అన్యాయంపై ఎక్కుపెట్టిన “రెక్కలగుర్రం”
Dr. Ramana Yashaswi

డాక్టర్ రమణ యశస్వి ఆర్థోపెడిక్ రంగంలో ఎంత గొప్ప వైద్యులో సాహితి రంగంలో కూడా అంతే ప్రతిభతో ఎంతో గొప్పగా రాణిస్తున్నారు. వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నట్లుగా సాహితీ రంగంలో కూడా మిణుగురులు, భలే మంచి రోజు, తిమ్మిరి బిళ్ళలు, తులసీదళాలు, కరోనా ఆత్మకథ సంపుటాలతో సరికొత్త ప్రయోగాలు చేశారు. అలాగే ఇప్పుడు “రెక్కల గుర్రం” పేరుతో “రెక్కల ప్రక్రియ”ని సాహితీ పూతోటలో అందంగా విరబూయించి సాహితీ పూతోటకి మరింత వన్నె తెచ్చారు. వీరిలోని వైద్య ప్రతిభతో సరికొత్త ప్రయోగాలు చేసి ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్న చందాన సాహిత్యంలో కూడా సరికొత్త ప్రయోగంతో ఈ రెక్కలు ఆరు లైన్లతో లైనుకి ఒకటి లేదా రెండు పదాలు మాత్రమే ఉంటూ “పర్యావరణం, సెల్లులోని లోటుపాట్లు, అవినీతి, రైతన్నల వెతలు, సమాజ స్థితిగతులు, సామాన్యుని ఈతి బాధలు, బంధాలు, అనుబంధాలు, విశ్వవిజేతలైన కవుల గురించి, ఓటుకు నోటు, నేటి సమకాలీన రాజకీయాలు…” ఇలా అనేక అంశాలతో కూడిన ఈ రెక్కలు ప్రక్రియతో సాహితీ పూతోటలో విహంగవీక్షణం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే గుర్రం మామూలుగానే ఎంతో స్పీడుగా నడుస్తుంది. అందునా రెక్కలుంటే ఇంకా గొప్పగా, అందంగా పరిగెడుతుంది. అంతే అందంగా “రెక్కలు ప్రక్రియ”ని కూడా సరికొత్త పందాలో పాఠకుల చదివే విధంగా పరుగులు పెట్టించారు ఈ కవితా శస్త్రచికిత్సా నిపుణులు. వీరు వైద్య రంగంలో ఎంత గొప్పగా రోగులకు వైద్యం చేస్తారో అంతకంటే గొప్పగా “రెక్కల గుర్రం” అనే సరికొత్త ప్రక్రియతో మనిషి మనసులో పేరుకుపోయిన కుళ్లు కుతంత్రాలను, మురికిని చాలా చక్కగా తొలగించారు.

మొదటి రెక్కలులో “మనసు/మాయ తివాచి/మడత పెట్టలేము/అదే పేచి/ ఇది కళ్లెం లేని/రెక్కల గుర్రం!/” తివాచీ పరిస్తే ఎంత అందంగా ఉంటుందో తెలుసు. కానీ మనసు మాత్రం ఎప్పటికీ అంత అందంగా ఉండదు. నిజంగానే మాయలు, మర్మాలతో నిండి ఉంటుంది. వాటిని పారద్రోల లేము. మనస్సుకు అడ్డూ, ఆపూ ఉండదు. రెక్కలు కట్టుకుని చెడు మార్గంలో పయనిస్తుందని వాస్తవాన్ని చెప్పారు. “వరాల జల్లులు/ మైకుల ఉరుములు/తారల మెరుపులు/ఉచిత తుఫాన్లు/ ఓట్లు/రాలు కాలం!/” అంటూ ఎలక్షన్సుటైములో నాయకులు చేసే హల్చల్ ని అద్భుతంగా చెప్పారు. ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు ఉరుము ఉరిమినట్లు శబ్దాలతో వరాల జల్లులు కురిపిస్తూ తారలతో ఉచిత పథకాలు ఇస్తామని హల్చల్ చేస్తారు. ఆ తర్వాత పత్తా ఉండరని కవి చెప్పకనే చెప్పారు. “రహదారి అనకొండ/…/మనిషి నీడ/ ఏడుస్తోంది!/” అంటే రోడ్లపై ఎక్కడా మట్టి అనేది లేకుండా తారు రోడ్లు వేసి ఇంకా చెట్టు అనేది కూడా లేకుండా చేస్తున్నారు. రోడ్లన్నీ అనకొండల్ని తలపింపచేస్తూ ఎండ తీవ్రతకు మనిషి తల్లడిల్లి పోతున్నాడని ఎంతో హృద్యంగా చెప్పారు. ఇంకా ఎండపొడకి కాలే కాలే తారు రోడ్లతో పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ రమణ.

“సెల్ఫీ/తీసుకున్నా/నా గుండె/గోడలపై నాన్న ఫోటో/ అదే/చిరునవ్వుతో!/” అంటూ యశస్వి తండ్రిపై అభిమాన ధనాన్ని, ఆప్యాయత, అనురాగాల్ని కురిపిస్తూ తండ్రిని నిండు మనసుతో స్మరించుకున్నారు. “పుస్తకం/ చిచ్చికొడుతోంది/హాయిగా/ నిద్ర పట్టింది/ నిద్రమాత్రకు/అసూయ!/” నేటి తరం పిల్లలకు పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టగానే నిద్రాదేవి ఒడిలోకి చేరుకుంటారని హాస్యం జోడించి చెప్పారు. ఇంకా నిద్ర మాత్రలుతో పని లేకుండా పుస్తకమే ఓ నిద్రా గుళిక లాంటిదని చాలా చక్కగా చెప్పారు. “నాటకం/…/ డైలీ సీరియల్/ జీడిపాకాల తోరణం!/” అంటూ వెండితెర, బుల్లితెర మాయాజాలాన్ని ఈ చిన్ని రెక్కలులో చక్కగా చెప్పారు. మానవ జీవితమే ఒక నాటక రంగం అని చెప్పారు. సినిమా అంటే ఏమాత్రం సహజత్వం లేకుండా కట్టు కథలతో ప్రేక్షకుల్ని మభ్యపెట్టి సొమ్ము చేసుకుంటున్నారని చక్కని రెక్కల బాణం వదిలారు. డైలీ సీరియల్ జీడిపాకం సాగినట్లు సాగదీస్తూ ఏళ్ళ తరబడి నడుస్తూ, కథా కథనం ఏమాత్రం లేకుండా కట్టు కథలతో ఆడవాళ్ళ వీక్ నెస్ ని క్యాష్ చేసుకుంటూ రెక్కల గుర్రం దౌడు తీసినట్లు ఏళ్లతరబడి సాగడం మాయాజాలంలో ముంచెత్తడమేనని అద్భుతంగా మలచి చెప్పారు. “అక్షర సత్యం/అంబేద్కరిజం/…/ముమ్మాటికీ ఇది నిజం!/” ఖనిజాలు ఎంత విలువైనవో అంబేద్కర్ ఆశయాలు అందించిన రాజ్యాంగం అంతే విలువలతో కూడి ఈ సమాజం అభివృద్ధి పథంలో ముందుకు నడవడం కూడా అంతే నిజం అని అంబేద్కర్ ఆశయ సాధనని గొప్పగా కొనియాడారు యశస్వి.

“పగలంతా/చెమట చుక్కలు/రాత్రంతా/మందు చుక్కలు/రెక్కల కష్టం/ ముక్కలు!/” ఈ చిన్ని రెక్కలు లో మనిషి నైజాన్ని అద్భుతంగా చెప్పారు. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన డబ్బుతో రాత్రయ్యేసరికి మందుబాబులై కుటుంబాన్ని అల్ల కల్లోలం చేస్తున్న వైనాన్ని చక్కగా మలచి చెప్పారు. “వర్షపు నీటితో/ప్రేమలో పడు/లేనిచో భావితరాలు/బావిలో పడు/రేపటి ప్రపంచం/కన్నీటి జలపాతం!/” ఈ రెక్కల గుర్రం అద్భుతంగా ఉంది. వర్షపు నీటిని ప్రేమతో ఒడిసిపట్టి దాచుకోకపోతే నీరు లేని బావిలో కప్పల్లా మానవ జాతి జీవచ్ఛవాల్లా కన్నీటి జలపాతంతో బావురుమంటారని చక్కని హెచ్చరిక చేశారు. “గర్భాశయం/సంచీలు నింపుతోంది/…/అమ్మతనము/ అమ్మకానికి!/” పవిత్రమైన అమ్మతనాన్ని అద్దె గర్భాల పేరుతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న మనిషిని “మనీ” “షి”గా మారుస్తున్న నిజాన్ని నిర్భయంగా చెప్పారు. “మేధస్సు/చందస్సు/../ ప్రశంసల బాణం/జాషువా కవితాస్త్రం!/” తన మేధస్సునంతా కలంలో గుప్పించి అక్షర తుటాలుగా మలచి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కవితా పాదాలై జాషువా ప్రశ్నించిన తీరుని ఈ చిన్ని రెక్కలులో విప్పి చెప్పారు. “కర్మ/సిద్ధాంతం/../ఎండగట్టేను/జాషువా ఆద్యంతం!/” కొందరు ద్రోహులు కర్మసిద్ధాంతాన్ని కులమతాలకు అంటగట్టి హల్ చల్ చేస్తుంటే వారందరినీ తన కవితా ఖండికలతో జాషువా ఉతికారేశారని హాస్యాన్ని జోడించి చెప్పకనే చెప్పారు యశస్వి.

“ఓటును అమ్మినవాడు/ ఓటమిని కోరినవాడు/ఓటును కొన్నవాడు/గెలిచినా సున్నా/ మళ్లీ మోయాలి/కష్టాల గర్భం ఐదేళ్లు!/” ఓటుకు నోటు తీరుతెన్నుల్ని ఈ చిన్ని రెక్కలులో చాలా అందంగా మలిచి చెప్పారు. ఓటరు ఓట్లను అమ్ముకున్నాడంటే తాను ఓడిపోయినట్లేనని. అలాగే ఓటును కొన్న బడాబాబులు గెలిచి సింహాసనం ఎక్కడమే కానీ మనకు ఒరిగేది ఏమీ ఉండదు. తల్లి గర్భం నవమాసాలు మోస్తే ఓటరు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఐదేళ్ల దాకా కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడాల్సిందేనని చక్కని నగ్నసత్యాన్ని చెప్పారు. “మనసు కావాలి/నీటిని ప్రేమించే జీవనది/ఇంకుడు గుంటే భావితరాలకు జలనిధి!/” ఇలా నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని నీటిని పొదుపు చేస్తూ పరిశుభ్రంగా ఉంచుతూ రోగాల పాలు కాకుండా ఇంకుడు గుంటలో నిల్వ చేసుకుంటే భావితరాలకు అదే గొప్ప సంపద అని చాలా చక్కగా చెప్పారు. “మేక పిల్లలకు/పాలిస్తుంది/ తల్లిపాల వారోత్సవాల/సదస్సు ముందు/స్త్రీలకు/మేక సందేశం!/” అద్భుతం ఈ రెక్కలు. ఏమి ఎరుగని మూగజీవాలు తమ పిల్లలకు పాలు ఇస్తుంటే అన్నీ తెలిసిన స్త్రీమూర్తి మాత్రం అందం ఎక్కడ తరిగి పోతుందోనని పురిట్లో పిల్లలకి కూడా స్త్రీ పాలు ఇవ్వట్లేదని మేకని చూసైనా నేర్చుకోండని ఈ చక్కని చమక్కు విసిరారు కవితా శస్త్రచికిత్సా నిపుణులు.

“కులాల కాలమ్/ ఎత్తివేయ ఉద్యమించండి/../ కులాలు కందిరీగలు/మతాలు మందుపాతరలు!/” కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టినా కూడా కుల పిచ్చితో పేరు చివర కులం పేరు పెట్టుకుని వారి కులమనే తోకలు కత్తిరించాలని చెప్పారు. లేదంటే కులాలు మనుషుల్ని కందిరీగల్లా కుడుతుంటే, మతాలు మందుపాతరల్లా పేలి అల్లకల్లోలం సృష్టిస్తాయని ఎంతో ఆవేదనగా చెప్పారు. “సాహిత్యపు/జరదా కిళ్ళిపై/ఠీవీగా నిలిచిన/ఘాటు లవంగం/రెండు శ్రీల శ్రీరంగం/..!/” ‘శ్రీశ్రీ’ ఈ రెండు అక్షరాలు కూడా సమాజానికి ఆదర్శవంతమైనవి. సమాజంలోని చెడును చీల్చి చెండాడేవి. ఇంకా సమాజంలోని ఆవేదనని, అణగారిన వర్గాల ఈతిబాధలు అని ఎలుగెత్తి చాటి చెప్పటం ఈ రెండు అక్షరాలకే సాధ్యం అని యశస్వి చెప్పకనే చెప్పారు.

రెండాకుల్లో/ఒకటి పేదలకి/ రెండవది/నెచ్చెలికి/అమ్మ మృతితో/ఆకురాలుకాలం మొదలయ్యింది!/” అంటే అమ్మ పార్టీ గుర్తులో ఒక ఆకు పేదలకి సహాయం చేసే దిశగా రెండవ ఆకు తన ప్రియ స్నేహితురాలికి గుర్తుగా ఉన్నాయి. అమ్మ(జయలలిత) తనువు చాలించడంతో ఆకులు కూడా అమ్మతో పాటు రాలిపోయి పేదలు ఇంకా నిరుపేదలు అవుతున్నారని ఎంతో హృద్యంగా చెప్పారు డాక్టర్ రమణ. ఇలా ఎంతో ఉత్కంఠగా సాగిపోతూ ప్రకృతి పర్యావరణం, పేదరికం, ప్రత్యేక హోదా, నోట్ల రద్దు, ఇంకుడు గుంటలు, డాలర్లు, చరవాణి, పోలియో చుక్కలు, పోలింగు, జాతిపిత…. లాంటి అనేకా అనేక ప్రత్యేక రెక్కల అంశాలపై వాస్తవం, వ్యంగ్యం, లోకం పోకడలు, హాస్యం అన్నింటిని మిళితం చేసి వీటికి బొమ్మలు కూడా జోడించి ఎంతో ఆకర్షణీయంగా,అందంగా మలచి రెక్కల గుర్రాన్ని (రెక్కలు) పాఠకులకు అందించి పాఠకుల మనసును రంజింపజేసిన కళారత్న డాక్టర్ రమణ యశస్వి గారికి అభినందనలు.

పింగళి భాగ్యలక్ష్మి,
కాలమిస్టు రచయిత్రి
ఫోన్ నెంబర్.9704725609

రెక్కలగుర్రం
వెల: 80/-రూపాయలు
ప్రతులకు:
డాక్టర్ రమణ యశస్వి, యశస్వి హాస్పిటల్స్, కాకాని రోడ్, గుంటూరు-522001
ఫోన్ నెంబర్.9848078807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap