీతాంజలి అసలు పేరు మణి. ఆమె స్వస్థలం కాకినాడ. 1947లో జన్మించారు. ఆమె తొలి చిత్రం 1960లో వచ్చిన ‘రాణీ రత్నప్రభ’. అందులో ఎన్టీ రామారావు హీరో. ఒక పాటలో డాన్సగా గీతాంజలిని చూసిన ఆయనకు ఆమె ముఖం బాగా నచ్చింది. దాంతో 1961లో తను రావణాసురునిగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’లో ఆమెకు సీత పాత్ర ఇచ్చారు. ఎన్టీఆర్. అందులో మణి అనే తన అసలు పేరుతోటే ఆమె నటించారు. ఆ మూవీలో శ్రీరాముని పాత్రను అప్పటి అందాల నటుడు హరనాథ్ పోషించారు. ఆమె పేరును “గీతాంజలి’గా మార్చింది హిందీ ప్రసిద్ధ దర్శకుడు బాబూభాయ్ మిస్త్రీ, ఆయన డైరెక్షన్లో లక్ష్మీకాంత్-ప్యారేలాల్ నిర్మించిన హిందీ జానపద చిత్రం ‘పారసుణి’లో గీతాంజలి రాజకుమారిగా హీరోయిన్ రోల్ చేశారు. టైటిల్ లో ‘మణి’ అని ఉండటంతో ఆమె తెర పేరును గీతాంజలిగా మార్చారు బాబూభాయ్. అప్పట్నుంచీ అదే పేరును ఆమె కొనసాగించారు.
13 సంవత్సరాలపాటు నిర్విరామంగా హీరోయిన్‌గా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రకరకాల పాత్రలు పోషించి, విలక్షణ నటిగా పేరుపొందిన గీతాంజలి, సహనటుడు. చక్కని హీరోగా గుర్తింపు పొందిన రామకృష్ణను ప్రేమ వివాహం చేసుకొని ఒకటిన్నర దశాబ్దం పైగా సినిమాలకు దూరమయ్యారు. అప్పటి అగ్ర హీరోలు, హీరోయిన్లతో ఆమె పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమాల్లో ‘డాక్టర్ చక్రవర్తి’, ‘తోడు నీడ’, ‘దేవత’, ‘లేత మనసులు’, పొట్టి ప్లీడరు’.. ‘అవే కళ్లు’, ‘పూలరంగడు’, ‘ప్రాణమిత్రులు’, సీజన్మ’, ‘రాము’, ‘బంగారు గాజులు’, ‘మంచి మిత్రులు’, రైతే రాజు’, ‘జాతకరత్న మిడతంబొట్లు’, ‘కాలం మారింది’, ‘పెద్దలు మారాలి వంటివి ఉన్నాయి. పద్మనాభంతో ఆమె జొడి ప్రేక్షకులకు బాగా నవ్వులు పంచింది. పాటల్లో ఎంతో వేగంతో, నైపుణ్యంతో ఆమె వేసే డాన్సులు ప్రేక్షకుల్ని బాగా ఆలరించేవి.
రామకృష్ణ మరణానంతరం తిరిగి ఆమె తల్లి పాత్రలతో సినిమాల్లో అడుగు పెట్టారు. ఈ మధ్య కాలంలో ‘పెళ్ళైన కొత్తలో’ (2006) సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. అందులో కోట శ్రీనివాసరావు భార్యగా, జగపతిబాబు నాయనమ్మగా ఆమె కీలక పాత్ర చేశారు. తమన్నా హీరోయిన్ గా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ ఆమె చివరి చిత్రం. అదింకా విడుదల కావాల్సి ఉంది.