- నటి పూర్ణిమకు గుంటూరు లో ఆలాపన వారి “అక్కినేని శతజయంతి పురస్కారం”
ముద్ద మందారం హీరోయిన్ పూర్ణిమను చూసి న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ బాల్యంలో చూసిన సినిమాలు గుర్తు చేసుకుని సంతోషంలో మునిగితేలారు! మా పల్లెలో గోపాలుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, తరంగిణి తదితర చిత్రాలలో పూర్ణిమ నటనా ప్రతిభను గుర్తు చేసి అభినందించారు. ఆదివారం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆలాపన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కినేని శత జయంతి పురస్కారం 50 వేల రూపాయల నగదుతో అలనాటి నటి పూర్ణిమను సన్మానించారు.
నటి పూర్ణిమ స్పందిస్తూ గుంటూరులో ‘అక్కినేని పురస్కారం‘ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆది దంపతులు చిత్రంలో అక్కినేనిగారి చెల్లెలుగా నటించే అదృష్టం తనకు లభించిందని చెప్పారు. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే నటిస్తూనే వున్నానని, రంగులరాట్నం సీరియల్ చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబం కోసం పిల్లల పెంపకం కోసం మంచి బ్రేక్ లోనే సిమిమాలకు గ్యాప్ తీసుకున్నట్లు తెలిపారు. హరిశ్చంద్ర సినిమాలో మహానటి సావిత్రి కుమార్తె పాత్రలో బాల నటిగా సినిమా రంగంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. సినీ గాయనిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు జంధ్యాల గారు హీరోయిన్ గా పరిచయం చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాల్లో నటించిన తరువాత హీరోయిన్ తో ఐటమ్ సాంగ్స్ చేసే ట్రెండ్ రావడంతో ఇష్టం లేక సినిమాలను వదిలి కొన్నాళ్ళు బ్రేక్ తీసుకున్నట్లు చెప్పారు.
డా. మహ్మద్ రఫీ సభాధ్యక్షత వహించిన సభలో గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్. జి.బి. పార్ధసారధి, న్యాయమూర్తి వి. రాజగోపాల్, జగ్గయ్యపేట న్యాయమూర్తి ఎం. శోభారాణి, గుంటూరు జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు టి. సునీత, సీనియర్ న్యాయవాదులు బీరం సాయిబాబు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు వి.జె. బ్రహ్మారెడ్డి, కె. కృష్ణ కిషోర్, పి. హృదయరాజు, ప్రముఖ న్యూరో సర్జన్ డా. వేమూరి నాగశంకర్, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ సంస్థ జాతీయ అధ్యక్షులు బాబు మిరియం, డి. శ్వేత చౌదరి, జె. శ్రీనిలత తదితరులు పాల్గొన్నారు. పూర్ణిమ శ్రీవారు మెరైన్ ఇంజనీర్ రతన్ ను ప్రత్యేకంగా సత్కరించారు.
న్యాయమూర్తి శోభారాణితో పాటు న్యాయవాది కొల్లా వెంకటేశ్వరరావు, రసూల్ బాబు, హెలెన్ కుమారి, సుధా శ్రీనివాస్ తదితరులు అక్కినేని, పూర్ణిమ నటించిన సినిమాల్లోని పాటలతో నిర్వహించిన సినీ సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో పూర్ణిమను గౌరవించడం విశేషం. ప్రేక్షకుల్లో ఎక్కువమంది న్యాయవాదులు వారి వారి కుటుంబాలతో హాజరవడం మరో విశేషం. ఆలాపన అధ్యక్షులు న్యాయవాది కొల్లా వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.
–డా. మహ్మద్ రఫీ