ఏ.పి.లో అకాడమీల అధ్యక్షుల నియామకాల పై మండలి బుద్దప్రసాద్ గారి ఆవేదన
తెలుగు భాషాసంస్కృతులపై అవగాహనలేమితో రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తుందో, కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో అర్దంకాని పరిస్దితి ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది.
తెలుగు-సంస్కృత అకాడమి వివాదం పరిష్కరించకుండానే, సాహిత్య, సంగీత నృత్య, నాటక, లలితకళ, చరిత్ర అకాడమిలకు అధ్యక్షులను ప్రకటించి, ఆయారంగాలకు సంబందం లేనివారిని అధ్యక్షులుగా ప్రకటించి మరో వివాదానికి తెరలేపారు.
ఏ జాతి ఔన్నత్యమైనా ఆ జాతి సాంస్కృతిక, సాహిత్య ఔన్నత్యం మీద ఆదారపడి ఉంటుంది. సమున్నత సాంస్కృతిక ఔన్నత్యం మన తెలుగు జాతికుంది.
దేశంలో కళలను, సాహిత్యాన్ని పరిపోషించుటకు ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అకాడమీలు నెలకొల్పారు. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అకాడమీలు నెలకొల్పాయి.
ఆయారంగాలలో నిష్ణాతులను అధ్యక్షులుగా నియమించేవారు.
ఆంధ్రప్రదేశ్ లో సాహిత్య అకాడమికి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి,శ్రీ దేవులపల్లి రామానుజరావు,సంగీత అకాడమికి శ్రీమంగళంపల్లి బాలమురళీకృష్ణ, నృత్య అకాడమికి శ్రీనటరాజ రామకృష్ణ లలిత కళా అకాడెమీకి శ్రీ పి. టి. రెడ్డి వంటి లబ్ధ ప్రతిష్ఠులు అధ్యక్షులుగా పనిచేశారు.
ఆయారంగాల్లో వారు తెలుగుజాతి ఖ్యాతిని ఇనుమడింపచేసిన వారు.
దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహనరెడ్డి ఈ చరిత్రను గమనించకుండా ఆయారంగాలతో సంబంధం లేని వారిని నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దిగ్బ్రమకు గురిచేశారు. ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న కవులు,కళాకారులు అనేకమంది ఉన్నారు. వారెవరిని పరిగణనలోకి తీసుకోలేదంటే భాష పట్ల, జాతి పట్ల ఎంత చులకన భావముందో అర్దమవుతుంది.
వివిద రాష్టాల అకాడమీల అధ్యక్షులుగా విశిష్ట వ్యక్తులున్నారు. వారికి సరితూగే వారిని నియమించకపోతే నవ్వుల పాలవుతామన్న ఆలోచన రాకపోవడమే విచిత్రం.
తెలుగు భాషా సంస్కృతుల విథ్వంసానికి ప్రభుత్వమే పూనుకుంటూ ఉంటే చూస్తూకూర్చోవటం వలన జాతి అస్దిత్వమే ప్రశ్నార్దకమవుతుంది. విజ్ఞులైన ప్రజలు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు అందరూ స్పందించాల్సిన సమయం ఇది. భాషా సంస్కృతుల ఔన్నత్యాన్ని నిలుపుకోవటం మనందరి కర్తవ్యం.
-మండలి బుద్ద ప్రసాద్
మాజీ ఉపసభాపతి.
Great article, it’s shame to FINE Arts.