దర్శక విజయుడు ‘రాజమౌళి ‘

అక్టోబర్ 10న భారీ చిత్రాల ‘రాజ’మౌళి పుట్టినరోజు సందర్భంగా …

ఎస్.ఎస్.రాజమౌళి గురించి కొత్తగా పరిచయం చేసేది లేదు. కొత్తగా రాసేది లేదు. ఎందుకంటే ఆయన ఖ్యాతి నిజంగానే జగద్విదితం. తను కనే కలలు.. తను చేసే సినిమాల కథలు ముందే చెప్పేస్తారు. పాతికేళ్ళు..ముప్పయి ఏళ్ళు ముందు దర్శక..నిర్మాతలు సినిమా కథ గురించి చూచాయిగా మీడియా ద్వారా
చెబుతుండేవారు.

నలభై.. యాభై సంవత్సరాల క్రితం అయితే పాటల పుస్తకాల్లో దాదాపు కథంతా రాసేసి.. మిగతా కథ వెండితెరపై చూడండి అని ఇచ్చేవారు. తర్వాత తర్వాత స్టోరీ లైన్ తెలిస్తే ప్రేక్షకులకి సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు అని లేదా మిగిలిన వాళ్ళు, కాపీ కొట్టేస్తారని మార్నింగ్ షో వరకూ కథ లీక్ కాకుండా జాగ్రత్త పడసాగారు. కాని రాజమౌళి కథాంశం దాచరు. వీలైనంత మటుకు సినిమా ప్రారంభం అప్పుడో.. తర్వాత ప్రెస్ మీట్స్ లోనో చెప్పేస్తారు. మగధీర నుంచి అయితే ఖచ్చితంగా ప్రతి సినిమా థీమ్ ముందే రివీల్ చేస్తున్నారు. దానివల్ల జరుగుతున్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ సినిమా ఇలాంటి జోనర్ కి చెందిందని ఆడియన్స్ మైండ్ సెట్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవడం. ఇంకొకటి.. రాజమౌళి ఆడియన్స్ ని బహిరంగంగా ఛాలెంజ్ చేయడం. అంటే నా కథ ఇది..మీరేం ఊహించుకుంరో.. ఎంత ఊహించుకుంటారో ఊహించుకోండి దాన్ని మించి తీసి.. మీకు అందిస్తాను అని తనలోని క్రియేటివిటీని తనే ఛాలెంజ్ చేసుకుంటున్నారు రాజమౌళి, శాంతినివాసం టివి సీరియల్ తో కెరీర్ ప్రారంభించిన వ్యక్తి.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఆకట్టుకునే స్థాయి సినిమాల సృష్టికర్త అయ్యారు అంటే రాజమౌళి ప్రయాణం ఎలా సాగిందో.. ఎంతటి ఉన్నత శిఖరాల లక్ష్యంగా జీవించారో తెలుస్తుంది. స్టూడెంట్ నెంబర్ 1.. సింహాద్రి.. సై.. ఛత్రపతి.. విక్రమార్కుడు.. యమదొంగ..మగధీర.. మర్యాదరామన్న.. ఈగ.. బాహుబలి బిగినింగ్.. బాహుబలి కన్ క్లూజన్ అన్నీ వరుస హిట్సే. సినిమా సినిమాకి బాక్సాఫీస్ సరిహద్దులు దాటేశారు.

భాషా భేదం లేకుండా ప్రేక్షకులని వశం చేసుకునే ఇంద్రజాల విద్యలో మాస్టర్ డిగ్రీ చేశారు రాజమౌళి. దిష్టి చుక్కగా అయినా ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శక విజయుడు రాజమౌళి.. ఇంతవరకు హీరోయిజాన్ని ఎలివేట్ చేసిన కమర్షియల్ సినిమాలు.. ఆ బాలగోపాలం నోరు వెళ్ళ బెట్టి చూసే ఫాంటసీ సినిమాలు తీర్చిదిద్దిన రాజమౌళి తొలిసారి ఓ చరిత్రని కలగంటున్నారు. ఇద్దరు యోధాను యోధుల పోరాట పటిమని తన ఫాంటసీ జత చేసి ఆర్. ఆర్. ఆర్. గా రూపొందిస్తున్నారు రాజమౌళి. కొమరం భీమ్.. అల్లూరి సీతారామరాజుల పేర్లు చెబితే తెలుగుజాతి పౌరుషాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడి వళ్ళు గగుర్పొడుస్తుంది. ఇలాంటి అమరవీరుల కథని ఈ తరం తెలుగువారికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రేక్షకుడికి పరిచయం చేసే బృహత్ కార్యక్రమాన్ని భుజస్కందాలపై ఎత్తుకున్నారు రాజమౌళి.
ఇంతవరకూ ఒక తెలుగు దర్శకుడిగా ప్రపంచస్థాయి విజయం సాధించి తెలుగువారు గర్వపడేలా చేశారు రాజమౌళి. ఇప్పుడు తెలుగు చరిత్రని చెప్పి ప్రపంచం నివ్వెరపోయేంతటి ఘన విజయం సొంతం చేసుకుని.. తెలుగు జాతి గర్వం మీసం మెలి తిప్పేలా రాజమౌళి చేయాలని మనసారా ఆకాంక్షిద్దాం..
తోట ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap