ఆహ్వాన పత్రాల్లో ‘ఘంటసాల కళా మండపం’ శంకుస్థాపన…!
చివరి నిమిషంలో ‘భారత్ కళా మండపం’ గా పేరు మార్పు ..!!
ఇదెక్కడి ఎన్నికల ప్రచారం స్వామి! కేంద్ర సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారని సంతోషించాలో, ఘంటసాల ను అవమానించారాని బాధపడాలో అర్ధం కావడం లేదు. ఎన్నో ఏళ్ల కల… హైదరాబాద్ లో సంగీత నాటక అకాడమీ ప్రాంతీయ కేంద్రం. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గా మన తెలుగు వాడు జి. కిషన్ రెడ్డి రావడం తో కొంచెం ఆశలు రేకెత్తాయి. మొత్తానికి ఇవాళ గచ్చిబౌలి CCRT కార్యాలయం ప్రాంగణంలో ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించారు. అలాగే అత్యంత ఆధునిక హంగులతో భారత్ కళా మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అభినందనలు.
అయితే, ఇక్కడ గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి జరిగిన అవమానం ఏముందని మీకు అనుమానం రావచ్చు. గత నాలుగు రోజులుగా కళాకారులకు, నాలాంటి కళాభిమానులకు, సెలబ్రిటీలకు, ప్రముఖులకు స్వయంగా జి. కిషన్ రెడ్డి గారు ఆహ్వానం పలుకుతూ రెండు పేజీల ఉత్తరాలు పంపించారు. అందులో ఘంటసాల కళా మండపం శంకుస్థాపన అనే రాశారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా కేంద్ర సంగీత నాటక అకాడమీ తెలుగు రాష్ట్రాలకు అందిస్తున్న కానుకగా అభివర్ణించారు. అలాగే అధికారిక ఆహ్వానపత్రంలోనూ అదే విధంగా ప్రచురించారు. కానీ, ఇవాళ ఉదయం వివిధ దిన పత్రికల్లో వచ్చిన ప్రకటనల్లో భారత్ కళా మండపం అని ప్రచురించారు.
ఇంకో విషయం ఏమిటంటే… కార్యక్రమాన్ని శిల్ప కళావేదికలో నిర్వహిస్తున్నారు. నిజానికి అక్కడ నుంచి కూతవేటు దూరంలోనే CCRT కార్యాలయం వుంది. ఆ శంకుస్థాపన ఏమిటో అక్కడే చేసేయవచ్చు. అక్కడ వేదిక కూడా వుంది. ఆ వేదిక పై సభా కార్యక్రమం కూడా పెట్టుకోవచ్చు. కానీ, భద్రతా రీత్యా అంటూ శిల్ప కళావేదికలో కార్యక్రమం ఏర్పాటు చేసి రిమోట్ తో ప్రారంభిస్తున్నట్లు యాక్షన్ చేశారు. వెనుక దానికి సంబంధించిన ఇన్విటేషన్ క్లిప్పింగ్ ఆవిష్కరించారు. పద్మవిభూషణ్ ఎం. వెంకయ్య నాయుడు, పద్మభూషణ్ పి. సుశీల, సాంస్కృతిక మంత్రి జూపల్లి కృష్ణారావు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు సంధ్య తదితరులు పాల్గొన్నారు. అదేదో CCRT లోనే నిర్వహిస్తే సరిపోయేది, ఇంత ఖర్చు, ఇంత హంగామా అవసరమా అని కళాకారులు పెదవి విరిచారు. ఇదంతా ఎన్నికల స్టంట్ అని చెప్పకనే తెలుస్తోంది.
ఇంతకీ ఘంటసాల పేరు రాత్రికి రాత్రి ఎందుకు మార్చేసినట్లు? మంత్రి కిషన్ రెడ్డి కి సంగీత నాటక అకాడమీ కి సరైన సమన్వయం లేదా? మాట నెగ్గలేదా? కేంద్ర పెద్దలు ఒప్పుకోలేదా? అసలేం జరిగింది? మళ్ళీ మంత్రి కిషన్ రెడ్డి గారే చెప్పాలి!
–డా. మహ్మద్ రఫీ
దీనికి ఏ విధంగా రియాక్ట్ కావాలో కూడా తెలియడం లేదు.
రాజకీయాలు ఉన్నచోట కళ మనుగడ సాగించలేదు.
కళాకారుల విద్య మరుగునపడి ఇలానే అవమానాలు ఎదురవుతాయి.