పునర్జన్మ చిత్రానికి 60 ఏళ్ళు

(‘పునర్జన్మ’ చిత్రానికి 60 ఏళ్ళు పూర్తైయిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…)

మంచి కథ, ఉత్తమ నటన, అత్యుత్తమ దర్శకత్వం కలబోసి తీసిన తెలుగు చలన చిత్రాలు అన్నీ అఖండ విజయం సాధిస్తాయని అనుకోవడం పొరపాటు. మల్లీశ్వరి, బాటసారి, పూజాఫలము, బంగారు పంజరం, సుడిగుండాలు, బీదలపాట్లు, ప్రాణదాత వంటి విలువలు కలిగిన చిత్రాలకు ‘మంచి చిత్రాలు’ అనే ముద్ర పడుతుందే తప్ప… కాసులు రాలవు, ఆ కోవలోదే ‘పునర్జన్మ’ చిత్రం. ఈ చిత్రం విడుదలై 29-08-2023 నాటికి 60 సంవత్సరాలు నిండుతాయి. ఈ చిత్రంలో మతిచలించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన అక్కినేని నాగేశ్వర రావు నటనకు కొలబద్ద లేదు. ఈ చిత్రాన్ని సింహావలోకనం చేసుకుందాం….

పి.ఏ.పి. ప్రతిష్ట: ప్రఖ్యాత నిర్మాత పి.ఏ.పి. సుబ్బారావు అనే అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన సినీ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ (పి.ఏ.పి.). ఈ సంస్థ ద్వారా సుబ్బారావు 22 తెలుగు, ఒక తమిళం, 3 హిందీ చిత్రాలు నిర్మించారు. విజయా, సురేష్, అన్నపూర్ణ సంస్థలకు ధీటుగా చిత్రాలు నిర్మించిన ప్రతిష్ఠాత్మక సంస్థ పి.ఏ.పి. ఇది మహాకవికి శ్రీశ్రీకి మాతృసంస్థ వంటిది. ఒకానొక సందర్భంలో తన రచనలపై విమర్శచేయ సాహసించిన ఒక సినీకవిని హెచ్చరిస్తూ “పి.ఏ.పి. లో నేరాసిన ఒక సంగం పాటకతికేవు. ఎందుకు నీ నీతులు.. నా ఎంగిలితిని బతికేవు” అంటూ ఘాటుగా సమాధానమిచ్చిన శ్రీశ్రీ, పి.ఏ.పి సంస్థను ఎంతగా అభిమానించేవారో తెలియజేయడానికి ఈ వ్యాఖ్య చాలు. 1953 లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన ‘పెంపుడుకొడుకు’ఈ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం. 1959 లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ‘ఇల్లరికం’ నిర్మించిన తర్వాత అతని వద్ద సహాయకునిగా పనిచేసిన కె. ప్రత్యగాత్మతో ‘భార్యాభర్తలు’ (1961), ‘కులగోత్రాలు’ (1962) నిర్మించి తదనంతర ప్రయత్నంలో ‘పునర్జన్మ’ చిత్రానికి శ్రీకారం చుట్టారు నిర్మాత సుబ్బారావు. ఈ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ దాదాపు విజయవంతమైనవే. వైవిధ్యం కోసం ‘పునర్జన్మ’ చిత్రాన్ని ప్రత్యగాత్మ ప్రయోగాత్మకంగా నిర్మించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద వున్న అచంచల విశ్వాసంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తే ఆశించినంత విజయాన్ని ఈ చిత్రం సాధించలేక పోయింది. కానీ, ఒక మంచి చిత్రంగా అందరి మన్ననలు పొందింది. ఈ చిత్రానికి హిందీ రచయిత గుల్షన్ నందా రాసిన ‘పత్ధర్-కీ-హో(ట్)’ నవల ఆధారం. ప్రజా నాట్యమండలి సభ్యుడిగా ఉంటూ ప్రత్యగాత్మ మద్రాసులో ‘జ్వాల’అనే పత్రికను నడిపేవారు. ఆ అనుభవంతోనే ఈ చిత్రానికి ఆచార్య అత్రేయతో కలిసి సంభాషణలు రాశారు. సొంతంగా స్క్రీన్ ప్లే కూడా సమకూర్చిన పునర్జన్మ చిత్రానికి సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు.

చిత్ర కథ టూకీగా: ఈ సినిమా హీరో గోపి (అక్కినేని) చిత్రకారుడు, శిల్పి. సంగీతమన్నా, కళలన్నా ఎంతో ఇష్టం. తండ్రి (గుమ్మడి) పెద్ద జమీందారు. గుమ్మడి చెల్లెలు యశోదాదేవి (సూర్యకాంతం) కూతురు వాసంతి (వాసంతి) అక్కినేనిని ప్రేమిస్తుంది. కళాకారుడైన గోపి అత్యద్భుతమైన ఒక శిల్పాన్ని మలుస్తాడు. ఆ శిల్పసుందరిని ఊహించుంటూ, సితారను మీటుతూ గానం చేస్తున్నప్పుడు, పొరపాటున అగ్ని ప్రమాదంజరిగి ఆ శిల్పం తగలబడిపోతుంది. ఊహించని ఈ పరిణామానికి తట్టుకోలేని గోపి మతిస్థిమితం కోల్పోతాడు. మానసిక వైద్యులు నాట్యం, సంగీతం తెలిసిన వాళ్లెవరైనా గోపికి తోడువుంటూ సేవ చెయ్యగలిగితే అతనిలో మానసిక పరివర్తన సాధ్యమేనని, తిరిగి మామూలు మనిషౌతాడని సలహా ఇస్తారు. వాసంతిని గోపికి తోడుగా వుంచమని జమీందారు తన చెల్లెల్ని కోరితే ఆమె ససేమిరా అంటుంది; వాసంతికి గోపి మీద ప్రేమ వున్నా ఆమె ఆటాపాటా రాని అశక్తురాలు… అంచేత గోపికి డాక్టరు చెప్పిన సేవలు చేయగలిగిన కళాకారిణి కోసం అన్వేషిస్తుండగా నర్తకి రాధ (కృష్ణకుమారి) జమిందారుకి తారసపడుతుంది. ఆమెను దివాణంలో గోపి సేవలకోసం నియమిస్తాడు. గోపికి రాధ సేవలు చేస్తూవుండగా, ఒకరోజు బంగళాలో పిల్లలు ఆడుకుంటున్న బొమ్మల పెళ్లిచూసి గోపి రాధ మెడలో తాళి కడతాడు. అందరూ నిర్ఘాంతపోతారు. రాధ గోపీని కళామందిరానికి తీసుకెళ్ళి అతనికి పూర్వజ్ఞానం వచ్చేలా చేస్తుంది. గోపి స్పృహతప్పి మరలా మామూలు మనిషౌతాడు. కానీ, రాధను మర్చిపోతాడు. మేనత్త గోపిని వాసంతికిచ్చి పెళ్లి చెయ్యాలని నాటకం ఆడుతుంది. రాధ బంగాళా వదిలి వెళ్లిపోతుంది. వాసంతి గోపికి నిజం చెప్పడంతో గోపి రాధను కలిసి, మతిపోయినట్లు నటించి, రాధను తనదాన్ని చేసుకుంటాడు.

సంగీత సౌరభాలు ఈ సినిమా పాటలు: ఈ చిత్రానికి సంగీతమే ఆయువుపట్టు. ఎందుకంటే ఈ చిత్రంలో హీరో సంగీతాభిమానిగా మెలిగే చిత్రకారుడు. తను మలిచిన శిల్పం సజీవమై నర్తిస్తుంటే ‘ఓ.. సజీవ శిల్ప సుందరీ.. నా జీవన రాగ మంజరీ.. ఎవరివొ నీ వెవరివో’ అనే ఘంటసాల ఆలపించిన శ్రీశ్రీ గీతం సినిమా మొదలైన కొద్దిసేపటికే వస్తుంది. చిత్రం మొత్తాన్ని మలుపు తిప్పే ఈపాటను కళ్యాణి, మోహన రాగాల్లో మేళవించి చలపతిరావు వరసకట్టగా, నాట్యమయూరి ఎల్. విజయలక్ష్మి ఈ పాటకు చేసిన ఆకర్షణీయమైన నృత్యం అప్పుడే అయిపోయిందా అనిపించేలా చిత్రీకరించారు ప్రత్యగాత్మ. ఈ పాటకు సితార్ విద్వాంసుడు జనార్దన్ పలికించిన స్వరాలను వింటుంటే అవి వీణానాదాలా అని భ్రమించేలా వుంటాయి. “నీకర కంకణ నిక్వణమా..అది..వాణీవీణా నినాదమా, నీ పద నూపురనిస్వనమా..అది..జలధితరంగ మృదంగరావమా” అని శ్రీశ్రీ పద ప్రయోగం వెనకవున్న రహస్యమిదే. ఈ పాట వింటుంటే పాశ్చాత్య దేశాల్లో తరచుగా వినిపించే ‘సింఫనీ’లు గుర్తురాక మానవు. రెండోది దాశరథి రాయగా సుశీల ఆలపించిన ‘అందగాడా మనసులోని మర్మమేదో తెలుసుకో’ అనే ఖావ్వాలి పాట; కృష్ణకుమారి పరిచయ గీతం. ఈ పాటకి సారంగితో ప్రయోగించిన బి.జి.ఎం హిందుస్తానీ పోకడల్ని గుర్తుకు తెస్తుంది. మూడోది సి.నారాయణరెడ్డి రచనలో “నీకోసం.. నీకోసం.. నా గానం నా ప్రాణం నీకోసం” అనే టర్నింగ్ పాయింట్ సాంగ్. ఈపాట చాలా మంద్రస్థాయిలో నడుస్తూ, చిత్రంలో మూడు సార్లు వస్తుంది. ఎంతో హృద్యంగా సుశీల పాడిన ఈపాటకు ఆద్యంతం క్లోజ్ అప్ షాట్లే వుంటాయి. అక్కినేని నటనాకౌశలం చూపేందుకే ఈ ప్రయోగం చేశారు. ఈ పాటే గోపిలో మార్పు వచ్చేందుకు సహకరిస్తుంది. నాలుగోపాట గోపికి అంచలంచలుగా గత దినాల జ్ఞాపకాలు పరిమళింపచేసే క్రమంలో రాధ చేసే ప్రయోగపు ఫలితం. ఈ పాట చివర్న గోపికి గతం తెలిసి స్పృహకోల్పోయి మామూలు మనిషి అవుతాడు. శ్రీశ్రీ రాసిన ఈ పాట ఒక ప్రబోధగీతంలా వుంటుంది. “మానవుడా.. మానవుడా… మనసు తెరచి చూడు.. నిజము తరచి చూడు” అంటూ సాగే పాట వినేదానికన్నా సన్నివేశ చిత్రీకరణలో సందర్భోచితంగా వుంటుంది… ఎందుకంటే ఇది సన్నివేశంకోసం రాసింది కనుక. ఇక ఐదోపాట విషయానికొస్తే జగపతి వారి ‘ఆరాధన’ చిత్రంలో శ్రీశ్రీ రాసిన “నా హృదయంలో నిదురించే చెలీ” పాటను ఒకసారి గుర్తుచేసుకోవలసి వుంటుంది. శ్రీశ్రీ కి ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి. ‘ఆరాధన’ చిత్రంలో ఈ పాటలో వచ్చే సన్నివేశంలాటిదే ‘పునర్జన్మ’ చిత్రంలో కూడా వుంది. వాసంతి ఎదుట గోపి పియానోమీద పాడే “ప్రేయసి ప్రేమగా పిలిచిన వేళా…నా హృదయమే కడలియై పొంగెనిదేలా” అనే ఘంటసాల పాడిన ఈపాట కూడా శ్రీశ్రీ రాసిందే. అదే ట్యూను, అదే శైలి. అయితే ‘ఆరాధన’లో పాటకి వచ్చిన గుర్తింపు ఈ పాటకు ఎందుకో రాలేదు. ఆఖరి పాట దాశరథి రాసిన “దీపాలు వెలిగె.. పరదాలు తొలిగె ప్రియురాలు పిలిచే రావోయి” అనే సుశీల పాట. తిలాంగ్ రాగఛాయల్లో స్వరపరిచిన జావళి ఈపాట. దాశరథికి ప్రత్యగాత్మ ఈపాట సన్నివేశాన్ని వివరించి సందర్భోచితంగా వుండే పాట రాయమన్నప్పుడు, సరైన మూడ్ రాక ట్యాంక్ బండ్ వద్దకు వెళ్లి కూర్చుని ఆలోచిస్తుంటే, చీకటి పడింది. అప్పుడప్పుడే లైట్లు ఒకటొకటిగా వెలుగుతున్నాయి. వెంటనే పల్లవి స్ఫురించి “దీపాలు వెలిగె” అంటూ పాట రాశారు దాశరథి. అయితే సినిమాలో ఈ పాటలేదు.

సినిమా విశిష్టతలు: ఈ చిత్ర దర్శకత్వ ప్రతిభ టైటిల్స్ లోనే కనపడుతుంది. టైటిల్స్ ఫ్లాష్ అయ్యే నేపథ్యంలో అనేక శిల్పాలు, కళాఖండాలు రోల్ అవుతూ వుంటాయి. చిత్రానికి ఆధారంగా భావించే సితార్ పరికరం గోడకు ఆనించి వుండగా జనార్దన్ సితార్ బిట్ వినిపిస్తుంది. ప్రక్కనే హీరో తయారుచేసిన శిల్పప్రతిమ కనిపిస్తుంది. అప్పుడు “నీకోసం.. నీకోసం” పాట మ్యూజిక్ బిట్ వినిపిస్తుంది. ఇదంతా నిశితంగా గమనిస్తే ప్రేక్షకుడికి ఈ చిత్ర నేపథ్యం అర్ధమౌతుంది. టైటిల్స్ ఎండింగ్ శిల్పం మీదుగా మొదటి షాట్ లోకి రోలై, హీరో (గోపి) ఆ శిల్పానికి మెరుగులు దిద్దడంపై ఫోకస్ అవుతుంది. ప్రాణంలేని శిల్పానికి జీవం వస్తే ఎలావుంటుందని వూహిస్తూ, సంగీతానికి రాళ్లైనా కరుగుతాయని భావించి సితార మీటుతూ పాట అందుకున్నప్పుడు, చేతిలో వున్న సిగరెట్ పీకను యధాలాపంగా పడవేయడంతో అగ్నిప్రమాదం సంభవించి శిల్పం కాలిపోయి, చిత్రాన్ని మలుపు తిప్పుతుంది. అంటే చిత్ర క్లైమాక్స్ మొదటే చూపించి కథని నడిపించారు ప్రత్యగాత్మ. అదే అతని ప్రతిభా విశేషం. శిల్పం మొత్తం కాలిపోయాక మతిభ్రమించే షాట్ ని నెగటివ్ షాట్ గా తీసారు. కృష్ణకుమారి జమిందారు ఇంట్లో ప్రవేశించి గోపి ప్రవర్తన పోకడల్ని నిశితంగా గమనించాక, గోపికి కనిపించే మొదటి షాట్ ని వివిధ భంగిమల్లో నిలిచిన శిల్పసుందరిలా షూట్ చేశారు. దీంతో గోపికి భయం పోయి ఆమెనే తన శిల్పసుందరి ఊహించుకొని ఆమెకి దగ్గరయ్యేందుకు మార్గం సుగమమౌతుంది. ఇది దర్శకుని ప్రతిభకు నిదర్శనం మాత్రమే. మతిభ్రమించిన కళాకారునిగా అక్కినేని నటన అసామాన్యం. ఈపాత్రలో అక్కినేని అచ్చం తన మనవడు ‘సుమంత్’ లాగే ఉంటాడు…అందంగా! ఇంకో సందర్భంలో ప్రత్యగాత్మ చూపిన ప్రతిభను గుర్తుచేయ్యాలి…దీపావళి సందర్భంగా గోపికి కొత్తబట్టలు తొడిగించి మొదటిసారి మేడమీదనుంచి కింద హాల్లోకి కృష్ణకుమారి తీసుకొచ్చేటప్పుడు ఒక్కోమెట్టు ఇద్దరూ దిగుతుంటే, పియానో మీద ఒక్కొరీడ్ అవరోహణ క్రమంలో వినిపించడం దర్శకుని దూరదృష్టిని, సంగీత దర్శకుని ప్రతిభని తెలియజేస్తుంది. ఈ చిత్రానికి మాటలు రాసిన ఆచార్య ఆత్రేయ (ప్రత్యగాత్మతో కలిసి) కనీసం ఒక్క పాటైనా ఇందులో రాయకపోవడం వింతే! ఈ చిత్రంలో అలనాటి ‘నౌబత్ పహాడ్’, ‘గండిపేట చెరువు’ అందాలను చూపించారు. అంతేకాదు సాలార్జంగ్ మ్యూజియంలో వున్న ‘రెబెక్కా’ శిల్పాన్ని కూడా చూపారు. ఈ చిత్రంలో అక్కినేనికి వాడిన దుస్తుల్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. కావలి పట్టణానికి చెందిన టైలర్ కన్నయ్య వాటిని రూపొందించారు. ఈ సంస్థ తీసిన ‘ఇల్లరికం’ చిత్రం 17 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోగా, ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ‘భార్యాభర్తలు’ చిత్రం 11 కేంద్రాల్లో శతదినోత్సవం జరుకుంది. భార్యాభర్తలు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కగా, కులగోత్రాలు చిత్రానికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్ర మెరిట్ సర్టిఫికేట్ దక్కింది. 1963 సంవత్సరంలో ‘పునర్జన్మ’ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా ప్రైవేటు ఫిలిం బాలెట్ వారు ప్రత్యగాత్మను ఎన్నుకున్నారు. చిత్రం క్లాస్ ప్రేక్షకుల్ని మెప్పించింది కానీ మాస్ హృదయాలకు చేరువ కాలేదు. చిత్రం ఆశించిన విజయం సాధించనందుకు ప్రత్యగాత్మ వివరణ ఇస్తూ “కొన్ని రకాల కథలుంటాయి. వాటిని తీస్తే కళాత్మకంగానైనా తీయాలి, లేదా వ్యాపారధోరణి లోనైనా తీయాలి. అంతేకాని, రెంటినీ మేళవిస్తూ తీసి ఆరెంటినీ సాధించాలనుకోవడం తప్పు. ఈ చిత్రం విషయంలో అక్కడే దెబ్బతిన్నాను” అన్నారు. ఈచిత్రాన్ని 1970లో హిందీలో ‘ఖిలోనా’గా సంజీవ్ కుమార్, ముంతాజ్ లతో చందర్ వోరా దర్శకత్వంలో నిర్మిస్తే 1971లో అది ఉత్తమచిత్రంగా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకొంది. ఇది కాక ఉత్తమ హీరోయిన్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (రఫీ), ఉత్తమ హాస్యనటుడు (జగ్దీప్), ఉత్తమ కథ (గుల్షన్ నందా) అవార్డులు కూడా ఈ చిత్రానికి దక్కాయి. అదే సంవత్సరం తమిళంలో ‘పునర్జన్మ’ చిత్రాన్ని ‘ఎంగిరిందో వందాళ్’గా శివాజీ గణేశన్, జయలలిత లతో నిర్మిస్తే అక్కడా విజయవంతమైంది. ఈ చిత్ర నిర్మాత 22-03-2007న, దర్శకుడు 08-06-2001న చిత్రసీమను విడిచి పరలోకాలకు వెళ్లారు.
-ఆచారం షణ్ముఖాచారి
(94929 54256)

2 thoughts on “పునర్జన్మ చిత్రానికి 60 ఏళ్ళు

  1. నిజంగానే 60 సంవత్సరాలు నిండిందా పునర్జన్మ సినిమా వచ్చి.. చిన్నప్పుడు అన్ని సినిమాలు చూస్తూనే ఉండేవాళ్ళం, నచ్చని సినిమా అంటూ ఉండేది కాదు. అయితే ఎందుకో ఈ సినిమా మాత్రం నాకు నచ్చలేదు.. బహుశా అక్కినేని అలా చూడడం ఇష్టపడలేక కావచ్చు, మళ్లీ చిన్నప్పటి రోజులు గుర్తు చేసినందుకు థాంక్యూ

  2. నమస్తే, పాత సినిమాలలో “ఓ ఫై ఉందా” అనే హాస్య నటుదు వివరాలు తెలియచేయగలరు. (రాజబాబు కాదు… ఇంకా పాత నటుదు). అలాగె ఓ పాత సినిమాలో హాస్య నాటకం… కనకం గారు పాడినదని అనుకుంటున్నాను.. ఉంగారమా ఉంగారమా.. నా ముద్దుల ఉంగారమా… ఏ సినిమలోనిదో తెలియచేగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap