పత్రికా చక్రవర్తి రాఘావాచారి

( రాఘావాచారి కిడ్నీ క్యాన్సర్ తో హైదరాబాద్లో 28-10-19 న తుదిశ్వాస విడిసారు.)
తెలుగు పత్రికా రచయితల్లో నిరుపమానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో పండి తుడు. ఆయన మూర్తీభవించిన నిజాయితీపరుడు. ఆ నిజాయితీ వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
సాంప్రదాయక అష్టగోత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయిదో ఏటి నుంచే ప్రబంధాలు, ప్రాచీన కావ్యాలు, రామాయణ మహాభారతాలు చదివారు. ఆయనకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ నేర్పడానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. సంస్కృతం నేర్చుకోవడానికి ఆయనను ఆంధ్ర ప్రాంతంలోని పొన్నూరు పంపించారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో జన్మించిన రాఘవాచారి సికింద్రాబాద్ సమీపంలోని లాలాగూడ రైల్వే పాఠశాలలో 11వ ఏట అయిదో తరగతీలో చేరారు. 1953 నుంచి రాఘవాచారి విశాలాంధ్ర చదవడం ప్రారంభించారు. నిజాం కళాశాలలో పి.యు.సి.లో చేరిన తరు వాత పిలక తీసేశారు. పి.యు.సి.లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతటిలో ఆరవ ర్యాంకు సాధించారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. కానీ ఇంజనీరింగు రెండో సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఆయనకు చదువు మీద ఆసక్తి తగ్గింది. వరంగల్ వెళ్లి బీ.ఎస్సీ.లో చేరారు. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో చేరారు. కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. పట్టభద్రుడైన తరువాత హైదరాబాద్ వచ్చి న్యాయశాస్త్రం అభ్యసించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధిగా లా కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్ష స్థానానికి పోటీ చేశారు. అప్పుడు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. ఇంగ్లిష్ చదువుతున్న ఎస్. జైపాల్ రెడ్డి వంటి వారు తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసినా రాఘవాచారి అఖండ విజయం సాధించారు. న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత ఎల్.ఎల్.ఎం. చేశారు.
1969-71 మధ్య ఆయన ఢిల్లీ నుంచి వెలువడే వామపక్ష అనుకూల పేట్రియట్ ఇంగ్లిష్ పత్రిక విలేకరిగా పనిచేశారు. 1971లో ఆయన విజయవాడ వెళ్లి విశాలాంధ్రలో చేరారు. కొద్ది కాలానికే ఆ పత్రికకు సంపాదకులయ్యారు. 28 ఏళ్ల సుదీర్ఘ కాలం విశాలాంధ్ర సంపాదకులుగా ఉన్నారు. ఆయన సంపాదకీయాలు సూటిగా, స్పష్టంగా ఉండేవి. స్పష్టత, సంక్షిప్తత ఆయన శైలి. ‘తెలుగు పత్రికల పరిణామం-ప్రయోగాలు-ప్రయోజనం’ అన్న వ్యాసంలో తెలుగు పత్రికా రంగంలో వాడే భాష ప్రామాణీకరణ జరగలేదని విచారం వ్యక్తం చేశారు.
విజయవాడలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉపన్యాసకుడిగా ఆయనను ఆహ్వానించే వారు. ఆయన మాటల్లో అడుగడుగునా వ్యంగ్యం తొణికిసలాడుతుంది. ఆయన గొప్పవాడిగా కనిపించే ప్రయత్నం ఎన్నడూ చేయరు. మేధావిగా ఆయనకు ఎంత గుర్తింపు ఉన్నా ఎనిమిది పదుల వయసు నిండిన రాఘవాచారిలో కలివిడితనం తగ్గలేదు. ఆయనతో మాట్లాడిన వారు ఎవరైనా ఆయన జ్ఞాన విస్తృతి చూసి ముచ్చ టపడతారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన చేసిన సేవను తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్న రాఘవాచారి నిస్సందేహంగా మేధావి అయిన సంపాదకుడే.

-చెన్నమనేని రాజేశ్వర రావు

1 thought on “పత్రికా చక్రవర్తి రాఘావాచారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap