హైదరాబాద్, రవీంద్రభారతి నాటక ప్రియులతో కిక్కిరిసిపోయి ఉంది. అప్పుడే వి. శ్రీనివాస్ గౌడ్ గారు తన అనుచరులతో వచ్చారు. ఆయన తెలంగాణ పర్యాటక అబ్కారి యువజన క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి. ఆయన తలచుకుంటే రవీంద్రభారతి ముందు వరస ఖాళీ చేసి VVIP సీట్ లో కూర్చోవచ్చు. కానీ, అలా చేయలేదు. జరుగుతున్న నాటకాన్ని డిస్టర్బ్ చేయలేదు. అలా అని తిరిగి వెళ్ళిపోలేదు. బాల్కనీ తలుపులు తెరిపించి పైకి వెళ్లి కూర్చుని నాటకం తిలకించారు తన అనుచరులతో. ఇది కదా కావాల్సింది. ఇదే కదా కోరుకుంది. ఏదో నామ మాత్రంగా వచ్చి నలుగురిని సన్మానించి వెళ్లడం కాదు. నాలుగు దశాబ్దాలుగా జరుగుతున్న రొటీన్ కు భిన్నంగా ఏ మంత్రి చేయని విధంగా వి. శ్రీనివాస్ గౌడ్ తన కళా హృదయాన్ని గొప్పగా చాటుకున్నారు. ఈ విషయం తెలిసి నాటక అభిమానులు సంతోషం వెలిబుచ్చారు.
ఈ అద్భుతం మొన్న(22-08-23) రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కొత్వాల్ రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ కళాకారులు రాజా బహద్దూర్ నాటకం ప్రదర్శించారు. కొత్వాల్ వెంకట రామారెడ్డి గారి బయోగ్రఫీ ఇది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ రచించిన ఈ నాటకాన్ని నంది పురస్కారాల గ్రహీత బి. ఎం. రెడ్డి దర్శకత్వంలో అద్భుతంగా ప్రదర్శించారు. నిజాం కాలంలో కొత్వాల్ రామారెడ్డి అందించిన సేవలను కళ్ళకు కట్టేలా చూపించారు. ఈ నాటకాన్ని ఈ తరానికి తెలియచేసిన ప్రయత్నం స్ఫూర్తివంతంగా ఉంది. తెలంగాణలోని ప్రతి వేదికపై ఈ నాటకం ప్రదర్శించేలా సాంస్కృతిక శాఖ పూనుకోవాల్సిన అవసరం ఉంది.
వెంకట రామారెడ్డి పాత్రలో విజయకుమార్, కె.వి. రంగారెడ్డి గా వెంకట్ గోవాడ, సురవరం ప్రతాప్ రెడ్డిగా పోలుదాసు శ్రీనివాసరావు, రాఘవమ్మ పాత్రలో శ్రీమతి సురభి లలిత తదితరులు ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయి జీవించారు. ఆనాటి ఆహార్యం విషయంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ నాటకానికి పరిపూర్ణత ను చేకూర్చింది. సురభి జయవర్ధన్ రంగోద్దీపనం, సురభి నాగరాజు సంగీతం చక్కగా సమాకూరింది. మల్లాది గోపాలకృష్ణ ఆహార్యంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు.
మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి. రమణాచారి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీమతి దీపిక రెడ్డి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు.
-మహమ్మద్ రఫీ