నేడు ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా…
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అద్దంకి మన్నార్… భాయియో ఔర్ బెహనో మై అమీన్ సయానీ బోల్ రహాహూ… ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సురమౌళి… రేడియో సిలోన్ నుంచి మీనాక్షీ పొన్ను దురై… ఇంకా రేడియో అక్కయ్య, అన్నయ్య, చిన్నక్క, రాంబాబు… ఇట్లా ఎన్నో గొంతులు ఈ తరానికి పరిచయం లేకపోవచ్చు. కానీ ఒకనాడు ఇంటింటా మార్మోగాయి. టీవీలూ, ఇంటర్నెట్ కూ ప్రజలు ఎంత అలవాటుపడినప్పటికీ అర్థవంతమైన, ఆరోగ్యవంతమైన భాషా వినియోగానికీ, భావాల ప్రసారానికీ రేడియో ఎంతో ఉపయోగపడే మాధ్యమం.
1981 ఆగస్టులో మొదలైన ఎంటీవీ ప్రారంభ కార్యక్రమంలో వీడియో కిల్ రేడియో స్టార్ అని పాట పాడారు. అయినా రేడియో అనేక ఆటుపోట్లు, అవరోధాల నడుమ ఇంకా సజీవంగానే ఉన్నది. దేశంలో నేటికీ ఆకాశవాణి 23 భాషల్లో, 179 మాండలికాల్లో తన ప్రసారాలను కొనసాగిస్తున్నది. భౌగోళికంగా దేశంలో 92 శాతం ఉన్న ప్రాంతాలకూ, 99.19 శాతం ప్రజలకూ తన ప్రసారాలను వినిపిస్తున్నది. బుందేల్ ఖండ్, గఢ్వాలీ, అవధ్, సంథాలీ లాంటి భాషల్లో 180కి పైగా కమ్యూనిటీ రేడియోలు ఉన్నా యంటే దాని రీచ్ను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రసార విస్తృతిని గమనించే ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ పేరున ప్రజలతో తన భావాలను పంచుకునేందుకు రేడియోను వాహకంగా ఉపయోగించుకుంటున్నారు.
ఇంతటి ప్రభావవంతమైన రేడియో ప్రసారాలను మోర్స్ 1844లో కనిపెట్టిన టెలిగ్రాఫ్ సుసాధ్యం చేసింది. టెలిగ్రాఫ్, టెలిఫోన్ ప్రాచుర్యంలోకి రాకముందే వ్యాక్యూమ్ ట్యూబ్ ద్వారా ధ్వని తరంగాలను పంపించే ప్రక్రియ రావడంతో రేడియో ప్రసారాలు సాధ్యమయ్యాయి. అమెరికాలో 1910-12 ప్రాంతంలోనే రేడియో మార్గదర్శకాలు రూపొందాయి. 1922 నాటికి ఇంగ్లండ్లో రేడియో ప్రసారాలు స్థిరీకరించ బడి, ‘బీబీసీ’ ఏర్పడింది. మనదేశంలో రేడియో వ్యవస్థ 1926లో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ముంబై, కోల్కతా నగరాల్లో 1927లో రేడియో కేంద్రాలను ఆరంభించింది. 1930లో ఆ సంస్థ ఇండియన్ స్టేట్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థగా మారింది. 1936లో ఆల్ ఇండియా రేడియోగానూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆకాశవాణి గానూ మారింది.
అనేక మార్పు, చేర్పులకు లోనై దేశవ్యాప్తంగా విస్తరించిన ఆకాశవాణిని 1997లో దూరదర్శన్ కలిపేసి సమాచార ప్రసారాల శాఖ నుంచి విడగొట్టారు. కొత్తగా ప్రసారభారతి చట్టాన్ని తెచ్చి నూతన వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఇతర మాధ్యమాలతో రేడియో తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నది. అయిన ప్పటికీ ఎలాంటి కేబుల్ ఛార్జీ, నెట్ఛార్జీ లేకుండా వినియోగదారులకు అందుతున్నది. ఎప్పటికీ అద్భుత మైన, అనువైన వినోద, సమాచార సాధనంగా రేడియో నిలిచిపోతుంది.
–వారాల ఆనంద్ (కవి, అనువాదకుడు)