‘వైజ‌యంతీ ‘ చిత్రం లో  అమితాబ్ బ‌చ్చ‌న్‌ తో ప్ర‌భాస్‌

వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో ప్ర‌భాస్‌, దీపికా ప‌డుకోనేతో జాయిన్ అవ‌నున్న లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్‌. సినీ ప్రియుల‌కు ఒక అద్భుత‌మైన సినిమా అనుభ‌వాన్ని ఇచ్చేందుకు ఒక‌ అగ్ర‌శ్రేణి నిర్మాణ సంస్థ‌, ఒక దూర‌దృష్టి క‌లిగిన ద‌ర్శ‌కుడు, భార‌తీయ చిత్ర‌సీమ‌లోని అతిపెద్ద న‌టీన‌టులు క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వీరికి విశేషాంశాలు క‌ల‌గ‌లిసిన ఒక చ‌క్క‌ని క‌థ తోడ‌వుతోంది.

ద‌క్షిణ భార‌త‌దేశంలోని ప్ర‌ఖ్యాత నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన వైజ‌యంతీ మూవీస్ త‌న‌ మెగా బ‌డ్జెట్‌, యూనివ‌ర్స‌ల్ అప్పీల్ ఉన్న బ‌హుభాషా చిత్రంలో ఒక కీల‌క పాత్ర చేయ‌డం కోసం లివింగ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్‌ను తీసుకొస్తుండ‌టం విశేషం.

తేజోవంత‌మైన 50 సంవ‌త్స‌రాలలో వైజ‌యంతీ మూవీస్ వివిధ భార‌తీయ భాష‌ల్లో చిర‌స్మ‌ర‌ణీయం అన‌ద‌గ్గ ప‌లు చిత్రాల‌ను నిర్మించింది. తెలుగు సినిమా కీర్తి ప‌తాకం ఎగ‌ర‌డంలో త‌న వంతు పాత్ర‌ను దిగ్విజ‌యంగా పోషించింది.

దిగ్గజ న‌టి సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన మునుప‌టి చిత్రం ‘మ‌హాన‌టి’ ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌ను అందుకుంది. దాని త‌ర్వాత ఇప్పుడు తీయ‌నున్న సినిమా వైజయంతీ మూవీస్ వ్య‌వ‌స్థాప‌కుడు అశ్వినీద‌త్ ఎంతో కాలంగా కంటున్న క‌ల.

అశ్వినీద‌త్ మాట్లాడుతూ, “శ్రీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ను దివంగ‌త లెజెండ‌రీ యాక్ట‌ర్ శ్రీ ఎన్టీఆర్ ఎంత‌గానో ఇష్ట‌ప‌డేవారు. అమితాబ్ చేసిన‌ కొన్ని సూప‌ర్‌హిట్ బాలీవుడ్ ఫిలిమ్స్ తెలుగు రీమేక్‌ల‌లో ఆయ‌న న‌టించారు కూడా. శ్రీ ఎన్టీఆర్‌, నేను క‌లిసి ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ అయిన ‘షోలే’ను అనేక‌సార్లు చూశాం. ఆ సినిమా ఎన్టీఆర్‌కు చెందిన రామ‌కృష్ణ థియేట‌ర్‌లో సంవ‌త్స‌రం పైగా ఆడింది. ఇన్నాళ్ల త‌ర్వాత మా బ్యాన‌ర్ వైజ‌యంతీ మూవీస్ నిర్మించ త‌ల‌పెట్టిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో భాగం అవుతున్న‌ భార‌తీయ సినిమా గ్రేటెస్ట్ ఐకాన్ శ్రీ అమితాబ్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం నిజంగా నాకు ల‌భించిన‌ అద్భుత‌మైన‌, అత్యంత సంతృప్తిక‌ర క్ష‌ణం. ఈ నిర్మాణ సంస్థ ప్ర‌యాణం శ్రీ ఎన్టీఆర్ న‌టించిన సినిమాతో మొద‌లైంది. వైజ‌యంతీ మూవీస్ అనే పేరు పెట్టింది కూడా ఆయ‌నే.” అని చెప్పారు.

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌లో త‌న ఆనందాన్ని పంచుకుంటూ, “ఎట్ట‌కేల‌కు ఒక క‌ల నిజమ‌వుతోంది.. లెజండ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ సార్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్నాను.. #NamaskaramBigB” అని పోస్ట్ చేశారు.

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, “త‌న‌కున్న ఎన్నో ఆఫ‌ర్ల‌లో మా ఫిల్మ్‌ను అమితాబ్ బ‌చ్చ‌న్ సార్ ఎంచుకోవ‌డం నాకు ల‌భించిన అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయ‌న‌ది పూర్తి స్థాయి పాత్ర‌. ఆయ‌న అయితేనే ఆ పాత్ర‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని మేం న‌మ్ముతున్నాం” అని ఉద్వేగంగా తెలిపారు.

వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమా ప‌తాకాల‌పై నిర్మించిన ప‌లు సినిమాలు కంటెంట్ ప‌రంగా, సాంకేతిక విలువ‌ల ప‌రంగా అత్యున్న‌త స్థాయిలో రావ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తూ వ‌స్తోన్న స‌హ నిర్మాత‌లు స్వ‌ప్నా ద‌త్‌, ప్రియాంకా ద‌త్ ఈ చిర‌స్మ‌ర‌ణీయ సంద‌ర్భంలో త‌మ అనిర్వ‌చ‌నీయ‌మైన ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

డ్రీమ్ క్యాస్ట్ అన‌ద‌గ్గ అమితాబ్ బ‌చ్చ‌న్‌, ప్ర‌భాస్‌, దీపికా ప‌డుకోనే లాంటి నేటి భార‌తీయ సినిమా బిగ్గెస్ట్ స్టార్స్‌, సినీ మాంత్రికుడు అన‌ద‌గ్గ నాగ్ అశ్విన్ (‘మ‌హాన‌టి’ ఫేమ్‌) లాంటి డైరెక్ట‌ర్ క‌ల‌యిక‌లో రానున్న సినిమా కావ‌డంతో ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని ఓ సెల్యులాయిడ్ దృశ్య కావ్యాన్ని సినీ ప్రియులు ఆశించ‌వ‌చ్చు.

తెలుగు, తమిల్ మరియు హిందీ భాషల్లో 2022లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap