ఏదైనా మంచి పని చేద్దాం రండి అంటే రాని మన సమాజం దోచుకుంటాం రండి అంటే మన సమాజం లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ‘మమ్మల్ని పరిపాలించండి సార్’ అని గద్దె నెక్కిస్తే గద్దెనెక్కిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం అన్నట్లుగా వ్యవహరిస్తోంది రాజకీయం. ప్రపంచంలో ఒక్క రోజు జరుగుతున్న అవినీతి 620 లక్షల కోట్ల రూపాయలు. కనీసం ఒక్కరోజైనా అవినీతి చెయ్యకపోతే 620 లక్షల కోట్ల రూపాయలు మిగిలిపోతాయి అనే ఉద్దేశంతో ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా పేర్కొన్నారు ఈ రోజుని.
గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి ఊర్లో గ్రామాల అభివృద్ధికి గ్రామాధికారి మూల పురుషుడు. నిస్వార్థంగా సేవలందించి ప్రజలకు సేవ చేయాల్సిన గ్రామాధికారి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. నిధులు వస్తే చాలు అమలు చేయకుండా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పారదర్శకత పాటించాల్సిన వారు డబ్బుకోసం అవినీతికి పాల్పడుతున్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు చేయాల్సిన వీరు నిధులు స్వాహా చేస్తూ కళంకం తెస్తున్నారు. ఈ పద్దతి గ్రామాలు, నాగరాలు, పట్టణాలు అన్నింటా విలయతాండవం చేస్తుంది. ఎవరి విషయంలో అయినా అవినీతి నిర్ధారణ అయితే వారి చెక్ పవర్ రద్దు చేయాలి. నిధులు స్వాహా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకువచ్చి వాటిని సక్రమంగా అమలు పరచాలి.
అలాగే ఆర్థిక వృద్ధి రేటు అన్ని పాయింట్లు మెరుగుపరుస్తాం, ఇన్ని పాయింట్లు మెరుగుపరుస్తాం అంటూ రేట్లు పెట్టుకునే అధికారులు అవినీతి విషయంలో ఏం మాట్లాడరు. ఏ ఒక్కరు కూడా అవినీతి నిర్మూలనకి ఉద్యమించరు. అన్నా హజారే లాంటి వారు ఉద్యమాలు, ధర్నాలు చేస్తుంటే వారితో చేతులు కలుపుతారే తప్ప అవినీతిని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చెయ్యరు ఏ ఒక్కరూ కూడా. ఈ విషయం “ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే” స్పష్టం చేసింది. వందకు వంద పాయింట్లు సాధించిన దేశాలలో అవినీతి రహిత దేశంగా గుర్తింపు తెద్దామని లెక్కలుకడితే మన భారతదేశం 36 మార్కులతో పాస్ మార్కులు తెచ్చుకోవడానికే పరిమితమైంది. 64 మార్కులు వెనుకబడి 176 దేశాలలో 94వ స్థానానికి పరిమితమైంది. నూటికి నూరుపాళ్లు ఉన్న మన దేశం ఇమేజ్ ని నూరో ర్యాంక్ కు సమీపంలో ఉండేలా చేసింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి ఆర్థిక అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా తయారైంది. నాయకులు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవినీతిని అంతం చేయకుండా సాధించేది శూన్యమని సర్వే తేల్చి చెప్పింది. ఎంత మంది నాయకులు వచ్చినా అవినీతిని అరికట్ట లేకపోతున్నారు. దీర్ఘకాల రోగమైన అవినీతి అన్ని రంగాలకు పాకింది. దేశాన్ని క్యాన్సర్ నుండి కాపాడే మందులున్నాయి కానీ అవినీతి నుంచి రక్షించే వాళ్ళు లేక భారతమాత విలవిల్లాడిపోతోంది. బ్రిటిష్ వారి నుంచి రక్షణ కల్పించిన మహాత్మా గాంధీ సైతం అవినీతి జాడ్యాన్ని రూపుమాపలేక పోయారంటే ఇక అవినీతి రహిత సమాజం కావాలంటే కొంత మంది గాంధీజీలు వచ్చిపోరాడాలో మనం ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో మనం అవినీతి వ్యతిరేక దినం పాటించాల్సి రావడం ఒక దురదృష్టం అనుకోవాలో, ఇది ఒక మంచి పరిణామం అనుకోవాలా? అనే సందిగ్ధంలో మనం ఉన్నాం. ఈ ఒక్కరోజు విలువ 620 లక్షల కోట్లు, అందులో మనదేశం వాట సగం. ఈ ఒక్కరోజు అవినీతి ఆపగలిగితే మన దేశానికి 310 లక్షల కోట్లు ఆదా అయినట్లే. ఈ డబ్బు ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది.
అవినీతికి పాల్పడిన వారిని సమాజం చిన్నచూపు చూసిన రోజున అవినీతి కొంతమేర తగ్గే అవకాశం ఉంది. కానీ “ఎవరైనా ఏమైనా తినండి నేను డబ్బులు ఇస్తాను నా పని నాకు చేసి పెట్టు” అనే ప్రజలు కూడా ఉన్నారు. ఈ పద్ధతి ఇలా మ్యూచువల్ గా తయారయింది. ముందు సామాన్య మానవునిలో మార్పు వస్తే కానీ అవినీతి నిర్మూలన అనేది జరగదు. ఇది సమాజంలో పూర్తిగా చొచ్చుకుపోయింది. ముందు వ్యవస్థలో ప్రక్షాళన రావాలి. మనం మన డిపార్టుమెంట్లు, శాఖలు దాటి పోయాము. ఎల్లలు దాటేసి పంచభూతాలను కూడా కబ్జా చేసి అవినీతికి పాల్పడుతున్నారు. ఇంకా ప్రజలు కూడా మా కోసం ఏం చేస్తారు అని కాకుండా మాకు ఎంత ఇస్తారు అనే స్థాయికి వచ్చేశారు. ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఇదే. ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రజల తప్పు అనుకోవాలా? అవినీతికి కూడా ఇదే మూలం. ముందుగా ప్రజల్లో అవగాహన రావాలి. ఎలాంటి లీడర్ అయితే మన అవసరాలు తీరుస్తారు, సమాజానికి ఉపయోగపడతారు అని ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడు కొంత వరకు అవినీతిని అరికట్ట గలుగుతాం. నేటి బాలలే రేపటి పౌరులు అన్న వ్యవస్థను తయారు చేస్తున్న విద్యా వ్యవస్థలో కూడా అవినీతి కొంతమేర ఉంది. ర్యాంకులు కొనుక్కోవడం, మాస్ కాపీయింగ్, అడ్మిషన్స్ మొదలైనవాటికి లంచం బాగా ఉంది. ప్రైవేటు వ్యాపారంలో ప్రక్షాళనలతో అద్భుతంగా ఉంది అనుకుంటాము. ప్రైవేటు రంగంలో కూడా ఏమాత్రం తీసిపోకుండా అవినీతి ఉంది. ఆఖరికి మతసంస్థలు, స్వచ్ఛంద సంస్థల్లో కూడా అవినీతి రాజ్యమేలుతుంది. దీనిని మార్చాలని చూసేవాళ్ళు కొంతమేర మార్చే ప్రయత్నం చేస్తున్నారు. “మనీ ఎట్ పవర్ ఇది ఎప్పుడు కూడా మనిషిని సంతృప్తి పరచలేదు. ఎక్కువ ఉంటే ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. నలుగురికి హెల్ప్ చేస్తే వచ్చే సంతృప్తి, ఆనందం లంచం తీసుకుంటే వస్తుందా? అనేదాన్ని ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి.
ఈ అవినీతిని నిరోధించాలి చట్టాలను కరెక్ట్ గా అమలుపరిస్తే లేదా ఈ చర్యలకు పాల్పడితే ఈ శిక్ష ఏదైతే చట్టంలో ఉందో అవి కచ్చితంగా అమలు అవుతాయని చూపించగలిగితే అప్పుడైనా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు. అలాగే ఈ చట్టాలను కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు నిజాయితీగా ఉంటే అంటే దాన్ని వ్యవస్థలోని వ్యక్తులు వాళ్ళకున్న అధికారాల్ని విచక్షణతో ఉపయోగిస్తే తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుంది. కానీ అలాంటి వాళ్ళని పై అధికారులు భరించే స్థితిలో ఉండరు. అధికారులు సరిగా ఉంటే పొలిటికల్ వ్యవస్థ సరిగా ఉంటుంది. కానీ సమాజంలో రకరకాలుగా తయారైపోయి ఈ పని చెయ్యకపోతే ఇతనికి చేతకాని తనం అని అనుకుంటారననే పరిస్థితి నుంచి మనం, మన సమాజం మారాలి. అందరూ గౌరవించే విధంగా మనం ఉండాలి. ఈయన చాలా బాగుంటాడు, ఈయన చాలా కష్టపడి పనిచేస్తాడు, సమాజంలో అందరికీ ఉపయోగపడతాడు. ఈయన చేసే పనులన్నీ ప్రజలకి ఉపయోగపడతాయి అనే గౌరవం వచ్చే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం, అందర్నీ అలా ఉండమని కోరుకుంటూ…..
–పింగళి భాగ్యలక్ష్మి,
ఫోన్ : 9704725609