నేనూ మారలేదు – నా ఇల్లూ మారలేదు

(ప్రముఖ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన సందర్భంలో)

ఆలిండియా రేడియో వార్తావిభాగంలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావుగారికి ఓ కన్ను వార్తలమీద, ఓ చెవి సంగీతం మీద. ఒక చెవి అని ఎందుకు అంటున్నానంటే సంగీతం అంటే చెవి కోసుకునే అభిమాని కాబట్టి.
ఓసారి బెజవాడ నుంచి మంచి నడి ఎండాకాలంలో వస్తున్న వారి అమ్మగారిని రిసీవ్ చేసుకోవడానికి సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళారు. గోల్కొండ రైలులో ఆవిడ దిగారు. అదే రైలులో ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామిగారు కూడా వచ్చారు. ఆయన్ని చూడగానే కృష్ణారావుగారు వారి అమ్మగారిని ఓ సిమెంటు బెంచి మీద కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తానని చెప్పి రామస్వామిగారివద్దకు వెళ్ళారు. ఆయన వయొలిన్ పెట్టె ఒక చేతిలో, మామిడి పళ్ళ బుట్ట మరో చేతిలో పట్టుకుని రైలు దిగారు. సూటుకేసు పట్టుకోవడానికి మరో చేయి లేక అటూఇటూ చూస్తుంటే కృష్ణారావు గారు ఆయన్ని పలకరించి వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లి హోటల్లో దిగబెట్టారు. ఇంతలో తల్లి గుర్తుకువచ్చి మళ్ళీ స్టేషన్ కు వెడితే ఆవిడ గాభరాగా ఈయన కోసం వెతుక్కుంటూ ఉన్నారట. అలా వుంటుంది కృష్ణారావుగారికి సంగీతం మీద అనురక్తి, సంగీతకారులు అంటే గౌరవ ప్రతిపత్తి.
రామస్వామిగారు బెజవాడ రేడియో స్టేషనులో హై గ్రేడ్ ఆర్టిస్టుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. అక్కడే న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన కృష్ణారావు గారికి అలా రామస్వామి గారితో పరిచయం.

1968లో హైదరాబాదు రవీంద్ర భారతిలో 150వ త్యాగరాయ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. జంట నగరాలలోని ప్రభుత్వ సంగీత కళాశాలల ప్రిన్సిపాల్స్ గా పనిచేస్తున్న శ్రీ నూకల సత్యనారాయణ, శ్రీ దంతాలే ఈ ఉత్సవాల నిర్వాహకులు. అనేక ప్రాంతాల నుంచి ఉద్దండులైన సంగీత విద్వాంసుల కచ్చేరీలు ఏర్పాటు చేశారు. వీరిలో అన్నవరపు రామస్వామి గారు కూడా వున్నారు. కచ్చేరీ సమయానికి ముందుగానే ఆయన ఓ అంబాసిడర్ కారులో రవీంద్రభారతికి చేరుకున్నారు. వయొలిన్ పెట్టె ఆయనకు ప్రాణం. దాన్ని ఎవరి చేతికీ ఇవ్వరు. స్వయంగా దాన్ని పట్టుకుని కారు దిగి డోరు వేస్తుంటే ఆయన చేతి వేలు నలిగిపోయింది. అయినా సరే బాధ ఓర్చుకుంటూ వేదిక మీదికి వెళ్లి కచ్చేరీ ప్రారంభించారు. వేలు బాగా వాచిపోయింది. కచ్చేరీ ఎలాగా అని నిర్వాహకులు కంగారు పడుతుంటే రామస్వామి గారు తన వయొలిన్ తో సభికులను ఉర్రూతలూగించారు. సంగీతం పట్ల ఆయన నిబద్ధత అలాంటిది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి రామస్వామిగారు అనేక కచ్చేరీలలో వయొలిన్ సహకారం అందించారు. వారిద్దరినీ సంగీత అభిమానులు ‘రామకృష్ణులు’ అనేవారు.
అలాగే విజయవాడ రేడియో స్టేషనులో అన్నవరపు రామస్వామిగారు (వయోలిన్), దండమూడి రామమోహనరావు (మృదంగం) చాలా పేరుపొందిన కళాకారులు. వారికి బయట నుంచి కచ్చేరీలకు ఆహ్వానాలు వస్తుండేవి. ఆఫీసులో వీరి మీద ఆజమాయిషీ చేసే అధికారికి అది నచ్చేది కాదు. అందుకని కార్యక్రమాల జాబితా రూపొందించేటప్పుడు, బయట ప్రోగ్రాములకి వీలు కుదరకుండా వీరిద్దరికీ కలిపి రేడియోలో డ్యూటీ వేసేవారు.
మాండలిన్ శ్రీనివాస్ కి మొదట్లో ప్రోత్సాహం ఇచ్చింది రామస్వామిగారే. తన మనుమరాలిని శ్రీనివాస్ కు ఇచ్చి పెళ్లి కూడా చేశారు.

ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామంలో అతిపేద మంగళ వాయిద్య కళాకారుల కుటుంబంలో జన్మించిన అన్నవరపు రామస్వామి గారు వారాలు చేసుకుంటూ మొదట మాగంటి జగన్నాధం చౌదరిగారి వద్దా, ఆ తరువాత పారుపల్లి వారి వద్దా శిష్యరికం చేసి వయొలిన్ వాయిద్యంలో మెళకువలు అభ్యసించారు. వారి సోదరులు అన్నవరపు గోపాలంగారు కూడా ఘటం విద్వాంసులుగా ఆకాశవాణిలో పనిచేశారు. తండ్రి పెంటయ్యగారు సోమవరప్పాడు గ్రామంలో నాదస్వర కళాకారుడు.
కృష్ణారావుగారు ఒకసారి, బహుశా రెండు మూడేళ్ల క్రితం కాబోలు, విజయవాడ వెడుతూ రామస్వామిగారికి ఫోన్ చేసి ‘మీ ఇల్లు సూర్యారావు పేటలోనేనా, మారారా’ అని అడిగారుట. ‘నేనూ మారలేదు, ఇల్లూ మారలేదు’ అనేది అన్నవరపువారి జవాబు.

కృష్ణారావు గారు వెళ్ళే సరికి ఆ వీధివీధంతా బహుళ అంతస్తుల భవనాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. వెతుక్కుంటూ వెడితే రామస్వామి గారు ఇల్లు కనపడింది. ఆ ఒక్క ఇల్లే ఆ వీధిలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే వుంది. వీధి గుమ్మానికి ఒక పక్కన గుండ్రటి అక్షరాలతో ‘అన్నవరపు రామస్వామి’ అనీ, మరో వైపు ‘రామకృష్ణ నిలయం’ అని రాసి వున్న బోర్డులు కూడా ఎలాంటి మార్పు లేకుండా వున్నాయి. ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం సాదా సీదాగా కట్టుకున్న ఆ ఇంటికి తన గురువుగారయిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి పేరు పెట్టుకున్నారు.

పారుపల్లి వారు త్యాగరాయ గురు శిష్య పరంపరలోని వారు. ‘సంగీతాన్ని నమ్ముకోండి, అమ్ముకోకండి’ అనే త్యాగరాజు గారి బోధనలను వంటబట్టించుకున్నవారు.
అందుకే, రామస్వామి గారు కూడా వందలాదిమంది శిష్యులను తయారు చేసినప్పటికీ, తన గురువు గారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఏనాడు ఎవరినుంచీ గురుదక్షిణ తీసుకోకుండా సంగీత సేవ చేస్తున్నారు.
రేడియో స్టేషన్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయన ప్రతిరోజూ సైకిల్ మీదనే వచ్చేవారు. గోచి పోసిన పంచె లాల్చీ ఆయన ఆహార్యం.

– భండారు శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap