లోగో ను ఆవిష్కరించిన ఉండవిల్లి అరుణ్ కుమార్
చిత్రకళా రంగంలో తనదైన ఖ్యాతి పొందిన మాదేటి రాజాజీ సంపాదకత్వంలోని ఒకనాటి ‘తూలిక’ పత్రిక పునరుద్ధరించడం చిత్రకళకు తిరిగి ఊపిరి పోయడమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, పూర్వ పార్లమెంట్ సభ్యులు ఉండవిల్లి అరుణ్ కుమార్ అభినందించారు. మాదేటి రాజాజీ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యాన పునరుద్ద రిస్తున్న ‘తూలిక’ పత్రిక లోగోను ఉండవిల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో గురువారం ప్రకాశంనగర్ లోని బుక్ బ్యాంక్ కార్యాలయంలో ఆవిష్కరించారు. పత్రిక ప్రధాన సంపాదకుడు సన్నిధానం శాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఆరు దశాబ్దాల క్రితం నడిపిన తూలికను పునరుద్ధరించడంతో రాజాజికి అసలైన నివాళి అర్పించడం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కేవలం చిత్రకళకే పరిమితమవుతున్న ఈ తూలిక ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాలు ప్రచురించడం ద్వారా మరింత ఆకర్షితమైన దృశ్యమాలికగా రూపొందాలని అరుణ్ కుమార్ ఆకాంక్షించారు. మాదేటి రాజాజీ తో తనకు అనుబంధం ఉండేదని, రాజాజీ గీసిన చిత్రాలు ఆ రోజులలోనే ఎంతో ప్రఖ్యాతి పొందాయని అరుణ్ కుమార్ అన్నారు. ఆదికవి నన్నయ తైల వర్ణ ఊహా చిత్రాన్ని ప్రపంచంలోనే తొలిసారి గీసిన చిత్రకారుడు రాజాజీ అని సన్నిధానం శాస్త్రి తెలిపారు. రాజాజీ చిత్రకళకు నిస్వార్థ సేవలు చేశారని చెప్పారు. ‘తూలిక’ పత్రిక ఔత్సాహిక చిత్రకారులకు వేదికగా నిలుస్తుందని ఆయన తెలిపారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం నేపధ్యంలో తూలికను వాట్సాప్ పత్రికగా(డిజిటల్ ఫార్మేట్) తీసుకు వస్తున్నట్లు పత్రికకు సంపాదకునిగా వ్యవహరిస్తున్న మాదేటి రవిప్రకాష్ తెలిపారు. జీవితాన్ని చిత్రకళకు అంకితం చేసిన రాజాజీ అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందారని, ఆయన స్మరణగా ఈ పత్రికను పునరుద్దరిస్తున్నామని ఆయన చెప్పారు. కోస్తా జిల్లా ల వర్తక సమాఖ్య పూర్వ నాయకులు అశోక్ కుమార్ జైన్, చందూరి భాస్కర రమణ, పి. సుమిత్ తదితరులు పాల్గొన్నారు.
చిరస్మరణీయ పత్రిక రాజాజీ గారి “తూలిక”
రాజాజీ గారు “తూలిక” పత్రికను 1963 నుండి 1964 వరకూ క్రమం తప్పకుండా ప్రపంచ చిత్రకళా గమనం గురించి, మన చిత్రకారులు, అకాడమీలు చేస్తున్న మరియు చేయాల్సిన కృషి గురించి నచిత్ర రూపంలో ఆయన ఒంటి చేతో నడుపబడిన పత్రిక “తూలిక”
రాజాజీ గారి సంపాదకత్వంలో వెలువడిన తూలికకు సహ సంపాదకవర్గ సభ్యులుగా కె.పి. పద్మనాభ టెంపే, వేలూరి రాధాకృష్ణ, సి. ప్రసాదరావు, వి.కె. పండిట్, అబీ తదితరులుండేవారు. ఎడిటోరియల్ బోర్డు నందలి పై సభ్యులతోపాటు ప్రముఖ కళా విమర్శకులయిన డాక్టర్ సంజీవదేవ్, వేలూరి రాధాకృష్ణ, వై. సుబ్బారావు, విస్సా అప్పారావు, మొక్కపాటి కృష్ణమూర్తి, బద్రీనారాయణ, ప్రభ లాంటి చిత్రకారులు కూడా తరుచుగా తూలికలో వివిధ అంశాలపై వ్యాసాలు రాసేవారు.
తొలి సంచికలో రాజాజీగారు ప్రారంభ వ్యాసంగా “కళ-సమాజం” గురించి రాస్తూ ఒకనాడు ఎంతో వైభవాన్ని చవిచూసిన మన కళా ప్రాభవం నేడు దురదృష్టకరమైన నీ తిలో ఉండడం శోచనీయం. కళాకారునికి -ప్రజలకు, కళకి-సమాజానికి మధ్య నున్న అగాదాన్ని భర్తీ చేయాల్సి అవసరం ఈనాడు దేశంలో గల అన్ని అకాడమీల కర్తవ్యం అంటూ అద్భుతమైన వ్యాసాన్ని వెలువరించారు.
-కళాసాగర్