ప్రతీ సంవత్సరం మార్చి నెలలో జరిగే దుబాయి ఆర్ట్ ఫెయిర్ అంతర్జాతీయ కళా ప్రదర్శనల్లో అగ్రస్థానం. ఇది మధ్య ప్రాచ్యానికి ప్రాముఖ్యతనిస్తూ 2007లో ప్రారంభమైంది. ఉత్తర ఆఫ్రికా, దక్షిణ ఆసియా దేశాలు పాల్గొనే గొప్ప కళాప్రదర్శన. నలభై దేశాలకు చెందిన తొంభై ఆర్టు గాలరీలు అనంత వైవిధ్యంతో పాల్గొనే ఈ మేళా ప్రపంచంలోని మేటి కళావేదికగా రూపొందింది.
అంతర్జాతీయ కళా కార్యకలాపాల్లో దుబాయ్ కళాసంతది చురుకైన పాత్ర. ప్రతి సంవత్సరం వేలాది సందర్శకుల్ని, కళాప్రియుల్ని ఆకర్షిస్తోంది. అరబ్ ఎమిరేట్స్ (UAE)కు చెందిన స్థానిక, అంతర్జాతీయ కళాప్రియులు, కళా సేకర్తలు, కళావ్యాపారులు, పరిరక్షకులు (క్యూరేటర్లు), కళాపోషకులు వంద వరకు సంచార మ్యూజియాలు, అనేక ఇతర కళాసంస్థలు పాల్గొనే అతి పెద్ద వేదిక. 2019లోనే ముప్పది వేల సందర్శకులను ఆకర్షించిన గొప్ప కళావేడుక.
ఈ మేళాలోని గాలరీ హాళ్ళకు సమాంతరంగా విస్తృత కార్యక్రమాల్లో కళాసృష్టికి పురమాయించబడ్డ ఆర్టిస్టులు, క్యూరేటర్లు, ప్రాజెక్టులు, స్థానిక సంస్థల చొరవ, ప్రోత్సాహంవల్ల గ్లోబల్ ఆర్ట్ ఫోరం పాత్రవల్ల ‘ఆర్ట్ ఫెయిర్’ విజయ పథంలో ప్రయాణిస్తోంది. దుబాయ్ రాజు, UAE ప్రధాని, ఉపాధ్యక్షుడు కూడా అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ దీనికి రాజ పోషకుడు. కరోనా విలయం, ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ అయిల్ ధరలు వేగంగా పడిపోవడం, రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించడం కారణంగా ఎమిరేట్సు ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయింది. అటువంటి పరిస్థితిని అధిగమించి అంతర్జాతీయ కళాప్రదర్శనను నిర్వహించడం, అందులో కళాకారులు, కళాప్రియులు ఎందరెందరో మదీనత్ జుమెయిరాలో సమావేశం అవడం ఊహకందని విషయం.
2020లో జరగవలసిన ఈ కళామేళా కోవిడ్ కారణంగా ఆగిపోలేదు కానీ డిజిటల్ రూపంలో అభిమానులకు చేరువయింది. 2022 మార్చి పదిహేనవ విడత ప్రదర్శన కాగా, 2023 మార్చి 1-5 తేదీలలో జరిగిన కళామేళా పదహారవది( 16th Edition). ఇటీవలే ప్రారంభించబడిన “మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్”, మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్, మేడం టుస్సాడ్స్, దుబాయ్ గార్డెన్ గ్లో, డిజిటల్ ఆర్ట్ థియేటర్ల పాత్ర కూడా ఈ మేళా విజయంలో కాదనలేనిది.
దుబాయ్ ఆర్ట్ గాలరీలు వర్తమానకళ, ఆధునిక కళ, బవాబా, డిజిటల్ ఆర్ట్ నాలుగు విభాగాలుగా విభజింపబడ్డాయి. వర్తమాన కళా విభాగం గత రెండు సంవత్సరాలుగా ప్రైమరీ మార్కెట్కు ప్రాధాన్యతనిస్తూ కళాసంపదను ప్రదర్శిస్తోంది. 100కి పైగా ఆర్ట్ గాలరీల నుండి ఎంపిక చేసిన 400 యువ కళాకారులు వర్తమానకళను పరిచయం చేయడం దీని ఆశయం. వివిధ కళాకారుల పనితనాన్ని, లబ్ద ప్రతిష్టులైన ఆర్టిస్టులు మొదలుకొని, కవర్ పెయింటింగు, డ్రాయింగు, శిల్పం, కళాకృతుల స్థాపన, వీడియో, ఫొటోగ్రఫీ మొదలైన రకరకాల కార్యకలాపాలకు విస్తృత పరిధిలో ప్రాతినిధ్యం కల్పించింది. 2019 మేళాలో పలు దేశాల 90 ఆర్ట్ గాలరీలతో కొత్తగా కళాజగతిలో అడుగుపెట్టిన కేమరూన్, కొలంబియాలకు చెందిన యువ కళాకారులకు ప్రవేశం కల్పించింది. సుమారు 40 దేశాల నుండి కళాకారులు పాల్గొన్నారు. అయ్యో ఈ సంవత్సరం మిస్ అయ్యామని బాధపడుతున్నారా ? వచ్చే సంవత్సరం Art Dubai 2024 మార్చి 1 నుండి 3 తేదీ వరకూ జరుగనుంది.
టి.వి. ప్రసాద్
Art Dubai 2023