తెలుగు మృత భాషకాకుండా జాగ్రత్త పడాలి

(తెలుగు మృత భాషకాకుండా జాగ్రత్త పడాలి -మండలి బుద్ధ ప్రసాద్)
తెలుగు భాషోద్యమానికి యువత నడుం కట్టాలని తెలుగు సమాఖ్య అధ్యక్షలు, అమ్మనుడి సంపాదకులు డాక్టర్ సామల రమేష్ పిలుపిచ్చారు. భాష లేందే దేశం లేదని, ప్రతి ఒక్కరూ మాతృభాషను ప్రేమించాలన్నారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ, పి.బి. సిద్ధార్ధ కళాశాల సభామందిరంలో మంగళవారం(21-02-2023) సాయంత్రం.. అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా సామల రమేష్ ప్రారంభోపన్యాసం చేస్తూ గత ఇరవైయేళ్ళ భాషోద్యమ సమాఖ్య కార్యక్రమాలు. తెలుగు భాషోద్యమ తీరు తెన్నుల్ని వివరించారు. యువకులు తెలుగు భాషోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నారు. ఇక మీదట భాషోద్యమ సమాఖ్య నిర్వహణలో యువకులు క్రియాశీలక పాత్ర వహించాలన్నారు.

ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రపంచ తెలుగు రచయితల గౌరవాధ్యక్షులు, మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ గారు మాట్లాడుతూ. గత ఇరవై యేళ్ళలో తెలుగుభాషోద్యమ సమాఖ్య సాధించిన విజయాలను ప్రస్తావించారు. దురదృష్టమేమంటే ఈ విజయాలేవీ అమలు కాలేదన్నారు.‌‌ ముఖ్యంగా తెలుగుభాషకు ప్రత్యేక. శాఖ ఏర్పాటు నిర్ణయం ఆచరణలోకి రాకపోవడం విచారకరమన్నారు. తెలుగు భాష దుస్థితికి కార్పొరేట్ సంస్థలు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.
ఇంగ్లీషులో చదువుకోకపోతే ఉద్యోగాలురావని తల్లిదండ్రుల మైండ్ ను వాష్ చేశారనిచెప్పారు. ఫలితంగా తెలుగు భాష అమలు కుంటుపడుతోందన్నారు.‌ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు అకాడమీని, తెలుగు సంస్కృత అకాడెమీగా మార్చడం అన్యాయమన్నారు. ప్రస్తుతం తెలుగుభాష పరిస్థితి బాగోలేక పోవడానికి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలే కారణమన్నారు.

ఇంగ్లీషుకు ఎవరూ వ్యతిరేకం కాదని, తెలుగుతో పాటు ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఇంగ్లీషు ఇందుకు మినహాయింపుకాదన్నారు. తెలుగు భాషను మృత భాషగా మారకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన వుందన్నారు. తెలుగువారు తెలుగు లోనే మాట్లాడాలి. తెలుగును జనభాషగా అమలు చేయడానికి తెలుగు వారందరూ కృషిచేయాలన్నారు. భారతీయ జాతీయోద్యమం మాతృభాషల అమలుకోసం ప్రారంభమైందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అమ్మనుడి తెలుగు భాషకు దీపస్తంభం లాంటిదన్నారు.

సభకు గారపాటి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు.. ఈ సందర్భంగా ‘అమ్మనుడి’ సంపాదకీయాల సమాహారం’ అనే పుస్తకాన్ని బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. దీంతో పాటు వలగూడు (వెబ్ సైట్) ను కూడా ఆయన ప్రారంభించారు.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు ఆచార్య బెల్లంకొండ‌ రాజశేఖర్, మాట్లాడుతూ భాషను బ్రతికించుకోకపోతే జాతికి మనుగడ ప్రశ్నార్ధకమౌతుంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా మాతృభాషలో జరుపవచ్చు.. జాతీయ విద్యావిధానం క్రింద అనువాద ప్రయత్నాలు మొదలవ్వడం సంతోషకరమైన విషయం అని అయితే విద్యార్ధులు, తల్లిదండ్రులు వద్దనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు..ఇంగ్లీషు మీడియం విద్యార్ధి కనీస నాలెడ్జ్ ఉంటంలేదు. వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందన్నారు. ఇంగ్లీష్ భాష‌వల్లే‌ వృద్ధి అనేది అపోహ‌ మాత్రమే అన్నారు. స్కూల్ భాషలో బ్రతికే‌ విద్యార్ధికి దురదృష్ట వశాత్తు ఇంటి భాష పరాయిభాష లా భావించే పరిస్థితి నెలకొందన్నారు. ఒక‌భాష పూర్తిగా వస్తే,మరో భాష ఏదైనా చక్కగా వస్తుందిని అభిప్రాయపడ్డారు.

ఆంధ్ర లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ…71 వ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యేళ్ళ క్రితం వరకూ ప్రపంచంలో పదివేల భాషలున్నాయన్న అంచనాలుంటే ప్రస్తుతం వాటి సంఖ్య 6500 వరకూ పడిపోయాయని,
2050 నాటికి 500 కి, మరో 20 ఏళ్ళకు 300 లకు పడిపోవచ్చని భాషా శాస్త్రవేత్తలు అంచనా వేశారన్నారు. హిబ్రూ భాష పూర్తిగా నశించే‌సమయంలో వారి భాషను బ్రతికించుకున్నారని, ఇప్పటివరకూ నోబెల్ అందుకున్న మేథావులలో 20 శాతం హిబ్రూ భాషలో చదువుకుని పరిశోధనలు చేసిన వారేనన్నారు.

నందివెలుగు ముక్తేశ్వరరావు, విఠపు బాల సుబ్రహ్మణ్యం, రహీముద్దీన్.. ఆచార్య జోగాసింహ్..ప్రభృతులు తెలుగు భాష ఔన్నత్యం, అమలు గురించి ప్రసంగించారు.

ఎ. రజాహుస్సేన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap